సబ్ ఫీచర్

కలుపుగోలుతోనే ఆధిపత్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోటితో వద్దు.. చేతితో చేయి.. అనమంటారు పెద్దలు. ఎందుకంటే కఠినంగా చెప్తే నొచ్చుకుంటారు. అదే చేతల్లో పది ఇచ్చే చోట పరక ఇచ్చినా ఇదిగో ఇది ఉంది తీసుకొని సర్ధుకో అనమంటారు. అపుడు జరగబోయే పోట్లాట నవ్వులాటతో పోతుంది.
ప్రతివారికీ తాను గొప్పగా ఉండాలన్న ఆశ ఉంటుంది. తానే అందరిలోకి అధికంగా ఉండాలన్న ఆశయమూ ఉంటుంది. అయితే దీనికోసం ఒక్కొక్కరూ ఒక్కోపద్ధతిని అలవర్చుకుంటారు.
సాధారణంగా నేడు ఆడ మగ తేడాల్లేకుండా చదువుకుంటున్నారు. వారి కాళ్లమీద వాళ్లు నిలబడుతున్నారు. కాని ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు. అమ్మాయికి అంత పెద్ద చదువులెందుకులే అనుకొనేవారు. ఎంత చదివితే అంతకన్నా గొప్ప చదువులు చదివిన వారిని భర్తలుగా తీసుకొని రావాలనే దృక్పథం చాలామంది తల్లిదండ్రుల్లో ఉండేది. దీనివల్లనే ఎక్కువగా ఆడపిల్లలకు చదువులో పైకి పోకుండా చేసేవారు.
ఇపుడు ఆపరిస్థితులు లేవు. ఆడపిల్లా చదువుతోంది. మగవారితో సమానంగా పనిచేస్తోంది. ఒకవేళ తన కన్నా తక్కువ ఉద్యోగస్థాయిలో ఉన్నవారిని తన భాగస్వామి గా చేసుకోవడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. మనసు నిర్మలంగా ఉంటే చాలు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే తనకేవిధమైన ఇబ్బంది తెచ్చి పెట్టకుండా ఉంటే చాలు అనుకొనే తత్వం ఇప్పటి అమ్మాయిల్లో ఉంది.
అందుకనే తల్లిదండ్రులూ వారిని చదివించడంలో అడుగు ముందుకు వేస్తున్నారు. కాని ఇక్కడా కొడుకులకన్నా కూతుర్లే నయం అమ్మానాన్నలను చూస్తున్నారు. కొడుకులు కన్నవాళ్లను వదిలేసి వేరు కాపురానికి వెళ్తున్నారు. వృథాశ్రమాలు ఎక్కువవుతున్నాయి. ఇదంతా కేవలం కొడుకు వల్లే అంటున్నారు. ఇదీ ఆడపిల్లల చదువుప్రోత్సాహమివ్వడంలో ఒక కారణం.
ఆడపిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకొంటున్నారు. అంటే మరి మగవాళ్లు కూడా చూడాలి కదా. ఇక్కడ కొడుకులు చూడడం అంటే కోడళ్లే కదా అత్తమామలను చూసేది. మరి నేటి యువతులంతా ఒంటరి కాపురానికి ఓటు వేస్తారు. అత్తమామల పొడ అంతగా గిట్టకుండా ఉంటారు. ముందే వేరు కుంపటి మాట్లాడేసుకుంటున్నారు. ఇంకొంతమంది కొన్నాళ్లు కలసి ఉండి ఏవో పొరపొచ్చాలు అంటూ విడిపోతున్నారు.
దీనికి కారణం ఏమిటి? ఇరవైయ్యేళ్ల పైన తల్లి గారింట పెరిగి మెట్టినింటికి వచ్చే కోడళ్లను అత్తగారు ఇంతకుముందులాగా ఆరళ్లు పెట్టేట్టు చూడడం లేదు. వీరు ఉద్యోగినులే కనుక వీరిని ఒక స్నేహభావంతోనే చూస్తున్నారు. కాని అత్త అంటే కోడలికి కోడలంటే అత్తకు అభిప్రాయ భేదాలే.
ఎక్కడో ఒక చోట మా అత్తమ్మ మంచిదనే కోడలు, మా కోడలు బంగారం అనే అత్త ఉంటారు. లేరని కాదు.కాని చాలామందిలో మాత్రం పొగలు సెగలే వేరు కాపురానికి బీజాలు వేస్తున్నారు. ఇంతకుముందు అయితే అభద్రతా భావంతో అత్త ఆరళ్లు పెట్టేది అనుకునేవారు. మరి ఇప్పుడు అత్తలూ ఉద్యోగాలు చేసేవారే. కాకపోయినా అంతకుముందు తానే గృహణిగానో, కోడలిగానో ఉన్న స్థానంలో ఉన్నవారే కదా. కాని కోడలు పోస్టు నుంచి అత్త పోస్టులోకి రాగానే ఆధిపత్యధోరణి, అభిజాత్యమూ వస్తున్నాయి. దాంతో షరామామూలే. ఇక్కడ కేవలం అత్తకోడళ్లే కాదు అమ్మకూతుళ్లు కూడా ఒక వయస్సు వచ్చిన తరువాత పోట్లాడుకునేవారు ఉంటున్నారు. నీకేమీ తెలియదు అనే కూతురు, నీకే నేను చెప్పేది అర్థం కావడం లేదు అనే అమ్మ ఉంటునే ఉన్నారు.
అభద్రతా భావం దూరమైనా ఆధికత్యభావం దగ్గరైనందువల్లే నిన్నటిదాకా అమ్మగారింట్లో పెత్తనం చెలాయించిన అమ్మాయి మెట్టినింటా తనదే ఆధిపత్యం ఉండాలనుకోవడం ఏం సబబు అని ఆలోచించాలి కదా. పైగా తన సత్తా ఏమిటో వారికి చూపిస్తే అంటే కొట్లాటలకు కాదు సుమా. తన తెలివితేటలతో కుటుంబబాధ్యతలను నెరవేర్చడమో లేక ఆర్థిక వ్యవహారాల్లోనో ఎందులోనైనా తాను అధికురాలు అని ఇతరులు అనుకొనేట్లు చేస్తే వెంటనే తనకే తాళాల గుత్తి అందుతుంది కదా. అవేమీ చేయకుండా తాను మాత్రం సుఖపడాలి. తన భర్త తెచ్చిన సొమ్ముంతా తనొక్తరిదే . దాన్ని నేను ఏమన్నా చేసుకోవచ్చు. కుటుంబంలోని ఇతరులకు దానిపై హక్కు ల్లేవు. భర్త అనేవాడికి భార్య తప్ప అమ్మనాన్న చెల్లి తమ్ముడు అనే బంధాలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా వారి కోసం తన సంపాదనను ఖర్చుచేయకూడదు అనే భావం వ్యక్తపరిస్తే ఆ కోడలి స్థానంలోని అమ్మాయికి ఆధిపత్యం ఇస్తారా చెప్పండి.
కుటుంబం అంటే అందరూ కలసి ఉండేది కాని తానొక్తరిదీ కాదు కదా. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా కలసి మెలసి ఉంటే ఆధిపత్యం మెల్లమెల్లగా తనంతట తానే వస్తుంది. నేత అనేవాడు అందరినీ కలుపుకుపోవాలి. కాని ఒంటి కొమ్ము సొంటిరాయిలా ఉంటానంటే నేత ఎలా అవుతారు. అందుకే నేటి యువతులంతా కుటుంబంలోని అందరినీ కలుపుకుని పోయేలా వ్యవహరిస్తే చాలు అన్నీ హక్కులు, బాధ్యతలూ బరువులూ మీ హస్తగతం అవుతాయి. దీనికి మొట్టమొదట ఉండాల్సింది కలుపుగోలు తనం. ఆ తరువాత తనవారే నన్న భావం ఉంటే చాలట అని కుటుంబ హింసలు తగ్గించడమెలా అనే చేస్తున్న సర్వేలు ఈ సూచనలు చేస్తున్నాయి. కనుక మీరు ఒక్కసారి దీనిపై దృష్టి పెట్టి చూడండి. ఒకరికి సాధ్యమైతే అందరూ అదే బాట పట్టచ్చు.
*

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-శైనీ