సబ్ ఫీచర్

సంభాషణాచతురుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిసలైన సంపాదకుడు, లోతయిన అధ్యయనశీలి, ఆకట్టుకునే వక్త, సంభాషణా చతురుడు, మృదువైన స్నేహశీలి, ఆకర్షణీయమైన స్ఫురద్రూపి అయిన సి.రాఘవాచారి హైదరాబాదులో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 1939 సెప్టెంబరు 10వ తేదీన వరంగల్ జిల్లా జనగామ/ పాలకుర్తి మండలం శాతాపురంలో జన్మించిన చక్రవర్తుల రాఘవాచారిని చాలామంది విజయవాడవైపు వ్యక్తిగా పరిగణిస్తారు. దానికి కారణం లేకపోలేదు- మూడు దశాబ్దాలకు పైగా ‘విశాలాంధ్ర’ దినపత్రికకు విజయవాడనుంచే సంపాదకత్వం వహించడంతోపాటు, బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత కూడా విజయవాడలోనే ప్రధానంగా ఉన్నారు. ఆయన వచ్చిన అవకాశాలను అందుకుని ఉంటే, తెలుగు పత్రికలకే కాదు ఆంగ్ల పత్రికలకు సైతం ఎడిటర్ అయి ఉండేవారు. ఎక్కడికక్కడ త్యజిస్తూ, చాలా సాధారణ జీవితం సాగించారు వారు.
నా వరకు అయితే, రాఘవాచారి అస్తమయం అనేది విజయవాడను కొంత వరకు కోల్పోడమే! ఆకాశవాణి, ప్రకాశం బ్యారేజి, కనకదుర్గమ్మ కొండ, తుమ్మలపల్లి కళాక్షేత్రం, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు... మాత్రమే కాదు; విజయవాడ ఉద్యోగం కారణంగా పరిచయమైన ఎందరో వ్యక్తులూ, వారి సాన్నిహిత్యం కూడా కదా! పాతికేళ్ళ క్రితంనుంచే విజయవాడ తెలుగు పత్రికా రాజధాని హోదా కోల్పోయింది. సరిగ్గా ఆ దశ మొదలైన తర్వాత 1996లో నేను బదిలీ మీద విజయవాడ ఆకాశవాణికి వెళ్ళాను. అప్పటికి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దినపత్రికల నుంచి పదవీ బాధ్యతలు నుంచి వైదొలిగిన కూచిమంచి సత్యసుబ్రహ్మమణ్యం, నండూరి రామమోహనరావు అక్కడే ఉన్నారు. వారిద్దరూ క్లాస్‌మేట్లు- వారే తర్వాతి దశలో రెండు పత్రికలకు ఎడిటర్లు అయ్యారు. వీరిద్దరూ ఆకాశవాణి భవనానికి చెరొకవైపు ఉంటూ; అడపా, దడపా ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వారితో సరిపోల్చగల ప్రతిభావంతుడు రాఘవాచారి. వారికన్నా చిన్నవారు అయినా రెగ్యులర్‌గా అధ్యయనం చేసి, విషయాలను సవ్యంగా ఆకళింపు చేసుకున్నవారు రాఘవాచారి. విస్తృతంగా చదివి, లోతుగా ఆ విషయాలను తరచి చూచి, తక్కువగా రాసిన ఎడిటర్ బహుశా రాఘవాచారిగారే కావచ్చు. నిజానికి వారు ఆ పత్రిక స్థాయిని మించిన సంపాదకులు.
రాఘవాచారిగారు పాత్రికేయులు, సంపాదకులు కన్నా ముందు పండితులు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు చక్కగా తెలిసినవాడు. ఆ స్థాయిలో భాషాపాండిత్యం ఉన్న సంపాదకులు ఆయన కాలంలోనే అరుదు అని చెప్పాలి. దానికిమించి తక్కువగా రాయడం నియమంగా పెట్టుకున్న సంపాదకులు కనుక విశే్లషణలో తొందరపాటుతనం ఉండదు. అంతకుమించి వారు రాయడంకన్నా ప్రసంగించడానికే ఎక్కువ ఇష్టపడేవారు. టీవీ ఛానళ్ళు హైదరాబాదులో ఉండటం; రాఘవాచారిగారు విజయవాడలోనే ఉండిపోవడంతో తెలుగు టీవీ జర్నలిజం నష్టపోయింది. ఇలా జరగకపోయి ఉంటే న్యూస్ టెలివిజన్ తెలుగులో మరింత అర్థవంతంగా మారి ఉండేది. విజయవాడలో వారు సభలో ప్రసంగించని రోజు లేదనే రీతిలో ఉండేది. ఆరోగ్యం కొంత దెబ్బతినడం, ఆస్పత్రిలో చేరడం మొదలయ్యాక ఈ ఉధృతి తగ్గింది. సభారంజకంగా, ఔచిత్యంతో ప్రసంగించగల దిట్ట రాఘవాచారి. విజయవాడలో వారు సభలలో వక్తగానే ఎక్కువ పేరుపొందారు. జర్నలిస్టుల క్లాసులు, యూనివర్సిటీలలో క్లాసులు, ఉపన్యాసాలలో కూడా బాగానే పాల్గొన్నారు.
ఎవరినీ నొప్పించకపోవడం మాత్రమేకాదు అవసరమైనచోట మాట పదునుగా సమయస్ఫూర్తితో ఛలోక్తిగా మాటలు విసిరేవారు. ఈ వ్యాఖ్యలు చూడండి:
* జిల్లాలను స్వతంత్ర రిపబ్లిక్‌లుగా ప్రకటించే స్థాయికి చేరుకున్నాయి మన పత్రికలు. * వావివరుస లేదన్నట్టు రంగు దేనికి ఉపయోగించాలి అనే విచక్షణ. ఔచిత్యం లేకుండా అన్నీ రంగుల్లో ప్రదర్శితమవుతున్నాయి. * ఇప్పటి విలేఖర్లలో మంచి చొరవా, ఎగ్రిసివ్‌నెస్, బోల్డ్‌నెస్, శైలిలో కొత్తదనం ఉన్నాయి. కానీ ప్రొఫెషన్‌ను సీరియస్‌గా తీసుకునే తత్వం వారిలో కనిపించడం లేదు. * పత్రిక ఈ చివరినుంచి ఆ చివరివరకూ రాజకీయమే... * తాను సంపాదకుడినని పత్రికాముఖంగా చెప్పుకునే స్వాతంత్య్రం సంపాదకులే కోల్పోవడం ఇటీవలి పరిణామం.
ఆయన ‘విశాలాంధ్ర’ దాటి ఏ పత్రికలోనూ ప్రవేశించలేదు, రాయలేదు. అయితే ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి చక్కని వేదిక అయ్యింది. ఉషశ్రీ వారికి మంచి మిత్రులు. తనను చాలా కార్యక్రమాలలో వినియోగించుకున్నారని రాఘవాచారిగారే నాకు చాలాసార్లు చెప్పారు. అయితే సంఖ్యతో ఇటు వైవిధ్యంగల కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం నాగసూరి వేణుగోపాల్ హయాంలో జరిగిందని కూడా ఆయనే అనడం నాకు గర్వకారణం. కొన్ని అనుభవాలు ఇక్కడ పంచుకోవాలి. వందేళ్ళ తెలుగు పుస్తక ప్రపంచంలో వంద పుస్తకాలు ‘శత వసంత సాహితీ మంజీరాలు’గా ధారావాహిక ప్రసారం చేసినపుడు దాశరధి ‘అగ్నిధార’ గురించీ, వారిచేత ఉత్తమ ప్రసంగాలు చేయించాం. అవి ఇటీవల ఆంధ్రభూమి దినపత్రిక ‘వినమరుగయిన’ శీర్షికలో ముద్రించబడ్డాయి కూడా! అయితే నాకు జి.వి.కృష్ణారావు సిద్ధాంత గ్రంథం ‘కళాపూర్ణోదయం’ గురించి ఎవరితో మాట్లాడించాలి అనే సందేహం ఎదురయ్యింది. సంస్కృత భూయిష్టమైన తెలుగు కావ్యాన్ని పరిశోధించి కృష్ణారావు ఇంగ్లీషు భాషలో సిద్ధాంత గ్రంథం రాశారు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషుతోపాటు విమర్శక దృష్టి, పాండిత్యం ఉంటే గానీ సాధ్యంకాదు. ఈ ప్రత్యేక సామర్థ్యాలు రాఘవాచారిగారిలో ఉన్నాయి కనుక చక్కని ఆకాశవాణి ప్రసంగం రక్తికట్టింది. 1999సం. ముగుస్తున్నవేళ, 20వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం అనే భావన ఎలా రూపం పోసుకుని, ఎలా వివిధ దేశాలలో వాస్తవ రూపు ధరించిందని విజయవాడ ఆకాశవాణి కోసం ఆరు కార్యక్రమాల కోసం వారిని నేను పరిచయం చేయడం విలువయిన అనుభవం. పొత్తూరి వెంకటేశ్వరరావుగారు ప్రెస్ అకాడమి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆకాశవాణి కోసం సంయుక్తంగా అప్పటి సంపాదక కవులతో ‘్భవన విజయం’ వంటి కార్యక్రమం 2000 సం. తొలి మాసాలలో చేశాం. అందులో రాఘవాచారిగారు గాంధీ టోపీ ధరించి కాశీనాథుని నాగేశ్వరరావుగారు రక్తికట్టించారు. ఇలా ఎన్నో జ్ఞాపకాలు ముప్పిరిగా మనసును నింపుతున్నాయి ఇపుడు.

- నాగసూరి వేణుగోపాల్ 94407 32392