సబ్ ఫీచర్

వనభోజనం..హృదయానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకమాసానికి సమానమైన మాసం లేదు. కేశవునితో సమానమైన దేవుడూ లేడు. వేదముతో సమానమైన శాస్తమ్రు కాని, గంగతో సమానమైన తీర్థము కాని లేవు అంటున్నాయి ఇతిహాస పురాణాలు.
పరమ పావనమైన హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో స్నాన, అర్చన జపాదులు, దీపదానాలు, వనభోజనాలు వంటి విధులను ఆచరిస్తే ప్రారబ్ద కర్మలు పటాపంచలై, మోక్షం ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం. ఈ విధులలో ప్రత్యేకించి పేర్కొనదగినది ‘వనభోజనం’.
మారుతున్న నేటి సామాజిక పరిస్థితుల్లో, పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడి, మనదైన సమాన సంస్కృతిని మరిచిపోతున్న తరుణంలో వనభోజనాలను గురించి తెలుసుకోవలసిన అవసరం వుంది.
వనభోజనాలు కుల, మత, వర్గ విచక్షణ లేకుండా, సామాజిక ఏకత్వాన్నీ, విభిన్న వ్యక్తులమధ్య సమరసతనూ, తద్వారా మానసికోల్లాసాన్నీ, ప్రశాంతతను ప్రసాదిస్తాయి. నగరాల్లో, పట్టణాల్లో ఉండే వారు ఉద్యోగస్థులైనా, విద్యార్థులైనా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ‘పిక్నిక్’ పేరుతో సామూహికంగా భోజనాలు చేయవచ్చు. కాని కార్తికమాసంలో అందరూ కలిసి ఏదో ఒక రోజున ‘కార్తీక సమారాధన’ (వనభోజనం) నిర్వహించడంలో విశేషం ఉంది. ఈనాటికీ పల్లె ప్రాంతాలలో ఈ ఆచారం కొనసాగుతుండడం హర్షణీయం. ఈ వనభోజనాలలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మానసికానందాన్ని పెంపొందిస్తుంది. వనభోజనం అంటే బంధుమిత్రులంతా కలసి ఒక తోటలో కూర్చుని, కేటరింగు వారికి అర్డరిచ్చి, భోజన సమయానికి కూర్చుని, పని పూర్తిచేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టడం కాదు. ఇందులో ఆనందం ఉండొచ్చు. కానీ అలా చేయడం మన సంస్కృతికి విరుద్ధం.
‘వనభోజనం’ ఒక సామాజిక కార్యక్రమం. కార్తికమాసంలో ఏదో ఒక రోజున వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ కలిసి ఉదయానే్న వివిధ రకాలైన వృక్షాలున్న ఒక చోటకు చేరాలి. వారందరిమధ్య నాటి కార్యక్రమానికి వీలుగా ఒక్కొక్క పని నిర్వర్తించడానికి వీలుగా చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి, ఒక్కొక్క గుంపు ఒక్కొక్క కార్యభారాన్ని చేపట్టాలి. పొయ్యిలు ఏర్పాటు, కట్టెలు ఏరి మం టలు ఏర్పాటు, కూరలు తరగడం, నీళ్ళు సమకూర్చడం వంటి వంట పనులలో ఆడ, మగ తేడా లేకుం డా శ్రమదానం చేయడం ప్రధా నం. చిన్నపిల్లలు, యువతీ యువకులు వారి వారి ఇచ్ఛానుసారం తోటలో సరదాగా ఆటలు పాటలతో గడపడం. పెద్దవారంతా కలిసి ఒక ఉసిరిక చెట్టు మొదట్లో చిన్న పూజామందిరంలా ఏర్పాటు చేసి సాలగ్రామాన్ని, శివకేశవుల చిత్రపటాన్ని గాని ఉంచి అభిషేకాదులు నిర్వహించాలి. మహిళలు లక్ష్మీపార్వతుల చిత్రపటాలను కుంకుమతో పూజించాలి. అందరూ కలిసి ఆ ఉసిరిక చెట్టు చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణం చేయాలి.
అనంతరం వండిన షడ్రసోపేతమైన పదార్థాలన్నిటినీ లక్ష్మీనారాయణులకు పార్వతీ పరమేశ్వరులకు నివేదించి హారతి సమర్పించాలి.
ఆ తరువాత అందరూ కలిసి ఆ ఉసిరిక చెట్టు క్రింద విందారగించాలి. హృదయాలు ఆనందంతో ఉప్పొంగాలి.
మన విశిష్ట సంస్కృతిలో భాగమైన ఈ ఆచారాన్ని పరిశీలిస్తే ఇందులో ‘సామాజిక సమరసత ఐక్యత’ అనేవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అంతేకాదు, ఎన్నో ఆరోగ్య రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఉసిరిక చెట్టుకు ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ప్రముఖమైన స్థానం ఉంది. ఉసిరిక వృక్షఛాయలో శరీరంపై పడే సూర్యకాంతితో పాటు, ఆ చెట్టు నుండి వీచే గాలి శరీరానికెంతో మేలు చేకూరుస్తాయి. ఉసిరిక వృక్షంనుండి పొంగే ఫలాలు (ఉసిరికాయలు) ఆయుర్వేదంలో రక్తస్రావాలను, విరోచనాలను అరికట్టడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. చ్యవన్‌ప్రాశ్‌ల తయారీకి వాడతారు. ఊరగాయ రూపొందించడానికి వాడుక చేస్తారు. ఉసిరి ఊరగాయ రోజూ తినడంవల్ల జీర్ణాశయానికి సంబంధించిన పెక్కు అనారోగ్య పరిస్థితులను చక్కబరుస్తుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రదాయినియైన ఉసిరిక వృక్షాన్ని ‘వనభోజనం’ అన్న ఆచారం కారణంగా సంవత్సరంలో ఒక రోజు పూజించి ఆ వృక్షఛాయలో శివకేశవ, లక్ష్మీపార్వతులకు నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించడంవలన ఆధ్యాత్మిక, ఆరోగ్య ఫలాలను పొందడమేకాక, ఉదయం నుంచి సాయం త్రం వరకూ అందరూ కలిసి మెలిసి ఆనందంగా గడపడానికి వీలవుతుంది కదా!

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- ఎ.సీతారామారావు