సబ్ ఫీచర్

శివభక్తురాలు అక్క మహాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిశక్తిస్వరూపిణి. స్ర్తి సృష్టిస్థితి లయకారిణి. తన కనుసన్నులలో ప్రకృతి నంతా పచ్చదనంతో అలరారేట్లుచేస్తుంది. ఆమె రుద్రరూపిణిగా మారితే ప్రళయం ఎదుర్కోవలసి వస్తుంది. ఎంత సున్నిత మనస్కురాలో కాఠిన్యం వహిస్తే అంత వజ్రసదృశరూపిణిగా కూడా కనబడుతుంది.
కర్ణాటక లోని శివమొగ్గజిల్లాలోని ఉదోతతి గ్రామంలో సుమతీ, నిర్మలశెట్టి దంపతులకు అక్కమహాదేవి జన్మించింది. ఆమెకు ముందు మహాదేవి అని నామకరణం చేసి ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వారి దైవమైన శివయ్యకథలను చిన్ననాడు వారి తల్లి ఆమెకు చెప్పేది. చిన్న వయస్సులోనే శివకథలను ఆసక్తి వింటూ పెరిగిన మహాదేవి పరమేశ్వరునిపై అనురాగాన్ని పెంచుకుంది.
యుక్తవయస్కురాలైంది. శివునిపై ప్రేమానురాగాలను దినదినాభివృద్ధి చేసుకొంటూ శివపూజలో లీనమయ్యేది మహాదేవి. ఆమెను చూసి తల్లిదండ్రులు ఒక్క ప్రక్కసంతోషాన్ని మరో ప్రక్క ఆందోళన పడేవారు.
ఈ సృష్టిలో పరమేశ్వరుడొక్కడే పురుషుడని తాను అతడిని మాత్రమే పెళ్లి చేసుకొంటానని అనేది ఆమాటలకు వారు ‘‘అమ్మా! మనం మానవ మాత్రులం. ఆ పరమేశ్వరుడే సృష్టిస్థితి లయకారుడు. అతనిని నిత్యం ఆరాధించు. కాని పెళ్లి మాత్రం మేము చెప్పినట్టు చేసుకో తల్లీ అని వారు చెప్పేవారు. మహాదేవి మహా సౌందర్యవతి. చారడేసి కనులతో కోటేరు వంటి ముక్కుతో దొండపండువంటి అధరాలతో చూడగానే ఎవరినైనా ఆకర్షించేది. ఆ తల్లి సౌందర్యాన్ని చూసి ఆనందించని వారు ఉండేవారు కారు.
ఆమె కోరిక విన్నవాళ్లు సాక్షాత్తు పార్వతీదేవి వలె ఉన్నది. శివుడే తగిన భర్త అని కూడా అనేవారు. అట్లాంటిసమయంలో కర్ణాటక పాలించే రాజు కేశికుడను రాజు చూశాడు. చూసీ చూడగానే ఆమెపై మోహాన్ని పెంచుకున్నాడు. ఎలాగైనా ఆ సౌందర్యమూర్తినే పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు. వెంటనే తన మంత్రులను పంపించి ఆ సుకుమారి వివరాలు తెలుసుకొని తన కోరిక వారితో చెప్పి వారిని వెంటనే పెండ్లికి ఏర్పాటు చేయమని పురమాయించాడు.
ఆ మంత్రివర్యులు ఆ పున్నమిచందమామ వంటి వనిత వివరాలు కనుగొన్నారు. ఆ మహాదేవి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి రాజుగారి కోరికను తెలిపారు. వారు హతాశులయ్యారు.‘అయ్యా! మా అమ్మాయి అసలు నరులెవరినీ పెళ్లిచేసుకోనని మంకు పట్టుపట్టి ఉంది. పరమేశ్వరుడే తన పతిదేవుడు అని నిశ్చయించుకుని ఉంది’అని చెప్పారు.
ఆ విషయం రాజుకు మంత్రులు చేరవేశారు. ఈ సంఘటనను జీర్ణిచుకోలేని రాజు మండిపడ్డాడు. తాను ఎలాగైనా ఆమెను పరిణయం ఆడాలని లేకపోతే వారిని నానాహింసల పాలుచేయమని వారిని ఎక్కదోసాడు.
తల్లిదండ్రులు రాజుగారి కఠిన నియమానికి భయపడి విషయాన్ని మహాదేవితో చెప్పారు. మూర్ఖుని మనసు మార్చడం ఆ దేవదేవునికూడా సాధ్యం కాదుకదా. తన వల్ల తన తల్లిదండ్రులు బాధపడకూడదనుకొంది ఆ తల్లి. రాజుతో నేనే స్వయంగా మాట్లాడుతాను రమ్మని చెప్పింది.
రాజుకు మహాదేవి తన నియమాన్ని చెప్పింది. మూర్ఖశిఖామణి అయిన రాజు తన పంతాన్ని వదలలేదు. ఒక్క షరత్తు అంగీకరిస్తే నేను నిన్నువివాహమాడుతాను అంది మహాదేవి. ఆ షరత్తు ఏంటంటే తన అంగీకారం లేకుండా ఒక్కనాడైనా తన శరీరాన్ని తాకకూడదు. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా నియమాన్ని షరత్తు అతిక్రమిస్తే ఆనాడు తాను పరమేశ్వరుని చెంతకు వెళ్తానని చెప్పింది.
తన వైభోగం చూసిన తరువాత మహాదేవే మనసు మార్చుకుంటుందనుకొన్న రాజు షరత్తుకు తలవంచాడు. మహాదేవి కేశికుని ఇల్లాలైంది. నిత్యం మహాదేవుని పూజలో మహాదేవి నిమగ్నమై ఉండేది. రోజులు గడిచే కొలదీ మహాదేవి సంపూర్ణంగా శివధ్యానంలో మునిగిపోయి ఉండేది.
ఇది తట్టుకోలేని రాజు ఒకరోజు బలవంతంగా మహాదేవిని తనకౌగిట బంధించాలనుకొన్నాడు. తనను ముట్టుకొన్న రాజును ఒక పురుగులాగా చూసి ఇక ఈ శరీరం మలిన భూయిష్టమైంది అను అక్కడే వస్త్రాలు వదిలేసి దిగంబరిగా మారి శివశరణులుండే కూడలి సంగమమైన కళ్యాణ పట్టణానికి చేరింది. ఆ శివునిలోనే మహాదేవి లీనమైంది. ఆనాటి నుంచి మహాదేవిని అక్క మహాదేవి అని సంబోధించి శివభక్తురాలుగా ఆమెను జనులంతా కీర్తిస్తారు.
శ్రీశైలానికి సమీపంలో ఉన్న కదళీవనంలో అక్క మహాదేవి కఠోరమైన తపస్సు ఆచరించి మల్లికార్జునిలోలీనమైన శివభక్తురాలిగా స్మరిస్తూ ఆమె జయంతిని మార్చి31న వేడుకగా శివభక్తులు జరుపుతారు.

- తెలుగు ఈరన్న