సబ్ ఫీచర్

బలిపీఠంపై బాలల భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా.. నేను స్కూలుకు వెళ్లను..’ అని మారాం చేయడం అందరి ఇళ్లల్లో పిల్లలు చేసే పనే- అని తేలికగా తీసుకోవడం తల్లిదండ్రులకు అలవాటే. భయపెట్టి, బెదిరించి , సముదాయించి, చాక్లెట్లు కొని ఇచ్చి పిల్లలను స్కూళ్లలో వదిలిపెట్టి రావడం తల్లిదండ్రులకు తలకు మించిన భారమే. కానీ, పిల్లలు స్కూలుకు వెళ్లేదిలేదంటూ మారాం చేయడంలో ఉన్న మర్మం ఏమిటో? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం తల్లిదండ్రులు చేయనందునే బాలలపై నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులపై భౌతికదాడులు, వేధింపులు, లైంగిక దాడులు ఎక్కువవుతున్నాయని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. ఎదుటివారి ప్రవర్తనను అర్థం చేసుకునే వయసు, సామర్ధ్యం లేక పిల్లలు తమ వేదనను కుటుంబ సభ్యులకో, ఉపాధ్యాయులకో చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. పిల్లల సమస్యలపై దృష్టిసారించే సమయం, ఓపిక ఇటు తల్లిదండ్రులకూ, అటు టీచర్లకూ ఉండటం లేదు.
బాలలపై దాడులు అనేక రకాలుగా జరుగుతున్నాయని, ప్రధానంగా సమాజం నుండి ఒత్తిడి పెరిగిపోతోందని నిపుణులు విశే్లషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో వారిలో నేరప్రవృత్తి చోటుచేసుకుంటోంది. లైంగిక వేధింపులు, భౌతికదాడులకు వారు గురవుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఏడాది కాలంలో చిన్నారులపై నేరాలు ఏడు శాతం పెరిగాయి. 2015లో 85 మంది చిన్నారులు హత్యకు గురికావడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాతృమూర్తి అయిన 27 ఏళ్ల పూర్ణిమ తన నెలల బాబు గొంతు కోసం హతమార్చిన సంఘటన సంచలనం రేపింది. మైలార్ దేవ్‌పల్లిలో 12 ఏళ్ల బాబును పొరుగువారే హతమార్చి పట్టాలపై పడేశారు. మరో సంఘటనలో ఏడేళ్ల బాలుడు సాయి ప్రసన్నను చంపి బాత్‌రూమ్‌లో పడేశారు. 2014లో తెలంగాణలో పిల్లలపై నేరాలు 17.3 శాతంగా నమోదయ్యాయి. 2015లో వీటి శాతం 24.1 శాతానికి పెరిగింది. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కంటే తెలంగాణలో పిల్లలపై నేరాలు పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలో కాదు, దేశవ్యాప్తగా ఈ తరహా నేరాల్లో బాధితులు ఎక్కువగా బాలికలేనని యునిసెఫ్ నివేదిక చెప్పిన నిజం. ఉత్తర భారతంలో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో 182, హర్యానాలో 129, పశ్చిమబెంగాల్‌లో 80, ఢిల్లీలో 49, రాజస్థాన్‌లో 18 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఓ బాలికను బస్సులో నుండి ఈడ్చి చంపేసిన ఘటన సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ తరహా సంఘటనలు దేశవ్యాప్తంగా అనునిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతునే ఉన్నాయి. పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల్లో ఎక్కువగా పరిచయస్థులే నిందితులు కావడం గమనార్హం. 5 నుండి 12 ఏళ్ల లోపు పిల్లలు హింసకు, అత్యాచారాలకు గురవుతున్నారని కేంద్ర స్ర్తి,శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలోనూ తేలింది. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 52.22 శాతం బాలికలు ఏదో ఒకరూపంలో లైంగిక నేరాలను ఎదుర్కొన్నవారేనని తేలింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, ఢిల్లీల్లో ఎక్కువమంది బాలలు అత్యాచారాలకు గురవుతున్నారు. మరోవైపు నేరస్తులుగా మారే పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది.
సమాజం పట్ల సరైన అవగాహన, తగిన విద్యాబుద్ధులు లేకపోవడం, మానసిక పరిపక్వత లోపించడం, ప్రసార మాధ్యమాల ప్రభావం, పాశ్చాత్య పోకడలు, పేదరికం వంటి పరిస్థితులు బాలలను నేరాలకు పురిగొల్పుతున్నాయి. సరైన మందలింపు లేకపోవడంతో కొందరు పదే పదే నేరాలకు పాల్పడుతున్నారు. భావి భారతాన్ని నిర్మించాల్సిన బాలలు ఇలా సమస్యల వలలో చిక్కుకోవడం చూస్తుంటే- భవిష్యత్ ప్రశ్నార్థకం కాక ఏమవుతుంది..?

-బివి ప్రసాద్