సబ్ ఫీచర్

ప్రపంచానికి ‘హైబీపీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక రక్తపోటుతో బాధపడే రోగుల సంఖ్య ప్రపంచంలో నానాటికీ పెరుగుతోంది. గడచిన 40 ఏళ్లలో హైబీపీ రోగుల సంఖ్య దాదాపు రెట్టింపైందని తేలింది. ప్రస్తుతం వీరి సంఖ్య 113 కోట్లు. ‘ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్’ శాస్తవ్రేత్తల నేతృత్వంలో జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 1975-2015 మధ్య వివిధ దేశాలలో రక్తపోటు అంశంలో మార్పులపై ఈ అధ్యయనం కొనసాగింది. ఈ తరహా పరిశోధనల్లో ఇదే అతి విస్తృతమైనది కావడం విశేషం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వివిధ దేశాలకు చెందిన వందలాదిమంది శాస్తవ్రేత్తలు కలసి దాదాపు 2 కోట్లమంది నుంచి రక్తపోటుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ పరిశోధనలో కనుగొన్న విషయాలను ప్రఖ్యాత జర్నల్ ‘ద లానె్సట్’లో ప్రచురించారు.
అత్యధిక ఆదాయం ఉన్న దేశాల్లో రక్తపోటు కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని, అతితక్కువ, మధ్యతరహా ఆదాయం ఉన్న దేశాల్లో అధిక రక్తపోటు కేసులు పెరిగాయని, ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో వీటి నమోదు ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. 2015 సంవత్సరానికి సంబంధించినంతవరకూ యునైటెడ్ కింగ్‌డమ్‌లో అతి తక్కువ అధిక రక్తపోటు రోగులున్నట్లు తేలింది. ప్రపంచంలో అతి తక్కువ స్థాయిలో అధిక రక్తపోటు బాధితులు నమోదైన దేశాల్లో దక్షిణ కొరియా, యుఎస్‌ఎ, కెనడా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 1975లో సంపన్నులనే అధిక రక్తపోటు ఎక్కువగా వేధించేదని, ఇప్పుడు పూర్తిగా విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సీనియర్ ప్రొఫెసర్ మజిద్‌ఎజ్జతి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ సమస్య పేదవారిలోనే ఎక్కువగా కనిపిస్తోందని ఆయన వివరించారు. ఈ పరిణామానికి అసలు కారణం తెలియకపోయినా పండ్లు, కూరగాయల వినియోగం పెరగడం వల్ల, అవి కొనే శక్తి సంపన్నులకు ఉండటం వల్ల అధిక రక్తపోటు ముప్పు వారికి తప్పుతోందని, పేదలకు పౌష్టికాహారం లోపించడం వల్ల సమస్యగా మారిందని ఆయన అంటున్నారు. అధిక రక్తపోటు రావడానికి కారణమైన ఊబకాయం సమస్యను ఎదుర్కొనే విషయంలో సంపన్న దేశాలు ముందున్నాయని అన్నారు. వెల్‌కమ్ ట్రస్ట్ నిధులతో ఈ అధ్యయనం నిర్వహించారు.
మహిళల్లో కన్నా పురుషుల్లోనే అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా అత్యధిక దేశాల్లో ఉన్నట్లు ఈ పరిశోధనల్లో తేలింది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 52.9 కోట్లమంది మంది మహిళలు అధిక రక్తపోటుతో బాధపడుతూంటే, హైబీపీ వేధిస్తున్న పురుషుల సంఖ్య 59.7 కోట్లు. హైబీపీ రోగుల్లోని పెద్దవారిలో సగానికి సగం మంది ఒక్క ఆసియాలోనే ఉన్నారని తేలింది. వీరిలో 22.6 కోట్ల మంది చైనాలోను, 20 కోట్లమంది భారత్‌లోనూ ఉన్నారు. అధిక రక్తపోటువల్ల గుండె, మెదడు, మూత్రపిండాల్లోని రక్తకణాలు, నాళాలపై ఒత్తిడి పెరుగుతుందని, గుండెపోటు, పక్షవాతం రావడానికి ప్రధాన కారణం ఇదేనని పరిశోధన తేల్చింది. ఏటా రక్తపోటు కారణంగా ఇలా చనిపోతున్న వారి సంఖ్య 75 లక్షలు. మగవారిలో అధిక రక్తపోటుతో బాధపడేవారు క్రొయేషియాలో అధికంగా (దేశ జనాభాలో 38 శాతం), మహిళల్లో నైజిరియా (36శాతం) తొలిస్థానాల్లో ఉన్నాయి. 1975 నాటి రక్తపోటు గణనకు సంబంధించిన పరికరాల్లో లోపాలు, సబ్‌సహారా, కరేబియన్ దేశాల్లో సమాచార సేకరణలో ఉన్న అవాంతరాల దృష్ట్యా ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులున్నాయని శాస్తవ్రేత్తల బృందం పేర్కొంది.

-రవళి