సబ్ ఫీచర్

సేంద్రీయ సాగుకు ఊతం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతులను ఆచరిస్తే సకల మానవాళికి, పర్యావరణానికి మేలు జరుగుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నా మనదేశంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మన ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు కొమ్ముకాస్తూ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఎంతమాత్రం ప్రోత్సహించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో సేంద్రియ పద్ధతుల వల్ల వ్యవసాయ రంగంలో అద్భుతాలను సాధిస్తున్నారు.
కేరళ ప్రభుత్వం రసాయన ఎరువులు, పురుగుమందులను కొంతమేరకు నిషేధించి సేంద్రియ వ్యవసాయానికి చేయూతనిస్తోంది. కేరళలో ‘ఎండోసల్ఫాన్’ అనే రసాయనిక పురుగు మందును పూర్తిగా నిషేధించారు. ఇందుకు విరుద్ధంగా మన తెలుగు రాష్ట్రాల్లో రసాయన క్రిమిసంహారక మందుల విక్రయానికి లైసెన్స్‌లు ఇచ్చి, వాటిని యథేచ్ఛగా అమ్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో నిషేధించిన పురుగు మందుల కంపెనీలకు మన ప్రభుత్వాలు ద్వారాలు తెరిచాయి. బహుళజాతి కంపెనీలు మన దేశంలో క్రిమిసంహారక మందులు ఉత్పత్తి చేసుకునేలా భూములు, పన్ను రాయితీలు, రుణపరపతి వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
మరోవైపు- గత రెండున్నర దశాబ్దాలుగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థలు ప్రభుత్వంతో నిరంతరం పోరాడుతూనే వున్నాయి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కూడా ప్రభుత్వ అధికారులు ఖాతరు చేయకపోవడం లేదా పక్కదారి పట్టించి, సేంద్రియ ఉత్పత్తుల కంపెనీలను యధాశక్తిన వేధిస్తూనే వున్నారు. బయో కంపెనీల వారు తమ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించుకోవడానికి ‘అల్కలైడ్స్ బయోల్యాబ్’ ఏర్పాటు చేయమని 15 ఏళ్లుగా అర్థిస్తూనే వున్నారు. లేనిపోని ఆడంబరాలకు వందల కోట్లు ఖర్చుపెట్టే మన పాలకులు పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనుకాడటం విచారకరం. పంటల్లో మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడడం వల్ల ఎన్నో దుష్ఫలితాలు సంభవిస్తున్నాయి. తల్లిపాలలో కూడా పురుగుమందుల విష అవశేషాలు వుండటానికి కారణం రసాయనిక ఎరువులు, మందులేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు కొన్ని బయో ఉత్పత్తులను పరీక్షించి, కిలో బయోఉత్పత్తిలో ఒక మిల్లీ గ్రాము లేదా 0.5 మి.గ్రా రసాయనాలున్నట్లు చూపించి బయో ఉత్పత్తిదారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆహార పదార్థాల్లో సూక్ష్మస్థాయిలో రసాయనాల అవశేషాలు ఉంటే- అది ఎవరి బాధ్యత? అని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మనం నిత్యం తాగే కూల్ డ్రింక్స్‌లోనూ, రసాయన ఎరువులతో పండించిన ఆహారోత్పత్తుల్లోనూ ఎక్కువగా రసాయనాలు వుండటం గమనార్హం. ప్రస్తుతం మనదేశంలో బయో ఉత్పత్తుల రంగం లఘు పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది. పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో సేంద్రీయ ఉత్పత్తులను కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో పూర్తిగా పన్ను రాయితీని కల్పించి, వీటికి ఏవిధమైన లైసెన్స్ అవసరం లేదని చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. కానీ, ఆ తర్వాత అధికారులు దానిని వక్రీకరించి, లైసెన్స్ లేదు కాబట్టి బయో ఉత్పత్తులను విక్రయించరాదని నిషేధం విధించారు. పాలకులు, అధికారులు ఈ విషయమై శాస్ర్తియ కోణంలో ఆలోచించాలి. మనం తీసుకునే ఆహారంలో పురుగుల మందుల అవశేషాలున్నాయని, వాటివల్ల క్రమంగా మన ఆరోగ్యం దెబ్బతింటుందని ఇప్పటికైనా వీరు గ్రహించాలి. బయో ఉత్పత్తులను అడ్డుకునే ముందు గత 25 ఏళ్లుగా రైతుల శ్రేయస్సు కోసం అంకిత భావంతో పనిచేస్తూ , వారికి అందుబాటు ధరలో తమ ఉత్పత్తులను అందజేస్తున్న బయో కంపెనీల నిజాయితీని గ్రహించాలి. సేంద్రియ ఎరువుల వినియోగం కారణంగా భూసారం పెరుగుతుంది. మొక్కలలో రోగ నిరోధక శక్తిపెరిగి, చీడ పీడలను తట్టుకునే సామర్థ్యం వృద్ధి చెందుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట దిగుబడి సాధించే అవకాశం ఉంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. ప్రజలకు హానికరం కాని ఆహారోత్పత్తులను అందిస్తుంది. కొన్ని చోట్ల వ్యవసాయాధికారులు బడా కంపెనీల ప్రలోభాలకు లొంగిపోయి, సేంద్రియ ఉత్పత్తులను అమ్మకుండా నిరోధిస్తున్నారు. గుంటూరు తదితర జిల్లాల్లోని ఎరువుల దుకాణాల్లో బయో ఉత్పత్తులు అమ్మకుండా అప్రకటిత నిషేధం విధించారు. దుకాణాల ముందు ‘బయో ఉత్పత్తులు విక్రయించడం లేద’నే బోర్డులు పెట్టాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. బయో ఉత్పత్తులు అమ్మే వ్యాపారులపై లేనిపోని కేసులు పెడుతున్నారు. దీనివల్ల సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారం పూర్తిగా మందగించింది. రైతులకు సేవ చేద్దామనుకునే బయో ఉత్పత్తుల కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. వాస్తవానికి వ్యవసాయశాఖకు బయో ఉత్పత్తులను అడ్డుకునే అధికారం చట్టపరంగా లేదు. ఈ విషయాన్ని 2006లో అప్పటి హైకోర్టు న్యాయమూర్తి గోపాలరావు స్పష్టంగా తన తీర్పులో పేర్కొన్నారు. అయితే, బయో ఉత్పత్తులను రైతులు వినియోగిస్తున్నందున వాటిపై తమకు నియంత్రణ అధికారం కావాలని వ్యవసాయాధికారులు కోర్టును అభ్యర్థించారు. దానికి హైకోర్టు బయో ఉత్పత్తుల్లో రసాయనాలు ఉన్నట్లు నిరూపితమైతే చర్యలు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది. దీన్ని అడ్డుపెట్టుకొని బయో ఉత్పత్తుల్లో రసాయనాలున్నాయనే సాకుతో వీటిని సమూలంగా నిషేధించేందుకు సర్కారు కుట్ర పన్నుతోంది. దీనికి రసాయనిక పురుగుల మందుల కంపెనీల ఒత్తిళ్లు కారణమని చెప్పకతప్పదు. న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం అధికారులు బయోఉత్పత్తుల నమూనాలను సేకరించి పరిశోధనా కేంద్రాల్లో పరిశీలించాల్సి ఉండగా, అధికారులు ఏ మాత్రం పరిశీలించకుండానే బయో ఉత్పత్తుల్లో రసాయనిక అవశేషాలున్నట్లు ధ్రువీకరించి ఏకపక్షంగా నిషేధాన్ని అమలుచేయాలనుకోవడం గమనార్హం. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో బయో కంపెనీలపై దాడులు విస్తృతంగా జరుగుతుండటం వెనక ఏ కారణాలు వున్నాయో అంతుచిక్కడం లేదు. ఈవిషయంలో ప్రభుత్వం హుందాగాప్రవర్తించడం లేదు. చట్టం చెప్పినట్టు చర్యలు తీసుకోవడం లేదు. బయో ఉత్పత్తిదారులపై కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి.. రసాయన ఎరువుల తయారీలో ప్రమాణాలు, నాణ్యత పాటించని ఎన్నో కంపెనీలపై కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రభుత్వం ఎందుకు చూపటం లేదో అర్థం కాకుండా వుంది.
గత పదేళ్ల నుంచి న్యాయస్థానం ప్రభుత్వ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను ఇస్తూనే వుంది. అధికారులు మాత్రం వాటిని ఏదోఒక విధంగా దుర్వినియోగం చేస్తూనే వున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లయినా ఒక వ్యాపార వర్గానికి లైసెన్స్‌ల విషయంలో చట్టం లేకపోవడం- ప్రభుత్వాల వైఫల్యమా? వ్యాపారస్తుల దురదృష్టమా? ఇది ఆధునికంగా వచ్చిన వ్యాపారం కాదు. బయో టెక్నాలజీ అంటే మన వేదాలలో రాసిన వృక్షాయుర్వేదమే. ఇది పూర్తిగా భారతీయ సంస్కృతి. బయో ఉత్పత్తుల సంస్థలపై వేధింపులను నిరసిస్తూ, ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత తెలుగురాష్ట్రాల్లోని ప్రజలందరిపైనా ఉంది.

-సి.వి రత్నకుమార్