సబ్ ఫీచర్

మతోన్మాద పాక్‌లో మైనార్టీల అరణ్యరోదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ఆవిర్భవించి ఏడు దశాబ్దాలు కావస్తున్నా ఆ దేశ రాజకీయ ప్రధాన స్రవంతిలో మతపరంగా అల్పసంఖ్యాకులైన వారికి ఎటువంటి న్యాయం దక్కడం లేదు. ‘మైనారిటీలు’గా ఉన్నవారికి సామాజిక న్యాయం అందించేందుకు ఏ దేశంలోనైనా అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం అత్యుత్తమ సాధనాలు. అయితే, పాకిస్తాన్ పాలకులు అనాదిగా ఈ అంశం పట్ల దృష్టి సారించడం లేదు. అక్కడ అధిక సంఖ్యాక ప్రజలతో సమానంగా హక్కులను అల్పసంఖ్యాకులకు కల్పించడం లేదు. నిజానికి పాక్ రాజ్యాంగమే మతపరమైన అల్పసంఖ్యాకుల పట్ల వివక్ష చూపుతోంది. 41,42వ అధికరణల ప్రకారం దేశ అధ్యక్ష, ప్రధానమంత్రి, జాతీయ అసెంబ్లీ స్పీకర్ పదవులకు ముస్లింలు మాత్రమే అర్హులు. పాకిస్తాన్ ఒక ఉదారవాద సమాజమా? ప్రజాస్వామ్య దేశమా? ఇస్లామిక్ రాజ్యమా? అనే ప్రశ్నలకు వివిధ సామాజిక, రాజకీయ వర్గాల నుండి విభిన్న సమాధానాలు లభిస్తున్నాయి. సైనిక అధిపతులు, రాజకీయ పార్టీల నేతలు, ఇస్లామిస్ట్‌లు ప్రజాస్వామ్యం, సమాజం, ప్రభుత్వ వ్యవహారాలలో తమకున్న అవగాహనల మేరకు సమాధానాలు ఇస్తున్నారు. ఫలితంగా వివిధ వర్గాల మధ్య సంఘర్షణలు అనివార్యం అవుతున్నాయి. రాజకీయ, పౌరహక్కుల స్వతంత్రత అనుమానమవుతున్నది. పౌరహక్కులు, మైనార్టీల హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడుతున్నది.
పాకిస్తాన్ ఏర్పడే సమయంలోనే మత స్వాతంత్య్రం సహా స్వేచ్ఛాయుత సమాజం గురించిన ఆకాంక్షలు వెల్లడయ్యాయి. ప్రతి మైనార్టీ బృందం కూడా తమ మతపర భావనలను ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా ఏర్పర్చుకోవచ్చని దేశ నిర్మాతలు చెబుతూ వచ్చారు. అయితే, ‘ఇస్లాం సంరక్షకులం’ అనే పేరుతో రాజకీయ, ధార్మిక పక్షాలు పాకిస్తాన్‌ను ఆక్రమించాయి. ఇప్పుడు ఇతరుల అభిప్రాయాలు, విశ్వాసాల పట్ల అసహనం చెలరేగుతున్నది. ఇతర మతాల పట్ల సామరస్యం మచ్చుకైనా కనబడటం లేదు. పాక్‌లో ఇప్పుడు హిందువులు, క్రిస్టియన్లు, అహ్మదీయులు, షియాలు వంటి మైనార్టీలను సామాజికంగా, ఆర్థికంగా వివక్షకు, అణచివేతకు గురిచేస్తున్నారు. మైనార్టీలకు చెందిన వారిలో అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నారు. హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా న్యాయవ్యవస్థ వారికి రక్షణ కల్పించలేకపోతున్నది. పైగా రాజ్యాంగంలో ఉన్న పలు వివక్ష పూరిత నిబంధనలు మైనార్టీలను వేధించడాన్ని చట్టబద్ధం చేస్తున్నాయి. తమకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి పాలకులు తిరస్కరిస్తుండటంతో మైనార్టీలు అణచివేతకు గురవుతున్నారు.
పాక్ రాజ్యంగంలోని 51(2ఎ) అధికరణ జాతీయ అసెంబ్లీలో 10 సీట్లను మతపర మైనార్టీలకు రిజర్వ్ చేసింది. 106వ అధికరణ కింద నాలుగు ప్రాంతీయ అసెంబ్లీలలో 23 సీట్లను రిజర్వ్ చేశారు. చట్టసభలో రాజకీయ పార్టీలకు గల బలాన్ని బట్టి రిజర్వ్‌డు సీట్లను కేటాయిస్తారు. ఆయా పార్టీలు సమర్పించిన అభ్యర్థుల జాబితా నుండి వీరిని ఎంపికచేస్తారు. ఎక్కువ సీట్లు గెల్చుకొనే పార్టీల చెప్పుచేతులలో ఉండేవారు మాత్రమే రిజర్వ్‌డు సీట్లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మైనార్టీ మహిళలు ఎవ్వరికీ చట్టసభలలో ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. పాలనా యంత్రాంగంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం కోసం కొన్ని సంస్కరణలను చేస్తున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. 2014లో 60వ అధికరణను రాజ్యాంగ సవరణల ద్వారా రాష్ట్రాల అసెంబ్లీలో మైనార్టీల రిజర్వ్‌డ్ సీట్లను 9 పెంచినా ఆచరణలో చెప్పుకోదగిన ప్రభావం కనబడటం లేదు. 1985లో ముస్లింయేతరులకు ప్రత్యేక ఎన్నికలు జరిపారు. జనరల్ సీట్లు 217 ఉండగా, రిజర్వ్‌డ్ సీట్లు 10 మాత్రమే ఉన్నాయి. 2002లో జనరల్ సీట్లను 272కు పెంచారు. తమ జనాభా నిష్పత్తి ప్రకారం జాతీయ, రాష్ట్ర అసెంబ్లీలలో రిజర్వ్‌డ్ సీట్లను పెంచాలని మైనార్టీలు కోరుతున్నారు. 2014లో 51(6)వ అధికరణకు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ప్రకారం మైనార్టీలకు ద్వంద్వ ఓటింగ్ హక్కు కల్పించారు. ఒక ఓటు జనరల్ సీట్ల ఎంపికకు అయితే, మరో ఓటు రిజర్వ్‌డ్ సీట్ల ఎంపికకు నిర్దేశించారు. ప్రధాన పార్టీ అభ్యర్థులుగా రిజర్వ్‌డ్ సీట్ల నుండి ఎన్నికవుతున్నవారు పార్టీ నిర్ణయాల ప్రకారమే నడుచుకోవలసి వస్తున్నది. మైనార్టీల స్థితిగతులపై వారు నోరు విప్పలేకపోతున్నారు.
రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో కొద్దిపాటి విజయాలను మైనార్టీలు సాధింపగలుగుతున్నా విధాన నిర్ణయ ప్రక్రియలో వివక్షకు గురవుతున్నారు. ఉదాహరణకు 18వ రాజ్యాంగ సవరణకు ఈమధ్యనే ఏర్పాటుచేసిన 27 మంది సభ్యులుగల పార్లమెంటరీ రాజ్యాంగ సవరణ కమిటీలో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు. రాజ్యాంగ సవరణల అమలు కమిటీలోనూ వారికి భాగస్వామ్యం లేదు. ఈ నేపథ్యంలో పాక్‌లో మైనార్టీల ఆర్థిక సాధికారికతకు తగు చర్యలను చేపట్టాలని ఆసియా మానవ హక్కుల కమిషన్ కోరింది. రాజకీయ పార్టీలు జనరల్ సీట్లలో మైనార్టీలను అభ్యర్థులుగా నిలబెట్టాలని కమిషన్ సూచించింది. సహనం కల్పించడం, విద్వేష భావనలు తొలగించడం, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడం దిశగా విద్యారంగాన్ని సంస్కరించాలని కూడా కమిషన్ సూచించింది. మరోవంక పాక్‌లో చిన్న చిన్న మతపర, జాతిపర సమూహాలు తమ సంస్థల, మతపర ఉనికిని కాపాడుకోలేక సతమతమవుతున్నాయి. మతపర ఉగ్రవాదం, బలవంతపు మత మార్పిడులు, వలసలు, వాతావరణ మార్పులు వారి అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లో హిందువులు అక్కడి జనాభాలో దాదాపుగా నాల్గవవంతు మంది ఉన్నారు. 1947లో కరాచీలో 4.50 లక్షల జనాభా ఉండగా 51 శాతం మంది హిందువులు కాగా, ముస్లింలు 42 శాతం మంది మాత్రమే. 1951నాటికి కరాచీ జనాభా 11.37 లక్షలకు పెరిగింది. ముస్లింల జనాభా 96 శాతంకు చేరుకోగా, హిందువులు 2 శాతం మాత్రమే ఉన్నారు. 1998 నాటికి పాక్‌లో హిందువుల జనాభా 1.60 శాతానికి తగ్గింది. తాజా గణాంకాలు తీసుకుంటే మరింతగా తగ్గవచ్చు. 1980 నుండి ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకొని, మతపర విధానాలను పాక్ అనుసరిస్తూ ఉండటంతో హిందువులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో హిందువులు చెప్పుకోదగిన కీలక పదవులలో లేరు. సైన్యంలో, వ్యాపార సంస్థలలో, పౌర సమాజంలోనూ వారికి ప్రాతినిధ్యం లభించడం లేదు. మైనార్టీలు తరచూ అపహరణలకు, అత్యాచారాలకు, వేధింపులకు గురవుతున్నా ఎలాంటి దర్యాప్తులు ఉండవు. రాజ్యాంగపరంగానూ వీరిని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చాలామంది ఇస్లాం మతంలోకి మారక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. పాస్‌పోర్ట్‌లో ఏ మతానికి చెందినవారో తప్పనిసరిగా పేర్కొనాలనే పాత ఉత్తర్వును తిరిగి కొనసాగిస్తూ 2005 మార్చి 24న పాక్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు మైనార్టీల పాలిట శాపంగా మారాయి. -

చలసాని నరేంద్ర