సబ్ ఫీచర్

‘ఘర్షణ’ ఓడింది.. ‘వితరణ’ గెలిచింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్క్సిజం పునాదిగా మావోయిస్టు పార్టీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో పనిచేస్తోంది. చట్టవ్యతిరేక కార్యక్రమాలు, విధ్వంసకర కలాపాలను నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఆ పార్టీని, దాని అనుబంధ సంఘాలను కొన్నింటిని చాలాకాలంగా నిషేధించిన సంగతి తెలిసిందే. చట్టవ్యతిరేక పనులకు సంబంధించి తగిన సాక్ష్యాధారాలుంటే మావోయిస్టులకు కోర్టులు శిక్షలు కూడా విధిస్తున్నాయి. మావోయిస్టుల మద్దతుదారు ఆచార్య జి.ఎన్.సాయిబాబాకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే సాయిబాబాకు మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలున్నాయని, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు నిర్ధారిస్తూ ఆయనకు ఈ శిక్షను విధించింది. ఆయన దివ్యాంగుడైనా మానసికంగా, ఆరోగ్యంగా ఉన్నందున శిక్షలో ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదని కోర్టు పేర్కొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో మార్క్సిజం ‘మూల అంశం’పై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ మూల అంశంపైగల మరో కోణాన్ని అంటే ‘దాతృత్వ విధానా’న్ని పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ రెండు కోణాలు సమాజంపై ప్రభావం చూపినవే కావడం విశేషం. జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్, మన దేశానికి చెందిన జెంషెట్జీ వాల్జీటాటా ఈ రెండు కోణాలకు, విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిద్దరూ దాదాపు సమకాలీకులు. మార్క్స్ 1818లో జర్మనీలోని ప్రష్యాలో జన్మించగా, జెంషెట్జీ టాటా 1839లో గుజరాత్‌లోని ఓ పార్సీ కుటుంబంలో జన్మించారు. వీరిద్దరూ ఉన్నత విద్యను అభ్యసించారు. సమాజం పట్ల గొప్ప ఆర్తిని ప్రదర్శించారు. వేర్వేరు దేశాలకు చెందినప్పటికీ సమాజంలో ఆనాడు కొత్తగా ఉబికి వచ్చిన కార్మిక వర్గం పట్ల వీరు అవ్యాజమైన ప్రేమను కనబరిచారు. సహానుభూతితో ఆ వర్గం కోసం ఎక్కువ ఆలోచనలు చేశారు. అయితే, ఇద్దరి ఆలోచనాధోరణి మాత్రం ఒకటి కాదు. అదే వారిని ప్రత్యేకంగా నిలిపింది.
కార్మికులపై ‘శ్రమ’ దోపిడీ జరుగుతోందని, యజమానులు సంపదను పోగేసుకుంటున్నారని మార్క్స్ విశే్లషిస్తూ ఎన్నో రచనలు చేశారు. కార్మిక వర్గాన్ని చైతన్యపరిచే లక్ష్యంతో బుద్ధిజీవిగా పనిచేశారు. జెంషెట్జీ తన కర్మాగారాల్లోని ఉత్పత్తిలో గౌరవనీయ స్థానం కార్మికులదని, వారి సంక్షేమం కీలకమని, దాన్ని ఆచరణలో చూపారు. దీంతో కార్మిక సంక్షేమం, అభివృద్ధికి కొత్తదారులు ఏర్పడ్డాయి. ఆ విధంగా జెంషెట్జీ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. కార్మికులు, పెట్టుబడిదారుల మధ్య మార్క్స్ ‘వర్గపోరాటం’ చూశారు. కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి కార్మికవర్గాన్ని ఘర్షణవైపు నడిపించారు.
జెంషెట్జీ మాత్రం ‘సంపద సృష్టి’ కీలకం అన్న విధానాన్ని నినాదంగా చేసుకుని, దానిపైనే మనసు నిలిపారు. ఆయన ఘర్షణ వాతావరణాన్ని ఎప్పుడూ కోరుకోలేదు. సమన్వయం, సంపద పంపకంపై దృష్టిపెట్టి త్రికరణ శుద్ధితో దాన్ని ఆచరణలో చూపారు. ఇటు కార్మికుల, అటు పౌరుల అభిమానాన్ని చూరగొన్నారు. మార్క్స్ ఆలోచనలు, భావాలు శ్రమ నుంచి ఆర్థికం, అనంతరం రాజకీయం వైపు కదిలాయి. దాంతో తీవ్ర కల్లోలానికి దారితీశాయి. లౌకిక వాదంతో కార్మిక సంక్షేమం ద్వారా సమాజ రూపాంతరం చెందుతుందని, ఆ విధంగా మానవ కల్యాణం జరుగుతుందని జెంషెట్జీ విశ్వసించి అవిశ్రాంతంగా కృషిచేశారు.
సుమారు గత 150 ఏళ్లుగా ఈ రెండు విధానాలు విశ్వవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అవి తమ ప్రభావాన్ని సమాజంపై చూపాయి. మార్క్స్ భావాలకు రాజకీయ రంగు- రూపు ఏర్పడటంతో అంతర్జాతీయ స్థాయిలో ఆ విధానం విస్తరించింది. జెంషెట్జీ భావాలు రాజకీయాలకు దూరంగా సమాజ పరివర్తన, పురోభివృద్ధిపై కేంద్రీకరించడంతో సంచలనాలకు దూరంగా నిశ్శబ్ద విప్లవం తీసుకొచ్చాయి.
1848లో మార్క్స్ తన మిత్రుడైన ఫ్రెడరిక్ ఏంగిల్స్‌తో కలిసి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ప్రచురించారు. దీని ఆధారంగానే కార్మికులు సంఘటితం కావడం, హక్కుల కోసం ఉద్యమించడం ఆరంభమైంది. 1867-1894 మధ్యకాలంలో మార్క్స్ తన ఆలోచనలకు సిద్ధాంత రూపమిస్తూ ‘దాస్ కాపిటల్’(పెట్టుబడి) అనే గ్రంథాన్ని మూడు సంపుటాలుగా ప్రచురించారు. 1887లో జెంషెట్జీ మహారాష్టల్రోని నాగపూర్‌లో ‘ఎంప్రెస్ మిల్లు’ను ప్రారంభించి కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆనాటికి ఏ దేశంలో లేని విధంగా, ఏ ప్రభుత్వం చట్టాలు చేయకముందే కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీని ఆయన కల్పించారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విశాలమైనచోట తక్కువ గంటలు కార్మికులతో పనిచేయించారు. కార్మికులకు మంచి వేతనాలు అందించి, తనకు వచ్చిన లాభాలతో పేదల కోసం పాఠశాలలు నిర్మించి, పలు సమాజ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. టాటా దీన్నొక సిద్ధాంతంగా రూపొందించారు. పరిశ్రమ యజమానులు దేశ సంపద సృష్టిలో కీలక భాగస్వాములు కావాలని కాంక్షించారు. పురోభివృద్ధి భావాలకు, ఆలోచనలకు చేయూతనివ్వాలని చెప్పడమేగాక ఆచరణలో పెట్టిచూపారు. విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ‘జ్ఞానం’ అత్యంత కీలక వనరుగా భావించి సైన్స్, టెక్నాలజీ రంగాలపై భారీగా ఖర్చుచేశారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను తలకెత్తుకున్నారు. టాటా కంపెనీలకు ఇదే శాసనంగా మారింది.
గత 160 ఏళ్ల చరిత్రను అవలోకిస్తే మార్క్స్ మూల భావంలో బలం లేదని తేలిపోయింది. వర్గపోరాటంతో మిగిలేది బూడిద తప్ప సంపద కాదని రుజువైంది. ఘర్షణలతో జ్ఞానానికి దూరమై కాలాన్ని కరిగించడం తప్ప మరో ప్రయోజనం లేదని తేలిపోయింది. మార్క్స్ సిద్ధాంతాలను వీరాభిమానంతో ఆచరణలో పెట్టిన రష్యా, చైనా, తూర్పు యూరప్ దేశాలు కొన్నాళ్లకు తమ విధానాలను మార్చుకున్నాయి. మార్క్స్ విధానాలతో ప్రజలకు సంపదను పంచలేమని నిర్ధారణకొచ్చాయి. ఇదే సమయంలో జెంషెట్జీ టాటా వారసులు ఎంతో విజయవంతంగా సంపద సృష్టి- వితరణ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఆ సిద్ధాంతానికి కట్టుబడి సమాజ పరివర్తనలో సంపూర్ణ భాగస్వాములవుతున్నారు. ఎందరికో స్ఫూర్తిదాయకంగా, ఆదర్శంగా నిలిచారు. గొప్ప సంప్రదాయాన్ని, సిద్ధాంతాన్ని సజీవంగా నిలిపారు.
సంపద సృష్టి- వితరణ అన్న సిద్ధాంతం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. జెంషెట్జీ దూరదృష్టితో ఆచరించిన మార్గంలో ప్రపంచ కుబేరులయిన బిల్‌గేట్స్, బఫెట్, మార్క్ జుకర్‌బర్గ్, అజీమ్ ప్రేమ్‌జీ, నారాయణమూర్తి లాంటి ఎందరో దిగ్గజాలు కదులుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజ్యాధికారం ‘యావ’లేకుండా ‘జ్ఞానం’ వికసనకు నిరంతరం తపన పడుతున్నారు. సైన్స్, టెక్నాలజీ ఆధారంగా సమాజ పరివర్తన జరుగుతుందని విశ్వసించి పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డి)కి చేయూతనందిస్తున్నారు. నైపుణ్యాలను అభివృద్ధి పరచుకునేవారికి ఆసరాగా నిలుస్తున్నారు. కొత్త ఆవిష్కరణలకు అండగా నిలుస్తున్నారు. మానవ కల్యాణానికి నిధులను ఖర్చుచేస్తున్నారు. మార్క్స్ దర్శించని అనేక పరిణామాలు ప్రపంచంలో చోటుచేసుకుంటున్నాయి. వాటి నేపథ్యంలో మార్క్స్ పేర్కొన్న వైరుధ్యాలు వెలవెలబోతున్నాయి. వాస్తవానికి జెంషెట్జీ ఆలోచనల ఆచరణతో మార్క్స్ చూపిన వైరుధ్యాలు అంత నికార్సయినవి కావని నిరూపించారు.
150 ఏళ్ల క్రితం జెంషెట్జీ అమెరికా ప్రయాణం సందర్భంగా స్వామి వివేకానందతో సంభాషించడంతో స్వదేశీయతపై తనకుగల ఆలోచనలు స్థిరపడ్డాయి. అనంతరం చోటానాగపూర్ సమీపాన అటవీ ప్రాంతంలో భారతదేశంలో మొట్టమొదటి ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదొక ఘన చరిత్ర. నూతన భారతదేశానికి అక్కడే పునాదులు పడ్డాయన్నా అతిశయోక్తి కాదు. బ్రిటీషు పాలకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా అద్భుతమైన ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించడమేగాక అందులో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు అంతే అద్భుతమైన నగరాన్ని నిర్మించడం నిజంగా అపురూపం, ఆదర్శప్రాయం. మార్క్స్ దృష్టికి, టాటా దూరదృష్టికి గల వ్యత్యాసం దీంతో మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జెంషెట్జీ సిటీ ప్లానర్‌గా పనిచేశారు. ఏ కట్టడాలు ఎక్కడ ఉండాలి? ఉద్యాన వనాలు ఎలా ఉండాలి? ఇలా అన్నీ ఆయన పర్యవేక్షణలోనే రూపుదిద్దుకున్నాయి. పాశ్చాత్య దేశాల నగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో నగరాన్ని పొందుపరిచారు. అంతిమంగా ఆ నగరం ఇప్పుడు ఆయన పేరుతోనే పిలువబడుతోంది. అదే జెంషెట్ జపూర్.
దేశంలో మొదటి విద్యుత్ ప్లాంట్‌ను ఆయనే ఏర్పరిచారు. అతిథులకు మంచి ఆతిధ్యమిచ్చే హోటల్‌ను నిర్మించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు నిధులు సమకూర్చారు. విద్యాధికులకు స్కాలర్‌షిప్‌లను ఇచ్చారు. దేశం పురోగమించాలంటే జ్ఞానసముపార్జన అత్యంత కీలకమని భావించి తన సంపదనంతా అందుకు ఖర్చుచేశారు. కొత్త ఆవిష్కరణలకు అండగా నిలిచారు. తన కాలం నాటి ప్రపంచ పరిణామాలను దగ్గరగా పరిశీలించి ఆధునిక భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేశారు. ఇప్పటికీ టాటా కంపెనీలు ట్రస్టుల ద్వారా నడుస్తున్నాయి. తమకు వచ్చే లాభంలో 66 శాతం ప్రజాసంక్షేమానికి, పేదల అభ్యున్నతికి ఖర్చు చేస్తున్నారు. పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నారు. మార్క్స్ వాదానికి, టాటాల సంపద సృష్టి- వితరణ విధానానికి మధ్య ఉన్న వౌలిక వ్యత్యాసం స్పష్టంగా బోధపడుతోంది కదా? ఏది మంచి, ఏది కాదో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కదా?

చిత్రాలు..జెంషెట్జీ , మార్క్స్

- వుప్పల నరసింహం సెల్: 99857 81799