సబ్ ఫీచర్

కాలుష్యం కాటుకు ఉక్కిరి బిక్కిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమిపై సమస్త జీవరాశి మనుగడ సాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న గాలి నేడు అనేక రూపాలలో కలుషితమై పోయింది. కా లుష్యం ఫలితంగా స్వచ్ఛమైన గాలి నానాటికీ కరవవుతోంది. అభివృద్ధి పేరుతో సహజ వాతావరణంపై మానవ ప్రమేయం రోజురోజుకూ మితిమీరిపోతున్న తరుణంలో వాతవరణ కాలుష్యం విషమ పరిస్థితికి చేరుకొంది. దీని పర్యవసానంగా అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మానవుని ఆర్థిక, సామాజిక జీవితంపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత్ సహా ప్రపంచ దేశాలలో వాయు కాలుష్యం తీరును పరిశీలిస్తే పరిశ్రమలు, మోటారు వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అగ్నిపర్వతాలు పేలడం, గనుల తవ్వకం, పంటల అవశేషాలను కాల్చడం, అడవులు నరకడం, పండగల సమయంలో బాణసంచా వినియోగం లాంటి కారణాల వలన సూక్ష్మాతి రేణువులు గాలిలోకి చేరి కాలుష్యం నలుదిశలా విస్తరిస్తోంది.
వాతావరణంలో గాలి కాలుష్యాన్ని లెక్కించాలంటే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ‘గాలి నాణ్యత సూచీ’, గాలిలోని వివిధ రసాయన పదార్థాల శాతాన్ని బట్టి లెక్కిస్తారు. ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఓజోన్, అమ్మోనియం, సీసం, గాలిలో తేలియాడే అతి సూక్ష్మమైన పదార్థాలు వాయు కాలుష్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. గాలిలోని సూక్ష్మాతి పదార్థాల పరిమాణం 2.5/ 10 మైక్రోమీటర్లు లేదా అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, అవి మానవుల, జంతువుల ఊపిరితిత్తులలోని వడపోత కేంద్రాలను దాటుకొని నేరుగా రక్తంలో కలిసిపోయి పలు రకాల వ్యాధులకు కారణమవుతాయి. తద్వారా ఉబ్బసం, ఊపిరి తిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు సోకుతున్నాయి. గర్భిణుల, గర్భస్థ శిశువులపైనా వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య సమస్యలకు దారితీస్తూ ‘నిశ్శబ్ద హంతకుడి’గా వాయుకాలుష్యం చేటు చేస్తోంది.
భారత్‌లోని వాయు కాలుష్య ప్రమాద ముప్పు గురించి పలు జాతీయ, అంతర్జాతీయ సర్వేలు పలు ఆందోళనకరమైన అంశాలను ఇప్పటికే బహిర్గతం చేశాయి. 2018 డిసెంబర్‌లో ‘లానె్సట్ ప్లానెటరీ హెల్త్’ అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం కారణంగా మన దేశంలో ఏటా దాదాపు 12.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది కాలుష్య పట్టణాలలో మన ఉత్తరాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని పేర్కొనడం మనలను విస్మయపరిచే అంశం. 2019 మార్చిలో ‘అమెరికా ఆధారిత అంతర్జాతీయ ఆహార పంటల విధాన పరిశోధనా సంస్థ’, ‘పార్ట్నర్ సంస్థ’ ఆధ్వర్యంలో వెలువడిన నివేదిక ప్రకారం ఉత్తర భారతదేశంలో వ్యవసాయ అవశేషాలు కాల్చడం వలన ఏటా 30 బిలియన్ డాలర్ల (రూ.2 లక్షల కోట్ల) ఆర్థిక నష్టం వాటిల్లుతోందని, బాణసంచా కాల్చడం వల్ల ఏటా 7 బిలియన్ డాలర్ల (రూ. 50 వేల కోట్ల) ఆర్థిక నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. గడచిన ఐదు సంవత్సరాల్లో పంట అవశేషాలు, బాణసంచా కాల్చడం వలన 190 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగిందని, అది దాదాపు భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.
గడచిన దశాబ్ద కాలం నుండి పలు నివేదికల ఆధారంగా మన దేశంలో పంట అవశేషాలు, బాణసంచా కాల్చడం లాంటి కార్యకలాపాలు వాయు కాలుష్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ‘గాలి నాణ్యత, వాతావరణ సూచన మరియు పరిశోధన వ్యవస్థ’ నివేదిక ప్రకారం 2018 సంవత్సరంలో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడం వలన ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 574 శాతానికి చేరుకుంటే, హైదరాబాదులో 267 శాతానికి చేరుకుంది. వాస్తవానికి గాలి నాణ్యత సూచీ (ఎక్యూఐ) 0 నుండి 100 వరకు ఉంటేనే అది ఆరోగ్యకరమైన వాతావరణంగా పరిగణిస్తారు. ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో దీపావళి పండగ సందర్భంగా గాలి నాణ్యత ఎంత ప్రమాదకరమైన స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు. దీపావళి తర్వాత సాధారణ పరిస్థితి రావడానికి ఢిల్లీలో 25 రోజులు, హైదరాబాదులో 16 రోజుల సమయం పట్టిందని ఆ నివేదిక విశే్లషించింది.
‘జాతీయ హరిత ట్రిబ్యునల్’ 2019లో ఉత్తర భారతదేశంలోని హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో వ్యవసాయ అవశేషాలను కాల్చడం వలన గాలి నాణ్యత దెబ్బతిందని, అనేక మంది ప్రాణాలను వాయుకాలుష్యం హరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితుల నివారణకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ వివిధ రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతం మన దేశంలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చిందని పలు అధ్యయనాలు పేర్కొంటున్న సందర్భంలో వాయు కాలుష్యం అనే మహమ్మారిని తరిమికొట్టడానికి మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలతో సహా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
మన దేశంలో కార్చిచ్చులు, అగ్నిపర్వతాలు పేలడం లాంటి ప్రమాదాల తీవ్రత లేనప్పటికీ, మానవ తప్పిదాల వల్ల వాయుకాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరు ఉద్యమబాట పట్టాలి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల స్థానంలో హరిత ఇంధనాల వినియోగాన్ని పెంచాలి, ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించాలి, జనావాసాలకు దూరంగా పరిశ్రమలను నెలకొల్పాలి. ఉత్తర భారతదేశంలోని వ్యవసాయ అవశేషాలను జీవ ఇంధనాల తయారీకి వినియోగించాలి. హరిత వనాలను విరివిగా పెంచుతూ అడవుల నవీకరణ కార్యక్రమాలు చేపట్టాలి. జనావాసాలకు దూరంగా గనుల తవ్వకాలను పర్యావరణం ఆధారంగా చేపట్టాలి. వివిధ పండగలలో, ఉత్సవాలలో పర్యావరణ హితమైన బాణసంచాను వాడాలి. దీపావళి పండుగ రోజున సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలి. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు ఎప్పటికప్పుడు వాయు కాలుష్యంపై తగు చర్యలు చేపట్టాలి. అప్పుడే స్వచ్ఛమైన ప్రాణవాయువును ప్రతి ఒక్కరూ పీల్చుకుని ఆరోగ్యకరంగా జీవించాలి.

-సంపతి రమేష్ మహారాజ్ 99595 56367