మెయన్ ఫీచర్

తెలంగాణలో వస్తున్న రాజకీయ స్పష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత సాధారణ ఎన్నికల (2014) అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ స్పష్టత ఏర్పడింది. కానీ తెలంగాణలో అది జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికార పక్షం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షం అయ్యాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కనుచూపు మేరలో లేవు. బిజెపి విడిగా ఉండకుండా అధికార కూటమిలో భాగస్వామి అయింది. రాగల కాలంలో స్వంతంగా ఎదిగి టిడిపికి ప్రత్యామ్నాయం కావాలనుకునే బిజెపి లక్ష్యం ఎటు తేలినా అది ఇప్పటి మాట కాదు గనుక ప్రస్తుతానికి ఆలోచించవలసింది లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు 2019నాటికి కోలుకోగల అవకాశాలు శూన్యం. టిడిపి పాలన పట్ల వ్యతిరేక ఓటు ఏర్పడితే అది పూర్తిగా కాకున్నా చాలావరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు పోయే సూచనలున్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితికి ఒక స్పష్టత ఉంది. కానీ ఆ ఎన్నికలలో టిఆర్‌ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రతిపక్షాలు బాగా వెనుకబడినమాట నిజమే అయినా ఇటువంటి స్పష్టత రాలేదు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడినప్పటికీ, టిడిపి- బిజెపి కూటమి బలం అంతకన్నా కొద్దిగా మాత్రమే వెనుకబడింది. కాంగ్రెస్ గెలిచింది 23 స్థానాలుకాగా, ఈ కూటమి 20 తెచ్చుకుంది. ఇటువంటి స్థితిలో వరంగల్ లోక్‌సభ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక, ఈ మూడూ జరిగిన వెంటనే సాక్షాత్తు టిడిపి శాసనసభా పక్ష నాయకునితో సహా ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరడంతో, తెలంగాణలోను రాజకీయ స్పష్టత ఆరంభమవుతున్నదని చెప్పక తప్పదు.
తెలంగాణలో రాజకీయ స్పష్టత అనే మాటకు ముందుగా కొంత వివరణ ఇచ్చుకోవాలి. అక్కడి పార్టీలలో టిఆర్‌ఎస్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి అధికారపక్షంగా కూడా మారినందున అది ఒక స్థిరపడిన, చలనం లేని పార్టీ అవుతున్నది. కాంగ్రెస్ తగినంత దెబ్బ తిన్నప్పటికీ రాష్టవ్య్రాప్త యంత్రాంగం, నాయకులు, కార్యకర్తలు, వేర్వేరు సామాజిక ఆర్థిక వర్గాలలో ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ కాక అది జాతీయ పార్టీ కూడా అయినందున 2014 ఓటమి కారణంగా కనుమరుగయే అవకాశం లేదు. బిజెపి పరిస్థితి కూడా ఇటువంటిదే. వారి బలం కాంగ్రెస్‌తో పోల్చితే చాలా తక్కువైనా ఒక పరిమితిలోనైనా స్థిరంగా ఉంది. కాంగ్రెస్‌వలె అది కూడా జాతీయ పార్టీ. కనుక ఆ పరిధిలో దాని మనుగడకు ప్రమాదం లేదు. కమ్యూనిస్టుల పరిస్థితి ఇతర పార్టీలకన్నా ఎప్పుడూ భిన్నమైంది. తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్‌లోగాని వరసగా పది ఎన్నికలపాటు సున్నా సీట్లే వచ్చినా వారి ఉనికికంటూ ముప్పు ఉండదు. అదెంత నామమాత్రంగా మారినా తెలంగాణలో ఆ విధంగా మిగులుతున్నది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ ఒక్క పార్టీ మనుగడ, భవితవ్యం ఏ విధంగా ఉండగలదనే దానిపైనే తెలంగాణలో రాజకీయ స్పష్టతలు ఆధారపడి ఉంటాయి. 2014 ఎన్నికల అనంతర స్థితినుంచి ఆ పార్టీ తిరిగి పుంజుకోవడమో, లేక క్రమంగా క్షీణించి ఇంచుమించు అంతర్థాన స్థితికి చేరడమో జరిగితే తప్ప ఈ అంశంపై మనకు స్పష్టత ఏర్పడదు.
ఆవిధంగా 2014 సాధారణ ఎన్నికల తర్వాత పరిణామాలను ఇప్పటివరకు గమనించినపుడు కనిపించేదేమిటి? ఈ ఇరవై మాసాల కాలంలో టిడిపి ఎంతమాత్రం పుంజుకోలేదు సరికదా, వేగంగా బలహీనపడుతున్నది. అంతేకాదు. ప్రవాహంలో కొట్టుకుపోయే మనిషి అందుకు ఆశ లేకపోయినా కనీసం కాళ్లు చేతులు విసురుతూ గట్టుకు చేరేందుకు ఆతురత చూపుతాడు. తెలంగాణలో తనవలెనే దెబ్బతిన్న ఇతర పార్టీలకు భిన్నంగా టిడిపిలో అటువంటి ఆతురత కూడా కనిపించలేదు. దాన్ని బట్టి ఆ పార్టీకి అక్కడ తన భవిష్యత్తు ఏమిటో అర్ధమైపోయినట్టు కనిపించింది. సాధారణ ఎన్నికల అనంతరం పుంజుకోవడమన్నది కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టుల విషయంలోనూ జరగలేదు. పైగా తదనంతరపు ఎన్నికలు, ఉప ఎన్నికలలో వారంతా టిడిపి వలె వరుస పరాజయాలను ఎదుర్కొన్నవారే. కాంగ్రెస్, బిజెపిల నుంచి కూడా టిఆర్‌ఎస్‌లోకి తగినన్ని వలసలు జరిగాయి. ఇటువంటి అంశాలకు సంబంధించి తక్కిన పార్టీలు ఎదుర్కొన్న సమస్యలకు, టిడిపికి తగిలిన ఎదురు దెబ్బలకు తేడాలేదు. అయినప్పటికీ ఈ ఇరవై నెలల అనంతరపు స్థితిని మదింపు చేసినపుడు, ఇతరుల కన్నా టిడిపి ఎక్కువ నష్టపోవడం, నైతిక స్థైర్యం కోల్పోయి చేష్టలుడగడం కనిపిస్తున్నది.
ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవి మూడు విధానాలైనవి. ఒకటి పరిస్థితులతో అంతర్నిహితమైనవి. రెండు స్వయం కృతాలు. మూడు తనను బలహీన పరిచేందుకు అధికార పక్షం చేస్తున్న ప్రయత్నాలు. ఈ మూడింటిని ఒక్కొక్కటిగా చూద్దాం. తెలుగుదేశం అన్నది ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతవరకు ఒక ప్రాంతీయ పార్టీ కాని దాని పుట్టుక, నిర్వహణ సీమాంధ్ర నాయకత్వానివి అయినందున తెలంగాణ ప్రశ్న ముందుకు రావడంతో దానికి అనివార్యంగా ‘ఆంధ్రా పార్టీ’ అనే ముద్రపడింది. ఆ పార్టీ ప్రతి మాటను, చేతను తెలంగాణ వారు అదే కోణంనుంచి చూసారు. అటువంటప్పుడు తెలంగాణ అనంతరం తర్వాత కూడా అదే దృష్టి కొనసాగడం సహజం. అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని టిడిపి ప్రభుత్వ చర్యలను కూడా తెలంగాణ ప్రజలు తమ ప్రయోజనాలకు అందువల్ల కలుగుతున్న లాభ నష్టాలేమిటన్న కోణంనుంచే చూస్తూ వచ్చారు. ఖమ్మం మండలాలు, సీలేరు, విద్యుత్తు-జలవివాదాలు, ఉద్యోగులూ నిధుల పంపిణీ, ఉమ్మడి ఆస్తులు మొదలైన వాటినుంచి మొదలుకుని ‘ఓటుకు నోటు’ ఉదంతం వరకు, తెలంగాణ టిడిపి నేతల వ్యవహరణ తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా ఉందా లేక చంద్రబాబుపట్ల విధేయంగానా అన్నంత వరకు, ఇవన్నీ చాలవన్నట్టు తామిక్కడ తిరిగి అధికారానికి ‘2019 కన్నా ముందే రావచ్చు’ నన్న తరహాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన పలు ప్రకటనల వరకు, రెండు రాష్ట్రాలను తిరిగి ఒకటి చేసే శక్తి తమకు మాత్రమే ఉందనడం వరకు అన్నీ తెలంగాణ ప్రజల శల్య పరీక్షకు గురయ్యాయి. ఆ విధంగా టిడిపికి ‘ఆంధ్రా పార్టీ’ అన్న ముద్ర, తెలంగాణ టిడిపి నాయకులకు ‘ఒక ఆంధ్రా పార్టీ విధేయు’లన్న ముద్ర బలపడుతూ పోయాయి.
ఇవన్నీ పైన ఉన్న అంతర్నిహితాలు, స్వయం కృతాలు. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణలోని ఇతర ప్రతిపక్షాలకు గుది బండ కాదు. సిపిఎంకు గల ఒకటి రెండింటిని మినహాయిస్తే. ఈ విధంగా టిడిపి బ్యాలెన్స్ షీట్‌లో తెలంగాణ ప్రజలకు నచ్చనివి ఇన్ని అంశాలున్నప్పుడు, ఆ పార్టీ మనుగడ, భవిష్యత్తు ప్రశ్నార్ధకం గాక మరేమవుతుంది? ఇతర ప్రతిపక్షాలది బలహీనతలు, ఎన్నికలలో పరాజయాల కథ మాత్రమే కాగా, టిడిపిది వాటికన్నా వౌలికంగా భిన్నమైనది. దానికి పడిన ముద్ర అన్నింటికన్నా ప్రమాదకరమైన పరాజయం. గుర్తించవలసిందేమంటే, ఇందులోని అంతర్నిహితమైన సమస్య (సీమాంధ్రులు ప్రారంభించి నడిపారన్నది) ఎవరూ ఏమీ చేయలేనిది. అప్పటి పరిస్థితుల్లో ఆ విధంగా జరిగింది. కానీ అంతకన్నా తీవ్రంగా నష్టపరుస్తూ వచ్చినవి స్వయం కృతాలు. విభజన అనంతరం ఒక రాష్ట్రంలో అధికారం నెరపుతున్న టిడిపి, తనకు తాత్కాలికంగానైనా కొన్ని వివాదాలున్న తెలంగాణకు, టిఆర్‌ఎస్‌కు మేలు కోరి సవ్యంగా వ్యవహరించడం అసలు సాధ్యమా అనే ప్రశ్న ఒకటుంది. కానీ టిడిపి నాయకత్వం చేసింది విభజనకు ముందు, ఆ తర్వాత కూడా తెలంగాణకు హానికరంగా వ్యవహరించడంవల్ల సాధ్యం కాగలని కూడా కాకుండాపోయాయి. ఉదాహరణకు విద్యుత్, ఉద్యోగుల విభజన వంటివి సమస్య కానక్కరలేదు. ఈ విధమైన అనేక స్వయం కృతాలలో టిడిపి తనను తాను తెలంగాణకు ‘బయటి పార్టీ’గా ధృవీకరించుకుంటూ వచ్చింది.
ఇటువంటివి ఇతర పార్టీలకు లేవు. కనుక తార్కికంగా ఆలోచించినపుడు తెలంగాణలో టిడిపి కొనసాగినంత కాలం అక్కడ రాజకీలకు స్పష్టత వచ్చే అవకాశం ఉండదు. ఇది రాజకీయ పరిణామ క్రమం సృష్టించిన డైనమిక్స్. ఎవరూ తప్పించుకోలేనిది. కనుక ఆ పార్టీ వరసగా ఓడటమే కాక అచేతనంగా మారి ఈ విధంగా వలసలు సాగుతున్నాయి. వాస్తవానికి ఆ పార్టీకి గ్రేటర్ ఎన్నికల తర్వాత ఇటువంటి విపత్తు ఎదురు కాగలదని ఊహించిందే. గ్రేటర్‌కు ముందు వారికి మిగిలిన స్థావరాలలో ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి చేజారుతుండిన తర్వాత మిగిలిన చివరి కోట గ్రేటర్. అది కూలితే ఇక మిగిలేది లేదు. ఆ కోటపై ఆశలు ఎందుకు నిలుపుకున్నారో, అది ఏవిధంగా ఎందుకు పతనమైందో ఆ దరిమిలా జరుగుతున్న పరిణామాలు ఏమిటో కనిపిస్తున్నవే అయినందున వేరే చెప్పుకోనక్కరలేదు. టిఆర్‌ఎస్ అనే అధికార పార్టీ, తనకు రాజకీయ స్పష్టత రావడం కోసం, ఈ పరిణామ క్రమాన్ని సహజంగానే వేగవంతం చేస్తువస్తున్నది. కాంగ్రెస్, బిజెపి ఉండక తప్పవు కనుక వాటిని వీలైనంత బలహీనపరచడం, టిడిపి ఉండక తప్పనిదేమీ కాదు కనుక దానిని ఉండకుండా చేయడం టిఆర్‌ఎస్ వ్యూహమనుకోవాలి.
ఇందుకు సంబంధించి చెప్పుకోవలసింది మరొకటి ఉంది. ఎన్టీఆర్ పార్టీని పెట్టినపుడు తన సోషల్ ఇంజనీరింగ్‌తో తెలంగాణలో పెద్ద సామాజిక వర్గమైన బిసిలు ఆయన వెంట నిలిచారు. చంద్రబాబు రాష్ట్ర విభజన అనంతరం సైతం ఆశలు నిలుపుకున్న వర్గాలలో ఇదొకటి. ఉద్యమకాలంనుంచే బలహీనపడుతూ వచ్చిన ఈ పునాదిని కెసిఆర్ పూర్తిగా తనవైపు ఆకర్షించడం టిడిపికి పునాదులు లేకుండా చేయడమేకాక రాజకీయ స్పష్టతకు దోహదం చేస్తుంది. ఉద్యమం తర్వాత ఎన్నికల కాలంలోనూ కొనసాగిన ఈ క్రమం, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలతో, దశలు దశలుగా వలసలతో పూర్తవుతున్నదన్నమాట. సీమాంధ్రుల ఓట్లు, బిసిల ఓట్లు, ఐటి వంటి ఆధునిక రంగాలతో సంబంధం గల కొత్త తరం ఓట్లు పోయిన తర్వాత, గ్రేటర్ కోట కూలిన వెనుక, టిడిపికి ఇక తెలంగాణలో మిగిలింది లేదు. రాజకీయ స్పష్టత సంపూర్ణమవుతున్నది.
ఇందులో చిట్టచివరి విషయం తెలంగాణ బిజెపిది. తమ మిత్రపక్షం ఈ విధంగా తన పునాదితో సహా అదృశ్య స్థితికి చేరుతున్నందున, తన రాజకీయ కార్యకలాపాలు, భవిష్యత్తు గురించి ఒంటరిగా తన స్థాయిలో స్పష్టత తెచ్చుకోవల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడుతున్నది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)