సబ్ ఫీచర్

మావోల ‘రాజ్యకాంక్ష’కు ఆదివాసీలు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టుల ‘రాజ్యకాంక్ష’కు ఇటీవల మరికొందరు ఆదివాసీలు అసువులు బాశారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోలకు బలమైన ప్రాంతమైన చింతల్‌నార్‌లో కొనే్నళ్ల క్రితం పదుల సంఖ్యలో పోలీసులను మావోయిస్టులు పొట్టనపెట్టుకున్నారు. అనంతరం అనేక ఒత్తిళ్ళతో ఆదివాసీలు నలిగిపోయారు. వారి జీవితం పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయ్యింది. ఈ సెగను అమాయక ఆదివాసీలు మరోదారి లేక భరించారు, భరిస్తూ ఉన్నారు. వారేమీ తమకు రాజ్యాధికారం కావాలని కోరుకోవడం లేదు. జష్‌పూర్ జిల్లా ఆదివాసీలు మద్యపానం మానేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. శతాబ్దాలుగా తాము బతుకుతున్న ‘బతుకు’నే కోరుకుంటున్నారు. కానీ మావోలు ‘ససేమిరా’ అంటూ ఆదివాసీలతో గెరిల్లా దళాలను నిర్మిస్తున్నారు. దండు కడుతున్నారు. ఆ దండులో చేరిన వారు మిడతల దండులా ఎదురు కాల్పుల్లో నేల కూలుతున్నారు. తాజాగా చింతల్‌నార్, ఆవవారం, కిరండల్ పోలీసుస్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు కన్నుమూశారు. మరుసటిరోజు మహారాష్ట్ర, గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మరణించారు. వీరిలో మలంగీర్ ప్రాంత మావోయిస్టు కమిటీ సభ్యులుగా భావిస్తున్న లచ్చు, పొడియాలున్నారు. ఇలాంటి లచ్చు, పొడియాలాంటి లక్ష మందిని ‘బలి’ఇచ్చినా మావోల రాజ్యకాంక్ష నెరవేరదు. అసలు ఆ వాతావరణమే లేదు. నియంతలు, రాజులు పాలిస్తున్న కాలం కాదిది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారి ఆకాంక్షలే నెరవేరుతాయి. అధికారం వారిదైనప్పుడు, వారి శక్తిసామర్థ్యాల మేరకు వాళ్లు జీవనం సాగిస్తూ ఉన్నప్పుడు సాయుధ పోరాటానికి, సుదీర్ఘ కాలం గెరిల్లా పోరాటానికి తావెక్కడిది?
ఈ విషయం మావోల చెవికెక్కడం లేదు. రెండవ ప్రపంచ యుద్ధం ముందునాటి భావజాలంతో, ఎత్తుగడల (లాంగ్‌మార్చ్)తో ముందుకు కదులుతామని చెప్పడం, అందుకు అమాయక ఆదివాసీలను బలిఇవ్వడం ఏ రకంగా భావ్యం? విభజించి-పాలించు అన్న సూత్రాన్ని ఔపోసన పట్టిన బ్రిటీషు పాలకులనే మట్టి కరిపించి, భారతదేశం నుంచి తరిమికొట్టిన చైతన్యపూరిత వాతావరణం నుంచి ఉబికి వచ్చిన ‘సాధికారత’ అంశం వదిలిపెట్టి సాయుధ పోరాటం, రాజ్యాధికారం, మార్కెట్ రహిత విధానం, సోషలిజం, కమ్యూనిజం అంటూ ఊహాలోకాల్లో విహరిస్తూ, ఉద్యమాల్తో అమాయకులను బలి ఇస్తూ వారి బంగారు భవిష్యత్‌ను నాశనం చేయడం ప్రజల సాధికారతకు ఊతం ఇస్తుందా?
వాస్తవానికి మావోలు వల్లించే ప్రతిమాట పాత చింతకాయ పచ్చడి. అందులో వర్తమాన ‘సూర్యుడి’ తేజస్సు ఇసుమంతైనా కానరాదు. సోషలిజం (సమ సమాజం) అన్నది ఓ పెద్ద భ్రమ. ఆ భ్రమల్లో ప్రజలు బతికేలా తాము పెత్తనం కొనసాగించేందుకు ఆ ‘నినాదం’ ఉపకరిస్తుందే తప్ప సమసమాజం ఎక్కడా రాలేదు.. రాదు.. సాధ్యం కాదు. అది మానవుని డిఎన్‌ఏలోనే లేదు. అనేకానేక శక్తిసామర్థ్యాల అంతరాలున్న చోట, ప్రజాస్వామ్యం కోరుకుంటున్నవేళ సమ సమాజం ఎలా సాధ్యం? ఏ ప్రాతిపదికన ఇప్పటికీ ఆ నినాదం ఇస్తున్నారో వారికే తెలియదు. మార్క్స్ సోషలిజం అన్నాడు కాబట్టి మేమూ అంటామంటే కుదురుతుందా? చైనాలో మావో ‘లాంగ్‌మార్చ్’చేసి, విప్లవాన్ని విజయవంతం చేశాడు కాబట్టి మేమూ ‘లాంగ్ మార్చ్’ చేస్తామనడం హాస్యాస్పదం. ఈ ఆలోచనను- అభిప్రాయాన్ని కొందరు ప్రొఫెసర్లు, విద్యాధికులు, రాజకీయ దురంధరులు సమర్ధించడం దారుణం.
తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్‌వార్ గ్రూపు నక్సలైట్ పార్టీ ఆవిర్భవించిన (1980) కాలానికి 2019లో గ్రామాల్లోనూ స్మార్ట్ఫోన్లు వాడుతున్న కాలానికి తేడా లేదా? ఈ 40 ఏళ్ళ కాలంలోనే ప్రపంచం పూర్తిగా మారిపోయిన తీరు స్పష్టంగా కనిపిస్తున్నా పట్టించుకోకుండా, 70 ఏళ్ళ క్రితం చైనాలో మావో నడిపిన ‘యాత్ర’ను మేమిక్కడ ‘రిప్లికేట్’ చేస్తామని మావోలు, వారి తరపు మేధావులు, విద్యావంతులు అదే పనిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సబబుగా ఉందా? ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ సిద్ధాంతాన్ని తలపై మోసే మేధావి అయినా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, వారి సాధికారత వారి చేతిలోంచి జారిపోకుండా రక్షణగా నిలవాలి. అంతేగాని తమ ‘రాజ్యకాంక్ష’కు అమాయకుల్ని బలి పశువులను చేస్తామని వ్యూహాలు పన్నడం నేరం! ప్రజలపై ప్రేమగల వారెవరూ తమకు రాజ్యాధికారం కావాలని కోరుకోరు. ప్రజల యోగక్షేమాలు, వారికి సమకాలీన జ్ఞానం అందుతున్నదా? లేదా? అని చూస్తారు. అదేమిటోగాని ప్రజలపై అపారమైన ప్రేమ ఉన్నట్టు ప్రకటిస్తూనే మావోలు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
సానుభూతి- ప్రేమను నటించడమన్నది పైశాచికత్వం తప్ప మరొకటి అవదు. రాజ్యాధికారంపైనే వారికి ‘ప్రేమ’ ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ దాన్ని కప్పిపెట్టి జన సంక్షేమం, ప్రజల ఎదుగుదల, అభివృద్ధి, కొత్త తరాలకు సరికొత్త జీవితం గూర్చి మాట్లాడటం ఏ రకంగా నిజాయితీ అనిపించుకుంటుంది? సమకాలీనతను పాతరవేసి గతంలో జీవించే వారెలా ప్రజాసంక్షేమం గురించి ‘కల’గంటారు, అభివృద్ధిని సాధిస్తారు? ఇంత పెద్ద ‘వైరుధ్యం’ కడుపులో పెట్టుకుని పచ్చని అడవులను ‘ఎర్ర’బార్చడం భావ్యమా? సమకాలీన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పట్టుకుని పోటీ ప్రపంచంలో పోటీ లేని సమాజాన్ని స్థాపిస్తామని అంటారు. అది సాధ్యం కాదని రష్యా -చైనాలు నిరూపించాయి). నైపుణ్యం బోధించిన వారే నిజమైన విప్లవకారులవుతారు తప్ప ఆదివాసీల ప్రాంతాలకు రోడ్లువేయవద్దు, పాఠశాల భవనాలు కట్టవద్దు, కడితే మందుపాతరలతో పేల్చివేస్తామని చెప్పి మరీ పేల్చివేయడమంత ‘అనాగరిక చర్య’ మరొకటి ఉంటుందా? ఆ చర్యకు ఓ సిద్ధాంత ‘ముసుగు’తొడగడం విడ్డూరం.
చైనాలో మావోయిజాన్ని తెలివిగా పక్కకుపెట్టి సంస్కరణల పేర, ప్రపంచీకరణ పేర ఒకప్పటి మావో అనుచరుడు డెంగ్ జియావోపింగ్ సమూల మార్పులు తీసుకొచ్చిన వేళ- ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మావోయిజాన్ని మరింత ఎత్తుకు ఎత్తిపట్టాలని ప్రయత్నించడం చైనా ఆదర్శంగా తీసుకునే నక్సలైట్లు (మావోలు) వర్తమాన చైనాను ఎందుకు ‘నమూనా’గా తీసుకోలేరు? తీయన్మాన్ స్క్వేర్ హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు?
నేపాల్ పరిణామాలను ఎందుకు స్ఫూర్తిగా తీసుకోరు? ఆరిన కొలంబియా కొలిమి నుంచి ఎందుకు గుణపాఠం నేర్చుకోరు? మార్క్సిజం ప్రయోగానికి కాలం చెల్లిందని సామాన్యుడికి సైతం అర్ధమవుతున్నా ‘‘సబ్ ఠీక్‌టాక్ హై’’ అని నటించడం ఎవరికి మేలుచేస్తుంది? ఒకప్పటి సోషలిస్టు దేశాలుగా చెప్పుకున్నవన్నీ పేకమేడల్లా కుప్పకూలిపోయి దశాబ్దాలు గడుస్తున్నా ఆ ‘దృశ్యం’ ఏదీ తమకు కనిపించడం లేదన్నట్టు నటిస్తే ఎలా? ప్రజల ప్రాణాలు, ఆస్తులతో ఆడుకుంటామని కంకణం కట్టుకుని ప్రవర్తిస్తే అదెలా ఆరోగ్యకర రాజకీయమవుతుంది? రాజకీయమంటేనే ధ్వంస రచన, హింస రచన అని నిర్వచనం చెప్పకుంటే ఎలా? ప్రజలే కేంద్ర బిందువులుగా, వారి స్వేచ్ఛ, సాధికారత కీలకమని భావించిన గ్రీతుతత్వవేత్త సోక్రటీసు కాలం నుంచి వేలాది సంవత్సరాలుగా ఎంతోమంది సరైన దిశగా, సవ్యమైన దారిలో ప్రజల్ని నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ముందూ జరుగుతాయి. వాటికి మాన్యత ఉంది.. ఉంటుంది. ప్రజల స్వేచ్ఛ, సాధికారత పేర ‘‘పూర్తి నియంతృత్వం’’, నిరంకుశత్వం కోరుకోవడం మావోలకే చెల్లింది... చెల్లుతోంది. ఈ విధా నం, ఒరవడి, వైఫల్యాలను మూటకట్టుకోవడం ఇంకెంత కాలం మిత్రులారా? పరిసరాలను పరిశీలించండి, ‘ప్రగతి’కి దారులు వేయండి, ప్రజల కంటి వెలుగులు కండి, అంతేకాని ప్రజల కంట్లో ‘నలుసు’గా మారకండి, ఆదివాసీలు ఇప్పటికే దశాబ్దాలపాటు వెనుకబడి వున్నారు. వారి గుండెల్లో, గూడాల్లో మందు పాతరలు పేల్చకండి. వారిని బలిపశువులను చేయకండి. గుణాత్మక మార్పు కోసం పాటుపడండి! ఇదే నేటి చారిత్రక ఆవశ్యకత! కాదంటారా?

-వుప్పల నరసింహం 99857 81799