సబ్ ఫీచర్

ప్రగతికి దారి చూపే పర్యాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయతా స్ఫూర్తిని రగిల్చేందుకు, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించేందుకు పర్యాటక రంగం ఎంతగానో దోహదం చేస్తుంది. వినోదం, విశ్రాంతి, ఆహ్లాదం కోసం పర్యాటక ప్రాంతాలను సందర్శించడం అనాదిగా వస్తోంది. నేడు పర్యాటక రంగం సమాజంలోని అన్ని రంగాల వారికి చేరువై ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. పర్యాటక రంగం అభివృద్ధి వల్ల విదేశీ మారకద్రవ్యం పెరగడంతో ప్రభుత్వాలు ఈ విషయంపై అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. పర్యాటకం ద్వారా అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లాండ్, జర్మనీ, టర్కీ, ఆస్ట్రియా తదితర దేశాలకు భారీగా ఆదాయం లభిస్తోంది. మానవ సమాజం సాంఘికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా సాధించిన ప్రగతికి తోడ్పాటునందించిన రంగాల్లో పర్యాటకం ఒకటి. యూఏఈ, ఈజిప్టు, గ్రీసు, థాయిలాండ్, బహమస్, ఫిజీ, సేషీల్స్ వంటి దేశాలలో పర్యాటకుల ద్వారా, వారికి అందించే సేవల ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది.
వివిధ ప్రదేశాలను సందర్శించడం మనోవికాసానికి ఎంతో ఉపయోగకరం. మన దేశంలో పర్యాటక రంగం ఇతోధికంగా వృద్ధి చెంది, నేడు స్థూల దేశీయోత్పత్తిలో 6.6 శాతం వాటాను అందచేస్తున్నది. సంప్రదాయమైన మన భారతీయ తత్త్వం ‘అతిథి దేవోభవ’ ప్రకారం మన దేశానికి వచ్చే పర్యాటకులు మనకు అతిథులు. వారికి సకల సౌకర్యాలు కల్పించాలి. అంతర్జాతీయ సమాజంలో పర్యాటక పాత్ర మీద అవగాహన పెంచడం, అది ప్రపంచవ్యాప్తంగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచెప్పటానికి ఏటా సెప్టెంబర్ 27న ‘ప్రపంచ పర్యాటక’ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ ఆనవాయితీ 1980 నుంచి ప్రారంభమైంది. అంతర్జాతీయ వాణిజ్యంలో టూరిజం కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీని ‘ది వరల్డ్ టూరిజమ్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేసింది. ప్రతి ఖండంలోనూ, ప్రతి దేశంలోనూ చూడతగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకం ఉన్నాయి. మన దేశంలో ఉన్నన్ని ఆధ్యాత్నిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలు మరే దేశంలో లేవంటే అతిశయోక్తి కాదు. పర్యాటక రంగానికి తగినన్ని నిధులు, దానిపట్ల తగినంత శ్రద్ధ లేనందున మనం ఆశించినంతగా ఈ రంగంలో అభివృద్ధి సాధించలేదు. తెలంగాణ ఖ్యాతిని వివిధ పర్యాటక ప్రాంతాలు ప్రపంచానికి ఘనంగా చాటుతున్నాయి. టెంపుల్, మెడికల్, రూరల్, వన్యప్రాణి, పర్యావరణ తదితర టూరిజాలు వర్ధిల్లుతూ కీర్తిపతాకాలై నిలుస్తున్నాయి. సుమారు మూడువేల ఏళ్లకు పైబడ్డ చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, కళా వైభవానికి ప్రతీక తెలంగాణ.
తెలంగాణలో టెంపుల్ టూరిజం : ఆలంపూర్‌లో అష్టాదశ శక్తిపీఠం, బాసరలో జ్ఞాన సరస్వతీ దేవాలయం, భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మెదక్‌లో క్రైస్తవుల చర్చి, నిజామాబాద్‌లో ఖిల్లా రఘునాథ ఆలయం, వరంగల్‌లో వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, చిలుకూరులో బాలాజీ ఆలయం, మేడారంలో సమ్మక్క సారమ్మ గద్దె ఉన్నాయి.
వారసత్వ పర్యాటకాలు: హైద్రాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ కోట, సాలార్‌జంగ్ మ్యూజియం, నిజామాబాద్ కోటలు వారసత్వ పర్యాటక వలయాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఎత్తయిన కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, కత్వాల్ అభయారణ్యం, మల్లెల తీర్థం, పాలమూరులో పిల్లలమర్రి వృక్షం, గద్వాల కోట, భువనగిరి కోట, దేవరకొండ దుర్గం, రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, పోచారం అభయారణ్యం తదితర పర్యాటక ప్రాంతాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం, సింహాచలం కొండలు, విజయవాడ కనకదుర్గ ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం, లేపాక్షి, అరకులోయ, మంత్రాలయం, బెలూం గుహలు, పుట్టపర్తి, అన్నవరం, శ్రీకాళహస్తి మొదలైన పర్యాటక ప్రాంతాలు ఎంతో ప్రసిద్ధిచెందాయి. ద్రాక్షారామం, మంగళగిరి మొదలైనవి ప్రసిద్ధిగాంచాయి.
అనేక దేశాల్లో పర్యాటక రంగాన్ని కీలక పరిశ్రమగా గుర్తించారు. ‘ప్రపంచం అనేక దేశాలుగా విడిపోయినా మానవ సంస్కృతి చరిత్ర అఖండం’అని చెప్పడానికి యునెస్కో ప్రయత్నిస్తోంది. ఇటీవల రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1966లో భారత పర్యాటక అభివృద్ధి సంస్థ, ఇతర రాష్టస్థ్రాయి పర్యాటక సంస్థలు అనేక పథకాలకు శ్రీకారం చుట్టాయి. దేశంలోని వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తున్నవారిలో 90 శాతం భారతీయులే ఉంటున్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల సంఖ్యలో అగ్రభాగాన ఉన్నాయి. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏటా ఒక నినాదంతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. 2018లో ‘టూరిజం అండ్ ది డిజిటల్ ఇన్ఫర్మేషన్’ అనే నినాదాన్ని వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకటించింది.
వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ తెచ్చిన కొత్త యాప్ పేరు ‘ఎక్స్‌ప్లోర్ తెలంగాణ’. పర్యాటక రంగాన్ని అభివృద్ధిచేయటానికి దేశంలోని 17 విశిష్ట నగరాలను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సర నినాదం- ‘పర్యాటకం- ఉపాధితో అందరికీ మంచి భవిష్యత్తు’. పర్యటనలే జీవిత పాఠాలు నేర్పుతాయి. జీవన పథంలో మనల్ని ముందుకు నడుపుతాయి అనే నానుడి నిజం కావాలి. అందుకు ప్రభుత్వాలు కృషిచెయ్యాల్సిన అవసరం ఉంది. పర్యాటక రంగం ప్రాధాన్యతను పెంచేలా అన్ని వర్గాల వారూ కృషి చేయాలి. పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం ప్రభుత్వ కర్తవ్యం.
(నేడు ‘వరల్డ్ టూరిజం డే’)

-కె.రామ్మోహన్‌రావు 94414 35912