సబ్ ఫీచర్

‘ఆంధ్రా గాంధీ’ వావిలాల గోపాలకృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీతి, నిజాయతీలకు మారుపేరు ఆయన. తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన మహానుభావుడు. రాజకీయాల విలువలకు పెద్దపీట వేసి, ప్రజాపోరాటాల్లో పాల్గొన్న చైతన్యశాలిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ఉత్తమ శాసనసభ్యునిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, రాష్ట్ర తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఎనలేని కీర్తిని పొందిన వావిలాల గోపాల కృష్ణయ్య ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. స్ఫూర్తి ప్రదాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన జీవితమే ఓ సందేశం.
1906 సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో గోపాకృష్ణయ్య జన్మించారు. సహాయ నిరాకరణోద్యమ సమయానికి ఆయన బాలుడే. ఆ ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. జైలుశిక్ష విధించారు. బాలుడు కావడంతో శిక్ష అమలు కాలేదు. 1929లో కొంతకాలం, 1932లోకొంతకాలం ఆంధ్రపత్రికలో ఉపసంపాదకునిగా పనిచేశారు. అంతకు ముందు 1925లో కొందరు మిత్రులను కలసి సత్తెనపల్లిలో శారదా గ్రంథాలయాన్ని స్థాపించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 9 నెలల పాటు కారాగార శిక్ష అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. 1946-47 మధ్య అజ్ఞాతవాసం గడిపారు.
స్వాతంత్య్ర సమరం ముగిసిన తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి 1952-72 మధ్య నాలుగు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు పార్టీ ఆయనకు అండగా ఉండేది. శాసనసభకు ఆయన ఇండిపెండెంటుగా నిలిచి గెలవడం గొప్ప విశేషం. శాసనసభలో ఆయన ప్రజా సమస్యలను లేవనెత్తి, ఆ సమస్యలు నెరవేరే వరకు విశ్రమించేవారు కాదు. నిత్య చైతన్యశీలిగా క్రియాశీలక పాత్రను పోషించారు. సహకార, గ్రంథాలయ ఉద్యమాల్లో కీలక భూమికను పోషించారు. గుంటూరు జిల్లాలో నందిగొండ ప్రాజెక్టు ఉద్యమంతో పాటు రైతు ఉద్యమాల్లో నాయకత్వ బాధ్యతను స్వీకరించి ప్రజల పక్షాన నిలిచారు. 1968లో ప్రపంచ శాంతి సదస్సులో భాగంగా భారత దేశ ప్రతినిధిగా రష్యాలో పర్యటించారు. 1985లో చైనాలో పర్యటించారు.
ప్రైవేటు గ్రంథాలయాల అభివృద్ధికి గాను తగిన సూచనలను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గోపాల కృష్ణయ్య అధ్యక్షతన ఓ సంఘాన్ని నియమించింది. ఈ సంఘం చేసిన సూచనలను ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ అమలుకు నోచలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణను (1953), ఆంధ్రప్రదేశ్ (1956) ఏర్పాటులో తనవంతు పాత్రను చిత్తశుద్ధితో నిర్వహించారు. మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. 1990లో సంపూర్ణ మద్య నిషేధ రాష్ట్ర స్థాయి కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు.
తెలుగును అధికార భాషగా అమలు చేసేందుకు వావిలాల జరిపిన కృషి అంతా ఇంతా కాదు. పురిపండ అప్పలస్వామి వంటి పెద్దల సహకారాన్ని తీసుకొని ఓ ఉద్యమం నిర్వహించారు. 1976-78 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార భాషా సంఘం అధ్యక్షునిగా వ్యవహరించి విశిష్ట సేవలందించారు. విద్యకు మాతృభాష, పాలనకు ప్రజల భాష, శిశువుకు తల్లిపాల వంటిదని ఆయన పేర్కొనేవారు. ఆయన హయాంలో తెలుగుభాష అమలు ప్రగతి, పురోగతి సాధించింది. బహు గ్రంథకర్తగా, తెలుగు భాషకు సేవలందించారు. ‘ఆంధ్ర రాష్ట్రం’, ‘సంస్థానాలు’ ‘తుంగభద్ర ప్రాజెక్టు’, ‘మద్రాసు మంత్రులు’, ‘మన్యం’, ‘గ్రంథాలయ బిల్లు’ తదితర అంశాలపై అమూల్యమైన రచనలు చేశారు.
ఆయన శాసనసభకు పోటీ చేసినప్పుడు ఓటర్లకు డబ్బును, తాయిలాలు పంచడం వంటి వాటికి దూరంగా ఉండేవారు. ఓడిపోవడానికి సైతం సిద్ధమే కాని, ఎన్నికలను న్యాయంగా ఎదుర్కొనడమే తన అభిమతమని పేర్కొనేవారు. ఆయా సభలకు ఆహ్వానించే నిర్వాహకులు రైలులో ఫస్టుక్లాసు టిక్కెట్టు కొనబోయినా, సున్నితంగా తిరస్కరించేవారు. సెకండ్ క్లాసులోనే ప్రయాణించేవారు. నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆయన జీవితాంతం ఖాదీ వస్త్రాలనే ధరించారు.
గాంధేయవాదం ఆయన జీవనవేదం. అంచేతననే ఆయనను ‘ఆంధ్రా గాంధీ’గా పిలుస్తారు. 1979లో వావిలాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’తో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం 1992లో ‘పద్మ భూషణ్’ పురస్కారాన్ని అందజేసింది. వందలాది సన్మానాలను అందుకున్నారు. 2003, ఏప్రిల్ 29న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంతిమశ్వాస విడిచారు. ఆయన ఆశయ సాధనకు గుంటూరులో వావిలాల సంస్థ ఏర్పాటైంది. నేటి శాసనసభ్యులు వావిలాల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని వ్యవహరిస్తే అంతా సంతోషిస్తారు. ఆయనకు అదే సరైన నివాళి.

-వాండ్రంగి కొండలరావు సెల్: 9490528730