ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్ చేతికి పట్టణ వైద్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 15: పట్టణ ప్రాంతాల్లోని పేదలకు వైద్యం అందించేందుకు ఏర్పాటుచేసిన అర్బన్ హెల్త్‌సెంటర్ల (పట్టణ ఆరోగ్య కేంద్రాలు) పేరును పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి నిర్వహణ బాధ్యతను ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రికి అప్పగించినట్లు సమాచారం. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలోని మొత్తం 120 అర్బన్ హెల్త్ సెంటర్లను ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జివో) నిర్వహిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 20 వరకు ఉన్నాయి. ఇకపై వీటిని కార్పొరేట్ సంస్థ నిర్వహిస్తుంది. దీనికి తోడు పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్ డిస్పెన్సరీలను సైతం వీటి పరిధిలోకే తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రజలకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదన్న కారణంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్వచ్ఛంద సంస్థలు ఓ వైద్యుడు, నర్సు, ఎఎన్‌ఎంను ఏర్పాటు చేసుకుని అర్బన్ హెల్త్‌సెంటర్లను నిర్వహిస్తున్నాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రోగులను పరీక్షించి ప్రభుత్వం ఇచ్చే మందులు అందించే వారు. అయితే సెంటర్ల నిర్వహణలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. నిర్వహణ పరంగా నివేదికలు, జాబితాలు సిద్ధం చేయడంలో సిద్ధహస్తులుగా పేరుగాంచిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పేదలకు ఉచిత వైద్యం చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చేసేవారనే విమర్శలు ఉన్నాయి.
హెల్త్‌సెంటర్ల నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రతి నెల అందించేది. నిధులు అందుబాటులో లేని సమయంలో నిర్వహణ క్లిష్టతరంగా మారేది. స్వచ్ఛంద సంస్థలు నిర్వహణ వ్యయాన్ని భరించలేక ప్రభుత్వం ఇచ్చే మందులతో పాటు నిర్వహణలో ఖర్చులు పెంచి చూపించేవారనే ఆరోపణలూ లేకపోలేదు. కార్పొరేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని పేదలు కూలీనాలీ చేసుకునేందుకు ఉదయం పూట బయటకు వెళ్లి మధ్యాహ్నం లేదా సాయంత్రం పూట వస్తారని, అందుకే వారికి అనుకూలంగా ఉండే సమయంలో ఆరోగ్య కేంద్రాలను తెరచిఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తప్పుబడుతున్నారు. గతంలో ఒక అర్బన్ హెల్త్‌సెంటర్ నిర్వహణ, ఏడాది మందులకు ఇచ్చే బడ్జెట్ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థకు ఒక నెలకే కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల పొట్టకొట్టే ఈ చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.