సబ్ ఫీచర్

ఈచ్ వన్ - ప్లాంట్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో పరిణామాలు చెంది ఈ భౌగోళంపై మానవజాతి, ఇతర జంతుజాలం, ప్రాణికోటి ఉండగలిగే పరిస్థితులు రావడానికి కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పటివరకైతే జీవరాశులు నివసించగలిగే వాతావరణ పరిస్థితులున్న గ్రహం భూమి ఒక్కటే. ఏ ప్రాణి అయినా బతుకడానికి అవసరమైన గాలి, నీరు, ఆహార పదార్థాలు దొరికే స్థలం భూమి ఒక్కటే. కోట్ల సంవత్సరాల పరిణామంతో ఈ స్థితికొచ్చిన భౌగోళం నాగరికత బాగా పెరిగిందనుకుంటున్న గత నాలుగైదు వందల సంవత్సరాలనుంచి కలుషితమై విధ్వంసం దిక్కు పయనిస్తుంది. వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం, భూమి కూడా కాలుష్యానికి గురయి ఈ భౌగోళంపై మనిషి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. గాలి కాలుష్యంవల్ల భూమి ఉష్ణోగ్రత పెరగడం, గ్లోబల్ వామింగ్‌తో మానవజాతి మాత్రమే కాదు జీవరాశులన్నీ నశించిపోయే ప్రమాదముంది. మరో నాలుగైదు వందల సంవత్సరాల్లో భౌగోళంపై జీవరాశులేవీ ఉండే పరిస్థితి లేదని, మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిన అవసరముందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ, నీటి కాలుష్యాలను, గ్లోబల్ వామింగ్‌ను ఆపకపోతే మానవజాతి ప్రమాదపుటంచులోకి నెట్టబడుతుందని, అంటార్కిటికా ప్రాంతంలోని మంచు కరిగి సముద్ర మట్టాలు మరింత పెరిగి ఉన్న కొంచెం భూమి కూడా తగ్గిపోతుందనే శాస్తవ్రేత్తలు చెప్పారు.
అయినా సరే పాలకవర్గాలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. యుద్ధ భయాన్ని పెంచుతున్నారు. ప్రమాదకరమైన యుద్ధ సామగ్రిని పెంచుతున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే జరగబోయే ఉపద్రవాలనెవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రపంచానికే అత్యంత ప్రమాదకరమైనదైన వాతావరణ కాలుష్యాన్ని తగ్గించకుండా ప్రమాదపుటంచుపై, మృత్యుశయ్యకు సమీపంలో ఉన్న మానవజాతిని రక్షించుకోవడం సాధ్యంకాని పని. ఇదే విషయాన్ని ప్యారిస్ ఒప్పందం నొక్కి చెప్పింది. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పింది. కాని కొన్ని దేశాలు వీటిని హాయిగా విస్మరిస్తున్నాయి. తేలికగా తీసుకుంటున్నాయి. అణు ప్రయోగాలు చేయడం, యుద్ధసామగ్రిని పెంచుకోవడం మానడం లేదు. ప్రపంచం మొత్తాన్ని మృత్యుశయ్యపైకి నెట్టుతున్న వాతావరణ కాలుష్యాన్ని పట్టించుకోకుంటే ఎవరొ మిగలరని మరొకసారి నొక్కి చెప్పింది. వాతావరణ కాలుష్యంపై పరిశోధనలు చేస్తున్న ఎన్.జి.ఓ. స్టీఫెన్ హాకింగ్ చెప్పిన మాటలనే మరొకసారి చెప్పి మానవజాతిని హెచ్చరించింది. తాత్కాలిక సుఖాలు, సుఖవాంఛ ఆధిపత్యంకోసం కోట్ల సంవత్సరాలు ఉండాల్సిన భూమిని, వాతావరణాన్ని తద్వారా జీవరాశుల మనుగడను సర్వనాశనం చేస్తున్నది మనుషులే, వీరిని చరిత్ర క్షమించదు. కాని చరిత్ర లిఖించడానికి, దాన్ని చదవడానికి మెదడున్న ఒకే ఒక్క ప్రాణి మనిషే లేకుంటే ఇక చరిత్ర ఎక్కడిది? అంతా శవాల కుప్పలే కదా?
మానవజాతికి సంభవిస్తున్న ఈ పెనుప్రమాదం నుండి రక్షించుకోవాలంటే ప్యారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలు అమలుచేయాలి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం అతి ముఖ్య విషయం. ఎందుకంటే గాలికి హద్దులు లేవు, ప్రపంచంలో ఎక్కడ వాతావరణం కాలుష్యమైనా అది ప్రపంచమంతటికీ వ్యాపిస్తుంది, దానె్నవరూ ఆపలేరు. దాదాపన్ని దేశాలు కొంచెం ఎక్కువ తక్కువగా ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీన్ని అదుపుచేయడం అన్నీ దేశాల బాధ్యత. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికించడం లేదా? అదెలా వ్యాపిస్తుంది? గాలి ద్వారానే కదా? అందువల్ల గాలి కాలుష్యాన్ని తద్వారా గ్లోబల్ వామింగ్‌ను, ఇంకా అనేక ప్రమాదాలను తగ్గించడం నేటి ప్రపంచానికవసరం, మానవజాతి అవసరం. ఈ ప్రపంచవ్యాప్త వాయుకాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతిరోజు 8 ఇశ ళి (8న109 = 8న10,00,000 000) ఖర్చవుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ప్రపంచ దేశాలన్నిటి సమస్య కాబట్టి ఇదేం అసాధ్య మొత్తం కాదు. అన్ని దేశాలు తమతమ బడ్జెట్‌లలో దీనికే ప్రథమ స్థానమిచ్చి కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటే తప్ప భూగోళం వినాశనం తద్వారా జీవరాశుల స్పెసిస్ నాశనం తప్పదు. అయినా ఈ విషయాన్ని ఏ దేశమూ, ఏ రాష్టమ్రూ సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనబడదు.
హరితవనం పేరుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చెట్లు నాటే కార్యక్రమం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల్లో ఒకటి. ఒక్క రాష్టమ్రో, కొందరు వ్యక్తులో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే వాతవారణ కాలుష్యం తగ్గకపోవచ్చు కాని ఇది ఒకర్నుంచి మరొకరికి ప్రేరణ ఇవ్వవచ్చు. గాలికి హద్దుల్లేవు, వాయువు ద్వారా, వైరస్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్న కాలుష్యకారకం, రోగాల కారకమైన వైరస్ ప్రపంచమంతటా వ్యాపించవచ్చు. ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ కరోనా జబ్బు పేరు మీద ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్ వామింగ్, ఓజోన్ పొరకు చిల్లులు పడటం లాంటి ప్రాణాంతక ప్రమాదకర చర్యలన్నీ గాలి కాలుష్యంవల్ల వస్తున్నవే. ఇది తగ్గాలంటే విపరీతంగా చెట్లు పెంచాలి. అడవులు నరకడం, గ్రామాలు, పట్టణాలన్నీ చెట్లు లేకుండా కాంక్రీటు వనాలుగా మారడం, పరిశ్రమల్లోంచి వచ్చే రసాయనాలు, ఇంధనం కాల్చితే వచ్చే విషకారక ఉద్గారాలు, బొగ్గు, పెట్రోలు, డీజిల్ లాంటి ఇంధనాలు విపరీతంగా కాల్చడం వల్ల గాలి కాలుష్యం ఏర్పడుతుంది. గాలిలో ప్రాణవాయువు తగ్గి ఆ గాలిని పీల్చుకోవడం వల్ల అనేక రోగాలు సంభవించి బతుకు దుర్భరమవుతుంది. అందుకే హరితహారం లాంటి చర్యలు అవసరం. ఇవి సరిగ్గా అమలుచేస్తే ఈ పథకం లాంటివి అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశాలకు విస్తరిస్తే వాయుకాలుష్యాన్ని అరికట్టవచ్చు.
హరితహారం కె.సి.ఆర్. ప్రకటించి, ఆయన జన్మదినం రోజున కోట్లాది మొక్కలునాటే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిందెందుకు? చెట్లు బాగా ఉండటం వల్ల జరిగే లాభాలు ఏంటి? మనం పాఠశాలల్లో చదువుకున్నప్పుడు అశోకుడు గురించి చదువుకున్నాము. అశోకుడు రోడ్లవెంట చెట్లు నాటించెను అనేది అందులో అతి ముఖ్యమైంది. అప్పుడు ఇప్పటి రోడ్లు లేకపోవచ్చు కాని రథాలు, ఎడ్లబండ్లు, గుర్రపు స్వారీలు, మనుషులు నడవడానికి తోవలుండేవి కదా. పిల్లబాటలతోపాటు ఎడ్లబండ్ల బాటలూ ఉండేవి. ఆ బాటలే ఆనాటి రోడ్లు. వాటివెంట చెట్లు నాటించాడు అశోకుడు. రెండువేల మూడువందల సంవత్సరాల పైచిలుకు కాలంలోనే అశోకునికి చెట్ల ప్రాముఖ్యత తెలిసిందంటే అతని దూరదృష్టి, శాస్ర్తియ జ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. చెట్లు, మనుషులు, జంతువులు బయటకు వదిలే గాలి, ఇంధనం కాల్చడంవల్ల వచ్చే ఉద్గారాలు, పరిశ్రమలనుండి వచ్చే విషవాయువులను పీల్చుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. గాలిలో ఉండే ప్రాణవాయువు 20.8% ఉండేట్టు చెట్లనుండి విడుదలయ్యే ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. నీళ్ళలో, సముద్రంలో నాచు నుండి వెలువడే ఆక్సిజన్ ద్వారా ఈ కొరత తీరుతుంది. భూమిపై చెట్లు, నీటిలో నాచు తగ్గడం వల్ల వాయు, నీటి కాలుష్యం వల్ల ఆక్సిజన్ తక్కువై ప్రాణికోటికి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే చెట్లు విపరీతంగా అవసరం.
అలసిపోయి చెట్టునీడకు పడుకున్నప్పుడు, చెట్లనుండి వచ్చే చల్లని గాలి సోకినపుడు హాయిగా ఉంది అంటాం. పల్లెటూళ్లలో ఇంటిముందున్న చెట్టు నీడకు మంచమేసుకొని పడుకునేవారు. చెట్ల కింద, నీడన హాయిగా ఎండుకుంటుంది? చెట్లనుండి వచ్చే ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల. అది ప్రాణవాయువు కదా! పెద్ద పెద్ద హాస్పిటల్లలో రోగి సరిగ్గా గాలి పీల్చుకోలేనపుడు ఆక్సిజన్ మాస్క్‌లు పెట్టడం చూస్తున్నాం కదా! అందుకే చెట్లు మన ప్రాణాలు నిలబెట్టే ప్రాణవాయువు నిచ్చే ప్రాణదాతలు. అందుకే వనమహోత్సవం, హరితహారం లాంటి పథకాలు. కె.సి.ఆర్. ప్రకటించిన రైతుబంధు లాంటి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచినట్టే, హరితహారం కూడా దేశానికే ఆదర్శంగా నిలువాలి, నిలుస్తుంది కూడా.
ఈచ్ వన్ ప్లాంట్ వన్ ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటండి నినాదంతో హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లే నేర్పు, ఓర్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రతి మనిషీ ఒక్క మొక్కను నాటడమే కాకుండా దాన్ని రక్షించి తీరాలి. ఇంటిముందు మొక్కనాటి తీరాలి, నాటకుంటే జరిమానా వేసి తీరాలి. కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే ఆ ఇంటిముందు ఒక్క మొక్కయినా ఉండి తీరాలి. తన ఉన్నచోట, ఊళ్ళో, కార్యాలయంలో, అపార్ట్‌మెంట్‌లో మరెక్కడైనా కాని ఒక్క మొక్క నాటి దాన్ని పూర్తిస్థాయిలో ఎదిగేటట్టు ఆ వ్యక్తే బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఉద్యోగిని, నిరుద్యోగితో పాటు అందరికీ ఈచ్ వన్ ప్లాంట్ వన్ బాధ్యతనప్పగించాలి. నిరుద్యోగులకు అవసరమైతే కొంత పారితోషికమూ ఇవ్వొచ్చు. రోడ్లకి ఇరువైపులా రాష్టమ్రంతటా మొక్కలు నాటడం ద్వారా వాతావరణంలో ఆక్సిజన్ కొంత తగ్గుతుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లోనూ ఇతర పట్టణాల్లోనూ రోడ్డుకు మధ్యలో అటువైపూ, ఇటువైపూ చెట్లునాటి పెంచడంవల్ల వాతావరణంలో ఉన్న విష వాయువులను పీల్చుకొని ఆక్సిజన్ బయటకొస్తుంది. చెట్లనుండి వచ్చే ప్రాణవాయువు కాలుష్యాన్ని నివారించి మనిషి బ్రతుకుకు భరోసానిస్తుంది. ప్రతి దాబా మీదా మిద్దెతోట, నేలపై ప్రహరిగోడల వెంట చెట్లు, బాల్కనీల్లో పూల చెట్లు పెంచితే వేడి నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రాణవాయువూ లభిస్తుంది.
జలాశయాల్లోకి కలుషిత సేవేజీని పంపకుండా ట్రీట్‌మెంట్ చేసి పంపాలి. సముద్రంలో, చెరువుల్లో, నదుల్లోనూ నీటిలో బతుకగలిగే చేపల్లాంటివి కూడా బతుకలేని పరిస్థితినుండి కాపాడాలంటే అందులో నాచు పెరిగేట్టు చర్యలు తీసుకోవాలి. నాచు నుండి వచ్చే ఆక్సిజన్ జలచరాలను బతికేట్టు చేస్తుంది. ప్రతి గ్రామమూ, పట్టణమూ, నగరమూ, ప్రతి ఇల్లూ చెట్లతో కళకళలాడితే ఆ చెట్టు కొమ్మలపై పాలపిట్టలు, గద్దలు, కాకులు వాలి కుహు కుహు రాగాలు వినబడాలి. ముప్పై ఏళ్ల, నలభై ఏళ్ల క్రితం హైదరాబాద్ రోడ్లపై నుండి నడుస్తుంటే చల్లగా, హాయిగా ఉండేది. ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. కారణం చెట్లు లేకపోవడం వల్లనే, దసరా రోజున తెలంగాణ జాతీయ పక్షి పాలపిట్టను, గరుత్మంతున్ని చూడడానికై చెట్లు కావాలి. ఈచ్ వన్ టీచ్ వన్ ద్వారా నిరక్షరాస్యతను నిర్మూలించడం, హరితహారం, ఈచ్ వన్ ప్లాంట్ వన్ ద్వారా రాష్ట్రంలోని వాయుకాలుష్యాన్ని నిర్మూలించడం, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడటం నేటి అవసరం అది కె.సి.ఆర్.తోనే సాధ్యం.

- డా.కాలువ మల్లయ్య, 9182918567