సబ్ ఫీచర్

‘ఆయుధ భాష’లో విషాద గీతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో భ్రామాగఢ్ వద్ద ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు మరణించారు. వీరంతా అహెరి, పెరిమిలి, సిరొంచ గెరిల్లా దళాలకు చెందిన వారట. మృతుల్లో దళ కమాండర్లూ ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందిన విజేందర్ ఒకరు. మావోలు గుమికూడిన సమాచారాన్ని పోలీసులు తెలుసుకుని అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్లను ప్రయోగించడంతో మావోయిస్టుల వైపు ప్రాణనష్టం అధికంగా జరిగిందని భావిస్తున్నారు. 24 గంటల్లో అక్కడికి సమీపంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు కన్నుమూశారు. దీంతో గడ్చిరోలి జిల్లాలో మరణించిన మావోల సంఖ్య 42కు చేరింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది మరణించగా, మృతుల సంఖ్య 52కి చేరింది. ఇది కలవరపరిచే అంశం. ఇంద్రావతి నదిలో మావోయిస్టుల శవాలు లభ్యం కావడంతో ‘దృశ్యం’ గంభీరంగా మారింది.
ఇటీవల కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాట్నాలో మాట్లాడుతూ- నక్సల్స్‌ను తరిమికొడతామని, వారి కార్యక్రమాలు తగ్గాయని గణాంకాలను వివరించారు. దాదాపు ఇదే సమయంలో గడ్చిరోలి జిల్లాలో రెండు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఒకసారి, ఎనిమిదిమంది మావోయిస్టులు మరో ఘటనలో మరణిచారు. సుకుమా, నారాయణపూర్ జిల్లాల్లో 15 మంది మావోలను, వారి అనుబంధ సంఘాల వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్లకు పడగలెత్తిన కొంతమంది మావోయిస్టు నాయకుల ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) నిఘా పెట్టింది. వారు కొన్ని ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే! కొందరు మావోయిస్టు నాయకుల పిల్లలు ప్రముఖ విశ్వద్యాలయాల్లో, విదేశాల్లో చదువుతున్నారని, ఆ నేతలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారని విచారణలో వెల్లడైనట్టు అధికారులు ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం వయసు మళ్లిన సిఆర్‌పిఎఫ్ జవాన్లను ఛత్తీస్‌గఢ్ నుంచి తప్పించి కొత్తగా రిక్రూట్ చేసుకున్న 18-21 ఏళ్ళ వయసుగల 12 వేలమందిని రంగంలోకి దింపేందుకు సిఆర్‌పిఎఫ్ ఉన్నతాధికారులు నిర్ణయించారట! దండకారణ్యంలో మావోలను ఎదుర్కొనేందుకు ఆయుధ సంపదతోపాటు మానవ వనరులను పెంచుతున్నారు. మహారాష్టక్రు చెందిన నక్సల్స్ వ్యతిరేక ‘సి-60 కమాండో దళాల’ను సైతం పెద్ద ఎత్తున ఆధునీకరించినట్టు సమాచారం.
మహరాష్టల్రోని గడ్చిరోలి జిల్లా తెలంగాణ సరిహద్దులో ఉన్నందున- మావోయిస్టుల పూర్వ నామమైన పీపుల్స్ వార్ తొలి రోజుల్లో అక్కడ దృష్టిని కేంద్రీకరించింది. ఆదివాసీ ప్రాంతం కావడం, పేదరికం అధికంగా ఉండటం, ఫారెస్ట్ కాంట్రాక్టర్ల ఆర్థిక దోపిడీ ఎక్కువగా కనిపించడంతో అప్పటి పీపుల్స్‌వార్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పెద్ది శంకర్ అనే రాడికల్ విద్యార్థిని రంగంలోకి దింపింది. అతను దూకుడుగా వ్యవహరించి పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఆ ఎన్‌కౌంటర్ మొదలుకుని తాజా ఎన్‌కౌంటర్ వరకు వందలాది మంది నక్సల్స్, పోలీసులూ మరణించారు. ఈ భయానక పరిస్థితులు 21వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లుతున్న సమయంలో అవసరమా?
ఏ పార్టీ నుంచి విడిపోయి నక్సల్స్‌గా ఏర్పడ్డారో ఆ పార్టీ (సిపిఎం) ఇటీవల హైదరాబాద్‌లో 22వ జాతీయ మహాసభల్ని జరుపుకుంది. 1967లో విడిపోయి సిపిఐ (ఎంఎల్)గా అవతరించిన అనంతరం సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని ప్రకటించి ఆ బాటను నక్సలైట్లు మరింత నెత్తుటిమయం చేస్తున్నారు. పార్లమెంటరీ రాజకీయాల్లో కొనసాగుతున్న సిపిఐ, సిపిఎంల పరిస్థితి ఎలా వుందో అందరికీ తెలుసు. తాజాగా త్రిపురలో సిపిఎం అధికారాన్ని కోల్పోయింది. అంతకుముందు బెంగాల్‌లో మమతా బెనర్జీ చేతుల్లో ఆ పార్టీ మట్టికరిచింది. దీర్ఘకాల సాయుధ పోరాటం ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని, వ్యవసాయక విప్లవాన్ని విజయవంతం చేస్తామన్న పంతంతో మావోలు ముందుకు కదలడం వల్లే ఇంద్రావతి నది నీరు ఎర్రబారుతోంది. మావోల ప్రయత్నం నిష్ప్రయోజనమన్న సంగతిని ప్రపంచ పరిణామాలు వెల్లడిస్తున్నా, వారు పట్టించుకోవడం లేదు.
దండకారణ్యంలో అంతర్భాగంగా భావించే గడ్చిరోలిలో మావోలు దశాబ్దాలుగా తమ కార్యక్రమాల్ని భారీగా నిర్వహిస్తున్నారు. వందలాదిమంది భద్రతా సిబ్బందిని హతమార్చారు. ఎన్నికల్లో హింసకు తెగబడి, బ్యాలెట్ బాక్సులను అపహరించారు. ఆదివాసీల అమాయకత్వం, పేదరికం, అవిద్యను ఆసరాగా చేసుకుని వివిధ సంఘాల్లో వారిని సమీకృతం చేసి సాయుధులుగా మార్చడం వల్ల పరిణామం ఇలా కనిపిస్తోంది. ఎన్‌కౌంటర్ మృతుల్లో సగం మంది మహిళా మావోయిస్టులే ఉండటం గమనార్హం. వారిలో ఎక్కువమంది గడ్చిరోలి ప్రాంతానికి చెందినవారు కావడం విషాదం గాక ఏమవుతుంది?
‘ఆకాశంలో సగం కాదు, అంతకుమించే మేము..’ అని ఆధునిక మహిళ నినదిస్తున్న వేళ ఇలా తూటాలకు ఆదివాసీ వనితలు బలికావడం ఏ రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం? కానీ, మావోలు మాత్రం ఎక్కువగా ఆదివాసీ మహిళలపైనే ఆధారపడుతున్నారు. పెద్ద సంఖ్యలో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసి మహిళలను రిక్రూట్ చేసుకుంటున్నారు. అక్షరాస్యతలో వెనుకబడిన ఆదివాసీలను ఇలా ఆయుధ శిక్షణ కార్యక్రమాల్లోకి దింపడం వల్ల వారికి మేలు జరుగుతుందా? అక్షర జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం లేనిదే బతుకు భారమవుతున్న ఆధునిక సందర్భంలో వాటిని విస్మరించి ఆయుధ భాష నేర్పడం వల్ల ఒరిగేదేమిటి?
ఆదివాసీల కొత్త తరాలకు విద్యాగంధం, సాంకేతిక పరిజ్ఞాన పరిచయం అవసరముంది. దీన్ని గుర్తించిన రామకృష్ణమిషన్, సిజినెట్ లాంటి స్వచ్ఛంద సంస్థలు దండకారణ్యంలో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో విద్యా సంస్థలను, వృత్తి శిక్షణ కేంద్రాలను నడుపుతున్నాయి. బాబా ఆమ్టే లాంటి సేవాతత్పరులు, చైతన్యవంతులైన శుభ్రాంశు చౌదరి లాంటి జర్నలిస్టులు, సేవా ధర్మం గల ధార్మిక సంస్థలు, కొన్ని కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ ‘నవరత్నా’ల్లోని కొన్ని సంస్థలు ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, చైతన్యపరిచే పనులను చేపడుతూ, వర్తమాన జీవిత ఆనవాళ్లను చూపిస్తున్నాయి. ఇదేదో దోపిడీ తత్వంతో చేస్తున్న పనికాదు. వాస్తవానికి కారల్ మార్క్స్ కాలం నుంచి, అంతకుముందే ఈ సమాజంలో పరోపకారం చిక్కగా కొనసాగుతోంది. మార్క్స్ మాత్రం మరో కోణాన్ని దర్శించి ఘర్షణను ప్రోత్సహించి, దానితోనే న్యాయం దక్కుతుందని బోధించి పోరాటాలకు ఉసిగొల్పాడు. ఆ ఉప్పందుకున్న మావోలు దండకారణ్యంలో దండు నిర్మిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల పేరిట ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రత్యామ్నాయమంటే ప్రాణాలు తీయడం, ఇవ్వడం కాకూడదు కదా? కాని మావోలు దశాబ్దాలుగా చేస్తున్నది ఇదే. బెర్లిన్ గోడను ప్రజలు కూల్చిన అనంతరం ప్రపంచం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇది జరిగి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్నా వాస్తవాల్ని అవగాహన చేసుకోకుండా, పాత పద్ధతిని అనుసరించడంవల్ల నష్టపోయేది పేద ప్రజలే, ఆదివాసీలే, శ్రామిక జనమేనని స్పష్టంగా తెలుస్తున్నా పట్టించుకోకపోతే ఎలా?
తాము నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి, అసంఖ్యాక ప్రజల్ని కష్టాల కడలిలోకి లాగుతుంటే ఆధునిక కాలంలో ఆ అధికారం మావోలకే కాదు మరెవరికీ లేదు. ప్రజలే ఈ సంపద సృష్టికి ప్రధాన కారకులు, వారిదే ఈ సంపద అని భావిస్తున్నపుడు వారిని- సంపద దిశగా నడిపించడానికి బదులు మృత్యు కుహరం వైపు కదిలించడం ఎలా సమంజసమవుతుంది?

కొసమెరుపు...
చాలాకాలం పాటు మావోల ‘వౌత్‌పీస్’గా గాయకుడు గద్దర్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన కొడుకు సూర్యం ఇపుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకుని కాంగ్రెస్‌కు బాసటగా నిలుస్తానని ప్రకటించడం విడ్డూరం గాక ఏవౌతుంది? సూర్యం గద్దర్ కుమారుడు కాకపోతే ఎవరూ అతనిని ప్రశ్నించేవారు కాదు. వందలాదిమందిని గెరిల్లా దళాల్లోకి ఆకర్షించి, తన ఆటపాటలతో అనేకమందిని ఉత్తేజపరిచి సాయుధ మార్గం తొక్కించి, ఎంతోమంది బలవడానికి కారణమైన గద్దర్ కుటుంబ పరిస్థితి ఇప్పుడెలా ఉందో ఇట్టే ఊహించవచ్చు. ఎన్నో ఆదర్శ పన్నాలు వల్లించిన గద్దర్ కుటుంబం ఇపుడు ఎంత ఆదర్శంగా ఎదుగుతున్నదో దగ్గరగా పరిశీలించిన వారికి బాగా తెలుసు. మావోయిస్టు పార్టీ నుంచి బహిష్కరణకు గురై, అనంతరం ఏ ఎండకు ఆ గొడుగు పట్టి కాలం వెల్లదీస్తూ తాజాగా తన కొడుకును గద్దర్ కాంగ్రెస్‌లోకి పంపాడు. తానూ కొత్త అవతారం ఎత్తే అవకాశముంది. సూర్యం విషయంలో తన ప్రమేయం లేదని ఆయన ప్రకటించినా ప్రకటించగలడు. సూర్యాన్ని గద్దర్ కొడుకుగానే కాంగ్రెస్ నాయకులు పరిచయం చేశారు తప్ప ఒక వ్యక్తిగా అతడిని పరిచయం చేయలేదు. ఇదీ మావోయిస్టుల, మాజీ మావోయిస్టుల పరిస్థితి. ఈ మాత్రం దానికి ఇన్ని వేలమంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలవాలా? ఇంత విధ్వంసం చోటుచేసుకోవాలా? ఇంత విలువైన సంపద బూడిదపాలు కావాలా? అందరూ నిశితంగా ఆలోచించాల్సిన విషయమిది.

-వుప్పల నరసింహం సెల్: 99857 81799