సబ్ ఫీచర్

నేతన్నలకు పెట్టుబడి సాయం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయంపై ఆధారపడే రైతన్నల తర్వాత కులవృత్తిపై ఆధారపడుతూ ఎక్కువ సంఖ్యలో జీవ నం గడుపుతున్నది నేతన్నలే. తెలుగు రాష్ట్రాలలో నేడు చేనేత కార్మికుల కుటుంబాలు కడు దయనీయ స్థితిలో ఉన్నాయి. వేరే పని చేయలేక కులవృత్తిపై ఆధారపడుతూ, దంపతులిద్దరూ రోజంతా శ్రమచేసినా కనీసం 200 రూపాయలు కూడా గిట్టుబాటు కానందున తమ కుటుంబాలను పోషించలేక ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. కొందరైతే ఈ వృత్తిని వదిలేసి కూలి పనులకు వెళుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఆరు వేల చొప్పున జమచేస్తున్నట్లు తమకు కూడా పెట్టుబడి కింద మగ్గానికి ఆరు వేల చొప్పున అందించాలని నేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ‘చేనేత నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టి, నేతన్న కుటుంబానికి ఏటా 24వేల రూపాయలు పెట్టుబడి అందించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. నేత కార్మికులు ప్రతికూల పరిస్థితులలో తమ వృత్తిని కొనసాగించ లేకపోతున్న దృష్ట్యా- తెలంగాణలో కూడా పెట్టుబడి సాయాన్ని అందించాలి. రైతులకు ఇచ్చినట్టే ఐదు లక్షల ఉచిత బీమాతో పాటు పెట్టుబడి సాయం కింద 30 వేల రూపాయలు అందించాలి. అప్పుడే కొంతమేరకైనా ఆ కుటుంబాల స్థితిగతులు మారుతాయి. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు శిలాఫలకం వేసి రెండున్నర సంవత్సరాలు దాటినా ఇప్పటికీ పనులు ప్రారంభించక పోవడం పట్ల నేత కార్మికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. భివాండీ, సూరత్, షోలాపూర్ లాంటి ఇతర ప్రాంతాల్లో వలస కార్మికులుగా పనిచేస్తున్న తెలంగాణ నేతన్నలకు టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో ఊరట లభిస్తుంది.
నేసిన బట్టకు కూలి గిట్టక, వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించలేక ఎందరో నేత కార్మికులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత బడ్జెట్‌లో చేనేత కార్మికులకు పెద్దఎత్తున నిధులు కేటాయించినప్పటికీ, నిధులను పథకాల అమలుకు ఖర్చుచేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలున్నాయి. గత ఐదేళ్ల కాలంలో సుమారు 350 మంది నేతన్నలు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోగా, అనారోగ్య సమస్యలతో కొందరు మృత్యువాత పడ్డారు. వేలాది మంది కార్మికులు నిరాశ్రయులై వృత్తిని కోల్పోతున్నారు. ప్రభుత్వ హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. చేనేత జౌళి శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నూలు సబ్సిడీ, థ్రిఫ్టు పథకాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వడం లేదు. నేతన్నలు ఎన్నో వ్యయప్రయాసలు పడి నేసిన వస్త్రాలు, తివాచీలు గిరాకీ లేనందున చేనేత సహకార సంఘాల్లోనే పేరుకుపోయాయి. వీటిని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నేత కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం సిరిసిల్ల చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలకు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చిన తరహాలో మిగిలిన ప్రాంతాల్లో ఆర్డర్లు ఇవ్వాలి. ప్రభుత్వ హాస్టళ్లకు తివాచీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారికి నేత వస్త్రాలు, కార్మికులకు వస్త్రాలు కొనేందుకు ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వరంగల్ తివాచీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏటా రూ. 14 లక్షల మేరకు ఆర్డర్లు వచ్చేవి. ఇపుడు రాష్ట్ర చేనేత సహకార సంస్థ(టెస్కో) ఆధ్వర్యంలో ఏడాదికి కేవలం 3 లక్షల ఆర్డర్లకు పడిపోయింది. టెస్కో ద్వారా నేతన్నలకు రావాల్సిన బకాయిలు 2 కోట్లకు పైగా ఉన్నాయని చెబుతున్నారు.
ఆర్డర్లు లేకపోవడం, బకాయిలు చెల్లించక పోవడం, ఋణాలు మాఫీ చేయకపోవడం, ప్రభుత్వాలు నేతన్నలకు ప్రత్యామ్నాయం చూపించక పోవడంతో వారి జీవితాలు దుర్భరమయ్యాయి. నమ్ముకున్న వృత్తి కూడు పెట్టకపోవడంతో నేతన్నలు మగ్గం వదిలి ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు, పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఘనత చేనేతలది. అగ్గిపెట్టెలో సైతం పట్టే చీర నేసిన కార్మికులు కొందరైతే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న నేతన్నలు ఎందరో ఉన్నారు. మహిళా నేత కార్మికులు సులువుగా కండె చుట్టే యంత్రం కనుగొన్న చింతకింది మల్లేశం లాంటి కార్మికులు తెలంగాణలో ఎందరో ఉన్నారు. అత్యంత ప్రాచీనమైన తమ వృత్తికి పాలకులు తగినంత ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలని నేతన్నలు కోరుతున్నారు.

-సామంతుల సదానందం