సబ్ ఫీచర్

స్ర్తిల అక్షరాస్యతలో వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లాలు అక్షరాస్యురాలైతే ఆ కుటుంబం చదువుల్లో రాణించి పరోక్షంగా దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది చారిత్రక సత్యం. నేడు ఎన్నో రంగాల్లో అభివృద్ధి పథాన దూసుకుపోతున్న భారత్‌లో ‘మహిళల అక్షరాస్యత సాధన’ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. చాలా విషయాల్లో భారత్ కన్నా వెనుకే ఉన్న పొరుగుదేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ మహిళల అక్షరాస్యతలో మాత్రం మనకన్నా ముందంజలో ఉన్నాయి. నేపాల్ అయితే ఆదర్శప్రాయమైన రీతిలో ముందుకువెళుతోంది. ముఖ్యంగా పాఠశాల విద్యా విధానం మంచి ఫలితాలు సాధించడంలో భారత్ విఫలమవుతోంది. పొరుగున ఉన్న దేశాలతో పోలిస్తే భారత్‌లో నాణ్యమైన ప్రాథమిక విద్య ఇప్పటికీ అందడం లేదు. నూయార్క్ కేంద్రంగా రాబోతున్న ఓ పత్రిక ‘ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఫైనాన్సింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్’ అన్న అంశంపై చేసిన సర్వే వివరాలను ఓ బ్లాగ్‌పోస్ట్‌లో విడుదలైనాయి. ఆ వివరాల ప్రకారం- భారత్‌లో పాఠశాల విద్య, మహిళల అక్షరాస్యత ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి.
ప్రాథమిక విద్యలో తొలి ఐదు సంవత్సరాలు విద్య పూర్తిచేసిన బాలికలు మన దేశంలో 48 శాతం మంది మాత్రమే. అదే నేపాల్‌లో 92 శాతం, పాకిస్తాన్‌లో 74 శాతం మంది అమ్మాయిలు ఒకటి నుంచి ఐదు తరగతుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. న్యూయార్క్ కేంద్రంగా రాబోయే ఈ పత్రికకు సంబంధించిన రచయిత జస్టిన్ శాండెఫర్ అభిప్రాయం ప్రకారం భారత్‌లో ప్రాథమిక, పాఠశాల విద్యా విధానం సమర్థవంతంగా పనిచేయడం లేదు. బడికి వెళ్లే అమ్మాయిల్లో రెండు సంవత్సరాల చదువు తరువాత ఉన్నత తరగతుల్లో చేరి విద్యాభ్యాసం కొనసాగిస్తున్నవారి సంఖ్య భారత్‌లో 1 నుంచి 15 శాతం పెరుగుదల నమోదవుతూంటే పాకిస్తాన్‌లో 3 నుంచి 31, నేపాల్‌లో 11 నుంచి 47 శాతం నమోదవుతోంది. భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్‌లో రెట్టింపు స్థాయిలో పాఠశాల విద్యలో అమ్మాయిలు దూసుకుపోతున్నారు. అక్షరాలు నేర్వడమే కాదు, చదవగలిగేలా చదువు కొనసాగించడమే గీటురాయిగా చూస్తే పాఠశాల విద్యలో మనకన్నా పొరుగుదేశాలే మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అభివృద్ధి సాధిస్తున్న ప్రపంచదేశాల్లో డెమొగ్రాఫిక్ అండ్ హెల్త్ సర్వేస్ (డిహెచ్‌సి) బాలికల విద్యపై సేకరించిన గణాంకాల ఆధారంగా న్యూయార్క్ పత్రిక ఈ నివేదికను విడుదల చేసింది.
నిజానికి ప్రపంచవ్యాప్తంగా మహిళల అక్షరాస్యత చెప్పుకోదగిన రీతిలో పెరుగుతోంది. పాఠశాలల నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలే ఇందుకు కారణమని ప్రస్తుతానికి భావిస్తున్నారు. మహిళల అక్షరాస్యతలో అభివృద్ధి చెందుతున్న 51 దేశాల జాబితాలో భారత్‌కు 38వ స్థానం దక్కింది. ఇండోనేషియా, రువాండా, ఇథియోపియా, టాంజానియాలు ఇండియాకన్నా పై స్థానంలో ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంటున్నది. కేవలం 7శాతం మహిళల అక్షరాస్యత ఉన్న ఘనా దేశం ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. ప్రాథమిక విద్య, పాఠశాల విద్య విభాగాల్లో బాలికలు నిరాఘాటంగా విద్య అభ్యసించడం ద్వారా మహిళల అక్షరాస్యత శాతం పెంచేందుకు చాలా దేశాలు విస్తృతంగా చర్యలు చేపడుతున్నాయి. ఒకటి, రెండు దశాబ్దాలుగా ఈ కృషి కొనసాగుతోంది. అయితే ప్రాథమిక దశలోనే మధ్యలో చదువు ఆపేయడం, కనీసం ఒక వాక్యం పూర్తిగా చదవలేకపోవడం అనే స్థితిని బాలికలు దాటలేకపోతున్నారు. ఇది ఆందోళనకలిగించే విషయం. ప్రాథమిక విద్యలో మొదటి ఐదు తరగతులు విరామం లేకుండా బాలికలు విద్య కొనసాగిస్తే, ఆ తరువాత వారి చదువుకు పెద్ద ఆటంకాలు ఎదురుకావడం లేదు. అలా జరుగుతున్న ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యత చెప్పుకోదగిన రీతిలో పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటికైనా బాలికల విద్యపై దృష్టి సారిస్తే మహిళల్లో అక్షరాస్యత పెరగడం ఖాయం.

-కృష్ణతేజ