సబ్ ఫీచర్

మోదీ దౌత్యనీతికి జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ‘బుర్జ్ ఖలీఫా’ భవనం మన జాతీయ పతాకంలోని అశోక్ చక్రం సహా త్రివర్ణాలతో ధగధగాయమానంగా వెలిగిపోవడం అసాధారణ విషయం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని దుబాయ్‌లో 2,722 అడుగుల (829.8 మీటర్ల) ఎత్తున అయిదేళ్ల కాలంలో నిర్మించిన ఈ భవనాన్ని ‘బుర్జ్ దుబాయ్’, ‘ఖలీఫా టవర్స్’ అని కూడా పిలుస్తారు. చమురు ఉత్పత్తులపై ఆధారపడిన తమ దేశపు ఆర్థిక వనరులను ఇతరత్రా వ్యాపారాలకు మళ్లించేందుకు యుఎఇ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక వాణిజ్య సముదాయ భవనం- ఈనెల 26న మువ్వనె్నలతో ముస్తాబు అవడం మన దేశానికి దక్కిన అరుదైన గౌరవం. మన గణతంత్ర వేడుకలలో భాగంగా బుర్జ్ ఖలీఫాలో ఎల్‌ఇడి లైట్లతో దీపోత్సవాలను నిర్వహించారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన దుబాయ్ ‘్ఫంటెన్ షోల’ను మన పతాకంలోని మూడు రంగుల ఆధారంగా రూపొందించారు. దుబాయ్‌లో త్రివర్ణ పతాకపు రెపరెపలు ఈ రెండు దేశాల మధ్య బలపడుతున్న సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలకు, ఇరు దేశాల ప్రజల మధ్య సంఘీభావనకు నిదర్శనం. పాకిస్తాన్‌కు అత్యంత సన్నిహితమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారత జయఘోషలు వినిపించడం, ఆ దేశపు యువరాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ ఆల్ నహ్ యాన్ దిల్లీలో గణతంత్ర దినోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేయడం నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌత్యనీతి విజయవంతం అయిందనడానికి ప్రత్యక్ష నిదర్శనం.
గత కొద్ది సంవత్సరాలుగా భారత్-యుఎఇల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఈ ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృఢపరచాలని, వేగంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఉత్సాహాన్ని ఇరు దేశాలు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వివిధ రంగాలలో 38 ఒప్పందాలున్నాయి. ఈసారి యుఎఇ యువరాజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మూడు రోజుల పర్యటన సందర్భంగా మరో 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. నరేంద్ర మోదీ, యువరాజు అల్ నహ్‌యాన్‌ల మధ్య ఇది మూడవ సమావేశం. 2015 ఆగస్టులో మోదీ అబుదబీ పర్యటన ముస్లిం దేశాలన్నింటినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అరబ్బుల నేలమీద నుంచి- ‘పాకిస్తాన్ అనుసరిస్తున్న తీవ్రవాద చర్యలకు వ్యతిరేకంగా పోరాడాల’న్న సంకల్పం మరోసారి నిర్ద్వంద్వంగా ప్రకటితమైంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-యుఎఇలు సంయుక్తంగా పోరాటం చేయాలన్న ఒప్పందంపై సంతకాలు చేసుకున్న కొన్ని గంటలకే దుబాయ్ క్రికెట్ స్టేడియం నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ- ‘‘గుడ్ తాలిబన్ - బాడ్ తాలిబాన్ అంటూ ఉండవు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి శిక్షపడాల్సిందే. గత 40 సంవత్సరాలుగా భారతదేశం నలిగిపోతోంది. ప్రపంచం మానవత్వం వైపు నిలబడుతుందో లేక తీవ్రవాదాన్ని సమర్థిస్తుందో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది’ అని కరాఖండీగా ప్రకటించారు.
దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత యుఎఇలో పర్యటించిన భారత ప్రధానిగా మోదీ ఆ దేశంతో ఆర్థిక, రక్షణ, వివిధ చట్టాల అమలు, సాంస్కృతిక, విద్యుత్ రంగాలలో కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు. మోదీ ప్రయత్నాల కారణంగా భారత్-యుఎఇల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మార్గం సుగమం అయింది. కొంతమంది, కొన్ని సంస్థలు మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల మధ్య, దేశాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని నిరోధించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడాన్ని త్రిప్పికొట్టాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఇరు దేశాలు తమ తమ ధార్మిక, మత గురువుల సమావేశాలు ఏర్పాటుచేసి శాంతి, సహనం, సమగ్రత, ప్రజాశ్రేయస్సు లక్ష్యాలను సాధించుకోవాలని అనుకున్నాయి. ఏ రూపంలో ఉన్నా తీవ్రవాదాన్ని నిలువరించాలని, తీవ్రవాద నిరోధానికి వివిధ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని, ఆయా దేశాల్లో ఉన్న తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని, తీవ్రవాదుల్ని కఠినంగా శిక్షించేలా ప్రపంచ దేశాలను కోరాలని నిర్ణయించుకున్నాయి. తీవ్రవాద నిరోధానికి ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారాన్ని ఒకరికొకరు అందించుకోవాలని అనుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించిన ‘కాంప్రహెన్సివ్ కనె్వన్షన్ ఆర్ ఇంటర్నేషనల్ టెర్రరిజం’ తీర్మానం ఆమోదానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడానికి యుఎఇ పూర్తి స్థాయిలో సహకరించింది. ఉభయ దేశాల సమగ్రత కోసం హిందూ మహా సముద్రంలో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి.
భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి యుఎఇ అంగీకరించింది. రైల్వే, నౌకాశ్రయాలు, రోడ్లు, విమానాశ్రయాల ఏర్పటుకు 75 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో భారత్ తలపెట్టిన బృహత్ కార్యక్రమంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమం అయింది. ఇదే సమయంలో యుఎఇలో భారత కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆ దేశం అంగీకరించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో భారత్‌కు వున్న ప్రతిభను వినియోగించుకోవడానికి యుఎఇ అంగీకరించింది. వీటన్నింటికీ మించి దుబాయ్‌లో హిందూ దేవాలయ నిర్మాణానికి యుఎఇ ప్రభుత్వం విశాలమైన భూమిని మంజూరు చేసింది.
రెండు దేశాల మధ్య ఇటువంటి ఒప్పందాలు సాధారణమైనవే. ఇందులో మోదీ గొప్పతనం లేదని విశే్లషకులు కొట్టిపారేయవచ్చు. ఇటువంటి వ్యాఖ్యలు చరిత్ర గతిని దాచిపెట్టడానికి లేదా మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని కించపరచడానికి చేసినవే అవుతాయి. గత 45 సంవత్సరాలుగా యుఎఇ-పాకిస్తాన్‌ల మధ్య సంబంధాల గురించి అవగాహన ఉన్నవారికి ఇటీవలి కాలంలో సంభవిస్తున్న మార్పులు విప్లవాత్మకమైనవిగా కనిపిస్తాయి. తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలు ముఖ్యంగా ముస్లిం దేశాలు ఒక్కటి కావడం, ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోతూండడం స్పష్టంగా కనిపిస్తాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని సమర్థిస్తూ యుఎఇ సంతకం చేయడం అత్యంత కీలకమైన అంశం.
కొన్ని సంవత్సరాల క్రితం వరకూ యుఎఇని పాకిస్తాన్ అనుబంధ దేశంగా గుర్తింపబడేది. 1971లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం ఏర్పడ్డ వెంటనే దాన్ని గుర్తించిన మొట్టమొదటి దేశం పాకిస్తాన్. మతపరంగా, సాంస్కృతికంగా ఉన్న సారూప్యతల కారణంగా ఈ రెండు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఏర్పడ్డాయి. జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ తీసుకున్న అనైతిక విధానాలను యుఎఇ అనేక దశాబ్దాల పాటు సమర్థిస్తూ వచ్చింది. అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్‌కు యుఎఇ పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నది. పాకిస్తాన్ సైనిక, పోలీస్, ఆరోగ్యం, విద్యారంగాలు దాదాపుగా యుఎఇ అందించే ఆర్థిక సహాయం మీదనే ఆధారపడ్డాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దాదాపు నాలుగు లక్షలమంది పాకిస్తానీలు దుబాయ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్‌కు దుబాయ్ ఆశ్రయం యిస్తూ వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య సైనిక బాంధవ్యాలు కూడా బలంగా ఉన్నాయి. యుఎఇ వైమానిక దళానికి పాకిస్తాన్ శిక్షణ ఇస్తూ వచ్చింది. పాకిస్తాన్ నిఘా విభాగపు అధికారి జనరల్ పాషా పదవీ విరమణ తరువాత యుఎఇ సైనిక సలహాదారుగా మారారు. బెలూచిస్తాన్‌లో శాంషీ ఎయిర్‌ఫీల్డ్‌ను నాలుగు సంవత్సరాలపాటు వాడుకోవడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉన్నది.
పాకిస్తాన్‌కు అనుబంధ దేశంగా దశాబ్దాల పాటు కొనసాగిన యుఎఇ ఆలోచనా ధోరణిని మార్చడంలో భారత్ కృతకృత్యమైంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలలో యుఎఇ నేడు మొదటి వరుసలో నిలబడడం మోదీ ప్రభుత్వం నిరంతర సానుకూల చర్యల ద్వారానే సాధ్యపడింది. పశ్చిమ ఆసియాతోపాటు ఇతర గల్ఫ్ దేశాలకు యుఎఇ ముఖద్వారం లాంటిది. మన దేశపు విద్యుత్ అవసరాలలో 70 శాతం ఈ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు 60లక్షల మంది భారతీయులు ఇక్కడ నివసిస్తున్నారు. యుఎఇ ఆర్థిక అభివృద్ధిలో భారత మానవ వనరులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 2013లో వేసిన ఒక అంచనా ప్రకారం యుఎఇలోని భారతీయులు ఏటా సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్లను భారత్‌కు పంపుతున్నారు.
భారత్-యుఎఇల మధ్య వ్యాపార లావాదేవీలు దాదాపు 50 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత్ ఎగుమతులలో యుఎఇది రెండవ స్థానం. భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాలలో యుఎఇ 10వ స్థానంలో ఉన్నది. ఆర్థికాభివృద్ధిలో ఇరు దేశాలకు సమాన అవసరాలున్నాయి. యుఎఇ యువరాజు అల్ నహ్‌యన్‌తో నరేంద్ర మోదీ ఇప్పటివరకు చర్చించిన 31 అంశాలలో 17 సైనిక, శిక్షణ రంగాలకు సంబంధించినవే.
గల్ఫ్ ప్రాంతంలోని వివిధ దేశాలలో మోదీ జరిపిన పర్యటనలన్నీ విజయవంతం అయ్యాయి. భారత ప్రభుత్వం ప్రతి దేశానికి ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ఇందులో చాలా దేశాలకు ఒకదానితో మరొకదానికి తీవ్రమైన విభేదాలున్నాయి. అయినప్పటికీ వీటన్నిటి మధ్య భారత ప్రభుత్వం తన పనిని అత్యంత సానుకూలంగా నిర్వహించుకుంటూ వచ్చింది. ఇజ్రాయిల్, ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్, యుఎఇ తదితర దేశాలలో మోదీ జరిపిన పర్యటనల కారణంగా ఆయా దేశాల్లో భారత్ పట్ల ఉన్న అపప్రదలు తొలగిపోయాయి. భౌతిక శిక్షణ రంగాలలో కలిసి పనిచేయడానికి ఈ దేశాలు ముందుకు వచ్చాయి.
యుఎఇ పట్ల ప్రత్యేక గౌరవాన్ని ప్రదర్శిస్తూ మోదీ ప్రొటోకాల్‌ను కాదని యువరాజును స్వాగతించడానికి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇరుదేశాల మధ్య బలపడుతున్న సంబంధాల కారణంగా ఆసియాతో పాటు చుట్టుప్రక్కల ఖండాల సుహృద్భావ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. క్షేత్రీయ, ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో ఈ రెండు దేశాల సంబంధాలు కీలకపాత్ర పోషించనున్నాయి. 2014లో మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అలుపెరుగకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలు అపహాస్యం చేశాయి. మోదీ చేసిన అవిశ్రాంత పర్యటనల ఫలితం నేడు ప్రపంచం ముందుకు వస్తుంటే వీరి నోట మాట పెగలడం లేదు. మోదీ విదేశాంగ నీతి విజయవంతం అయిందనడానికి అతి తక్కువ సమయంలో మారిన యుఎఇ విధానాలే ఒక మచ్చుతునక. ప్రపంచంలో తీవ్రవాదాన్ని నిర్మూలించడంతోపాటు ఆర్థిక అభివృద్ధికి దోహదపడడానికి భారత్ తన వంతు కృషిని అమోఘంగా నిర్వహిస్తున్నది. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113