సబ్ ఫీచర్

వందేళ్ళ గుణపాఠం నేర్చుకుంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా విప్లవానికి ఈ నెలతో వందేళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కుబడిగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి. మరోసారి మూల్యాంకనం చేస్తూ మార్క్స్ అభిమానులు ముందుకొచ్చారు. తమ తమ సిద్ధాంత పాండిత్యాన్ని ప్రకటించుకున్నారు.
లెనిన్ నాయకత్వం రష్యా విప్లవం ఒడ్డుకు చేరిన అనంతరం అరుణ పతాక ధగధగాయమాన కాంతులు ప్రపంచమంతటా పరచుకుంటాయని అతి విశ్వాసంతో ‘కమ్యూనిస్టు ఇంటర్నేషనల్’ను ఏర్పాటు చేశారు. కాని వందేళ్ల సందర్భంలో ఆ అరుణ పతాక కాంతులు మసక మసకగానైనా కనిపించని నేపథ్యంలో ఆ విప్లవ విజయాన్ని స్మరించుకుంటున్నారు. ఉత్తేజం - ఉత్సాహం కలికానికైనా కానరాని పూర్తి నిరాశాజనక వాతావరణంలో రష్యా విప్లవ సంస్మరణలు జరిగాయి. మూల్యాంకనాలు సైతం అదే మూస ధోరణిలో కొనసాగాయి తప్ప మెరుపులు లేవు.. వెలుగులూ లేవు.
ఈ కీలకమైన సందర్భంలోనైనా అభ్యుదయవాదులు, మానవాళి క్షేమం కోరేవారు, ముఖ్యంగా శ్రమజీవుల జ్ఞానం పెరగాలని తపించేవారు, వారి జీవితాల్లో వసంతాలు విరబూయాలని కోరుకునే శక్తులు.. మార్క్సిస్టులు కాలం కల్పించిన వెసులుబాటు ఆధారంగా నూతన దృక్కోణంలో, నూతన పరిష్కారాల మార్గం వైపు నడుస్తారని, నడిపిస్తారని ఆశపడినవారికి పూర్తి నిరాశే మిగిలింది. మార్క్స్ ఆర్థిక సూత్రాలు, గత తార్కిక సూత్రాలు ఇప్పటికీ అంతే ప్రాసంగికమని భావించడం వారి భావదారిద్య్రానికి, ఆలోచనా రాహిత్యానికి చిహ్నం.
కారల్‌మార్క్స్ ప్రకటించిన రీతిలో విప్లవాలు పురుడు పోసుకోలేదని అంగీకరిస్తూనే భవిష్యత్ విప్లవాలు మాత్రం మార్క్స్ ఆలోచనలకనుగుణంగా పురుడుపోసుకోవాలని అన్ని మర్యాదలను మంటగలపడం మూర్ఖత్వమే అవుతుంది.
ఉత్పత్తి శక్తుల మధ్య సంఘర్షణ, వైరుధ్యాలు బద్ధలై శ్రామిక వర్గం చేతిలోకి ఉత్పత్తి సాధనాలు వస్తాయని మార్క్స్ చేసిన ఊహకు భిన్నంగా రష్యాలో రాచరికానికి వ్యతిరేకంగా, చైనాలో రైతుల ఆగ్రహంతో విప్లవాలు పురుడు పోసుకున్నాయి.
ఆ రష్యా విప్లవానికిప్పుడు వందేళ్లు. ఈ వందేళ్లలో మార్క్స్‌గాని, అనంతరం ఆయన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడానికి శ్రమించి అనేక సమీకరణలు, సూత్రాలు స్థిరపరచి మార్క్సిజాన్ని మెరుగుపరిచామని చెప్పుకునే సిద్ధాంతవేత్తలు ఊహించినవేవీ నిజం కాలేదు, వాస్తవ రూపం దాల్చలేదు.
చారిత్రక భౌతికవాదం, వైరుధ్యాలు, ఉత్పత్తి సంబంధాలు.. ఇవేవీ మార్క్సిస్టు మూల భావనలకు అనుగుణంగా కొనసాగుతున్న సూచనలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. అయినప్పటికీ 21వ శతాబ్దంలో మార్క్స్ ఊహలు వాస్తవమని మారణాయుధాలతో కవాతు చేస్తే కన్నీరు తప్ప పన్నీరు చిలకదు!
మార్క్స్ గాని ఆయన అనుచరులుగాని శ్రమ.. శ్రమ.. శ్రమ గూర్చిన ఆలోచనలు చేశారు, చేస్తున్నారు తప్ప. మానవాభ్యుదయంలో శ్రమ ఒక కారకం మాత్రమేనన్న వౌలికాంశాన్ని అంగీకరించడానికి సుతరామూ సిద్ధంగా లేరు. అదే వారి పతనానికి దారివేసింది, వేస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకోవడానికి వారు ఏమాత్రం ఆసక్తిని ప్రదర్శించకపోవడం విడ్డూరం. మార్క్స్ గతితార్కిక సూత్రాల ప్రకారం రాచరికం అనంతరం భూస్వామ్యం తరువాత పెట్టుబడిదారి విధానం. ఈ పెట్టుబడిదారీ విధానంలోని లొసుగులను, వైరుధ్యాలు, అమానవీయత బద్దలై శ్రామికులు తమ స్వామ్యాన్ని, నియంతృత్వాన్ని నెలకొల్పుతారు.
గత చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అని ఈ సూత్రీకరణ ఆధారంగానే మార్క్స్ పేర్కొన్నారు. ఆయన అభిమానులు దీన్ని నూటికి రెండొందల శాతం వాస్తవమని తలకెత్తుకున్నారు. వాస్తవానికి వేల సంవత్సరాల చరిత్రలో మార్క్స్ చెప్పిన అంశాల్లో అంతర్లీనంగా, బలంగా కొనసాగిన జ్ఞానం, మానవుని సృజన శక్తికి దానికున్న ప్రభావాన్ని పూర్తిగా విస్మరించారు.
ఈ జ్ఞానం, సృజన, ఆవిష్కరణల గుణం మానవాళిలో ఏ ఒక్క వర్గానికో, సముదాయానికో సంబంధించిన అంశం కాదు. అటు బూర్జువాల్లోనూ, ఇటు శ్రామికుల్లోనూ ఈ సుగుణాలు, ఉత్ప్రేరకాలు ఉండొచ్చు.. ఉన్నాయని రుజువైంది. ఈ విశిష్టతల ఆధారంగానే సమాజాలు అభివృద్ధి వేగాన్ని పుంజుకుంటున్నాయి. దీన్ని మార్క్సిస్టులు పూర్తిగా విస్మరిస్తున్నారు.
ఆవిరి యంత్రాల అనంతరం మానవ శ్రమకు యంత్రశక్తి తోడయింది. ఆ యంత్ర శక్తి క్రమంగా పరిణామం చెందుతోంది. అంతిమంగా మానవుని శ్రమకన్నా యంత్ర శక్తి ఉత్పత్తిలో కీలకంగా మారింది.. మారుతోంది. ఆధునిక కాలంలో రోబోలు ఈ విషయాన్ని రుజవు చేస్తున్నాయి. ఉత్పత్తి రంగంలో గత సంవత్సరాల్లో వచ్చిన మార్పులు.. అవి మానవుని ఆలోచనలపై, అభిప్రాయాలపై వేసిన ప్రభావాన్ని, గతి తార్కిక సూత్రాలకు భిన్నంగా ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్న అంశాలను పట్టించుకోకుండానే రష్యా విప్లవం ఫలితాలు వర్తమానంలో వెలవెలబోతున్నాయని వగచడంలో ఏ మాత్రం అర్థం లేదు.
మానవ జీవితాన్ని టెక్నాలజీ, జ్ఞానం శాసిస్తోందని వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, నిపుణులు చెబుతున్నారు. అది వాస్తవమని సామాన్యుడి ఎరుకలోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ ఎకానమీ ఆవిర్భవించింది. మార్క్సిస్టు అభిమానులకు మాత్రం అది ఎరుకలోకి రావడం లేదు. వచ్చినా అది ఐచ్ఛికంగానే భావిస్తున్నారు తప్ప వాస్తవమని అంగీకరించడంలేదు. దాని కారణంగానే అనేక సన్నాయి నొక్కులు వినిపిస్తుంటారు. అవన్నీ అపశ్రుతిలో వినిపిస్తున్నా.. పట్టించుకున్న పాపాన పోవడంలేదు.
మానవ వౌలిక ఆకాంక్షలకు, అభిప్రాయాలకు భిన్నంగా మార్కెట్ రహిత వ్యవస్థ, సొంత ఆస్తి రద్దు, సామూహిక క్షేత్రాలు, కార్కానాలు, నియంతృత్వం.. ఈ భావనలతో, సిద్ధాంతాలతో విశేష వైవిధ్యాలు, అనేక డిఎన్‌ఎ భేదాలు, స్థాయి భేదాలతో జీవించేవారిని ఏకం చేస్తాం. ఒక తాటిమీదకి ప్రపంచాన్ని తీసుకొస్తాం. ప్రాంతీయ, భౌగోళిక, ఇంకా అనేక అవరోధాలతో బతుకీడుస్తున్నవారందరికి ఒకే సూత్రంతో బంధిస్తాం.. బాగుపరుస్తాం.. ఒకేమాదిరి శ్వాసించేలా చేస్తాం అని పిడికిలెత్తడం పూర్తిగా అమాయకత్వమే! మానవ సమాజాన్ని అర్థం చేసుకోలేనితనమే! మనిషినే అర్థం చేసుకోలేని మార్క్సిస్టు సిద్ధాంతులు, వారి శిష్యులు, ప్రశిష్యులు మొత్తం సమాజాన్ని ప్రక్షాళన చేస్తాం, తమ గురువుగారి ప్రవచనాలను వాస్తవంలోకి తెస్తాం అని అదేపనిగా కలవరించడం కొండకచో మావోయిస్టులయితే ప్రజల ఆదివాసీల ప్రాణాలను పణంగా పెట్టడం చూస్తే ఇంత గందరగోళంతో ఆలోచించే వ్యక్తుల చేతికి అధికార పగ్గాలు అందాలా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.
మనిషి అంతర్గత బలాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, యుక్తిని ఇంకా అనేక ఆవిష్కారం కాని అంశాలను విస్మరించి ఆలోచించినంత కాలం మార్క్సిజం మనుగడ సాగించడం అసాధ్యం. అలాంటి సిద్ధాంతం ఆధారంగా దండకారణ్యంలో, మధ్యభారతంలో రావణకాష్టం రాజేయడం, వేలాదిమందిని పొట్టన పెట్టుకోవడం వెర్రితనమే తప్ప మరొకటి కాదు.
ఒక తరం ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు, ఆకాంక్షలు, జీవన విధానం మరో తరానికి నచ్చడంలేదు. అంటే ఏమిటి అర్థం? ప్రతి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు సమాజంలో పెనుమార్పులు జరుగుతున్నాయి. అది ప్రకృతి నైజం. దీనికి భిన్నంగా వంద.. వంద యాభై సంవత్సరాల క్రితం భావనలకు, ఆలోచనలకు ఇప్పుడు పట్టం గడతామని ఆయుధాలతో తిరుగాడితే మానవుడి సమస్యలకు పరిష్కారం లభిస్తుందా?
ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం గత మూడు వందల ఏళ్ళలో ఎప్పుడూ జరగనంత వేగంగా ఇప్పుడు జరుగుతోంది. మానవ సమాజం నత్తలా, ఆవిరియంత్రాల కాలంనాటి మాదిరి మెల్లిగా కదలడంలేదు. వేగంగా, వేగమే మంత్రంగా చేసుకొని కదులుతోంది.
రోబోలకు పౌరసత్వం కల్పిస్తూ, రోబో పోలీసులను నియంత్రిస్తూ, కృత్రిమ మేధ మానవుని చర్యలన్నింటిలో కీలక భాగస్వామ్యం కల్పిస్తూ ఓ కొత్త ప్రపంచం ఆవిష్కారం అవుతున్న నేపథ్యంలో ఆవిరి యంత్రాల కాలం నాటి ఆర్థిక సూత్రాల విశే్లషణకు టెక్నాలజీ ఊసే లేని గతి తార్కిక అంశాల వింగడింపునకు ఎలా కరెన్సీ ఉంటుందని భావిస్తాం?
నాష్టాల్జీయాగా మార్క్సిజంపై ప్రేమ- అభిమానం, ఆరాధనావం ఉండటం వేరు, 21వ శతాబ్దంలో రోబోలు శాసిస్తున్న తరుణంలో సమాజంలో బలవంతంగా దాన్ని రుద్దాలని ఆయుధాలు పట్టడం లేదు. కాలానుగుణంగానే సమాజాలు కొనసాగుతాయి. ఇదే నిజమైన గతితర్కం. ఇప్పటికైనా మార్క్సిజం ప్రేమికులు కళ్లు తెరిచి ప్రజలను సాధికారత వైపు కదిలిస్తే వారి జన్మ ధన్యవుతుంది.

-వుప్పల నరసింహం 9985781799