సబ్ ఫీచర్

సాహసాలకు ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి తృతీయ ప్రధానిగా 1966లో ఇందిరా ప్రియదర్శిని పగ్గాలు చేపట్టాక- నాటి సీనియర్ రాజకీయవేత్తలు ఆమెను ‘డంబ్ డాల్’గా అభివర్ణించారు. అయిదేళ్ల తరువాత ‘లండన్ టైమ్స్’ పత్రిక ఆమెను మహిళాశక్తికి ప్రతీకగా ప్రశంసించింది. ఇందిరకు చిన్నతనంలోనే మహాత్మా గాంధీ ఆశీస్సులు లభించాయి. 1942లో ఫిరోజ్ గాంధీతో వివాహం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. 1944లో రాజీవ్, 1946లో సం జయ్ జన్మించడం, 1960లో ఫిరోజ్ హఠాన్మరణంతో తండ్రి జవహర్ లాల్ నెహ్రూ అడుగుజాడల్లో ఆమె రాజకీయ జీవితం ప్రభావితమైంది. 1964లో దేశ తొలి ప్రధాని, తండ్రి నెహ్రూ మరణానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ మంత్రివర్గంలో ఇందిర అంతగా ప్రాధాన్యం లేని సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
1950 నుంచి 1964 వరకు ఆమె ఇంటి బాధ్యతలను, తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూస్తూ మరోవైపు ప్రధాని నెహ్రూకు అండగా వుండేవారు. 1959లో 41 ఏళ్ల వయసులో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆమెను వరించింది. ఎటువంటి ప్రచార ఆర్భాటానికి తలవంచకుండా తండ్రి అభీష్టాలకు అనుగుణంగా అడుగులు వేశారు. 48వ ఏట దేశ ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టాక ఆమె పలు సందర్భాల్లో ఒడిదుడుకులను సాహసంతో ఎదుర్కొన్నారు. మహిళా ప్రధానిగా ఆమె శక్తియుక్తులు, ప్రతిభా సంపన్నత ప్రపంచాన్ని విస్మయపరిచాయి. నెహ్రూ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయి. లాల్‌బహదూర్ శాస్ర్తీ ఆకస్మిక మరణంతో కాంగ్రెస్‌లో మళ్లీ నాయకత్వ సమస్య తలెత్తింది. మొరార్జీ దేశాయ్ ప్రధాన ప్రత్యర్థిగా ఇందిరకు సవాళ్లు ఎదురయ్యాయి. 1969లో బెంగళూరు కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో దేశాధ్యక్ష అభ్యర్థిత్వానికి ఇందిర బలపరిచిన జగజీవన్ రామ్ ఒక్క వోటు తేడాతో నీలం సంజీవరెడ్డి చేతిలో ఓటమి చెందారు. వై.బి.చవాన్ ఆఖరి క్షణంలో ఇందిరకు వ్యతిరేకంగా సిండికేట్‌ను ప్రోత్సహించారు. మొరార్జీ దేశాయ్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి తప్పించవలసి వచ్చింది. పేద ప్రజల ఆశాజ్యోతిగా ఇందిరాగాంధీ- రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీరుూకరణ, భూసంస్కరణలు వంటి పథకాలను చేపట్టారు. అలీన రాజ్యాల ఐక్యతకు శాంతిదూతగా కీర్తి గడించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత ప్రజాస్వామ్యం విజయానికి విలక్షణ రూపమైంది. కరవుకాటకాలు, ధరల పెరుగుదల, పేదరికంతో సమతమతమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. పేదప్రజల పెన్నిధిగా అశేష భారత జనావళి హృదయాలను ఆమె ఆకట్టుకొన్నారు. ఇందిరమ్మ దీక్షాదక్షతల పాలనా సామర్థ్యం భారతావనిని ప్రగతిమార్గం వైపు పరుగులు పెట్టించింది. పాకిస్తాన్‌ను మట్టికరిపించిన ‘విజయేందిర’ 1971లో బంగ్లాదేశ్ అవతరణకు దారి చూపారు. అలహాబాద్ హైకోర్టు రాయ్‌బరేలీ ఎన్నికపై ఇచ్చిన తీర్పు సృష్టించిన అశనిపాత పరిణామాల కారణంగా దేశంలో కారుచీకటి కమ్ముకొంది. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవానికి పిలుపు ఇవ్వడం, ప్రతిపక్షాల ఐక్యత, కాంగ్రెస్ అసమ్మతి నేతల అధికార దాహం వంటి అంశాలు ఇందిరాగాంధీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. 1977 నాటి కలగూరగంప రాజకీయ పార్టీల అధికార దాహం కప్పల తక్కెడ వ్యవహారంగా మారడంతో రెండున్నరేళ్లలోనే జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 1980 మధ్యంతర ఎన్నికల్లో విజృంభించిన ఇందిర మళ్లీ ప్రధాని కావడం చరిత్రాత్మక పరిణామం.
ఉగ్రవాదం కాటుకు బలి...
‘ప్రత్యేక ఖలిస్థాన్’ ఏర్పాటు కోసం పంజాబ్‌ను అగ్నిగుండంగా మార్చిన ఉగ్రవాదులను అణచివేసేందుకు ఇందిర సాహసోపేతమైన చర్యలు తీసుకొన్నారు. అమృతసర్‌లోని సిక్కుల ప్రార్థనామందిరం ‘స్వర్ణ దేవాలయం’లో నక్కిన ఉగ్రవాదులను అణచివేసేందుకు ‘ఆపరేషన్ బ్లూస్టార్’కు ఇందిర అనుమతించారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను వ్యతిరేకించిన సిక్కు ఉగ్రవాదులు ఇందిరను అంతం చేయాలని వ్యూహం పన్నారు. ఫలితంగా సొంత సెక్యూరిటీ గార్డులు జరిపిన తుపాకీ కాల్పులకు ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఇందిర మరణానంతరం దేశ రాజధానిలో సిక్కులపై దాడులు, విపరీతంగా ఆస్తినష్టం వంటి విపరిణామాలు చోటుచేసుకున్నాయి.
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించి, పేదవర్గాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఇందిరమ్మ మరణించి నేటికి సరిగ్గా 35 ఏళ్లు గడిచిపోయాయి. సుమారు 16 ఏళ్లపాటు ప్రధానిగా ఆమె భారత రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతిభాశాలి. పేదల జీవన సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ పలు సంస్కరణలను ప్రవేశపెట్టిన ఇందిర దేశ రాజకీయాలను మలుపుతిప్పారు. నెహ్రూ నుంచి రాజకీయ వారసత్వం సిద్ధించినా, ఆమె అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారు. అధికార కేంద్రీకరణ, వ్యక్తిగత ప్రాబల్యంతో కాకుండా అరుదైన భారతావని నిర్మాణానికి పునాదులు వేశారు. జాతీయ, అంతర్జాతీయ రంగాలలో భారతదేశ కీర్తిప్రతిష్ఠలను మకుటాయమానం చేశారు. ఢిల్లీలోని శాంతవన్‌లో 156 అడుగుల ‘శక్తి మాతృక’ చిహ్నం ఇందిర వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటింపజేస్తోంది.
*
నేడు ఇందిరమ్మ వర్థంతి
*

-జయసూర్య