సబ్ ఫీచర్

అన్నీ మంచి శకునములే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌కు మరో టెక్నాలజీ ఆణిముత్యం వచ్చి చేరింది. అమెరికాకు చెందిన సెమీ కండక్టర్ సంస్థ ‘‘మైక్రాన్ టెక్నాలజీ ఇన్’’ తన పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డి) కేంద్రాన్ని ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభించింది. ‘నీతి ఆయోగ్’ సీఈఓ అమితాబ్ కాంత్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనే శక్తి భారత్ వద్ద ఉందని, కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) లాంటి కీలక సాంకేతిక అంశాల్లో దేశం ఎంతో పురోగతి సాధించిందని కాంత్ చెప్పారు. అలాంటి సాంకేతికతకు వెనె్నముకగా సెమీ కండక్టర్స్ పరిశ్రమ నిలుస్తోందని, ఆ పరిశ్రమకు చెందిన ఆర్ అండ్ డి విభాగం హైదరాబాద్‌కు రావడం మంచి పరిణామమని ఆయన చెప్పారు.
పరిశోధన కేంద్రానే్న గాక ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఆ సంస్థ ముఖ్య అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ రోజురోజుకూ వర్ధిల్లుతోందని, మరిన్ని సంస్థలు రానున్నాయని కూడా మంత్రి తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్ మైక్రాన్ కేంద్రంలో ఏడువందల మంది పనిచేస్తున్నారని త్వరలో వీరి సంఖ్య రెండువేలకు చేరుకోగలదని సంస్థ సిఈఓ సంజయ్ మెహ్రోత్రా పేర్కొన్నారు. తమ సంస్థ టర్నోవర్ 30 మిలియన్ డాలర్లు అని, ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో 34వేల మంది పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
అభివృద్ధికి తారకమంత్రం!
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సిఐఐ (కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)కి చెందిన దక్షిణ ప్రాంత కౌన్సిల్ సమావేశంలో ఇటీవల పాల్గొని వర్తమాన తారకమంత్రమైన ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (వౌలిక సదుపాయాలు), ఇంక్లూజివ్ గ్రోత్ (అందరికి అభివృద్ధి ఫలాలు), ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ (వ్యాపార అంతర్జాతీయకరణ) గూర్చి వివరించారు. వీటి ద్వారా నవీన భారతదేశ నిర్మాణం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల మధ్య పారిశ్రామిక అభివృద్ధికి సదరన్ ఇండస్ట్రియల్ కారిడార్ రూపకల్పనకు పూనుకోవాలని కోరారు.
మేటి స్మార్ట్ సిటీ..!
హైదరాబాద్ స్మార్ట్ సిటీల్లో అగ్రస్థానం దక్కించుకుంది. ఇది అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. భారత్‌లోని మూడు నగరాలు పోటీపడగా హైదరాబాద్ అగ్రభాగాన నిలిచింది. భాగ్యనగరం తరువాతనే ఢిల్లీ, ముంబయి నగరాలు నిలిచాయి. స్విట్జర్‌లాండ్, సింగపూర్‌కు చెందిన సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రాతిపదికగా ఈ హోదాను ప్రకటించారు. ప్రపంచం మొత్తంలో హైదరాబాద్ 67వ స్థానం దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తొలి స్థానాన్ని సింగపూర్ చేజిక్కించుకుంది.
ఇటీవల ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ‘ఇండియా ఎకనామిక్ సమ్మిట్’లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొని గత ఐదేళ్ళలో తెలంగాణలో కొత్తగా 8400 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని వీటి ద్వారా 12 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరికొన్ని లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించిందని పేర్కొన్నారు.
‘గూగుల్’ రీసెర్చి కేంద్రం
కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోగశాల (రీసెర్చ్ సెంటర్)ను బెంగళూరులో ఏర్పాటుచేస్తున్నట్టు గూగుల్ సంస్థ పేర్కొన్నది. ‘‘గూగుల్ రీసెర్చ్ ఇండియా ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెంట్ ల్యాబ్’’గా దీన్ని పిలువనున్నారు. అక్కడ ఏఐతో పాటు కంప్యూటర్ సైన్స్‌పై పరిశోధనలు జరుపుతారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య లాంటి కీలక రంగాల్లో ఎదురవుతున్న సవాళ్ళకు సలక్షణ పరిష్కారాలను అణ్వేషించేందుకు ప్రయోగాలు జరుపుతారు. టాటా ట్రస్ట్స్‌తో కలిసి గూగుల్ సంస్థ ‘ఇంటర్నెట్ సాథీ’ అనే కార్యక్రమంలో భాగంగా 80వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సేన్‌గుప్తా పేర్కొన్నారు.
బెంగళూరును మించిన హైదరాబాద్
ఐటీ రంగంలో బెంగళూరుకన్నా హైదరాబాద్‌లో ఎక్కువ అభివృద్ధి ఉందని మంత్రి కేటీఆర్ ఇటీవల చెప్పారు. రాయదుర్గం ‘స్కై వ్యూ’ భవనంలో ‘ఎంఫసిస్’ అనే ఐటీ సంస్థను ప్రారంభిస్తూ హైదరాబాద్‌లో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి పరిచే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) పనిచేస్తోందని మంత్రి వివరించారు.
హైదరాబాద్‌లో చైనాకు చెందిన ‘్థండర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ’ కంపెనీ తన కార్యక్రమాల్ని విస్తృతపరిచేందుకు ఇటీవల నిశ్చయించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. పరిశోధన- అభివృద్ధి కార్యక్రమాల కోసం తమ సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చుచేయనున్నదని సిఈఓ జావో పేర్కొన్నారు. ఇంటెల్, క్వాల్‌కామ్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ లాంటి సంస్థలు తమ ఖాతాదారులుగా ఉన్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో బలమైన కేంద్రాన్ని రూపొందిస్తామని, వచ్చే మూడేళ్ళలో వెయ్యిమంది వరకు ఉద్యోగులను తీసుకోనున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో మంచి అవకాశాలున్నాయని, మరింత ‘పని’చేపట్టేందుకు వీలుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఐటీ నైపుణ్యాలు అందించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) సంస్థ ముందుకొచ్చింది. వీరు పాఠ్యాంశాలను మరింత సమర్ధవంతంగా బోధించేందుకు ఈ శిక్షణ ఉపకరించగలదని భావిస్తున్నారు. ఇందులో సిఐఐని సైతం భాగస్వామ్యం చేశారు. ఈ శిక్షణలో రెండు రోజుల థియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయి. దీనికోసం టిసిఎస్ వంద మంది ఐటీ ఉద్యోగులను కేటాయించింది. తొలుత 67 మంది ఉపాధ్యాయులను శిక్షణకు ఎంపిక చేశారు. వివిధ దశల్లో మొత్తం ఐదువేల మంది ఉపాధ్యాయులకు ఈ శిక్షణ అందించనున్నారు. దీని ప్రభావం విద్యార్థులపై తప్పక పడుతుంది. విద్యాప్రమాణాలు పెరుగుతాయి.
టీ-ఫైబర్ పనులు ఆరంభం
అత్యంత వేగం గల బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, డిజిటల్ సేవల కోసం ఉద్దేశించిన అతిపెద్ద ఫైబర్ ప్రాజెక్టు పనులను ‘తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్’ (టి-ఫైబర్) ఎల్ అండ్ టీ సంస్థ ప్రారంభించింది. దాదాపు 56వేల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసే పని ప్రారంభమైంది. దీనివల్ల 11 జిల్లాల్లో 3,201 గ్రామ పంచాయతీల్లోని ఎనిమిదిన్నర లక్షల ఇళ్ళకు బ్రాడ్‌బ్యాండ్ సదపాయం లభించనున్నది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చుకాగలదని భావిస్తున్నారు.
అంకుర సంస్థలకు ఆదరణ
నాలుగైదేళ్ళ క్రితం స్టార్టప్ సంస్థల సంఖ్య కేవలం 450 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 4,500కు పెరిగింది. దశాబ్ద కాలంలోనే భారతదేశంలో స్టార్టప్ సంస్థల ‘దృశ్యం’ సంపూర్ణంగా మారిపోయింది. ఈ సంస్థలలో కొన్ని అంతర్జాతీయ స్థాయిలో సైతం పోటీపడుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నగరాలలో స్టార్టప్ సంస్థలు వృద్ధిచెందుతున్నాయి. నీతి ఆయోగ్, నాస్కాం, సిఐఐ లాంటి సంస్థలు వీటిని ఆదుకుంటున్నాయి. త్వరలో టీ-హబ్-2 ప్రారంభం కాబోతోంది. దీనిలో మరిన్ని కొత్త స్టార్టప్‌లు ‘‘స్టార్ట్’’కానున్నాయి. హైదరాబాద్‌లోని టీ-హబ్ ఈ అంశంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ రకంగా హైదరాబాద్‌కు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి.

-వుప్పల నరసింహం 99857 81799