సబ్ ఫీచర్

గురి తప్పిన మోదీ దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు రూపంలో నల్లకుబేరులపై ప్రధాని నరేంద్ర మోదీ ‘సర్జికల్ దాడి’ చేశాక దేశ సామాజిక, ఆర్థిక రంగం రూపురేఖలే మారిపోయాయి. నల్లధనం మీద దాడి చేయవద్దని, అవినీతిని అరికట్టవద్దని ఎవరూ అనరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉండే వారు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. గతంలో అధికారం చలాయించినవారూ చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అసలు సమస్యంతా- నోట్లరద్దు తర్వాత ఏర్పడబోయే పరిణామాలను, ప్రజల ఇబ్బందులను మోదీ ప్రభుత్వం ముందుగా అంచనా వేయకపోవడమే. పార్లమెంటులో విపక్షాలు, బయట ప్రజాసంఘాలు వేస్తున్న ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వడం లేదు. నగదు కొరతతో ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. ఎవరి ప్రయోజనాలను ఆశించి మోదీ ఇంతటి నిర్ణయం తీసుకున్నారు? నేడు ఆర్థిక వ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితులకు, సామాన్యుడి ఛిద్రమైన జీవనానికి బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా సమస్యను రాజకీయం చేసి తప్పించుకోవాలన్న ఎత్తుగడ మాత్రమే మోదీలో కనిపిస్తోంది.
నల్లధనం ఎవరి వద్ద ఉందో, ఏయే రంగాల్లో అది చెలామణి అవుతోందో కేంద్ర ప్రభుత్వానికి కచ్చితంగా తెలుసు. నల్లకుబేరులపై నేరుగా దాడిచేసి వారిని పట్టుకునే అవకాశం ఉన్నా, రాజకీయంగా ఇబ్బందులు వస్తాయన్న భయంతో దేశ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేలా నిర్ణయం తీసుకోవడం సరికాదు. ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న అభద్రతాభావంతోనే నల్లకుబేరులపై దాడికి వెనుకంజ వేశారని భావించాలి. తరగతి గదిలో అల్లరి చేసే సంపన్న వర్గాల కుర్రాడిని శిక్షించడానికి భయపడి, అల్లరి చేయని మిగతా పిల్లలను బెత్తంతో కొట్టిన ఉపాధ్యాయుడి మాదిరి మోదీ ప్రవర్తించడం సిగ్గుచేటు. ఊరిపెద్దలు కనె్నర్ర చేస్తే తన ఉద్యోగం ఊడుతుందని భయపడిన ఉపాధ్యాయుడిలా మోదీ వ్యవహరించారు.
మోదీ నిర్ణయంతో కొంతమేరకు మాత్రమే లాభం జరిగింది. నకిలీ నోట్ల తయారీ, పంపిణీ ముఠాలు ఒక్కసారిగా అవాక్కయ్యాయి. మావోయిస్టులు, ఉగ్రవాదులకు నిధుల కొరత ఏర్పడి వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. కాశ్మీర్‌లో రాళ్లు రువ్వడం వంటి కవ్వింపు చర్యలు నిలిచిపోయాయి. బంగారం, ఇతర స్మగ్లింగ్‌కు తెరపడింది. మోదీ ఆశించిన లాభాల కన్నా, సమాజంలో మెజారిటీ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. కూలిపనులు చేసుకునే వారు నగదు మార్పిడి కోసం బ్యాంకుల వద్ద బారులు తీరారు. నోట్ల మార్పిడికి గడువు ముగిశాక ఇపుడు కాసింత నగదు పొందేందుకు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. అవసరాలకు తగినట్టుగా గాక పరిమితులకు లోబడి నగదు తీసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. చేతిలో నగదు లేనందున పేద, మధ్య తరగతి కుటుంబాలకు రోజు గడవడమే కష్టమవుతోంది. వారి ఇళ్లలో సరదాలు, సంబరాలు లేకుండాపోయాయి. పెళ్లిళ్లు రద్దయ్యాయి. ప్రయాణాలు ఆగాయి. శుభ, అశుభ కార్యాలకు నానా యాతన పడుతున్నారు. రోగాలతో ఉన్నవారు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది బ్యాంకుల వద్ద క్యూలో ప్రాణాలు విడుస్తున్నారు. నగదు లేనందున అసౌకర్యాలనే కాదు, అవమానాలను సైతం పేదలు ఎదుర్కొంటున్నారు.
దేశం కోసం ఏభై రోజులపాటు కష్టాలు భరించాలని మోదీ ప్రజలకు విన్నవించినా, ఆయన చెప్పినట్టు ఏభై రోజుల తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందా? ఎంతమంది నల్లకుబేరులను జైళ్లకు పంపుతారు? దేశానికి మేలు జరుగుతుందంటే తాము క్యూలో కష్టాలు పడేందుకు సిద్ధమేనని జనం సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాస్తవంగా చూస్తే ఆర్థిక పరిస్థితి చక్కబడే అవకాశాలు లేకపోగా, దీర్ఘకాలంలో తీవ్ర నష్టాలు కలిగే ప్రమాదం పొంచి ఉంది. ఒకే ఒక్క నిర్ణయంతో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయేలా చేయడంలో మోదీ సఫలమైనట్లే. కరెన్సీని చిత్తుకాగితాల్లా చేసే శక్తి ప్రభుత్వానికి ఉందని ప్రజలకు తెలిసింది. ఏ నోట్లను ఎప్పుడైనా రద్దు చేస్తారన్న భయం జనంలో ఆవరించింది. కరెన్సీ భయం కారణంగా సంపాదన, ఖర్చు విషయంలో గందరగోళం ఏర్పడుతోంది. ఈ ప్రభావం వ్యవసాయోత్పత్తులపైన, ఆర్థిక వ్యవస్థపైనా పడడం ఖాయం. బ్యాంకులో దాచుకున్న డబ్బు గురించి, లాకర్లలో దాచుకున్న బంగారం గురించి ప్రశ్నిస్తారన్న ప్రచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించడం లేదు. దీంతో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపై జనంలో విశ్వాసం సన్నగిల్లుతోంది. బ్యాంకులో డబ్బు జమ చేసేందుకు భయపడే ప్రజలు మరో పద్ధతిలో దాన్ని దాచుకుంటారు. ఫలితంగా అది తిరిగి నల్లడబ్బుగా మారుతుంది. ఇంట్లో దాచుకోలేక డబ్బును వడ్డీలకు, ఇతర వ్యాపారాలకు ఇచ్చే పరిస్థితి వస్తుంది. తగినన్ని డిపాజిట్లు రాక బ్యాంకింగ్ కార్యకలాపాలు తగ్గుతాయి. బ్యాంకులు బలహీనపడితే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది.
దేశంలో అనుకూల ఆర్థిక వాతావరణం కొనసాగుతున్న తరుణంలో మోదీ- ‘తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లు’గా పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని దేశాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేశాడని చెప్పక తప్పదు. మెరుగ్గా ఉన్న ఆర్థిక వ్యవస్థకు మోదీ చేసిన ‘సర్జరీ’తో దేశం పతనం వైపునడిచే పరిస్థితి ఏర్పడింది. తన మంత్రుల సలహాలు తీసుకోకుండానే అత్యంత రహస్యంగా మోదీ కీలక నిర్ణయం తీసుకున్నా, దాని అమలులో ఆర్‌బిఐని సైతం భాగస్వామ్యం చేయలేదు. ఆర్‌బిఐ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ప్రధాని తీసుకోవడం సబబా? నోట్లరద్దుపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఈ వ్యవహారం ఇప్పట్లో తేలదు. ఈలోగా ప్రజలకు కష్టాలు తప్పవు. పెద్దనోట్ల రద్దుతో సినిమా, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు కుదేలవుతాయి. ఈ రంగాల్లో పనిచేసే వారికి ఉపాధి దొరకదు. కొత్త ఉద్యోగాలను ఇవ్వకపోగా మోదీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందన్న అపఖ్యాతి తెచ్చుకుంటోంది. మోదీ నిర్ణయంతో భవిష్యత్‌లో బిజెపి ఓటు బ్యాంకుకు గండిపడే ప్రమాదం లేకపోలేదు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద నరకయాతన చవిచూస్తున్న పేద, మధ్యతరగతి వారు తమ చేదు అనుభవాలను అంత సులభంగా మరచిపోలేరు. ఎన్నికల వేళ వారు తమ సత్తా చాటుకుంటారన్న భయం బిజెపి శ్రేణుల్లో లేకపోలేదు. నోట్లరద్దు నిర్ణయంతో అన్ని వర్గాల వారినీ పీడించిన ఘనత మోదీకే దక్కుతుంది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు కలలుగన్న ‘సోషలిజా’న్ని ఆయన ఇలా సాధించారు. నోట్ల రద్దుతో మోదీకి రాజకీయంగా దెబ్బ తగులుతుందని ఎవరూ బాధపడనవసరం లేదు. కానీ- దేశానికి తగిలిన దెబ్బతో ఈ జాతిని రక్షించేదెవరు?

- అడుసుమిల్లి జయప్రకాష్ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ