రాష్ట్రీయం

లక్ష్యం చేరని ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడ్జెట్ కేటాయింపులకే పరిమితం కావాలి
శాఖలకు అదనంగా నిధులివ్వలేం
2016-17 బడ్జెట్ 1,30,000 కోట్లు
18వేల కోట్ల రెవెన్యూ లోటు
ఆర్థిక శాఖ సమావేశంలో వెల్లడైన వివరాలు

హైదరాబాద్, జనవరి 2: ఖజానాకు అవసరమైనంత నిధులు సమకూరకపోవడంతో బడ్జెట్‌లో పొందుపర్చిన మేరకే ఖర్చులు చేయాలని శాఖాధిపతులకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశాలు జారీ చేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ రాబడులు, ఖర్చులతోపాటు 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపొందించేందుకు వీలుగా శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి 3 గంటలపాటు చర్చించారు. రెవెన్యూ ఆదాయ పరిస్థితి ఇలాగేవుంటే వేర్వేరు శాఖలకు 2015-16 అవసరాలకు అదనంగా నిధులివ్వలేమని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి మెరుగుకు ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలిచ్చేలా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 2015-16కి తాను 1,13,048 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించానని యనమల గుర్తు చేశారు. గనులు, అడవులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు వినా ఇతర శాఖలు ప్రభుత్వం రూపొందించిన ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేదని ఈ సందర్భంగా వెల్లడైందన్నారు. అధికారులు సమర్థతగా పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల లక్ష్యసాధన ఇప్పటి వరకు సాధించలేకపోయినట్టు పేర్కొన్నారు. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలల గడువుండటంతో నిర్ణీత ఆదాయ లక్ష్యం సాధించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు వ్యవసాయం, జలవనరులు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య శాఖల కోసం దాదాపు 12 వేల కోట్లు అదనంగా ఖర్చయ్యాయని సమావేశంలో తేలింది. సంక్షేమ కార్యక్రమాలకు నిధులు నిలుపుదల చేయలేని పరిస్థితి నెలకొందని, రాష్ట్ర ఖజానా పరిస్థితి పరిశీలిస్తే అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందన్నారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరిస్థితి పరిశీలిస్తే ఇప్పటికే దాదాపు 10 వేల కోట్ల రెవెన్యూ లోటు కనిపిస్తున్నట్టు సమావేశంలో వెల్లడైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి లోటు 18 వేల కోట్లకు చేరుకునే పరిస్థితి ఉందన్నారు. అందువల్ల ఖజనాకు చేరాల్సిన నిధుల విషయంలో రెవెన్యూ రాబడులు ఉన్న అన్ని శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి 1,30,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదించాలని భావిస్తున్నట్టు ఈ సమావేశంలో వెల్లడైంది. ఇందుకు అనుగుణంగా వివిధ శాఖల నుండి వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. మరో పదిరోజుల్లో మళ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ సి కుటుంబరావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.