సబ్ ఫీచర్

వ్యక్తిత్వమే గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి మాట్లాడే శక్తి దేవుడిచ్చిన వరమైతే ఆ మాటలే అతని వ్యక్తిత్వానికి వనె్నతెచ్చే సాధనాలు. మనిషి రెండు రకాలుగా మాట్లాడగలడు... నోటితో వాగ్రూపుంలో మాట్లాడేది వౌఖికభాష. కళ్లతో, కాళ్లతో, చేతులతో, నుదుడితో ఇలా ప్రతి అవయవంతో సంకేతరూపంగా మాట్లాడేది ‘శరీరభాష’.మాటలు శబ్దరూపంలో మనమేమిటో ఇతరులకు తెలియచేస్తే ఈ చేతలు ప్రవర్తన రూపంలో మనల్ని ఎదుటివాళ్లకు పట్టి ఇస్తాయి. ఒక చిన్న కడలిక, లిప్తకాలపు ఒక బొమముడి... ఒక ముఖం చిట్లింపు మన మనసులోని ఆలోచనలను, భావాలను అవలీలగా మనల్ని గమనిస్తున్న వాళ్లకు తెలియజేయగలదు. అందుకే నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనం నిల్చునే పద్ధతి, కూర్చునే విధానం, చేష్టలు, చూపులపట్ల చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే నలుగురి ముందు మనం చులకనైపోతాం...! మనకు మనమే మన గురించి తప్పుడు సంకేతాలను ఎదుటివాళ్లకు అందించినట్టు అవుతుంది. దాంతో మన వ్యక్తిత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతి పనికీ ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలి. ఏ సందర్భంలో ఎలా మెలగాలి... ఎలా మాట్లాడాలి అన్ని విషయం మీద ఒక ప్రవర్తనా నియమావళి అనేది ఉంటుంది. దాన్ని అనుసరించే మనం నడుచుకోవాలి. మనం వెళ్లిన స్థలం, సమయం, సందర్భం, వ్యక్తులు, మానసిక పరిస్థితి వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని వాటికి తగినట్లుగా... ఏది ఉచితమో అలా ప్రవర్తిస్తే అది మన వ్యక్తిత్వాన్ని ప్రశంసనీయం చేస్తుంది. అలా కాక అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే... విమర్శలను ఎదుర్కోవలసి రావటమే గాక మన ఉనికి మన పక్కవాళ్లకు భరించలేనిదిగా తయారవుతుంది. అందుకే ప్రతి మాటనూ ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి... ప్రతి అడుగును ఆచితూచి జాగ్రత్తగా వెయ్యాలి. మాట జారినా, అడుగు తడబడినా, తప్పినా దానివల్ల ఎన్నో అపార్థాలు, అనర్థాలు సంభవించే ఆస్కారం ఉంటుంది. మన తల్లిదండ్రుల పెంపకంవల్ల, మన గురువుల విద్యాబోధనవల్ల మనకు ఒక సంస్కారం అనేది అలవడుతుంది. దానికి మన దేశ సంస్కృతి, సంప్రదాయము, ఆచార వ్యవహారాలు చిన్నతనం నుంచే రక్తంలో జీర్ణమై వస్తూ మనకు మంచి ప్రవర్తనను అలవడేలా చేస్తాయి. ‘ఎక్కడ ఎలా ఉండా’లో ఆ జ్ఞానంతో పాటు ‘ఎక్కడ ఎలా ఉండకూడదో...’ దాన్ని కూడా మనకు అలవడేలా చేస్తుంది. పెద్దలు, అనుభవజ్ఞులు చెబితే విని నేర్చుకునేది కొంతయితే... స్వయంగా ఇతరులను చూసి నేర్చుకునేది మరికొంత ఉంటుంది. పుస్తక జ్ఞానంతో పాటు వయసుతోపాటు క్రమక్రమంగా పెరిగే లోకజ్ఞానం మనల్ని పరిపక్వతకు, పరిపూర్ణతకు ఎప్పటికప్పుడు చేరువచేస్తూ ఉంటుంది.
ఎక్కడికి వెళ్లేటప్పుడు ఎలా డ్రస్ చేసుకోవాలి... జుట్టును ఎలా ఉంచుకోవాలి... పాదరక్షలు ఎలాంటివి ధరించాలి... సందర్భోచితంగా ఎలా మాట్లాడాలి... ఎలా కూర్చోవాలి... ఎలా నిల్చోవాలి... ఎలా నడవాలి... వంటి చిన్నచిన్న విషయాలు కూడా మనపట్ల తోటివారికి ఒక అభిప్రాయం... ఇష్టం, ప్రేమ, సద్భావం లేక చిన్నచూపు, చులకనభావం వంటి వాటిలో ఏదో ఒకటి (కొన్ని) కలిగించేటంత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పెద్దవాళ్ల దగ్గరకి, మన ‘పై అధికారు’ల దగ్గరికి, ప్రముఖుల దగ్గరికి వెళ్లినప్పుడు వళ్ళు కనిపించే మోడ్రన్ డ్రస్సులు, టకటక శబ్దం చేస్తే హై హీల్స్ వేసుకోకూడదు... జుట్టు విరబోసుకోకూడదు... పొందికగా కూర్చోవాలి... పరుగెత్తుతున్నట్టు... ‘్భమి బద్దలవుతుందా’’ అన్నట్టు నడవకూడదు. వాళ్లు మనతో మాట్లాడుతున్నప్పుడు చీటికి మాటికీ రిస్ట్‌వాచీ వంక చూసుకోవడం మన అసహనాన్ని, విసుగును వ్యక్తం చేస్తుంది. మనకు వాళ్లమీద గౌరవం కానీ వాళ్ళు చెబుతున్న మాటలపట్ల శ్రద్ధగానీ లేవని వాళ్లకు వ్యతిరేక సంకేతాలను అందిస్తుంది.
అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌లోకి వెళుతున్నప్పుడు ఎంత మోడ్రన్‌గా నయినా డ్రస్సింగ్ చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు ఉంటుంది. కానీ అన్ని సందర్భాలలో కాదు.. ఆ విషయాన్ని పెద్దవాళ్ళు వాళ్లకు చెప్పాలి... నేర్పించాలి. జీవితం అన్న తర్వాత శుభాలు, అశుభాలు, ఉత్సవాలు, విషాధ ఘటనలు ఇలా చాలా ఉంటాయి. ఏ సందర్భంలో మన వస్తధ్రారణ, మన మాట తీరు, మన ప్రవర్తన ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దానే్న ‘సందర్భోచితం’ అంటారు. పెళ్లికెళుతున్నప్పుడు ఆడవాళ్లు పట్టుచీరలు కట్టుకుని వెళతారు... కానీ ఆస్పత్రిలో రోగిని పరామర్శించటానికి వెళ్లినప్పుడు సాదాసీదా చీరలో వెళతారు. మొదటిచోట ఉత్సాహం, ఉల్లాసం, సందడి ఉంటే రెండోచోట వ్యాకులత, ఆందోళన, నిశ్శబ్దం ఉంటాయి. జీవితంలో అనేక కోణాలు... ఎన్నో రంగులు.. ఎన్నో మలుపులు ఉంటాయి. అవి మనకో, మనవాళ్లకో, మన పరిచయస్తులకో సంబంధించినవి అయినప్పుడు మన ప్రవేశం, జోక్యం, అందించాల్సిన సహాయ సహకారాలు, నిర్వహించవలసిన కనీస బాధ్యతలు ఇలా చాలా ఉంటాయి. ఆయా పాత్రలను చక్కగా నిర్వహించాలంటే ముందు మనకు మంచి నడత అవసరం. మనిషి ‘ప్రవర్తన’ అనేది పైకి చూడటానికి అతని మాటలకు, శరీర భాషకు సంబంధించింది అయినట్లు అనిపించినా నిజానికి అది మనసుకు సంబంధించింది, మంచిమనసు, మానవత్వం, సేవా గుణం, సానుభూతి తత్వం, స్పందించే హృదయం ఉన్నవాళ్ల స్వభావం ‘లో’ నుంచి మనిషి ప్రవర్తనను నిర్దేశించటం, నియంత్రించటం మనకు తెలియకుండానే చేస్తూ ఉంటుంది. అందుకే మనసునెప్పుడూ స్వచ్ఛంగా ఉంచాలి.
ఆ మధ్య ప్రముఖ హిందీ నటి ప్రియాంకా చోప్రా... మన దేశ ప్రధాని నరేంద్రమోదీని కలవడానికి వెళ్లినప్పుడు అర్ధనగ్న దుస్తులను ధరించడం, ఆయన పక్కన కాలుమీద కాలేసుకుని కూర్చోవడం, జుట్టు విరబోసుకోవటం సోషల్ మీడియాలో, పేపర్లలో చాలా విమర్శలకు చోటిచ్చింది. సినిమాల్లో నటిస్తున్నప్పుడు, సినిమా ఫంక్షన్ వేదికల మీద ఎలా ఉన్నా ఆ ‘గుంపులో గోవిందా’ అన్నట్టు సరిపడుతుందేమోగానీ దేశ ప్రధాని వంటి వరిష్టుల దగ్గరికి వెళుతున్నప్పుడు వంటినిండా బట్టలేసుకుని వెళ్ళాలని... పద్ధతిగా కూర్చోవాలని, హుందాగా వ్యవహరించాలని ఆ నటికి ఎందుకు తెలియలేదో... ఎవరైనా ఎందుకు చెప్పలేదో ఆమెకే తెలియాలి.

- డా. కొఠారి వాణీచలపతిరావు, పి.హెచ్‌డి