సబ్ ఫీచర్

ప్రోత్సహిస్తే మార్పు తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట స్కూల్లో తరగతి అయిపోయాక నారాయణ అనే విద్యార్థిని పిలిచాను. తరగతిలోని పిల్లలంతా విద్యార్థి నారాయణ, నా ముఖం చూశారు. నారాయణ అంటే స్కూలంతా హడల్. ఎవరైనా అతనిని ఎదిరిస్తే తెల్లారేవరకు వాళ్ల చెంపలు లావు అవుతాయి, లేకుంటే కాలో, చెయ్యో ఇరుగుతది. అందుకే నారాయణ అంటే పిల్లలకు, పంతుళ్లకు కూడా హడల్! అతను వస్తుంటే పక్కకుపోతారు. ఇంతకు నారాయణ చదివేది 9 తరగతి.
నారాయణా! నువ్వు లెక్క చాలా బాగాచేశావు. హోంవర్క్ బాగా చేశావు. చదువుకోవాలని నిర్ణయం తీసుకున్నావు? అని అడిగాను. నారాయణ మాట్లాడలేదు. తల వొంచుకున్నాడు.
సాయంత్రం మా ఇంటికొచ్చాడు. బాగా ఏడ్చాడు. ఇప్పటివరకు నన్ను ఎవరు కూడా ఒక లెక్క బాగాచేశావని, బాగా చదివానని ఎవరూ అనలేదని, తన ఇంటి గాథను చెప్పబట్టాడు.
అయితే నువ్వు మా ఇంటిలోనే ఉండమని నారాయణకు చెప్పాను.
నేను నారాయణపేటలో వున్న రెండు సంవత్సరాలు ఆ విద్యార్థి మా ఇంట్లోనే ఉన్నాడు. నేను హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయిన తరువాత నాతోటే వచ్చాడు. తర్వాత ఎస్‌ఎస్‌సి పాసై, టీచర్ ట్రైనింగ్ చదివి టీచర్ అయ్యాడు. అదే నారాయణపేటలో గొప్ప టీచర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఒక వాక్యం ఒక మనిషి జీవితానే్న మార్చివేసింది. నేను ఎప్పుడు తరగతి గదికి వెళుతున్నా మా నారాయణను జ్ఞప్తిచేసుకుంటూ పోతాను. ఈ ఉపాధ్యాయ వృత్తి ఎంత బాధ్యతగల పనో స్మరించుకుంటాను. నేను స్వతహాగా చురుకైన వాణ్ణేంకాదు. టీచర్ కావటంవల్ల నా మాటకున్న విలువను నారాయణ ప్రవర్తనలో వచ్చిన మార్పువల్ల తెలిసింది.
విద్యార్థుల యొక్క భవిష్యత్తు రూపురేఖలను ఉపాధ్యాయుడు తీర్చిదిద్దుతాడు. తల్లిదండ్రులను నిర్ణయించటం అన్నది భగవదేచ్ఛ. కానీ ఉపాధ్యాయుణ్ణి నియమించటం చాలా కీలకమైంది. కొన్ని జీవితాలను నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉండటం అన్నది కొన్ని తరాల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ప్రధాన పాత్ర వహించే భాగ్యం ఉపాధ్యాయులకే లభించటం ఎంత అదృష్టం. నా వృత్తిపట్ల నాకు గర్వమున్నమాట వాస్తవమే. ఆ వృత్తిని నిర్ణయించేటప్పుడు నాకెందుకో ఆత్మవిశ్వాసం వస్తుంది. తరగతి గదినుంచి బైటకు వస్తే ఎంత బలహీనున్నో అర్థమవుతుంది. ఇంత గొప్పశక్తిని నాకు ఎవరిచ్చారు. నారాయణ లాంటి విద్యార్థి విజయం, ఆ విద్యార్థి చూపించిన నమ్మకమే ఉపాధ్యాయునిగా నాకు బలం.
ఉపాధ్యాయులను నియమించటం ఒక ఉత్కృష్టమైన పని. తల్లిదండ్రులకు సమానంగా హోదా ఇచ్చి రాబోయే 30 సంవత్సరాలలో పటిష్టమైన జాతిని నిర్మించే పనిని, సమాజాన్ని తీర్చిదిద్దమని ఉపాధ్యాయ వర్గానికివ్వబడింది. ఉపాధ్యాయ నియామకం ఎంతో పకడ్బందీగా జరగాలి. ఉపాధ్యాయ నియామకం అంటే భర్తీచేయటం (రిక్రూట్‌మెంట్) కాదు. అందుకు సమర్థులను ఎంపికచేయటం చాలా దూరదృష్టితో జరగాలి. దూరదృష్టితో సమర్ధులైనవారిని నియమించకపోతేదేశానికే అన్యాయం చేసిన వాళ్లమ వుతాం. ఒక్కొక్క ఉపాధ్యాయుడి చేతిలో ఎందరో విద్యార్థులు మెరికల్లాగా తయారు కావాలి. అందుకు విషయపరిజ్ఞానం, జిజ్ఞాస, ఆసక్తి, పాఠ్యాం శాన్ని విడమరచి అర్థమయ్యేలా చెప్పగల సామర్ధ్యం తప్పనిసరిగా ఉండాలి. విషయపరిజ్ఞానం కలిగి వివరించలేకపోయనా, వివరించగలిగి ఉండి విషయ పరిజ్ఞానం లేకపోయనా ఫలితముండదు. ఉపాధ్యాయ శిక్షణ తప్పనిసరే. కానీ ఇదే సమయంలో బోధనా సామర్ధ్యం లేకపోతే వృధా. అందువల్ల ఉపాధ్యాయుల ఎంపికలోనే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

- చుక్కా రామయ్య