సబ్ ఫీచర్

అసహనంతో అనర్థమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఇప్పుడు సర్వత్రా కనిపిస్తున్నవి అసహన దృశ్యాలే. అధికార,ప్రతిపక్షాల మధ్య సుహృద్భావ, సామరస్య వైఖరి స్థానంలో కక్షపూరిత, వ్యక్తిత్వ హనన దృ శ్యాలు దర్శనమిస్తున్నాయి. ప్రకృతికి పగలు-రాత్రి ఎంత అవసరమో ప్రజాస్వామ్యంలో అధికారపార్టీతోపాటు ప్రతిపక్షం ఉంటేనే శోభ! దేశంలో ఇప్పుడు ఇలాంటి భావన ఏ పార్టీలోనూ కనిపించడం లేదు. ఇందుకు ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలు, అక్కడి రాజకీయ పార్టీలూ మినహాయింపు కాదు. రాజకీయపార్టీల మధ్య ఉండాల్సిన ఇచ్చిపుచ్చుకునే ధోరణి స్థానంలో ఆజన్మశత్రుత్వ భావన, ఒకరి అంతు మరొకరు తేల్చాలన్న కసి కనిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శోభనివ్వదు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూసిన మహానేతల నుంచి, కొత్తగా అక్షరాభ్యాసం చేస్తున్న యువనేతల వరకూ ఇలాంటి పెడధోరణి మంచిది కాదు.
ఏపిలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత యుద్ధం జరుగుతోంది. సీఎం స్థానంలో చంద్రబాబును చూసేందుకు జగన్ ఇష్టపడటం లేదు. ఎంతోమంది ప్రతిపక్ష నేతలను చూసిన అనుభవంతో, ఆ స్థానంలో కూర్చున్న జగన్ చర్యలను బాబు భరించలేకపోతున్నారు. వీరిద్దరి వ్యవహారంలో మీడియా చెరొక వైపు నిలబడటం ఇక్కడ మరో ఆక్షేపణీయ అంశం. పార్టీలకు సొంత మీడియా సంస్థలుంటే రాజకీయాలు ఎంత వేడిగా ఉంటాయో, తమిళ పార్టీలు తెలుగునాట మీడియాను చూసి నేర్చుకోవలసిందే.
తాజాగా ప్రజల దృష్టిని ఆకర్షించిన ఘోర బస్సు ప్రమాదంలో పదిమంది మృత్యువాత పడితే, దానె్నవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రమాదానికి గురైన బస్సు తెదేపా ఎంపి జెసి దివాకర్‌రెడ్డిది. అం దువల్ల సహజంగానే దానిని రాజకీయంగా ఉపయోగించుకునే లక్ష్యంతో జగన్ అక్కడికి వచ్చారు. జగన్ వచ్చేవరకూ కలెక్టర్ రాలేదు. తాను బాధితుల కో సమే వచ్చానని, ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదన్న సంకేతాలిచ్చే ఆవేశంలో జగన్, కలెక్టర్ సహా డాక్టర్లపై వీరావేశం ప్రదర్శించారు. ఇదొక రాజకీయ క్రీడలో భాగమే అనుకున్నా, జగన్ పరామర్శను తప్పుపట్టకూడదు. ఆయనను అడ్డుకునేందుకు అధికారపార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడం తప్పున్నర తప్పు. జగన్‌పై క్రిమినల్ కేసుపెట్టడం, కృష్ణా జిల్లా కలెక్టర్ మైనారిటీ అయినందున ఈ దాడి యావత్ మైనారిటీలపైనే జరిగిందన్నట్లు మత రాజకీయాలు చొప్పించడం, ఐఏఎస్‌ల సంఘాన్ని కూడా రంగంలోకి దింపడం సహేతుకం కాదు. రాజకీయ కోణంలో జగన్‌కు ఉద్యోగులు, మైనారిటీలను ఏకకాలంలో దూరం చేసే లక్ష్యం ఉన్నప్పటికీ.. అది సామాన్య ప్రజల్లో మాత్రం బాధితుల కోసం వెళ్లిన జగన్‌పై ప్రభుత్వమే అక్రమంగా కేసులు పెట్టించిందన్న ఉచిత ప్రచారం, సానుభూతిని ప్రతిపక్షానికి అందించడమే. ఈ విషయంలో సీఎం మెరమెచ్చుల కోసం జగన్‌ను ఇంకా వేధించాలన్నట్లు ఇద్దరు ముగ్గురు మంత్రులు రెచ్చగొట్టడం విపక్ష నేతకు సానుభూతి పోగుచేసి ఇవ్వడమే! గతంలో ఎమ్మెల్యే రోజాపై ఏడాది బహిష్కరణ వ్యవహారం అధికారపార్టీకి మానసిక ఆనందం కలిగించినా, అది రాజకీయంగా ఆమెకు బోలెడంత ఉచిత సానుభూతి తెచ్చిపెట్టింది. ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఈ రాజకీయరొచ్చులో దిగి, ఆందోళన వ్యక్తం చేయడమే ఇక్కడ ఆశ్చర్యం. దీనిని ప్రశ్నిస్తూ గతంలో బాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులను బెదిరించిన వైనాన్ని వైసీపీ తెరపైకి తీసుకువచ్చి, అధికారుల సంఘాన్ని ఇరుకునపెట్టడంలో విజయం సాధించింది. ఇది పరోక్షంగా సంతకం చేసిన అధికారులపై వ్యక్తిగతంగా ‘ముద్ర’ వేయడమే. రాజకీయాల్లోగానీ, మీడియాలోగానీ ముద్రలు బహు ప్రమాదకరం. అలాంటి ముద్ర పడిన వారికి వ్యక్తిగత ప్రయోజనం జరిగితే ఫర్వాలేదు. ఉత్తిపుణ్యానికి ముద్రలు వేయించుకుంటే దానివల్ల వ్యక్తిత్వంతోపాటు, భవిష్యత్తూ ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు మీడియాలోని రెండు శిబిరాల్లోనూ కొంతమంది సిగ్గుపడటం మానేశారు. ఇలాంటివారు అస్సలు భయపడరు. ఇతరులు ఏమనుకుంటారోనని అసలు పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేటిసిగ్గన్నట్లు ఉంటారు. పైవారి మెప్పు కోసం ఆత్మగౌరవాన్ని కూడా త్యాగం చేస్తుంటారు. తమ పట్ల సానుకూలత కోరుకునే వారు కూడా ఇలాంటి లక్షణాలున్న దక్షులనే దరిచేర్చుకుంటారు. దానికి సామాజికవర్గాలు కూడా కలిస్తే మరీ మహదానందం!
ఇలాంటి తరహా వారు భవిష్యత్తు, వ్యక్తిత్వం గురించి ఆలోచించరు కాబట్టి వారికొచ్చే నష్టం కూడా ఉండదు. అధికారులు అలా కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా పనిచేయాల్సిందే. ప్రస్తుతం జగన్ వైఖరిని తప్పుపట్టిన సీనియర్ ఐఏఎస్ పరీడాకు నిజాయితీపరుడన్న పేరుంది. బాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండగా ఆయన సమర్ధతను ప్రోత్సహించడంతో పరీడాకు తెదేపా అనుకూల ముద్ర పడింది. ఆయనొక్కరే కాదు. అప్పట్లో బాబు ప్రోత్సహించిన కొందరు అధికారులపై ఆ ముద్రపడింది. ఫలితంగా వైఎస్ సీఎం అయిన తర్వాత అలాంటి ఐఏఎస్, ఐపిఎస్‌లకు లూప్‌లైన్ పదవులు దక్కాయి. పోనీ ఇక్కడ సదరు అధికారులు ఏమైనా బావుకున్నారా అంటే అదీ లేదు. సీఎం చెప్పిన పని చేయడమే వారు చేసిన పాపమయిందప్పుడు! అదే పరీడాకు బాబు ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ పదవి ఇస్తుందని భావించారు. ఎర్రచందనం వ్యవహారంలో ఆయన చాలా కసరత్తు చేసి, తగిన ఫలితాలు రాబట్టారు. ఆయన బదులు ఇప్పటికి ముగ్గురు సీఎస్‌లైపోయారు. మరి ఆయనకు ఏం న్యాయం జరిగినట్లు? రేపు ఇంకో ప్రభుత్వం వస్తే అప్పటి ప్రతిపక్షనేత ఇలాగే వ్యవహరిస్తే, అప్పుడూ అధికారుల సంఘం ఇలాగే స్పందిస్తుందా? ఈ సిద్ధాంతం అందరికీ వర్తిస్తుంది! బస్సు ప్రమాదంలో అసలు నిందితులపై చర్యలు తీసుకోవడం మానేసి, యావత్ పార్టీ జగన్‌కు ఉచిత మైలేజీ తెచ్చే వ్యూహంలో అధికారపార్టీ మునిగిపోవడం ఆశ్చర్యం.
ఇక జగన్ విషయానికొస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే సీఎం అయిపోవాలన్న ఆత్రుతతో ఉన్నారు. జనం కూడా తననే కోరుకుంటున్నారన్న నమ్మకంతో ఉన్నారు. అది నిజమా? భ్రమనా? అన్నది ఎన్నికల్లోగానీ తేలదు. తెదేపా ఎంపి జెసి దివాకర్‌రెడ్డిని ముద్దాయిగా నిలిపే ఉత్సాహంలో ఆసుపత్రిలో విధుల్లో ఉన్న డాక్టరు, అక్కడికొచ్చిన కలెక్టర్‌పై నోరుపారేసుకోవడం ప్రతిపక్షనేత పాత్రకు హుందాతనం ఇవ్వదు.ఈవిధంగా తొందరపాటు ప్రదర్శిస్తే ఆయన కష్టం వృథా కాక తప్పదు. తండ్రి వైఎస్ మొండివాడైనప్పటికీ పట్టువిడుపులు ప్రదర్శించి, అవసరమైన సందర్భాల్లో క్షమాపణ కూడా చెప్పిన నేత. బాబు-వైఎస్ మధ్య సభలో అనేకసార్లు వాగ్యుద్ధం జరిగిన రోజులున్నాయి. అయినా ఇరు పార్టీలు లౌక్యంగా ఇచ్చి పుచ్చుకున్న దృశ్యాలు చూశాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాబు వద్దకు వచ్చి సభ సజావుగా సాగేందుకు ప్రయత్నించిన రోజులూ లేకపోలేదు. అప్పుడు ఇరుపక్షాలకూ సర్దిచెప్పేందుకు సీనియర్లుండేవారు. కానీ ఇప్పుడు అలాంటి సీనియర్లు లేకపోవడం దురదృష్టకరం. విపక్షాన్ని రెచ్చగొట్టి ఇరుకున పెట్టడం అధికారపార్టీ లక్షణం. అధికారపార్టీ వలలో పడకుండా తప్పించుకుని రక్షణాత్మకవిధానం పాటించడంతోనే విపక్ష నేత వివేకమేమిటో బయటపడుతుంటుంది. జగన్ శిబిరం ఎంతసేపూ వ్యక్తిగత దాడులకే పరిమితమవుతోంది. దీనివల్ల ప్రభుత్వ తప్పిదాలు ప్రజలను ఆకర్షించలేకపోతున్నాయి. ఫలితంగా జగన్‌లో ఇంకా పిల్లచేష్టలు పోలేదన్న సంకేతాలతోపాటు, బాబు వంటి అనుభవజ్ఞుడితో ఇప్పట్లో సరితూగలేరన్న బేరీజు లెక్కలకు ఆయనే కారకులవుతున్నారేమో?!
* * *
చంద్రబాబు ఏమి చేసినా అదొక చరిత్రలా కనిపిస్తుంటుంది. అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు కూడా అలాంటివే. తక్కువకాలంలో అసెంబ్లీ కట్టి తానేమిటో చాటుకున్నారు. అటు సొంత గడ్డపై సమావేశాలు నిర్వహించుకోవాలని రెండేళ్లనుంచి పోరాడుతున్న స్పీకర్ కోడెల చిరకాల వాంఛ కూడా తీరింది. కానీ, ప్రజల సొత్తయిన అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి, అందులో సభ్యులయిన ప్రతిపక్షాన్ని కూడా ఆహ్వానిస్తే హుందాగా ఉండేది. ప్రతిపక్షాన్ని పిలిచీ పిలవనట్లు ఉండాలన్న ధోరణి ఆరోగ్యకరం కాదు. విపక్షాలు కూడా వస్తే బాగుండేదన్న బాబు వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన జవాబు చూస్తే ఎవరికైనా ఇలాంటి భావనే ఏర్పడుతుంది. అటు విపక్షం కూడా అందిన ఆహ్వానాలకు పెడార్ధాలు తీయకుండా హాజరవుతే బాగుండేది. విపక్షాలు లేకుండా సభ జరగాలని అధికారపార్టీ ఆలోచన ఎంత తప్పో, అధికారపార్టీని అడ్డుకోవడమే పనిగా పెట్టుకోవాలనుకుంటున్న విపక్ష ఎత్తుగడా అంతే తప్పు! హైదరాబాద్‌లోని పాత సభలో అసెంబ్లీ కార్యదర్శిపై వచ్చిన ఫిర్యాదులతోపాటు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండానే కొత్త సభ ప్రారంభం కానుంది. రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలు వ్యక్తిగత రచ్చకు కాకుండా, ప్రజాసమస్యల పరిష్కారానికి వేదిక కావాలన్నదే అందరి కోరిక. *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144