రాష్ట్రీయం

9న టిడిపి బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: గ్రేటర్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులు గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, గ్రేటర్ పరిథిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. ఇంకా ఈ నెల 9న నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశానికి టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇలాఉండగా బహిరంగ సభ నిర్వహించే నిజాం కళాశాల మైదానాన్ని టి.టిడిపి నగర శాఖ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఇతర నాయకులు బుధవారం సందర్శించి, ఏర్పాట్ల గురించి కొన్ని సూచనలు చేశారు. మిత్రపక్షమైన బిజెపి నాయకులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. బిజెపి సహకారంతో ఈ బహిరంగ సభను విజయవంతం చేసి, గ్రేటర్ పరిథిలో టిడిపి-బిజెపి కూటమి బలంగా ఉందన్న సంకేతాలు పంపించాలని టిడిపి నాయకులు భావిస్తున్నారు. ఇలాఉండగా టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చించి జిహెచ్‌ఎంసి పరిథిలోని 24 నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను, బాధ్యులను నియామకం చేశారు. సమన్వయ కమిటీ సభ్యులుగా రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రమేష్ రాథోడ్, గరికపాటి మోహన్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఇ. పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, అరవింద్‌కుమార్ గౌడ్, రావుల పాటి సీతారామారావు, ఎం. అమర్‌నాథ్‌బాబు, జి. బుచ్చిలింగంను నియమించారు.ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కెటిఆర్ దృతరాష్ట్ర కౌగిలిని నమ్మవద్దని టిడిపి నేత రావుల అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలుపొందాలనే దురాలోచనతో ఎన్నికల ప్రక్రియనే మార్చి వేసి, రిజర్వేషన్లు ప్రకటించకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నది సామాజిక తెలంగాణ కోసమే తప్ప కెసిఆర్ కుటుంబం కోసం కాదని రావుల అన్నారు.

రూర్బన్ మిషన్ అమలుకు
రాష్టస్థ్రాయి సాధికారక కమిటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: కేంద్రప్రభుత్వానికి చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎపి రాష్ట్రప్రభుత్వం 10 మంది ఉన్నతాధికారులతో సాధికారక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. మెంబర్ కన్వీనర్‌గా పంచాయితీ రాజ్ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సభ్యులుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, సివిల్ సప్లైస్ శాఖ ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని నియమించారు.
ఎన్‌జిటి ఆదేశాలపై స్టేకు నిరాకరణ
హైకోర్టులో సర్కారుకు చుక్కెదురు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: ఖమ్మం జిల్లా మణుగూరులో నిర్మాణంలో ఉన్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులు నిలుపుదల చేయాలంటూ చెన్నైలోని సదరన్ జోన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం బుధవారం నిరాకరించింది. ఈ ఆదేశాలను ట్రిబ్యునల్ గత నెల 12వ తేదీన జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేవంటూ మానవ హక్కుల ఫోరం దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం ఈ పిటిషన్ విచారణను సంక్రాంతి తర్వాతకు వాయిదా వేశారు.
ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ
నేడు హైదరాబాద్‌లో పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం ఉదయం 9 గంటలకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులతో సమావేశం, 10.30కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు బిహెచ్‌ఇఎల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో సమావేశం, మధ్యాహ్నాం 3.30కి ఎన్‌ఎండిసిలో ఎస్సీ, ఎస్టీ సర్వీస్ సంబంధిత ఫిర్యాదులపై సమీక్ష నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది. రాత్రి ఇక్కడే బస చేసిన తర్వాత 8వ తేదీ ఉదయం బెంగళూరు బయలు దేరి వెళుతుందని స్పష్టం చేసింది.
వైద్య మండలి ఏర్పాటు
జిఓ జారీ చేసిన టి.సర్కార్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. వైద్య కళాశాలల టీచింగ్ స్ట్ఫాకు సంబంధించి కాకతీయ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ సిద్ధార్ధ, హైదరాబాద్ సరోజిని నేత్ర వైద్య శాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి రాజలింగం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ విభాగం నుంచి డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఇ రవీంద్రరెడ్డి, డాక్టర్ సిహెచ్ జగన్మోహన్ రావు, డాక్టర్ బి రమేష్‌కుమార్, ప్రభుత్వం నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ వైస్‌చాన్సలర్‌ను నియమించారు.

దక్షిణాసియా శాంతిదూతగా
ప్రొఫెసర్ రేఖా పాండే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ రేఖా పాండేను దక్షిణాసియా ప్రాంత శాంతిదూతగా కొరియాకు చెందిన అంతర్జాతీయ మహిళా శాంతి గ్రూప్ (ఐడబ్ల్యుపిజి) నియమించింది. స్ర్తి, పురుష అంశాలపై రేఖా పాండే చేసిన సేవలకు గాను ఈ పదవి దక్కింది. ఐడబ్ల్యుపిజి సంస్థ మహిళల కోసం అంతర్జాతీయ స్థాయిలో పని చేస్తుందని హైదరాబాద్ యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. యుద్ధ సమయంలో పిల్లలను ఎలా సంరక్షించుకోవాలి, మహిళల బాధ్యతలకు సంబంధించిన అంశాలపై పాండే పని చేశారు.
ముగిసిన ఐసిసి 2016
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: ఇంజినీరింగ్, సైంటిఫిక్ విభాగానికి చెందిన రెండవ ఇండియన్ కంట్రోల్ కాన్ఫరెన్స్ బుధవారం నాడిక్కడ మహీంద్రా ఎకోల్ సెంట్రల్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ముగిసింది. ఈ నెల 4న ప్రారంభమైన ఈ కాన్ఫరెన్స్ బుధవారంతో ముగిసింది. దాదాపు 170 మంది ఈ సమావేశంలో పాల్గొనగా, వీరిలో డాక్టోరల్ విద్యార్థులు 70 మందికిపైగా ఉండగా, వంద మంది నిష్ణాతులు పాల్గొన్నారు. మరో 20 మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు. ఈ సమావేశానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఇఇఇ) సాంకేతిక సహకారాన్ని అందించింది. రీసెర్చ్, టెక్నికల్ పేపర్లకు సంబంధించి ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో విద్యార్థులు సమర్పించారు.
జిహెచ్‌ఎంసి ఎన్నికల షెడ్యూల్
కుదింపుపై నేడు విచారణ
వెల్లడించిన హైకోర్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ ఎన్నికల షెడ్యూల్ పరిమితిని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కుదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను గురువారం విచారించనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్లను విచారించింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల షెడ్యూల్‌ను 28 రోజుల నుంచి 15 రోజులకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురుద్దేశ్యంతో కూడినదంటూ సి రఘునందనరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రప్రభుత్వం జిహెచ్‌ఎంసి సెక్షన్ 33ను సవరించింది. ఈ సవరణలతో కూడిన జీవోను ప్రభుత్వం జనవరి 4వ తేదీన జారీ చేసిందన్నారు. సవరణకు తగిన కారణాలను పేర్కొనలేదన్నారు. చట్టం ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సవరణలు చేయడం సమంజసం కాదన్నారు. పిటిషనర్ తరఫున కె అంథోని రెడ్డి వాదనలు వినిపించారు.

సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) ఈ నెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.నాగరాజు ప్రకటించారు. రంగారెడ్డి రీజియన్, హైదరాబాద్ జోన్ పరిధిలో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 2470 అదనపు బస్సులను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీబస్ స్టేషన్, సిబిఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఎల్‌బినగర్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి నడుపుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు గాను వివిధ ప్రాంతాల్లో బస్సులను నియంత్రించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, పరిగి, వికారాబాద్, తాండూరు, సంగారెడ్డి వైపు వెళ్లు బస్సులు ఎంజిబిఎస్ నుంచి, విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే షెడ్యూల్ బస్సులు ఎల్‌బి నగర్ నుంచి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపునకు వెళ్లే బస్సులు జూబ్లీబస్ స్టేషన్, పికెట్ నుంచి నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.