సబ్ ఫీచర్

సంసారయానంలో సవాళ్లెన్నో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్యలకి సంబంధించిన ప్రతి విషయంలోనూ కొందరు భర్తలెందుకు కల్పించుకుంటున్నారు? తను చెప్పిన ప్రతి మాటనూ భార్య వినాలని ఎందుకనుకుంటారు? ఇతరత్రా ఏమీ సాధించలేనివారు ఇంట్లో అధికారం చెలాయిస్తారని మనస్తత్వ శాస్తన్రిపుణులంటారు. ఇటువంటి అధికార వాంఛ అభద్రతాభవానికి చిహ్నమంటారు. పూర్వం అత్తగార్లలో ఇటువంటి అభద్రతాభావమముండేది (ఇప్పుడూ ఉందేమో). భర్తలలోనూ కన్పిస్తూ ఉంటుంది.
ఈశ్వర్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. తాగుడు, పేకాట, స్ర్తిలోలత్వం వంటి వ్యసనాలు లేవు. కట్నం ప్రసక్తి లేకుండా చంద్రకళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె జీవితం స్వర్గ్ధామం కావాలి. కానీ ఆమె ‘‘అత్తగారు లేరన్నమాట లేకుండా ఆరళ్ళు మీరే పెడుతున్నారు’’ అంది. ‘‘నేనేం చేస్తున్నాను? నీ మంచి కోసం, నువ్వు సుఖంగా, సులభంగా పనిచేసుకోవాలని చెప్తున్నాను. ఆ మాత్రానికే కోపమెందుకు?’’ అన్నాడు. చాలామంది భర్తలు ఈశ్వర్‌లాంటివాళ్ళని చూస్తూనే ఉంటాం.
వంటింట్లో భార్య వంట చేసుకుంటూ ఉంటుంది. భర్త లోపలకు వచ్చి ‘‘ఇలా గ్యాస్‌ని ఎక్కువలో పెట్టి చెయ్యకూడదు. సిమ్‌లో పెట్టి మూత పెట్టావనుకో.. తొందరగా ఉడికిపోతుంది..’’ అంటాడు. ‘‘కూరలు తరిగే కత్తిని ఈ అల్మారాలో పెట్టావనుకో, సులువుగా తీసుకోవచ్చు’’ అంటూ కత్తిని ఇంకో అరలో పెడతాడు. ‘‘ఇల్లు తుడిచేటప్పుడు ఏ గదిలో చెత్తను ఆ గదిలోనే ఎత్తెయ్యమని పనిమనికి చెప్పు’’ అంటాడు. గృహ నిర్వహణ గృహిణికన్నా తనకే బాగా వచ్చునని పతిదేవుల దృఢవిశ్వాసం.
కధ అక్కడే ఆగిపోదు. ఇంకా ముందుకు సాగుతుంది. నీరజ్ భార్యతో పార్టీకి వెళ్లాలి. ఆమె నీలం రంగు చీర కట్టుకుంది. తలలో మల్లెపూలు పెట్టుకుంది. ‘తెల్లటి’ పూలు పెట్టుకున్నావు, తెల్లచీర కట్టుకోవాలి కానీ నీలం రంగేమిటి? మార్చుకునిరా. ఇంకా టైముంది’’ అని నీరజ్ అన్నాడు. ఏ చీరైనా, ఏ డ్రెస్సయినా అంతే. పార్టీలకే కాదు, మామూలుగా ఏ బట్టలు కట్టుకున్నా అంతే. ఈ రంగు బాగులేదు, నీకు డ్రెస్‌సెన్స్ లేదు అంటాడు. ఇలాంటి పురుష పుంగవులకీ లోటు లేదు.
ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఇంటికి ఎటువంటి వస్తువులు కొనాలి, ఏ రోజు ఏ కూర వండాలి, ఫాన్ ఏ స్పీడులో తిరగాలి వంటి ప్రతి విషయంలోనూ తలదూర్చడం, సణుక్కోడం, ఇల్లాలేమైనా అంటే అలిగి సాధించడం అలవాటు. తమ మాట సాగాలన్నా పట్టుదలను వదిలేస్తే వారిలో ఏ ఇతర లోపమూ ఉండదు. పిల్లలను ప్రేమగా చూసుకుంటారు, అత్తమామలను గౌరవిస్తారు, తిండికీ, బట్టకీ, సౌకర్యాలకీ లోటుచెయ్యరు. కానీ భార్యలకు ఊపిరాడనివ్వరు.
మానవ మనస్తత్వం సార్వజనీనమైనది. పాశ్చాత్య దేశాలలో స్ర్తికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉందనుకుంటాం. అక్కడా భార్య చేసే ప్రతి పనినీ విమర్శిస్తూ, ఆమెలో తప్పులు ఎత్తిచూపుతూ (తప్పా కాదా అన్నది వేరే విషయం), ఆమెను ఉద్ధరిస్తున్నామనుకునే మగవారికి లోటులేదు. మైక్రోవేవ్ ఓవెన్‌లో ఒక్క నిమిషం వేడి చేసుకుందుకు భార్య 1, 0, 0 నొక్కి స్టార్ట్ బటన్ నొక్కుతుంది. భర్త వెంటనే ‘‘నాలుగుసార్లు నొక్కడమెందుకు? అర నిమిషం బటన్ రెండుసార్లు నొక్కితే సరిపోతుంది కదా’’ అంటాడు. ‘‘నాలుగుసార్లు బటన్ నొక్కితే నా చేతులు కందిపోవు, మైక్రోవేవ్ ఓవెన్ పాడయిపోదు’’ అని భార్య మనస్సులో అనుకుంటుంది కానీ పైకి అనదు. అంటే ఇల్లు రణరంగమే. భార్య పుట్టినరోజుకి ఆమె స్నేహితురాలు గులాబీ రంగు డ్రెస్ ప్రెజెంట్ చేసింది. ఆమె భర్తకి మురిసిపోతూ చూపించింది. ‘‘ఈ డ్రెస్ ఏమీ బాగులేదు. బిల్లు నీ దగ్గరుంటే ఎక్స్ఛేంజి చేసుకో. లేకపోతే నీ ఫ్రెండ్‌నే మార్చిపెట్టమను’’ అని భర్త అన్నాడు. ‘‘నాకీ డ్రెస్ నచ్చింది’’ అని పంటి బిగువున భార్య అంది. ‘‘నచ్చితే అల్మారాలో దాచుకో. ఎప్పుడూ వేసుకోకు’’ అని అతనన్నాడు.
1970, 1980 దశకాలలో భర్తలలోని అభద్రతా భావాన్ని, అధికార వాంఛనూ స్ర్తిలు సహించేవారు. ఇంకా గొప్పగా ‘‘ఏమిటో ఆయన ప్రతి విషయంలోనూ తన మాటే చెల్లాలంటారు. నాకు వంకాయ పెరుగు పచ్చడి ఇష్టం. ఆయనకు పులుసు పచ్చడి ఇష్టం. సగము ఇలా, సగము అలా
చేస్తానన్నా ఊరుకోరు’’ అని చెప్పుకునేవారు. ఆధునిక గృహిణి మాత్రం సహించలేకపోతున్నది. ప్రతి పనీ అంగుళమైనా తేడా లేకుండా తను అనుకున్నట్లే జరగాలనుకోడాన్ని మైక్రోమేనేజ్‌మెంట్ అంటారు. పూర్వం పిల్లల్ని రిక్షాకోసం పంపినప్పుడు ‘‘అర్థరూపాయకి బేరమాడి తీసుకునిరా’’ అని పంపేవారు. రిక్షావాలా అరవై పైసలకు కానీ రానంటే పిల్లవాడు ఇంటికొచ్చి పెద్దలను అడిగి మళ్లీ వెళ్లాల్సిందే. ఇప్పటి పిల్లలైతే అటువంటి పరిస్థితిని అంగీకరించరు. గృహిణులైనా అంతే. విడాకులు ఎక్కువ కావడానికి మగవారి మైక్రోమేనేజిమెంటు కూడా కారణమే. కానీ ఇతరత్రా ఏ లోటూ లేని భర్తను ఈ కారణంగా వదిలెయ్యడం ఎంతవరకూ లాభాన్నీ, సుఖాన్నీ ఇస్తుంది? పిల్లలను తండ్రి ప్రేమకు దూరం చేసి, భర్త సమకూర్చే అన్ని సౌకర్యాలనూ వదులుకుని బతకడం అభిలషణీయమా? కాదనుకుంటే ఊపిరాడనివ్వని మగవాడితో జీవించడం సుఖప్రదమా? ఇక్కడే మధ్యే మార్గముందా అన్న ప్రశ్న మహిళ వేసుకోవాలి. ముందుగా స్ర్తి గ్రహించాల్సినది మైక్రోమేనేజిమెంటు చేసే మగవారు దుర్మార్గులు కారు అన్న విషయం. నెమ్మదిగా చెప్పి కొంత మార్పు సాధించవచ్చు. అయినా కూడా అన్ని విషయాలలో కల్పించుకుంటూ ఉంటే యోగాభ్యాసం ఉపకరిస్తుంది. భర్త ఏమైనా అన్నప్పుడు కళ్ళు మూసుకుని, దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవడంవల్ల మనస్సు వికలమవకుండా ఆపుకోవచ్చు. అప్పుడప్పుడు వారం, పది రోజులు పిల్లలను తీసుకుని పుట్టింటికి కానీ, బంధు మిత్ర దర్శనానికి కానీ, విహార యాత్రలకు కానీ, భగవద్దర్శన యాత్రలకు కానీ వెళ్లినా మంచి ఫలితముంటుంది.
క్రింద చెప్పిన నియమాలను అన్ని వేళలా అనుసరించడం మంచిది
మీ భర్త ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకునే వ్యక్తి అయితే ఎప్పటికీ మీ స్వంత లక్ష్యసాధనలో అతని సహకారాన్ని అర్థించవద్దు. సౌమ్యకు బరువు తగ్గాలనిపించింది. ఆహారం, ఎక్స్‌ర్‌సైజు విషయంలో భర్తను సహాయం చెయ్యమంది. ఒక పార్టీలో ఆమె సలాడ్ తింటూండగా ‘ఇప్పటికి తిన్నది చాలు’ అంటూ ప్లేటు లాగేశాడు. పదిమందిలో ఆమె పరువేం కావాలి? మీకు సంగీతం నేర్చుకోవాలని ఉన్నా, వ్రతం చేసుకోవాలన్నా ఎంత చేతనయితే అంతే చేసుకోండి.
వీలయినంతవరకూ ఇంటిపనీ, వంటపనీ భర్త లేనప్పుడే చేసుకోండి. కూరలు తరిగి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. వంట వండి హాట్ పాక్‌లో పెట్టుకోవచ్చు. ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది.
ఏదైనా పొరపాటు జరిగినప్పుడు విమర్శకు సిద్ధంగా ఉండండి. మొదటివాక్యం అయినా అవకుండానే క్షమించమనండి.
ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటూంటే పక్కకు జరగండి. వాళ్లకి నచ్చినట్లుగా చేస్తారు.
ఎంత తెలివైనవారయినా, ఎంత గొప్పగా పనిచెయ్యగలిగినవారికైనా తమ మార్గమే ఉత్తమమనుకున్న నమ్మకం మంచిది కాదని సున్నితంగా గుర్తుచెయ్యండి.
ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళకు కూడా పైన చెప్పిన సూచనలను చెప్పి, పాటించమనండి. ముఖ్యంగా పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు.
వేలు మీద కురుపు వస్తే నయం చేసుకుంటామే కానీ వేలు కోసేసుకోము. అన్ని విషయాలలో భర్త కల్పించుకుంటూ, విమర్శిస్తూ ఉండడం కురుపు రావడం వంటిదే తప్ప కాన్సర్ రావడం కాదు. కాన్సర్‌కే వైద్యం దొరుకుతోంది. ఇక కురుపు ఎంత? విడాకులకి వెళ్ళే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా రచనను మావారి ముందుంచాను. మైక్రోమేనేజి చేసేవాళ్ళలో మహిళలు లేరా? కారు నడిపే మగవాడి పక్కన వౌనంగా ఎందరు మహిళలు ఉంటారు? కూరలు కొనుక్కొచ్చిన భర్తతో ‘‘కిలోకి నాలుగు వంకాయలు పుచ్చిపోతాయి’’ అని అతివలు అనరా? ‘‘కంచి నుంచి అయిదువేలు పెట్టి చీర తెచ్చారా? ఇక్కడ మూడు వేలకే దొరుకుతోంది’’ అని ప్రేమగా చీర తెచ్చిన శ్రీవారిని సాధించే స్ర్తిలకు తక్కువ అం టూ లెక్చరిచ్చారు. ఏమనాలి? స్ర్తి పురుషులు మైక్రోమేనేజ్‌మెంటులోనూ సమాను లే అనాలా?

****

భూమికకు రచనలు పంపాలనుకునే వారు
రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లోbhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- పాలంకి సత్య