సబ్ ఫీచర్

‘ప్యాకేజీ’తో దగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా అవశేష ఆంధ్రప్రదేశ్ పట్ల అంతులేని సానుభూతిని కురిపిస్తూ, ‘ప్రత్యేక హోదా’తోనే ఎపి ప్రజలకు సాంత్వన లభిస్తుందని గంభీర ప్రకటనలు చేసిన ప్రస్తుత కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ఇపుడు మాట మార్చడం దారుణం. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఎన్‌డిఎ ప్రభుత్వం వద్దనే ఉన్నా, ‘ప్యా కేజీ’ వల్ల ఎంతో మేలు జరుగుతుందని ప్రజల ముందు అందమైన కలల్ని ఆవిష్కరిస్తూ ఈ ఇద్దరు మంత్రులూ దగా చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో కన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని చెప్పడం నిజంగా వంచనాశిల్పమే! నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో శంకుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు నీటిమూటలుగా మారాయి. అయిదేళ్ల కాలంలో ఎపికి 2.03 లక్షల కోట్ల మేరకు నిధులిస్తామని, ఇచ్చిన హామీలపై మడమ తిప్పబోమని మోదీ ప్రకటించారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా, మోదీ ఇచ్చిన హామీల్లో ఐదవ వంతు నిధులు కూడా ఎపికి ఇవ్వలేదు.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ఎపికి అయిదేళ్లు మాత్రమే ప్రత్యేక హోదా కల్పిస్తూ నాటి ప్రణాళికా సంఘానికి ఆదేశాలు జారీ చేసిందని, తాము అధికారలోకి వస్తే ఆ హోదాను పదేళ్లపాటు ఇస్తామని విభజన సమయంలోను, గత సాధారణ ఎన్నికల సమయంలోనూ బిజెపి నేతలు ఘనమైన ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ఏవో సాంకేతిక ఇబ్బందుల వల్ల హోదా ఇవ్వడం ఆలస్యం అవుతోందని, హోదా ఇవ్వడం మాత్రం ఖాయమని ప్రజలను కొన్నాళ్లు నమ్మించారు. అయితే, ఇటీవలే అసలు ముసుగు తొలగించి ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని వారు తేల్చేశారు. హోదా కన్నా ఎంతో మెరుగైన ‘ప్యాకేజీ’ ఇస్తున్నామని తెగేసి చెప్పారు. ఇంతకూ ఆ ప్యాకేజీ ఏమిటన్నది స్పష్టంగా లేదు. ఆ మధ్య ఓ అర్ధరాత్రి సమయాన- ప్యాకీజీ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొన్ని వరాలు ప్రకటించారు. ఈ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని అమరావతిలో ఇటీవల జరిగిన సభలో వెంకయ్య నాయుడు తన సహచర మంత్రి జైట్లీని కోరడాన్ని గమనిస్తే- ప్యాకేజీ పట్ల కేంద్రం ఇప్పటికీ ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు లేదని అర్థమవుతోంది. ప్యాకేజీ కింద ప్రకటించిన నిధులను ఎప్పటిలోగా విడుదల చేస్తారో స్పష్టత లేదు. ‘ప్యాకేజీ ప్రకటన’ కేవలం కంటితుడుపు చర్య అని ప్రజానీకం గ్రహించింది. అరుణ్ జైట్లీ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని, ప్రజలను వంచించడానికి ఇదో కపట ప్రయత్నం అని స్పష్టమవుతోంది.
ఆర్థిక కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు తగు వాటాను కేంద్రం ఇవ్వాల్సి ఉంది. చట్టబద్ధంగా ఇవ్వాల్సిన ఈ నిధులను విడుదల చేయకుండా ‘ఏదో దానం చేస్తున్నాం..’ అన్నట్టు ఎన్‌డిఎ నేతలు మాట్లాడడం అభ్యంతరకరం. ‘సహకార సమాఖ్య’ అని గొప్పలు చెబుతున్న ప్రధాని మోదీ రాష్ట్రాల పట్ల ఇలా చిన్నచూపు చూడడం తగునా? విభజన చట్టంలోని ప్రతి అంశాన్నీ తాము అమలు చేస్తామని, అయితే ఇవన్నీ ‘నీతి ఆయోగ్’ పరిశీలనలో ఉన్నాయని అమరావతిలో శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ సెలవిచ్చారు. ఆ తర్వాత ఆ విషయాలను ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. మట్టి, గంగాజలం తెచ్చిన మోదీ ఇపుడు ముఖం చాటేయడం చూస్తే ఎపి ప్రజలు ఎంత వంచనకు గురయ్యారో విశదమవుతుంది. కేంద్రమంత్రులే కాదు, ఎపి సిఎం చంద్రబాబు కూడా ప్రజలను ఎంత ఘోరంగా తప్పుదారి పట్టించారో అర్థమవుతుంది.
ఏ ప్రత్యేక చట్టాలు లేకుండానే మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎన్నో రెట్లు నిధులిస్తున్న మోదీ- ఇపుడు ఎపికి ఏదో మేలు చేస్తున్నట్టు చెప్పుకోవడం నిజంగా ఆత్మవంచనే. కొత్త పరిశ్రమలను ఇవ్వకపోగా, కొన్ని పరిశ్రమలను ఎపి నుంచి తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఎపికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు నోరు మెదపడం లేదు. ప్రత్యేక హోదా వల్ల కేంద్ర పథకాల నిధుల వాటాలో 90 శాతం కేంద్రం, పది శాతం రాష్ట్రం భరించడం మినహా ఎలాంటి మేలు జరగదని జైట్లీ అంటున్నారు. అదే నిజమైతే- ఎపికి ప్రత్యేక హోదా కావాలంటూ అలనాడు రాజ్యసభలో వాదించి, ఆ విషయాన్ని తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టిన బిజెపి నేతలు ‘ఓట్ల కోసమే ఇదంతా చేశామ’ని ఇప్పుడు ప్రజలకు చెప్పగలరా? హోదా ఇవ్వకపోవడానికి రాజకీయ కోణం తప్ప మరే ఇతర కారణాలు కనిపించడం లేదు. హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సులు అవరోధంగా ఉన్నాయని చెప్పిన జైట్లీ ఆ తర్వాత- అలాంటి అడ్డంకులేవీ లేవని ఆ కమిషన్ మాజీ చైర్మన్ వైబి రెడ్డి చెప్పడంతో వౌనం వహించి, చివరికి ఎపి ప్రజలను మోసం చేసేందుకే నిర్ణయించుకున్నారు. ‘ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్’లో ఉభయ తెలుగు రాష్ట్రాలూ దేశంలోనే ప్రథమ స్థానంలోకి రావడంతో ఇపుడు ఎపికి ‘హోదా’ ఇచ్చేందుకు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. ఇప్పటికే పలు రంగాల్లో అగ్రగామిగా నిలిచిన ఎపికి గనుక హోదా ఇస్తే- మిగతా రాష్ట్రాలు అందుకోలేని రీతిలో అభివృద్ధి పథంలో మరింతగా దూసుకుపోతుందని, ఈ పరిణామాలు తమకు రాజకీయంగా చికాకులు తెస్తాయని ఎన్‌డిఎ నేతలు భావిస్తున్నారు.
కేవలం ప్రధాని సంతకంతో క్షణాల మీద ఇవ్వాల్సిన హోదాకు కుంటిసాకులు చెప్పడం తగదు. ఎపిలో బిజెపి సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎలాగూ లేదు. హోదా ఇస్తే టిడిపికి తప్ప తమకు ఎలాంటి ప్రయోజనం లేదని ‘కమలనాథులు’ భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 11 రాష్ట్రాలకు అమలులో ఉన్న ప్రత్యేక హోదాను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తొలగిస్తామని రాజ్యసభలో అరుణ్ జైట్లీ చెప్పారు. లోక్‌సభలో మరో మంత్రి మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలకు హోదాను తొలగించే ప్రసక్తే లేదన్నారు. హోదా ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు ఎపికి భారీగా వస్తాయని ఎవరూ అనుకోవడం లేదు. కానీ, పెట్టుబడులు సమకూరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రం చెబుతున్న ప్యాకేజీ వల్ల ఎన్ని పరిశ్రమలు వస్తాయో, ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో బిజెపి నేతలు చెప్పగలరా? ప్యాకేజీ పేరిట ఓ ‘మిధ్యా ప్రపంచాన్ని’ జనం ముందు ఉంచడం దేనికి? సహజ వనరులు విస్తారంగా ఉన్న ఎపికి ప్రత్యేక హోదా ఇస్తే కొత్త పరిశ్రమలకు దండిగా రాయితీలు లభిస్తాయి. అపుడు ప్రపంచంలోనే ప్రగతికాముక ప్రాంతంగా ఎపికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా తమకు ఇబ్బందులు కలిగిస్తాయని బిజెపి నేతలు భావిస్తున్నారు. అందుకనే ఉద్దేశ పూర్వకంగానే ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని జనం భావించాల్సి ఉంది. హోదాతో అన్నీ సాధ్యమే అనడం ప్రజలను దగా చేయడమే.

- కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపి konathalark09@gmail.com