సబ్ ఫీచర్

విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్షపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబరు 24న ఇచ్చిన ఉత్తర్వులు ఆ ఒప్పందాల పున:సమీక్షకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే- గతంలో తెదేపా ప్రభుత్వం వివిధ రంగాలలో చేసుకొన్న ఒప్పందాలను సమీక్షించడానికి, కాంట్రాక్టులను రద్దు చేయడానికి పూనుకొన్నది. అస్మదీయులకు ప్రయోజనాలు కలుగజేసేందుకే చేసుకొన్న దీర్ఘకాలిక ఒప్పందాలను సమీక్షిస్తున్నారని ప్రతిపక్షం, దాని అనుబంధ మీడియా వారు విమర్శిస్తుంటే, ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో చేసుకొన్న ఒప్పందాల వల్ల భారీగా అవినీతి జరిగిందని ప్రజాధనం వృథా అయ్యిందని, దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల ప్రజలమీద మోయలేని భారం పడుతున్న కారణంగానే సమీక్ష అవసరమని పాలకపక్షం, దాని అనుకూల మీడియా వాదిస్తున్నాయ.
విద్యుత్ కొనుగోల ఒప్పందాల సమీక్షకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పవన విద్యుత్ ఉత్పత్తి దారులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సమీక్షను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు గతంలో ఇచ్చింది. ఇప్పుడు ఒప్పందాలకు ఆమోదం తెలిపిన సాధికార సంస్థ అయిన రాష్టవ్రిద్యుత్ నియంత్రణ సంస్థ దగ్గరే విషయాన్ని తేల్చుకోమని ఆదేశాలు ఇచ్చింది. ఆ లోపుగా యూనిట్‌కు రూ.2.44 చొప్పున పవన విద్యుత్ ఉత్పత్తి దారులు సరఫరా సంస్థకు విద్యుత్‌ను సరఫరా చేయమని కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అను కూలమైనవని వేరే చెప్పవలసిన పనిలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ సమీక్షలో- గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలతో ఏటా 2,500 కోట్ల భారం విద్యుత్ పంపిణీ సంస్థలపై పడుతుందని, ఒప్పంద కాలానికి మొత్తం భారం రూ.62,500 కోట్లు అని అంచనా వేశారు. ఇందులో సింహభాగం సంప్రదాయేతర విద్యుత్ కోనుగోళ్ళకు సంబంధించిన ఒప్పందాల ఫలితంగా ఏర్పడింది. వీటిలో పవన విద్యుత్ ఒప్పందాలు మరీ ముఖ్యమైనవి.
మతలబు ఉందా..?
నవ్యాంధ్ర ఏర్పడినపుడు పవన విద్యుత్ కేంద్రాల స్థానిక సామర్థ్యం 670 మె.వా. అది ప్రస్తుతం 4100 మె.వా. గత ఐదేళ్లలో పెరిగిన స్థాపక సామర్థ్యం 3430 మె.వా. అదే సమయంలో సోలార్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం కూడా 3000 మె.వా. పెరిగినప్పటికీ, పవన విద్యుత్ ఒప్పందాలపైనే ఎక్కువ ఆ రోపణలు రావడానికి కారణాలు ముఖ్యంగా రెండు. పోటీ పద్ధతిలో కాకుండా అవగాహన ద్వారానే కొనుగోలు ఒప్పందాలు జరిగాయ. దేశంలో ఉన్న వాతావరణానికి భిన్నంగా రాష్ట్రంలో కుదర్చుకొన్న పవన విద్యుత్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
రాయలసీమ ప్రాంతం పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ ఈ ప్రదేశాలలో గాలి సాంద్రతను బట్టి విద్యుత్ ఉత్పాదన అవకాశాలను అంచనా వేస్తుంది.ఎవరైనా పెట్టుబడిదారుడు పవన విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలనుకుంటే ముందుగా రాష్ట్ర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఉంటుంది. ఒప్పంద కాలపరిమితి ఒక 2 1/2 సం॥ మొదటి 1 1/2 సం॥ పెట్టుబడి దారుడు అధ్యయనం పూర్తి చేసి, పెట్టుబడులను సమకూర్చుకోవలసి ఉంటుంది. 1 1/2 సం॥ లోగా పెట్టుబడులు సమకూర్చుకోలేకపోతే ఇంధన వనరుల అభివృద్ధి సంస్థతో ఉన్న ఒప్పందం రద్దు అవుతుంది. పెట్టుబడి దారుడు చేసిన అధ్య యన సమాచారం మొత్తం ఇంధన వనరుల అభివృద్ధి సంస్థకు స్వంత మవుతుంది. దానిని మరొక పెట్టుబడి దారుడికి ఇచ్చే హక్కు ఇంధన వనరుల సంస్థకు ఉంటుంది. అయితే ఇంధన వనరుల సంస్థ ఆ హక్కును వాడుకున్నట్టు దాఖలాలు లేవు. విద్యుత్ ప్రాజెక్టు స్థాపించడానికి అవసరమైన వా తావరణం పెట్టుబడిదారుడికి ఏర్పడే వరకూ ఒప్పంద కాలాన్ని పొడిగించడం ఆనవాయితీగా మారింది ఇంధన వనరుల సంస్థపై ఉన్న ప్రధానమైన ఆరోపణ ఇది. రాష్ట్ర విభజన సమయానికి 7500 మె.వా. విద్యుత్ కేంద్రాల స్థాపనకు ఒప్పందాలు ఉన్నప్పటికి కేవలం 700 మె.వా. లోపు మాత్రమే స్థాపించబడడం దీనికి ఒక ఉదాహరణ.
అవకాశాలను కొందరికే ఇచ్చారా?
పవన విద్యుత్ కేంద్రాల స్థాపనకు అవకాశమున్న అన్ని అంశాలను కేవలం 6-7 సంస్థలకే కట్టబెట్టారనేది, ఇంధన వనరుల సంస్థ పై ఉన్న మరో ఆరోపణ. పైగా వీటిల్లో ఎక్కువ మంది పవన విద్యుత్ పరికరాల తయారీదారులు. అంటే వీరు విద్యుత్ కేంద్రాల స్థాపనకు అవసరమైన అన్ని అధ్యయనాలు చేసి, అనుమతులు తీసుకొని, ఆ తర్వాత పెట్టుబడి దారుడిని వెతుక్కుంటాయి. పెట్టుబడిదారుడి తరఫున వీరే విద్యుత్ కేంద్రం స్థాపించి, నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు. వచ్చిన లాభాలను పెట్టుబడి దారుడికి ఇస్తారు. ఈ తతంగంలో అసలైన పెట్టుబడి దారుడి వద్ద వసూలు చేసేమెగా వాట్ విద్యుత్ ఖరీదు మారుతూ ఉంటుంది. విద్యుత్ రేటు 25 సంవత్సరాల పాటు ఒకటే కాబట్టి, ఎక్కువ గాలి సాంద్రత ఉండి, ఎక్కువ విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్న చోట ఎక్కువ రేటుకు పరికరాలు అమ్ముకుంటాడు. ఆ విధంగా పరికరాల తయారీదారులకు ఇంధన సంస్థ వారు సహకారం అందించి పవన విద్యుత్ రంగంలో పోటీ అనేదే లేకుండా చేస్తున్నారనేది మరో ముఖ్యమైన ఆరోపణ.
వివిధ కారణాల రీత్యా పవన విద్యుత్ కేంద్రాల పెట్టుబడిదారులు విద్యుత్ పంపిణీ సంస్థలకే విద్యుత్‌ను అమ్మడానికే మొగ్గుచూపుతారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు కావడం వల్ల కొన్ని పరిమితులకు లోబడే అవి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటాయి. విద్యుత్ చట్టం-2003 ప్రకారం పోటీ వేలం ద్వారానే విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సాంప్రదాయేతర వనరుల వినియోగాన్ని ప్రోత్సాహించడానికి, మొత్తం విద్యుత్‌లో కనీసం కొంత విద్యుత్‌ను సంప్రదాయేతర విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్‌ను కొనాలనిఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంస్థ వారు నిర్దేశించారు.
ఆర్.పి.ఆర్.ఒ పెంచుకొంటూ పోయారా?
పవన విద్యుత్ తయారీ దారులు పవన విద్యుత్‌కు ఎక్కువ ధర నిర్ణయించాల్సిందిగా ప్రభుత్వాన్ని, ఇంధన వనరుల సంస్థని అడగడం, వారు కోరిన విధంగానే అందుకు అంగీకరించడం, ఆర్.పి.ఆర్.ఒ ను పెంచుకుంటూ పోవడం, తద్వారా మరిన్ని ఒప్పందాలు చేసుకోవడం మొదలైన వాటిపై అనేక ఆరోపణలు వచ్చాయి. అధిక ధరలు పెట్టి పవన విద్యుత్‌ను కొనాల్సిన అవసరం లేదని పలు సంస్థల నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో ఉం చుకొని, విద్యుత్ పంపిణీ సంస్థలు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడానికి నిరాకరించినప్పటికీ ప్రభుత్వమే పోటీ వేలం ప్రక్రియను పక్కకు పెట్టి అవ గాహన పద్ధతి ద్వారా ఒప్పందాలు కుదిర్చారనేది ప్రధాన ఆరోపణ.
విచారణకు భయమెందుకు?
విద్యుత్ కొనుగోలు ఒప్పంద ప్రక్రియను సమీక్షించి వాస్తవాలు వెలికి తీయడం అత్యవసరం. ముఖ్యంగా ఈ కింది అంశాలపై విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.
* విద్యుత్ నియంత్రణ సంస్థ వారు ఆదేశించిన సంవత్సరమే విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన, వాటి విద్యుత్ ఉత్పాదన అందుబాటులోకి వస్తుందా?
* 2016-17లో 2911 మె.వా ఉన్న పవన విద్యుత్ ఉత్పత్తి ఒక సంవత్సర కాలంలోనే (2017-18) 7200 మె.వాకు పెరగడం ఎట్లా సాధ్యం?
* 15.11.2012 న పవన విద్యుత్ ధరను యూనిట్‌కి రూ.4.70గా నిర్ణయించారు. 01.08.2015న యూనిట్ ధరను రూ. 4.83గా నిర్ణయించారు. ఈ ధరలు నిర్ణయించిన తరువాతే కొన్ని నెలల్లోనే (2-4)కొన్ని కేంద్రాలను స్థాపించారు. ఇది దీనివలన ఎవరు లబ్ది పొందారు?
* విద్యుత్ ఒప్పందాల ప్రకారం పవన విద్యుత్ కేంద్రాల వారు దగ్గరలోని సరఫరా కేంద్రం వరకు విద్యుత్ లైన్లను సబ్ స్టేషన్లను నిర్మించాలి. కాని ఎ.పి ట్రాన్స్‌కో వారే సబ్ స్టేషన్లను 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు నిర్మించారు?
పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలనే కాకుండా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కూడా పూర్తిగా సమీక్షించాలి. ప్రతి నిబంధన అమలు జరిగిన తీరును విచారణ చేయాలి.
కొనుగోలు ఒప్పందాలను సమీక్షించడమే కాకుండా, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం, సరఫరా నష్టాలను తగ్గించడం మీద కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ఉచిత విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరణ చేయాలి. విద్యుత్‌ను కొన్ని వర్గాలకు ఉచితంగా ఇస్తున్నారు. దీర్ఘకాలంలో ఈ భారాన్ని ప్రజలే మోయవలసి ఉంటుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించి తిరిగి ఒప్పందం చేసుకొనే రీతిలో నిబంధనలను ఒప్పందంలోనే పొందుపర్చాలి. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలను తగ్గించడానికి పాలకులు కృషిచేయాలి. విద్యుత్ రంగ సంస్కరణల వలన ఇంతవరకూ ఒనగూరిన ప్రయోజనాల గురించి సమగ్ర చర్చ జరగాలి.

-డా॥ బి. సారంగపాణి