సబ్ ఫీచర్

ధీరోదాత్తుడు శాస్ర్తిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు లాల్ బహదూర్ జయంతి
*
జాతిపిత మహాత్మా గాంధీ జన్మించిన నాడే లాల్‌బహదూర్ శాస్ర్తీ జన్మించడం ప్రాముఖ్యత సంతరించుకున్నది. 1904 అక్టోబర్ 2న వారణిసిలో పేద బడిపంతులు శారదాప్రసాద్, రాం దులారీదేవి దంపతుల ద్వితీయ సంతానంగా లాల్‌బహదూర్ జన్మించారు. విద్యార్థి దశలోనే దేశభక్తి తత్పరుడై 1921లో 10వ తరగతిలో ఉన్నపుడు గాంధీజీ పిలుపుతో పాఠశాలను వీడారు. జాతీయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న ఫలితంగా అరెస్టయి జైలుకు వెళ్లారు. 1928లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యుడై 1930లో గాంధీజీ సలహా మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడంతో శాస్ర్తిజీని 1940లో బ్రిటిష్ పాలకులు ఏడాది పాటు జైల్లో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత శాస్ర్తిజీ ‘ఆనంద భవన్’ నుండి స్వాతంత్య్ర ఉద్యమ కార్యకర్తలకు సలహాలు అందించడంతో 1946వరకు మళ్లీ జైలు శిక్ష పడింది. అలా శాస్ర్తిజీ తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపారు.
1947 ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద వల్లభ పంత్ శాస్ర్తిజీని హోం, రవాణాశాఖల మంత్రిగా నియమించారు. మంత్రిగా చక్కటి సంస్కరణలు అమలుపరచి ప్రజాభిమానం పొందారు. శాస్ర్తిజీ అంకితభావాన్ని గుర్తించిన ప్రధాని నెహ్రూ ఆయనను 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1952 మే 13న ప్రధాని నెహ్రూ శాస్ర్తిజీని కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా నియమించారు. 1956లో దక్షిణాదిలోని అరియలూర్‌లో సంభవించిన రైలు ప్రమాదంలో 145 మంది ప్రయాణీకులు మరణించిన ఫలితంగా శాస్ర్తిజీ నైతిక బాధ్యత వహించి, తన మంత్రి పదవికి రాజీనామా చేసి, మంచి సంప్రదాయాన్ని నెలకొల్పారు. తన నిజాయితీ నిరూపించుకున్నారు.
ప్రధానమంత్రిగా..
1964 మే 27న నెహ్రూజీ తన కార్యాలయంలో తనువు చాలించగా, ప్రధాని పదవికి శూన్యత ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు కె.కామరాజ్ చొరవతో జూన్ 9న శాస్ర్తిజీకి ప్రధాని పదవి కట్టబెట్టారు. వివాహ రహితుడు, మృదుస్వభావి అయిన శాస్ర్తిజీ నెహ్రూ రాజకీయ పంథాకు చెందిన వాడయినందున సాంప్రదాయ వర్గానికి చెందిన మొరార్జీదేశాయ్ ఔన్నత్యాన్ని నిరోధించగలిగారు. తన మంత్రివర్గంలోనికి ఇందిరాగాంధీని సమాచార, ప్రసార శాఖామంత్రిగా నియమించారు. 1965లో చెలరేగిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చాకచక్యంగా ఆయన పరిష్కరించారు. హిందీయేతర రాష్ట్రాలు కోరేవరకు ఇంగ్లీషు అధికార భాషగా ఉంటుందని హామీ ఇచ్చారు. శాస్ర్తిజీ ప్రణాళికాబద్ధమైన నెహ్రూ సోషలిస్ట్ ఆర్థిక సిద్ధాంతాలను పక్కనబెట్టి ‘హరిత విప్లవాన్ని’, ‘క్షీర విప్లవాన్ని’ పెంపొందించారు. అధిక ఆహారోత్పత్తి సాధించి, రైతుల ఆర్థిక స్థోమత పెంచే దిశగా వ్యవసాయ, పశుసంవర్ధక రంగాల్లో శాస్ర్తియ పద్ధతుల్ని అవలంబించేందుకు విరివిగా ప్రోత్సాహకాలు అందజేశారు. 1964లో భారత ఫుడ్ కార్పొరేషన్ ప్రారంభించారు. క్షీర విప్లవం ద్వారా పాల ఉత్పత్తి పంపిణీ సాధించేందుకు గుజరాత్ తరహా ఆనంద్ అమూల్ సహకార సంస్థను, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డును ప్రారంభించారు.
ఇండో-పాక్ యుద్ధం..
శాస్ర్తిజీని తక్కువగా అంచనావేసిన పాకిస్తాన్ 1965లో భారత్‌పై దండయాత్ర చేసింది. అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన శాస్ర్తిజీ వడివడిగా నిర్ణయం తీసుకుని సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భారత్ సైన్యం పాకిస్తాన్ దండయాత్రను తరిమి కొట్టడంతో పాకిస్తాన్ సైన్యం చావుదెబ్బతింది. పాకిస్తాన్‌పై విజయం భారత్ ప్రతిష్ఠను ఇనుమడింపజేసింది. ఐరాస, అమెరికా, రష్యాల జోక్యంతో 23-9-65న యుద్ధం ముగిసింది. ఇండో- పాక్ యుద్ధం తర్వాత 10-1-66న రష్యా నాయకుడు అలెగ్జీ కొనిగిన్ ఏర్పాటుచేసిన టాష్కెంట్ (నేటి ఉజ్బెకిస్తాన్) శాంతి సమావేశంలో శాస్ర్తిజీ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్ పాల్గొన్నారు. నాటి సమావేశంలో ఇరు దేశాల సైన్యం తమ పూర్వపు స్థావరాలకు వెనక్కు వెళ్లాలని ఒప్పందం కుదిరి సంతకాలు చేశారు. మరుసటిరోజు ఉదయం శాస్ర్తిజీ తాష్కెంట్‌లోని తన విడిది గృహంలో మరణించినట్లు వార్త వెలువడడం భారత జాతిని విషాదానికి గురిచేసింది. శాస్ర్తిజీ మరణం వెనక గూడుపుఠాణీ జరిగిందని ఆయన మద్దతుదార్లు భావించగా, తన భర్తను విష పూరితం చేసి చంపారని శాస్ర్తిజీ భార్య లలితాశాస్ర్తీ ఆరోపించారు. ఆ మరణంపై పోస్ట్‌మార్టం జరపడంపై హోంశాఖ నేటివరకు సమాచారం ఇవ్వలేదు. విదేశీ సంబంధాలు దెబ్బతింటాయని ప్రధానమంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా శాస్ర్తిజీ న్యూక్లియర్ పరీక్షలతో ముందుకెళ్లాలన్న కృతనిశ్చయం పట్ల అమెరికా జాగ్రత్త పడినట్లు వార్త వెలువడింది. ఇండియా, రష్యా ఈ ప్రాంతంలో ఐక్యంగా ఆధిపత్యం చెలాయించడంపై అమెరికా నిఘా సంస్థ సిఐఏ అనుమానించినట్టు కూడా వార్తలు వచ్చాయి.
జై జవాన్! జై కిసాన్!!
ఇండో-పాక్ యుద్ధం సందర్భంగా శాస్ర్తిజీ ఇచ్చిన ‘జై జవాన్! జై కిసాన్!!’ నినాదం నేటికీ శాశ్వతంగా ప్రతిధ్వనించడం ఆయన సైన్యానికి, రైతాంగానికి ఇచ్చిన ప్రాముఖ్యతకు నిదర్శనం. ఆయన ఉన్నత పదవులను చేపట్టినా చనిపోయినపుడు తన చెంత చిల్లిగవ్వలేకపోవడం ఆయన ఆదర్శ జీవితానికి నిదర్శనం. శాస్ర్తిజీ అసమాన ధైర్యశాలి. నీతి, నిజాయితీ, విధి పట్ల అంకితభావం, నిరాడంబరత లాంటి సద్గుణాలు ఆయన సొంతం. శాస్ర్తిజీ విజయాలు భారతీయుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి.

-గుండాల రామకృష్ణయ్య 98498 90102