సబ్ ఫీచర్

విస్తరిస్తున్న సైబర్ వికృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ.. ఇది లేని మానవ జీవితం ఊహించలేం మనం. ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తరువాత మనిషి ప్రతి కదలికనూ టెక్నాలజీయే శాసిస్తోందంటే అతిశయోక్తికాదు. ఈ కొత్త మిలీనియం తరానికి చెందిన వారికైతే (వీరినే జనరేషన్ జడ్ అంటున్నారు) టెక్నాలజీయే సర్వస్వం అయిపోయింది. ఈ కొత్త తరానికి చెందిన ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో తమ ఉనికిని చాటుకోడానికి తహతహ లాడుతున్నారు. సోషల్ నెట్‌వర్క్, ఆన్‌లైన్ గేమింగ్ వీరి జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరి కేరాఫ్ అడ్రస్ ఇంటర్నెట్ అయిపోయింది.
‘‘పేరెంట్ సర్కిల్’’ పత్రిక, ఇంటర్నేషనల్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (ఐఎంబిఆర్) దేశవ్యాప్తంగా 2015లో జరిపిన సర్వేలో తేలిందేమిటంటే 10-18 సంవత్సరాల మధ్య వయస్సుగల యువతీ యువకులలో 60 శాతం మంది ఆన్‌లైన్‌లో కాలం గడుపుతున్నారు. వీరంతా రోజుకి కనీసం ఒక గంటసేపు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన ఏమిటంటే 45 శాతం మంది తల్లిదండ్రులకు తమ పిల్లలకి ఆన్‌లైన్ అకౌంట్లు ఉన్న విషయమే తెలియదు.
నేటి యువతీ యువకులలో ఆన్‌లైన్ కాలక్షేపం ఎంతగా పెరిగిపోయిందంటే ఒక ఆటగా వారు సైబర్ నేరాలకి పాల్పడుతున్నారు.. తెలిసో తెలియకో.
ఒక సంఘటన చూద్దాం. ఇందులో పేర్లు మార్చబడ్డాయి. ప్రతిమ తొమ్మిదవ తరగతి చదువుతోంది. చాలామంది టీనేజర్స్ లాగే ఈ అమ్మాయికి కూడా ఫేస్‌బుక్‌లో స్నేహితులు ఎక్కువే. అయితే ప్రతిమ తన సాధారణ అకౌంట్‌తోపాటు, ఫేస్‌బుక్‌లో తన సహాధ్యాయిని వినీల పేరుతో మరో అకౌంట్ తెరిచింది. ఆ అకౌంటుతో రకరకాల మగాళ్ళతో స్నేహాలు చేస్తూ, అడ్డమైన సంభాషణలూ చేయడం, వినీల ఫొటోలు పెట్టడం ప్రతిమ చేసే పని. ఇదంతా ఆమె సరదాకోసం చేస్తున్నదే తప్ప, వినీలని ఇబ్బంది పెట్టాలని కాదు. ప్రతిమ నడుపుతున్న ఈ వ్యవహారం గురించి వినీలకి తెలియనే తెలీదు. అసలామెకు ఆన్‌లైన్ ప్రపంచంతో పరిచయమే లేదు. మరోపక్క వినీల పేరుతో ప్రతిమ ఫేస్‌బుక్‌లో చేసే సంభాషణల్లో అసభ్యత పెరిగిపోతోంది. ఇదేమే తెలీని వినీల ఇంటినుంచి బయటికి వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల కుర్రాళ్ళు ఆమెవైపు అదోలా చూడడం, వెకిలిగా నవ్వడం చేస్తున్నారు. అసలు విషయం తెలియని వినీలకి మొదట్లో ఇదంతా అయోమయంగానే అనిపించింది. వ్యవహారం ముదురుతూండడంతో వినీల ఆరాతీయగా ఇదంతా ప్రతిమ నడుపుతున్న కథేనని తెలుసుకుంది. తనకి ప్రతిమ చేసిన మోసాన్ని క్లాసులో అందరిముందూ ఉంచింది వినీల. అందరూ నిలదీసేసరికి నిజం ఒప్పుకోక తప్పలేదు ప్రతిమకి. సిగ్గుతో నలుగురి ముం దూ తలెత్తుకోలేని స్థితిలో అర్ధాంతరంగా స్కూలు మానేసింది ప్రతిమ. అప్పటిదాకా జరుగుతున్న వ్యవహారం గురించి తెలియని ప్రతిమ తల్లిదండ్రులకి ఇదొక కోలుకోలేని పెద్ద దెబ్బ.
యువతీ యువకులనుంచి ఇప్పుడు సైబర్ వికృతి పిల్లలకు కూడా విస్తరిస్తోంది. తెలిసీ తెలియని వయసులో పిల్లలు సైబర్ నేరాలలో భాగస్వామ్యులవుతున్నారు.
ఒక్క ప్రతిమ ఘటనే కాదు. ‘స్మార్ట్’వలలో చిక్కుకున్న యువతీ యువకుల గురించిన ఎన్నో వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు తెలియకుండానే సైబర్ క్రైమ్‌లకు పాల్పడుతున్న పిల్లల గురించి తెలియని తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. మరికొందరు తమ పిల్లల పట్ల ఉదాసీనంగా ఉంటున్నారు. కారణం సైబర్ క్రైమ్‌ల పర్యవసానాల గురించి చాలామంది తల్లిదండ్రులకు ఊహామాత్రంగానైనా తెలియదు కాబట్టి, కానీ తల్లిదండ్రుల అవగాహనా రాహిత్యమే పరిస్థితులు చెయ్యి దాటిపోయేలా చేస్తోంది. ఒకవేళ తల్లిదండ్రులకు అవగాహన ఉన్నట్టయితే సైబర్‌క్రైమ్ గురించి తెలియజెప్పి జాగ్రత్తలు తీసుకునేవారుగా. టాపులు జరగకుండా పిల్లలని కట్టడిచేసే అవకాశం ఉందిగా.
పేరెంట్ సర్కిల్ పత్రిక, ఐఎంబిఆర్ సంయుక్తంగా 2015లో జరిపిన సర్వేలో మూడింట ఒక వంతు తల్లిదండ్రులు పిల్లలు ఆన్‌లైన్‌లో కాలం గడిపితే పెద్దగా భయపడాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు ధీమగానే ఉండొచ్చు. కానీ జరగవలసిన నష్టం జరిగిపోతూనే ఉంటుంది. ఒక్క 2015లోనే సైబర్ నేరాలకు పాల్పడినవారి సంఖ్య మూడు లక్షలు దాటింది. ఇప్పుడా సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇది మనకెవరికీ ఆందోళన కలిగించే విషయం కాదా?
నేడు ఆన్‌లైన్ ప్రపంచంలో పొంచి ఉన్న ఆకర్షణీయమైన ప్రమాదాల పట్ల తల్లిదండ్రులు చాలా జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో పొందుపరచబడే తమ పిల్లల వ్యక్తిగత సమాచారం విషయంలో భద్రతా చర్యలు తీసుకోవాలని 63 శాతం మంది తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆన్‌లైన్ స్నేహితులతో పిల్లలు తమ వ్యక్తిగత సమాచారం పంచుకునే విషయంలో పిల్లల సోషల్ కార్యకలాపాలలో తల్లిదండ్రులు కఠినంగానే వ్యవహరించాలని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 81 శాతం మంది తల్లిదండ్రులు సోషల్ మీడియాలో తమ పిల్లలు వాడే భాష అసభ్యకరంగా ఉంటోందని వాపోతున్నారు. తమ పిల్లల్లో సైబర్ బెదిరింపులు కూడా ఎక్కువౌతున్నాయని 78 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ బెదిరింపుల కారణంగా 8-17 సంవత్సరాల పిల్లల భద్రతకు ప్రమాదం వాటల్లుతున్న దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు.
మనం చేయవలసింది ఏమిటి?
ఇంటాబయటా కూడా తమ పిల్లల భద్రతకోసం తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. కానీ నేటి తరం పిల్లలు, యువతీ యువకులు కనిపించని సైబర్ ప్రమాదాల పడగ నీడన కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి ఏదన్నా జరిగినప్పుడు చూసుకుందాంలే అన్న ధోరణితో కాకుండా తమ పిల్లల సైబర్ భద్రత విషయంలో తల్లిదండ్రులు క్రియాశీలక దృష్టిపెట్టవలసిన అవసరం ఎంతో ఉంది. దీనివల్ల సైబర్ నేరాల వల్ల పిల్లలకి కలిగే నష్టాలను 50శాతం వరకు అరికట్టవచ్చు.
కిరుబా శంకర్ బ్లాగ్ రచయిత, డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూయర్. ‘‘పిల్లల ఇంటర్నెట్ వాడకంపై తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ ఉండాలి. మొదట్లో పిల్లలు ఉపయోగించే డెస్క్‌టాప్ లేదా లాప్‌టాప్‌లను నలుగురూ ఎక్కువగా సంచరించే గదిలోనే ఉంచాలి. మొబైల్ ఫోన్లద్వారా ఇంటర్నెట్ వాడకుండా పిల్లలపై పూర్తిగా ఆంక్షలు విధించాలి. అయితే కొన్నిసార్లు పిల్లలు ప్రైవసీని కూడా కోరుకుంటారు. అందువల్ల తాము ఎందుకు పర్యవేక్షిస్తున్నామో పిల్లలకు అవగాహన కలిగేలా తల్లిదండ్రులు వివరించాలి. అలాచేయకపోతే పిల్లలు ఎదురుతిరగడం మొదలుపెడతారు’’ అని ఆయన సూచిస్తున్నారు. అంతేకాదు, పిల్లలు తమ పూర్తిపేరు, ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్, పాస్‌వర్డ్, తమ రోజువారీ కార్యకలాపాల వివరాలను ఇంటర్నెట్‌లో ఇంకొకరితో షేర్‌చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
ఏదిఏమైనా పిల్లల సంరక్షణ, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత. కాబట్టి మొదట తల్లిదండ్రులకి సైబర్ ప్రపంచంపట్ల మంచి అవగాహన ఉండాలి. అప్పుడే వాళ్ళు దానికి సంబంధించిన మంచిచెడులను పిల్లలకి వివరించి చెప్పగలరు. పిల్లలని అన్నివేళలా పర్యవేక్షిస్తూండడం, కాపాడుకుంటూండడం క ష్టమే. కాని తగినంత పర్యవేక్షణ, జాగ్రత్తలు తీసుకుంటే ‘‘వెబ్ విష వలయం’’లో చిక్కుకోకుండా పిల్లలని కాపాడుకోవచ్చు.

-డాక్టర్ దుగ్గిరాల రాజకిషోర్ సెల్: 80082 64690