సబ్ ఫీచర్

బాలలకు భరోసా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో బాలబాలికలు దేశ భవిష్యత్‌కు ఆశారేఖలు. చిన్నారులకు బంగరు భవిత ఉండాలంటే అటు పెద్దలు, ఇటు ప్రభుత్వాలు చక్కటి చర్యలు తీసుకోవాలి. కానీ ప్రస్తుత సమాజంలో ఆ ఛాయలు కన్పించడం లేదు. దారి తప్పిన చదువులు, మాధ్యమాలు పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పు ఒంటరి కుటుంబాల్లో పిల్లలను తుంటరులను చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో బాలలే నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. ఇది కలవరపరిచే అంశం. దురలవాట్లకు బానిసలయి దొంగతనాలు చేస్తున్న విద్యార్థులు, క్షణికావేశానికి లోనయి హత్యలు చేస్తున్న పిల్లలు, ఆఖరికి నిర్భయ లాంటి అత్యాచార సంఘటనల్లో బాల నేరస్థుల ప్రమేయం ఉన్న వార్తలు వింటే గుండె తరుక్కుపోతోంది.
బాలబాలికలు సన్మార్గంలో నడవడానికి బాల్యంలోనే సరైన అడుగు పడాలి. కుటుంబ వాతావరణం, ప్రాథమిక విద్య సరిగ్గా ఉంటే వారి భవిష్యత్‌కు ఢోకా ఉండదు. అప్పట్లో పిల్లలకు తాతయ్య, అమ్మమ్మల అండ ఉండేది. కథలు, కబుర్లు, మంచిచెడ్డలు చెప్పేవారు. ఇప్పుడు సమష్టి జీవన విధానం లేదు. కుటుంబ పెద్దలు పొట్టకూటికోసం ఉద్యోగం చేస్తూ పట్టణాల్లో బ్రతుకుతున్నారు. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలు దూరంగా ఉంటున్నారు. గురువుల కంటే ముందుగా మంచి విషయాలు చెప్పే బోధకులు పిల్లలకు కరువయ్యారు.
ఉద్యోగంకోసం వెళ్ళే పెద్దలు తమ పిల్లలకోసం తగిన సమయం కేటాయించడం లేదు. రెండున్నరేళ్ళు దాటగానే ప్లేస్కూల్ లేదా కిండర్ గార్టెన్‌లో చేరుస్తున్నారు. అక్కడ పిల్లలకు ఆంగ్లమాధ్యమంలో ఉండే రైమ్స్ నేర్పుతున్నారు. హిందూ సంస్కృతిలోని ఉన్నత మానవతా విలువలతో కూడిన బోధన కరువవుతోంది. అదొక లోపంగా పరిణమించింది.
బడిలో ఇచ్చిన హోమ్‌వర్క్ పూర్తిచేసిన పిల్లలు ఆటస్థలంలో తోటి పిల్లలతో ఆడుకోవడం లేదు. మొబైల్ గేమ్స్‌కు అలవాటుపడుతున్నారు. టీవీ కార్యక్రమాల్లో హింస ప్రధానమైపోయింది. అవి చూస్తున్న పిల్లల్లో కోపం, అసహనం తెలియకుండానే పెరుగుతున్నాయి. నలుగురితో కలసి బతకడం తెలియడం లేదు. పిల్లల్లో హింసాప్రవృత్తి పెరగడానికి ఇదే కారణం. ఈ విషయాన్ని ఇటీవల పరిశోధనలు చేసిన మాంట్రియల్ స్కూల్ ఆఫ్ సైకో ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు తేల్చి చెప్పారు.
‘బాల ప్రపంచం పాల ప్రపంచం/ పాల వలె తెల్లనిది/ పాల వలె చిక్కనిది/ పాల వలె తియ్యనిది/’అన్నారు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులైన న్యాయపతి రాఘవరావు. అలాంటి నిష్కల్మషమైన పిల్లల మనస్సులో పరోక్షంగా విష బీజాలు నాటుతున్నది పెద్దలే. ఒకప్పుడు ప్రతి ఇంట్లో చందమామ, బాలమిత్ర, బుజ్జాయి లాంటి పిల్లల మాస పత్రికలు దర్శనమిచ్చేవి. పెద్దలూ పిల్లలచేత చదివించేవారు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఒకరు లేక ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న నేటి తల్లిదండ్రులు గారాబంతో పిల్లలను చెరపు చేస్తున్నారు.
పిల్లలను రెండున్నరేళ్ళ వయసులో కె.జి.లో, పదేళ్ళకి హాస్టల్‌లో చేర్చడంవల్ల పిల్లలకి తల్లి లాలన, తండ్రి పాలన అందడం లేదు. వారి హృదయాల్లో ప్రేమ, ఆప్యాయతలు నిక్షిప్తం కావడం లేదు. నేటి సినిమాల ప్రభావం పిల్లలపై ఎక్కువగానే ఉంది. మంచి కథలతో సినిమాలు అరుదైపోయాయి. ప్రేమ, ఫ్యాక్షన్‌ల నేపథ్యంలో సినిమాలు హాని చేస్తున్నారు. నేటి సమాజంలోనే ఆచరణీయమైన మార్పురావాల్సి ఉంది. అందుకు తల్లిదండ్రులే ముందడుగు వేయాలి. ప్రభుత్వమూ సరైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వారి భవిత బంగారం. బడిలో ఒక గంట సమయం ఉత్తమ బాలసాహిత్యానికి కేటాయించే నిబంధనలు విధించాలి. మంచి నీతికథ సారాన్ని వ్రాసేలా పరీక్షవిధానం మార్చాలి. బాలల మానసిక వినోదం, వికాసం, విజ్ఞానం కాంక్షించి స్వర్గీయ ఎన్.టి.ఆర్. స్థాపించిన ఒకనాటి బాలల అకాడెమీని తెరిపించాలి. దేశంలో స్వచ్ఛమైన మనసున్న పౌరులు తయారుకావాలి. నీతి, నిజాయితీలు, దేశభక్తిగల పౌరులు భావితరాలకు అందించాలనే నేటి బాలల భవిష్యత్తుని బంగారుమయం చేయాల్సిన బాధ్యత అందరిదీ.

-నారంశెట్టి ఉమామహేశ్వరరావు