సబ్ ఫీచర్
వర్తమానాన్ని ఒడిసిపట్టే సాహిత్యం అత్యావశ్యకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సర్వసాధారణ కష్టజీవుల జ్ఞానానికి అతీతమైన వ్యవహారంగా మేధావి వర్గాలు నిర్వహించే దోపిడి జరుగుతుంది. పాలకవర్గ రాజకీయాలు, వారికి అనుయాయులుగా మసలుతున్న మంది మాగాదులు, వ్యాపార వర్గాలు దోపిడీని దొరతనంగా భావిస్తూ అందినకాడికి ప్రజాధనాన్ని మింగిపారేస్తున్నారు. కోటాన కోట్లును నల్లధనంగా మార్చిపారేస్తున్నారు. మనిషిని ఆర్థిక అవతారంగా మార్చిపారేస్తు మానవీయతకు మరణ శాసనం రాసేస్తున్నారు. ‘‘కాదేదీ అక్రమార్జనకు అనర్హం’’ అనిపిస్తున్నారు. ప్రపంచంమీద పెట్టుబడిదారీ దేశాల మనోగతం ‘ప్రపంచీకరణ’ రూపంలో మహమ్మారిలా విరుసుకపడ్డాక మనిషి తాత్త్విక చింతనే మారిపోయింది. మనిషి మనసులేని మరబొమ్మగా వస్తువ్యామోహంతో డబ్బు బొడ్లో సుఖాన్ని సంతోషాన్ని వెతకడం మొదలెట్టాడు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, కూలి చేసుకొని పూట గడుపుకునే వాని దగ్గర నుంచి, కోట్లు గడించి తిన్నది అరగక తిరిగే బడా బూర్జువాల వరకు ఎవరి హద్దుల్లో వాడు, దోపిడీకి తెరలేపి ఎవడికి తగ్గట్టు వాడు అల్ప సంపాదనలకై ఆరాటపడుతున్నారు. అయితే చిన్నవాడు తేలిగ్గా దొరికి శిక్షను అనుభవిస్తున్నాడు. పెద్దవాడు ‘స్కామ్’ల రారాజుగా రాజ్యాలేలుతున్నారు. ఈ మనోవైఖరిని ప్రోత్సహించే ఈ జాఢ్యం ఎట్లా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో, ఎవరివలన వచ్చిందో, ఇది ఏవిధంగా వైరలవుతుందో అందరికీ తెలుసు.. అయినా దీనిలో ఏదో సుఖాన్ని ఇచ్చే వ్యసనంలా భరించి ప్రోత్సహించడం గమనార్హం.
పెట్టుబడిదారీ దేశాల దోపిడీ అనే మానస పుత్రికను అందరూ అక్కున చేర్చుకునేట్లు చేయడంలో పెట్టుబడిదారీ వర్గాలు కృతకృత్యులయ్యారనే చెప్పొచ్చు. భౌతికవాదులుగా, శాస్ర్తియ ధోరణి, దృక్పథం, హేతుబద్ధతతో ఆలోచించే జ్ఞానం జనంలో నానాటికి సన్నగిల్లిపోతూంది.
మనిషి అవినీతి పుట్టై, కుట్రలు కుతంత్రాలు విషపు నాగులకు నిలయమైపోతున్నపుడు, మనిషికి మనిషిమీదే కాదు ప్రకృతిమీద కూడా ప్రేమ నశించింది. స్వార్థం పెచ్చుమీరింది. వర్తమానం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. భవిష్యత్తు పట్ల ఆశ అంతరించింది. చారిత్రక అంశాలు వ్యక్తీకరణకు గురి అవుతున్నాయి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చరిత్రలో నిలిచిపోడానికి తప్పుడు రాతలతో గొప్పలు చెప్పుకోచూస్తున్నారు. ఈ ప్రక్రియకు దోహదపడే కవులు, రచయితలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. సాహిత్య రంగంలోకి ఎనె్నన్నో ప్రలోభాలు చోటుచేసుకుంటున్నాయి. కీర్తి కండూతితో సాహిత్యం ఎథిక్స్‌ను విస్మరించి, వక్రీకరణలు చేతివాటంగా ప్రదర్శించే స్థితిలోకి సాహితీవేత్తలు జారిపోవడం శోచనీయం.
ఇవాళ కవిత్వంలో వస్తు, రూప, సారాలకు తగినంత ప్రాధాన్యము ఇవ్వడంలేదు. వస్తురహితంగా అభివ్యక్తిని అందలమెక్కిస్తూ, నైరూప్యం నిషాతో కవిత్వం సాగుతుంది. జనాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల యెడల కవిత్వ పరంగా స్పందన కరువవుతుంది. ప్రస్తుతాన్ని వదలి వాదాల ముసుగులో కవిత్వం పాత రోతల్ని నెమరేసుకుంటూ మానిన గాయాల్ని రేపుతుంది.
దార్శనిక దృక్పథం కలిగించే సాహిత్యం కనుమరుగవుతోంది. నేడు సాహిత్యం కుల మతాల కుమ్ములాటలకు వర్గ వైషమ్యాలకు జీవం పోస్తుంది. సాహిత్యం, వాదాలు పరంగా వర్గాల పరంగా రాజకీయం మసాలాతో, నాయకత్వం బతుకుతెరువును వెతుక్కుంటూంది. కాల మార్పుతో పాటు సమాజంలో సమస్యలు మారుతుంటాయి. సమస్యలు కొత్త కోణాల్లో ప్రతిబింబిస్తుంటాయి. సాహిత్యం ఎప్పటికప్పుడు నూతన మూల్యాంకనంతో, సరికొత్తవైన ఎత్తుగడలతో, అదృశ్యమానంగా ఉండే సమస్యల సారాన్ని పాఠకలోకానికి అందించే ప్రజల భాషతో అధునాతన అభివ్యక్తితో ముందుకు సాగాల్సి వుంది. ఇవాళ సాహిత్యం సమాజంలో దావానలంగా వ్యాప్తి చెందుతున్న ‘బర్నింగ్ ప్రాబ్లమ్స్’ను విడిచిపెట్టి అభౌతిక, అలౌకిక, మనిషిని నిద్రావస్థలోకి జార్చే, జాగృతిని ఏమార్చే ఆధ్యాత్మికం ముసుగులో మూఢభక్తిని ప్రోత్సహించే సత్యదూరమైన కట్టుకథలకు నిలయమైపోతుంది. నిలువెత్తు సాక్ష్యమై కూర్చుంది. ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా గుడులు గోపురాలు వెలుస్తున్నాయ్. దోపిడీదార్లు దేవుళ్లను ప్రతిష్ఠిస్తూపోతుంటారు. గర్భదరిద్రులు వాటి చుట్టూ ప్రదర్శనలు చేస్తుంటారు. అప్పుడప్పుడు ఆరిపోతున్న వత్తిని చమురు అందించి ఎగదోసినట్లు పాలక వర్గాల్లో హోదా ఉన్న నాయకులు గుడుల్లో మొక్కులు చెల్లించి, భక్తుల నమ్మకానికి వెన్నుదన్నై నిలుస్తుంటారు. ఈ తంతుకు సాహిత్యం దోహదపడుతూనే వుంది. మనిషిని కర్మసిద్ధాంతాలు దాటిరానీయకుండా తోడ్పడుతూనే వుంది. పిచ్చిరాతలతో బొందితో కైలాసం చేరే మార్గాల్ని బోధిస్తూనే ఉన్నారు.
ఇంతెందుకు ఉదాహరణగా రైతు సమస్య తీసుకుందాం. స్వాతంత్య్రం వచ్చింది లగాయితు ఎప్పుడు రైతు సుఖంగా ఉన్నాడో, నమ్మకమైన జీవితాన్ని గడిపాడో ఆలోచించండి. నిజం మాట్లాడితే ఈ రోజు రైతు సమస్య రావణకాష్ఠంగా రగులుతున్న సమస్య. ఆరుగాలం చెమటోడ్చిన రైతు, తీరా పంట చేతికందక, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలుసు, మనకు కొత్తేమీ కాదు. అయినా రైతు సమస్యకు పరిష్కార మార్గం ఏ ప్రభుత్వం చూపిందో ఆలోచించామా? సమస్యను పరిష్కరించడానికి కనీసం ప్రయత్నించిన, రైతు జీవితం ఎరిగిన మేధావులతో కమిటీలు వేసి సమస్యలు చర్చించిన, సమస్యల పరిష్కారానికి ఫలానా నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు ఏవైనా ఉన్నాయా? అన్నీ కంటితుడుపు వాగ్దానాలు, ఎన్నికల ముందు ప్రమాణాలు. ఆచరణలో అన్నీ గాలికొదిలేసి అక్రమార్జనకు ఎగబడటాలు.. ఇదా ప్రజాస్వామ్యం? వీరా మన నాయకులు? అనిపిస్తున్నా, మన కలం యోధులు, కుల పోరాటాలకో, మత వ్ఢ్యౌనికో సిరాను ఖర్చుచేస్తారే కాని, పట్టెడన్నం పెట్టే అన్నదాత కష్టాలను ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తున్న దాఖలాలు అరుదుగా వుండడమే ఆలోచించవలసిన అంశం.
ఒక కవి అంటాడు- ‘‘బతుకంతా చెమట చిత్తడై / నెత్తురు ఆవిరై / విశ్వాసం తునాతునకలై / మట్టి పువ్వులు జీవచ్ఛవాలై రాలిపడుతున్నాయ్’’. వర్తమానాన్ని నిశితంగా దర్శించే మేధావికెవరికైనా ‘‘పిడికిట అన్నం ముద్దగా పిసికినప్పుడల్లా / పాలకులు కసిగా గొంతు పిసికిన రైతే గుర్తొస్తుంటాడు’’. మరి ఈనాడు మన సాహిత్యలోకం రైతు కవిత్వాన్ని ఎందుకు ఒక ఉద్యమంగా, వాదంగా తీసుకోవడం లేదో ఆలోచించాల్సి వుంది. మొక్కుబడిగా రైతుమీద కవిత్వం రాయడం కాదు, ఒక కవి సమ్మేళనాన్ని జరపడం కాదు. నడుము కట్టి సాహితీవేత్తలు రైతు ఉద్యమానికి ఊపిరిలూదే రైతు కవిత్వం రాయాల్సి వుంది. ‘‘మట్టిని నమ్మిన దేశానికి వెట్టి బతుకులు ఇంపోర్ట్ అవుతుంటే / మానవీయతను వ్యాపారించే దేశాలకు మానవ మేధస్సు ‘ఎక్స్‌పోర్ట్’ అవుతుంది, తెలిసీ మన ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తూనే వుంది. ‘స్వేదం విత్తి సేద్యాన్ని పండించేవాణ్ణి హైటెక్ పిచ్చితో హత్య చేస్తూనే వున్నామ్. వ్యవసాయానికి అన్ని విధాల అనువైన మన దేశంలో వ్యవసాయాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నాం. అన్నదాత ఆయువు పట్టు మీద దెబ్బకొడుతూనే ఉన్నాం.
ఈ విషయాల మీద ఎంతమంది కవులు, రచయితలు తమ కలాలను కదుపుతున్నారో మన పేపర్స్‌లో వచ్చే సాహిత్య పేజీలు చదివితే తెలుస్తుంది. రైతుకు దార్శనిక దృక్పథం కల్గించే సాహిత్యం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆడి, ఓడిన చెడును మనం నవనాగరికతగా మన యువతకు అందిస్తున్నాం. ఏది ఏమైనా ‘పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు’- అభివృద్ధి చెందిన దేశాల వస్తు వ్యామోహాన్ని, ఆర్థికోత్పత్తిని చూచి మనం నేల విడిచి సాము చేయపూనుకోవడం సబబు కాదేమో! మన దేశ పరిస్థితులను బట్టి మనం ఏ దారెంట నడవాలో తేల్చుకోవడం మాని, ప్రపంచమంతా చుట్టి వచ్చినంత మాత్రాన మన పాలకులు సమర్థవంతమైన పాలనను మాటల్లో చూపిస్తారే కాని చేతల్లో నెరవేర్చలేరు. నీతి, నిజాయితీ, నైతికతను ఎత్తి చూపుతూ వర్తమానాన్ని ఒడిసిపట్టుకొనే సాహిత్యం రావాలి. మనకు ఈ దార్శనిక దృక్పథాన్ని అప్పుడే కలిగించగలుగుతుంది.