సబ్ ఫీచర్

ధర్మవీరుడు ఆచార్య ధర్మవీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజికవేత్త, సంఘసంస్కర్త, తత్వవేత్తగా ప్రస్తుతించబడిన ఆర్యసమాజ్ ప్రముఖుడు, పరోపకారిణి సభ అధ్యక్షుడు, సంపాదకుడు ఆచార్య ధర్మవీర్ సేవలు నిరుపమానం. 1946 ఆగస్టు 20వ తేదీన మహారాష్టల్రోని ఉదయగిరిలో జన్మించిన ఆయన అక్టోబర్ 6న పరమపదించారు. ఆయన ఇకలేరన్న వార్త ఆర్యసమాజ సభ్యులను విషణ్ణవదనులను చేసింది. అజ్మీర్ (రాజస్థాన్)లోని ‘పరోపకారిణి సభ’ ద్వారా ఆయన చేసిన సామాజిక సేవ చిరస్మరణీయం. ఆయన సారథ్యంలో సంఘసేవా కార్యక్రమాలు నిరాఘాటంగా సాగిపోయాయి.
ఆచార్య ధర్మవీర్ ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పండిట్ భీమ్‌సేన్ చిన్నకుమారుడు. ఆర్యసమాజ్‌లో చేరిన తరువాత ఆయన ప్రజ్ఞ బహుముఖంగా విస్తరించింది. భయం ఎరుగని ఆర్యసమాజ్ నాయకుడిగా, నిజమైన జాతీయవాదిగా, వేదంపై పట్టు సాధించిన పరిశోధకుడిగా ఆయన ఎదిగారు. సమర్ధుడైన కార్యనిర్వాహకుడిగా, నేర్పుతో పనులు చక్కబెట్టగల వ్యక్తిగా ఆయన చూపిన బాటలో ఎందరో ఉన్నతస్థానాలను అధిరోహించారు. భాష, కుల, మత, ఆర్థిక, ప్రాంతీయ భేదాలకు ఆయన అతీతుడు. ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా- తాను దళితుడినని చెప్పుకునే ధర్మవీర్ సంఘంలోని దురాచారాలు, నిర్హేతుక విధానాలకు వ్యతిరేకంగా పనిచేశారు. తన అనుభవ సారం నుంచి నేర్చుకున్న అన్ని విషయాలను సాధికారికంగా, సహేతుకంగా వివరిస్తూ సమాజ అభ్యుదయానికి ఉపకరించేలా పరోపకారిణి పత్రికలో రచనావ్యాసంగం చేసేవారు. ఆయన రచనలు కొత్త ఆలోచనలకు స్ఫూర్తి రగిలించేలా ఉండేవి. కుల, ప్రాంతీయ కట్టుబాట్లను తోసిరాజని జర్నలిస్టు భరతేంద్రనాథ్ కుమార్తె జ్యోత్స్న ఆర్యను వివాహం చేసుకున్నారు. కులం, ప్రాంతం అనే విభేదాలకు దూరంగా తన ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. తన కుమార్తెలకు మాతృభాషగా సంస్కృతం నేర్పి, అందులో అసమాన ప్రావీణ్యం కలిగేలా తీర్చిదిద్దారు. ధర్మవీర్‌జీ మంచి వక్త. ధన సంపాదనపై ఎన్నడూ ఆసక్తి చూపలేదు. నిస్వార్థంగా సంఘసేవ చేయాలన్నదే ఆయన నిరంతర తపన. సహజసిద్ధంగా, ఆలోచనలపరంగా ఆయన నిజమైన సేవకుడు. అజ్మీర్‌లో దయానంద కళాశాలలో సంస్కృత విభాగానికి అధిపతిగా ఆయన సేవలందించారు. ఆ తరువాత ఉద్యోగ బాధ్యతలను విరమించి వేదతత్వాన్ని ప్రజలకు చేరవేసే దిశగా కృషి చేశారు. ఆయన మంచి రచయిత. ‘సత్యార్థ ప్రకాశ్ మీన్ క్యా హై’ అన్న శీర్షికతో ఆయన రాసిన గ్రంథం ప్రశంసలందుకుంది. ‘ఆర్య సమాజ్ ఔర్ శోథ్’, ‘మహర్షి దయానంద్ కి వేద్ భాష్య శైలి’, ‘వేద్ ఔర్ కర్మకండీయ వినియోగ్’ వంటి గ్రంథాలకు ఆయన సంపాదకత్వం వహించారు. పరోపకారిణి పత్రికకు ఆయన అనేక సంవత్సరాలుగా గౌరవ సంపాదకునిగా వ్యవహరించారు. ఆయన మరణవార్త ఆర్యసమాజ్ సభ్యులను కలచివేసింది. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆర్యసమాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. సామాజిక రుగ్మతలపై పోరాడిన ధర్మవీర్‌జీ వంటి యోధులకు మరణం లేదు. ఆయన కీర్తి అజరామరం.
*
chitram...
ఆచార్య ధర్మవీర్