ఆంధ్రప్రదేశ్‌

గుడుల జోలికొస్తే సహించం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: విజయవాడలో రోడ్ల విస్తరణ పనుల పేరుతో అనేక ఆలయాలను తొలగించడం పట్ల హిందూ మత సంస్థలు, ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుడుల కూల్చివేతను ఖండిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ సహా వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు సోమవారం సమావేశమై చర్చించారు. వీరిలో ఒక బృందం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తరువాత వన్‌టౌన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పలువురు మాట్లాడారు. హిందూ దేవాలయాల్లో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, ఆ విగ్రహాలను తొలగించాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయని, అధికారులు వాటిని పట్టించుకోకుండా తొలగించారని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానందస్వామి అన్నారు. గుజరాత్‌లో గుడులను తొలగించినప్పుడు అక్కడి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ మఠాధిపతులు, పీఠాధిపతులతో సమావేశమై గుడులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇచ్చారని, తిరిగి నిర్మించేందుకు అయిన ఖర్చుకూడా ప్రభుత్వమే భరించిందని అమరావతిలోని శివక్షేత్రం అధిపతి శివస్వామి తెలిపారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరించారని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గుడి పూజారులకు కూడా తెలియకుండా రాత్రికి రాత్రి గుడులను కూల్చివేశారని వారన్నారు. ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలను అసందర్భంగా తొలగించడం ప్రభుత్వానికి అరిష్టమని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కమలానంద భారతి అన్నారు. దీని ఫలితాన్ని ప్రభుత్వం చవిచూస్తుందన్నారు. ఇకపై ఆలయాల జోలికి వస్తే సహించేది లేదని, దేశవ్యాప్త ఉద్యమానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. కాగా, గోశాలను తొలగించడంపై ఎంపి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను సమావేశంలో పాల్గొన్న వారంతా ఖండించారు. ‘పశువులే కదా! వాటిని ఎక్కడికి తరలిస్తే ఏమవుతుంద’ని కేశినేని ప్రశ్నించారని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో విజయవాడలో ఏ ఒక్క హిందూ దేవాలయంపై చేయివేసినా సహించేది లేదని సమావేశం హెచ్చరించింది. హిందువులు అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇకపై నిరంతర జాగరణతో దేవాలయాలను పరిరక్షించుకోవాలని కోరారు. ఇదిలాఉండగా వినాయకుని గుడి కూల్చేస్తారనంటూ జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు యువకులు సమావేశానికి హాజరైన మంత్రి కామినేని శ్రీనివాస్‌పై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆయన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
పునర్నిర్మిస్తాం:కామినేని
మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ దేవాలయాలను తొలగించిన విధానం సరిగాలేదని, ఈవిషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గమనించారన్నారు. తొలగించిన ఆలయాలను పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆలయాల తొలగింపు ఉండదు!
విజయవాడలో ఇకపై ఆలయాల తొలగింపు ఉండదని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఎంపి గోకరాజు గంగరాజు అన్నారు. ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భవిష్యత్‌లో ఏ దేవాలయన్నైనా కూల్చాలంటే సంబంధిత పెద్దలతో మాట్లాడిన తరువాతే చర్యలు మొదలుపెట్టాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో బిజెపి నేతలు సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విశ్వహిందూ పరిషత్ నాయకులు విద్యాధరరావు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విజయవాడ నగరంలో హిందూ ఆలయాల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేస్తున్న మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు