సబ్ ఫీచర్

మానవత్వాన్ని మంటగలుపుతున్న మావోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి మానవత్వాన్ని మావోయిస్టులు మంట గలిపారు. విశాఖ మన్యంలో ‘ఇన్‌ఫార్మర్’అన్న నెపంతో పెదపాడు గ్రామానికి చెందిన తంబేలు లంబయ్య అలియాస్ దివుడు అనే గిరిజనుడిని మావోయిస్టులు ఇటీవల కాల్చి చంపారు. పొలంలో పనిచేసుకుంటున్న లంబయ్యను సాయుధులైన మావోలు చుట్టుముట్టి కుంకుంపూడి గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. యధాప్రకారం లంబయ్య పోలీసు ఇన్‌ఫార్మర్ అని ఓ లేఖ అక్కడ వదిలి వెళ్ళారు. మావోయిస్టు జాంబ్రీ తదితరుల ఎన్‌కౌంటర్‌కు కారణమనుకుంటున్న అనుమానంతో ఇటీవల ఒకరిద్దరు గిరిజనులను మావోలు కాల్చిచంపారు. తాజాగా లంబయ్య వారి చేతిలో హతమయ్యాడు. ఈ సంఘటనలతో విశాఖ మన్యంలో గిరిజనుల్లో భయాందోళనలు పెరిగాయి.
అటు ఛత్తీస్‌గఢ్‌లో ఇటు విశాఖ మన్యంలో ఎందరో ఆదివాసీలను, గిరిజనులను ఇన్‌ఫార్మర్ల పేరిట మావోలు కాల్చిచంపుతూ ఉన్నారు. ఈ విశృంఖల హత్యాకాండను ఏ ప్రజాస్వామ్యవాది, ఏ ‘విప్లవ’వాది, ఏ మానవతావాది సమర్థిస్తాడో తెలియదు. తామెవరికీ జవాబుదారి కాదన్నట్టు మావోయిస్టులు ఇలా అమాయక ఆదివాసీలను, కొండ ప్రాంతాల గిరిజనుల ప్రాణాలు తీస్తే ప్రయోజనమేమిటి? ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో బుగతల- పెద్ద షావుకార్లను చంపి, తలలు నరికి గిరిజనులకు మేలుచేశామని, వారికి ‘విముక్తి’ కల్పించామని చెప్పుకున్నవారు ఇప్పుడు ఆ గిరిజనులను కాల్చి చంపి ఎవరిని విముక్తి చేస్తున్నారు? ఎవరిని చైతన్యపరుస్తున్నారు? ఏ వెలుగులకీ ప్రస్థానం?
ఈ ప్రశ్న గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కులకోసం పరితపించే సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ప్రొఫెసర్లు, చైతన్యవంతులైన విద్యాధికులు మావోలనుద్దేశించి వేయాలి కదా? ఆ నైతిక బాధ్యత వారికి లేదా? మావోలను, వారి సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా, అరెస్టుచేసినా ప్రదర్శనలు... ఊరేగింపులు, విజ్ఞాపన పత్రాలు, నిరసనలు... ఇట్లా అనేక పద్ధతుల్లో వ్యవహారం నడిపేవారు ఇలా అమాయక ఆదివాసీలు- గిరిజనులు మావోయిస్టుల తుపాకి గుళ్ళకు గురవుతుంటే సంవత్సరాల తరబడి ఈ తంతు జరుగుతుంటే, అనేక రాష్ట్రాల్లో ఇదే వైనం కొనసాగుతుంటే కిమ్మనకుండా ఉండటం సమంజసమవుతుందా?... వారు ఈ దేశ పౌరులు కారా? ఎందుకు వారిపట్ల ఈ వివక్ష కొనసాగుతోంది? ఇంత ‘వౌనం’ భావ్యమా? ఇంత నిర్లక్ష్యం, నిరాదరణ ఆమోదనీయమా? ఏ పేదవారి పట్ల జాలి-ప్రేమ, కరుణ, కనికరం చూపాలని చెప్పేవారే ఇలా నిరుత్తరులై బిక్కమొహం వేసి దశాబ్దాల తరబడి చూస్తుంటే అదెలా న్యాయ సమ్మతమవుతుంది? పేదలకోసమే పుట్టాయని చెప్పకునే ‘వామపక్ష పార్టీలు’ అయినా ఈ మానవ హనన కార్యక్రమం పట్ల పెదవి విప్పాలి కదా?
విశాఖలో విశ్వవిద్యాలయముంది, మరెన్నో కళాశాలలున్నాయి, చైతన్యవంతమైన విద్యార్థులున్నారు, ఎందరో మానవాభ్యుదయం గూర్చి తపనపడే ప్రొఫెసర్లు, అధ్యాపకులు ఉంటారు. వారిలో ఏ ఒక్కరు గొంతువిప్పక అది తమ సమస్యకాదన్నట్టు ప్రవర్తిస్తే అదెలా మానవాభ్యుదయం అనిపించుకుంటుంది? విశాఖపట్నం ఎంతో చైతన్యవంతమైన నగరమని చిరకాలంగా చెప్పుకుంటారు. రచయితలు, కవులు, కళాకారులు, చైతన్యవంతమైన యువకులు ఉంటారని, ఉన్నారని అంటారు. మరి ఇన్ని ‘హత్యలు’ ఇన్‌ఫార్మర్ల పేర జరుగుతుంటే కిమ్మనకపోతే ఎలా? రాజ్యహింసనే కాదు పార్టీల హింస... హింసా రాజకీయాన్ని నిరసించాలని దశాబ్దాల క్రితమే కె.బాలగోపాల్ గొంతు చించుకుని చెప్పారు. 21వ శతాబ్దంలో, సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో ఇలా సిద్ధాంతాల పేర సాయుధ దాడులుచేస్తూ సామాన్య ప్రజలను, అమాయక గిరిజనులను హతమారిస్తే అదెలా అంగీకారమవుతుంది? సమాజంలో అట్టడుగువర్గాలకు, దిగువన ఉన్న వారికి మేలైన జీవితం కల్పించాలని, ఇతరులు అనుభవిస్తున్న సదుపాయాలు- సౌకర్యాలు-వారి చెంతకు చేర్చాలని అందుకు ‘అందరూ’ కృషిచేయాలని, ఎవరి శక్తిమేరకు వారు పాటుపడాలని చెప్పుకుంటున్న సందర్భంలో ఏకంగా అలాంటి సామాన్యులపై సాయుధంగా విరుచుకుపడటంలో అర్థమేమున్నది? అలా జరిగితే కనీసం ఖండించాలి కదా? విశాఖపట్నం ఇప్పుడు మెట్రోసిటీగా రూపాంతరం చెందుతోంది. అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ‘ఐటి’రంగం వేళ్ళూనుకుంటోంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలున్నాయి. భారీ పరిశ్రమలున్నాయి. తీరప్రాంతం కావడంతో మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంది. విమానాలు తిరుగుతున్నాయి. ఇంటర్నెట్ మెజార్టీ ప్రజలకు అందుబాటులోకొచ్చింది. స్మార్ట్ఫోన్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఈ నేపధ్యంలో ఇందులో కొన్ని సౌకర్యాలు మన్యం ప్రాంత ప్రజలకు అందాలని, అందుకు చొరవతీసుకోవడం విజ్ఞత అవుతుందా? లేక వారిపై తుపాకి గుళ్ళవర్షం కురిపించి ప్రాణాలు తీయడం విశిష్టమైన చర్య అవుతుందా? అలా మరణించిన వారి కుటుంబాలను రోడ్డుపైకి తేవడం తెలివైన పని అనిపించుకుంటుందా? ఏది మేలైన ‘‘చర్య’’అవుతుందనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో ప్రతిధ్వనించాల్సిన అవసరముంది.
ఈ సంవత్సరాంతంలో విశాఖపట్నంలో ‘‘టెక్ 2019’’ పేర గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్పగొప్ప సాంకేతిక నిపుణులు, ‘‘ఒరిజినల్ థింకర్స్’’ అందులో పాల్గొని స్థానిక విద్యార్థులకు, ఔత్సాహికులకు మార్గదర్శనం చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి నిధులు సైతం అందనున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఆటోమేషన్, త్రీడీ ప్రింటింగ్, ఇట్లా అనేక ఆధునిక సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం యువతరాన్ని ఆకర్షిస్తోంది. అటువైపుగా గుంపులు గుంపులుగా కదులుతున్నారు. ఈ దృశ్యానికి... విశాఖ మన్యంలో ఆలీవ్‌గ్రీన్ దుస్తులు ధరించి తుపాకి చేతబట్టి, కిట్‌బ్యాగ్ వీపున వేసుకుని, విప్లవ నినాదాలుచేస్తూ జి.కె.వీధి మండలంలో తిరిగే మావోలు ఇన్‌ఫార్మర్ పేర గిరిజనులను చంపుతున్న దృశ్యానికి... ఎంతటి వ్యత్యాసముందో అందరూ గమనించాలి.
ఏ దృశ్యం ఆహ్వానించదగ్గది? ఏదీ ఖండించదగ్గది? అని ఎవరికివారే నిర్ణయించుకోవాలి.
ఇటీవల కొత్త ఢిల్లీలో ‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్’ జరిగింది. మొబైల్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు అక్కడ ప్రదర్శితమయ్యాయి. 5జి ఫోన్లు, రోబోలు, యంత్ర సామాగ్రి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటి) పరిజ్ఞాన ప్రదర్శన... ఇట్లా అనేకం మార్కెట్లోకి రాబోతున్న వాటిని ప్రదర్శించారు. ఇప్పుడు ప్రపంచమంతా 5జి జపం చేస్తోంది. 4జితోనే విశాఖపట్నంలో ఇంత ‘హల్‌చల్’ జరుగుతుంటే త్వరలో రానున్న 5జితో ఆ నగరం ఏ ఎత్తుకు ఎదగనున్నదో మావోయిస్టుల ఊహకు అందదు. మొత్తం జీవన విధానం 5జితో మారబోతోంది. సమాజం ఇప్పటికే ‘రీడిజైన్’ అయిన సంగతి స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖపట్నంలోని ఇంజినీరింగ్ కళాశాలలు, కోచింగ్ సంస్థలు, సాఫ్ట్‌వేర్ సంస్థలు... పెరిగిన వౌలిక సదుపాయాలు ఆ విషయాన్ని తెలుపుతున్నాయి. 5జి టెక్నాలజీ వచ్చాక పరిశ్రమలు, గృహాలు, వ్యాపారాలు, చదువులు, విద్య-వినోదం, వైద్యం అన్నీ మరో ‘లెవల్’కు చేరనున్నాయి. ఆ అంచున నిలబడి మావోయిస్టుల ‘హత్యాకాండ’ను పరిశీలిస్తే... అందులో ఏమైన ‘న్యాయం’ కనిపిస్తోందా?
‘టెక్ సావీ’గా పేరొందిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సాంకేతిక కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. పదో తరగతి నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు ఎవరైన తమతమ ఆసక్తి, అనురక్తి ఆధారంగా తమ నైపుణ్యాలను వృద్ధిపరచుకునేందుకు ఈ కేంద్రాలు తోడ్పాటు నందించనున్నాయి. ఇప్పటికే వివిధ పథకాలు అమలులో ఉన్నాయి. స్టార్టప్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో పరిష్కారం కనుగొనే ‘‘సంస్కృతి’’ అంతటా వ్యాపిస్తోంది. తాజాగా ‘గూగుల్’సంస్థ ‘క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్’ను ఆవిష్కరించింది. ఇది సరికొత్త విప్లవాన్ని తీసుకురాబోతున్నది.
సుస్థిర అభివృద్ధికి ఉగ్రవాదం... తీవ్రవాదం ఆటంకాలన్న స్పష్టమైన ‘అవగాహన’తో అటు హోంమంత్రి అమిత్‌షా, ఇటు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని (మావోయిజాన్ని) కూకటి వేళ్ళతో తొలగించి వేస్తామని అమిత్‌షా ఇటీవల పలుసార్లు చెప్పారు. ఈ మొత్తం నేపథ్యంలో మావోయిస్టులు మానవత్వాన్ని మంటగలుపుతూ ‘మన్యం’లో అమాయకులను హతమార్చడం నిందనీయం కాదంటారా?

- వుప్పల నరసింహం 9985781799