సబ్ ఫీచర్

క్రీడల్లో ఇంకెన్నాళ్లీ వెనుకబాటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియోలో 2016 ఒలింపిక్ క్రీడలు ముగిసాయి. చైనా తరువాత 125 కోట్ల జన సంఖ్యతో ప్రపంచంలో రెండో స్థానంలో భారతదేశం ఉంది. జన సంఖ్యకు తగ్గట్టే అంతర్జాతీయ క్రీడావేదికలపై ఆర్భాటం ప్రదర్శిస్తుంది. దక్షిణాసియా క్రీడారంగంలో సత్తాచాటినా ప్రపంచ పోటీలలో చతికిలపడుతుంది. అందుకు ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్సే సాక్ష్యం. బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు పతకాలకు- అందులో ఒకటి స్వర్ణం- పరిమితమైంది భారతదేశం. లండన్‌లో జరిగిన పోటీలలో స్వర్ణ వినా ఆరు పతకాలను సాధించింది. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో క్రీడారంగానికి ప్రోత్సాహం ఇవ్వాలన్న తలంపుతో రియోలో రెండంకెల స్థాయిన పతకాలు సాధిస్తుందన్న విశ్వాసంతో, నిధులతోపాటు, ఎప్పుడూ లేనంతగా క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ, స్ఫూర్తినింపుతూ ప్రధానమంత్రే వెన్నుతట్టి రియోకు సాగనంపారు. 120 మంది క్రీడాకారులు పయనమయ్యారు. 14 అంశాల్లో పాల్గొన్నారు. పోటీలు ఇక మూడు రోజుల్లో ముగుస్తాయనే వరకు భారతదేశానికి ఒక్క పతకం లేదు.
రిక్తహస్తాలతో తిరిగి వస్తారనుకుంటున్న తరుణంలో మొదటిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న సాక్షిమాలిక్ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించింది. మరుసటి రోజు బ్యాడ్మింటన్ పోటీలో పి.వి.సింధు రజతాన్ని అందుకుని మువ్వనె్నల పతాకాన్ని వినువీధిలో రెపరెపలాడటానికి కారణమైంది. అంతకుముందు ప్రాడునోవా అను ప్రాణాంతక జిమ్నాస్టిక్ పోటీలో తొలిసారి బరిలో దిగిన దీపాకర్మాకర్ తృటిలో కాంస్యాన్ని అందుకోలేకపోయినా భారతీయులందరికీ స్వర్ణ పతక విజేతగా హృదయాలలో నిలిచింది. ఈ ముగ్గురూ తొలిసారి ఒలింపిక్ పోటీలలో పాల్గొన్న మహిళలు. 125 కోట్ల ప్రజలకు ప్రతినిధులుగా, 120 మంది పాల్గొన్న క్రీడాకారులు కేవలం రెండు పతకాలతో తిరిగి వచ్చారు.
ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైన లగాయితు ఈ దేశానికి 9 మాత్రమే స్వర్ణ పతకాలు లభించాయి. అందులో ఎనిమిది హాకీలోను, ఒకటి షూటింగ్‌లోను లభించాయి. ఇవికాక 7 రజతాలు, 12కాంస్యాలు ఇంతవరకూ ఈ దేశం సాధించినవి. జాతిని నిర్వీర్యం చేసిన ప్రదర్శనం ఇది. మన క్రీడాకారుల్లో నైపుణ్యం లేదా? ఇతర దేశాలలోవలె క్రీడారంగానికి ప్రభుత్వాలు స్ఫూర్తి కలిగించడం లేదా? ప్రపంచపటంలో ఆ దేశం ఎక్కడుందో వెతుక్కుని తెలుసుకోవాల్సిన దేశాలు స్వర్ణాలను చేజిక్కించుకున్నాయంటే, ఆ స్థాయిని మన క్రీడాకారులెందుకు అందుకోలేకపోయారు? ఇటువంటి పోటీలలో వాస్తవానికి ఓడిందెవరు? ప్రతి ఒక్కరూ ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉంది.
ఇటీవలెనే అధికారం అందుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ పోటీలపై ఆయా క్రీడారంగాలపై అవి నిర్వహిస్తున్న సంఘాలపై అంతగా అవగాహన లేకపోవొచ్చు. ప్రభుత్వంలోని అధికార యంత్రాంగంపై ఆధారపడి ఉం డొచ్చు. అయినప్పటికీ క్రీడారంగాన్ని ఉత్సాహపరుస్తూ, ఎన్నడూ లేనంతగా నిధులను సమకూర్చి, అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడానికి వీలు కల్పించింది. తెర వెనుక జరిగే బాగోతాలు తెలియక ఉత్సాహంతో ముందుకు ఉరకలేసిందేమో మరి?
రెండవ అంశం ఏమంటే ఆటలంటే తెలియని వాళ్ళు క్రీడా సంఘాలను అజమాయిషీ చేస్తున్నారు. హాకీ బంతికి, క్రికెట్ బంతికి తేడా తెలియని వాళ్ళూ, బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్‌లలో గాలి పరిమాణం తెలియని వాళ్ళూ, ఏ కోర్టు వైశాల్యం ఎంతో తెలియని వాళ్ళూ రాజకీయ ప్రాబల్యంతో ఏదో ఒక హోదాతో ఈ పోటీలకు హాజరవడం, క్రీడాకారులను ప్రక్కనపెట్టి తమ స్వంత వ్యవహారాలు చూసుకుంటూ, పర్యాటకులుగా పలు ప్రాంతాలను ప్రభుత్వ ఖర్చుతో సందడి చేస్తున్న వాళ్ళే. క్రీడాకారుల బాగోగులు చూసే వారే లేరని, సరైన వసతి, భోజన సదుపాయాలు లేవంటూ, ఎన్నో ఫిర్యాదులు వచ్చినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. భారత స్వాతంత్య్రదినం నాడు కూడా క్రీడాకారులు ఉపవాసం చేయవల్సి వచ్చిందట. కూడా వెళ్ళిన అధికారులు క్రీడాకారులకు అందవల్సిన పోషక ఆహార పదార్థాలు, రోజువారి భత్యాలు ఇవ్వడం లేదనీ ఫిర్యాదులు వచ్చాయి. సుదీర్ఘమైన నడక పోటీలకు చిన్న చిన్న దేశాలు తమ క్రీడాకారులకు మార్గమధ్యంలో మంచుగడ్డలు, పానీయాలు అందిస్తున్నా, భారత క్రీడాకారుల్ని చూసే నాధుడే లేడట! ఎంత విడ్డూరం క్రీడాకారులకు ఈ పరిస్థితి నిరుత్సాహపరిచేవే! కూడా వివిధ హోదాల్లో వెళ్ళిన అధికారగణం తమ అవసరాలు తీర్చుకుంటున్నారే తప్ప తమ గురించి పట్టించుకోలేదని క్రీడాకారులు వాపోతున్నారట.
మరో అంశం ఏమంటే క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపాల్సిన క్రీడా సంఘాలు తమ ఉనికి కోసం రాజకీయ పెత్తందారీ తనానికి కొమ్ముకాస్తూ, కుత్సిత మనస్తత్వం కలిగిన కొందరు ‘ద్రోణాచార్యుల’చే తమకనుగుణంగా సలహాలు తెప్పించుకుని, ప్రావీణ్యతకు పాడికట్టి, తమవారిని ఎంపిక చేసుకోవడంలో ప్రమాణాలను సవరిస్తూండడం చేత క్రీడలు కునారిల్లుతున్నాయంటూ పత్రికలు ఘోషిస్తున్నాయి. పతకం సాధించగలవారిని పోటీలకు దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీటిని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గమనించి రియో ఒలింపిక్స్‌లో ఓటములను విశే్లషించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల క్రికెట్ వ్యవహారాలపై లోధాకమిటీ చేసిన సిఫారసులు దేశంలోని అన్ని క్రీడా సంఘాలకు అన్వయించి తక్షణ చర్యలు తీసుకుని 2020లో టోక్యోలో జరుగనున్న ఒలింపిక్ పోటీలకు ముందుగానే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.
మన దేశం ప్రతి రంగంలోనూ వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం రాజకీయ ఒత్తిడులు, భ్యూరోక్రాట్ల పైచేయి, ఎక్కడ చూసినా అవినీతి, ఆశ్రీత పక్షపాతం- ఇలా ఎనె్నన్నో. క్రీడారంగానికి కూడా ఈ జాడ్యం ఉంది. ప్రతి క్రీడకు ఒకటి కంటె మించిన సంఘాలు, పరస్పర కలహాలు, కొందరు ద్రోణాచార్యులు క్రీడాకారుల్లో నాటుతున్న విష బీజాలు, తమ వారి ఎంపిక కోసం మరో క్రీడాకారునిపై అర్ధంలేని ఆరోపణలు, ప్రామాణికతను బట్టికాక, అవసరానికోసం చేస్తున్న ఎంపికలు అన్నీ కలిగి భారతదేశం కీర్తి ప్రతిష్ఠలను దిగజార్చాయి.
క్రీడారంగానికి ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తాలను చూస్తే తలవంచుకోవాలని అనిపిస్తుంది. బ్రిటన్ ఒక్కొక్క పతకంకోసం రూ.8.8 కోట్లు ఖర్చుచేస్తుందని, అభినవ బింద్రా అన్నారు. ఈ దేశంలో క్రీడలకోసం ఎంత వెచ్చిస్తున్నామో ఇతర దేశాల గణాంకాలను చెబుతూ స్థాయా సంఘం వెల్లడించింది. తలసరి లెక్కల ప్రకారం అమెరికా రూ.22 ఖర్చుచేస్తే, అట్లాసులో వెతికితే కాని కనిపించని జమైకా 18 పైసలు వ్యయం చేస్తున్నదట. మరిమన భారతదేశమో?! ముష్టి మూడు పైసలు! అందులో క్రీడాకారునికి అందేది ఒక పైసా కంటే తక్కువే. తత్తిమ్మాది ప్రక్కదారి పట్టిపోతోంది. ఇక ఈ దేశంలో క్రీడాభివృద్ధిని గురించి ఊహించడం అర్ధంలేనిది.

- ఏ.సీతారామారావు - 08978799684