ఆంధ్రప్రదేశ్‌

దెబ్బకు దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: తెలుగుదేశం తన రాజకీయ ప్రత్యర్థి వైసీపీని దెబ్బకు దెబ్బ తీయనుందా? ఓటుకునోటు కేసులో సీఎం, తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకు తెలంగాణ ఏసీబీతో నోటీసులు ఇప్పించి ఇబ్బందిపెట్టిన వైసీపీపై, అధికార తెదేపా ప్రభుత్వం అదే కేసుల ఉచ్చు బిగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తుని హింసాకాండలో నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసిన ప్రభుత్వం, అందులో కొందరిని జైలుకు పంపింది. ఆంధ్రప్రదేశ్‌లో కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో జనవరి 31న భారీ బహిరంగసభ నిర్వహించారు. ఆ సందర్భంగా కొందరు ఎదురుగా ఉన్న రైలును తగులబెట్టగా, అంతకుముందు పోలీసుస్టేషన్‌ను ధ్వంసం చేశారు. ఈ కేసులో 11మందిని అరెస్టు చేసి జైలుకు పంపించగా, ముద్రగడ రంగంలోకి దిగి, దీక్ష చేయటంతో ప్రభుత్వం దిగివచ్చి ఆ 11మందికి బెయిల్ వచ్చేలా సహకరించింది. దానితో సర్దుమణిగిందనుకున్న తుని కేసు తాజాగా వైసీపీ నేత, జగన్‌కు అత్యంత సన్నిహితుడైన భూమన కరుణాకర్‌రెడ్డికి సీఐడి నోటీసులు ఇవ్వడంతో కొత్త మలుపు తిరిగినట్టయింది. తుని బహిరంగసభకు ముందు కరుణాకర్‌రెడ్డి స్వయంగా ముద్రగడను కలవడంతోపాటు, బహిరంగసభ జరిగే ప్రాంతానికి వెళ్లారని, ఆ విధ్వంసం వెనుక ఆయన ఉన్నారని తెదేపా నేతలు బహిరంగంగానే ఆరోపించారు. అయితే తనకు భూమనతో పూర్వ సాన్నిహిత్యం ఉందని ముద్రగడ అప్పట్లో చెప్పారు.
పోలీసు వర్గాలు సైతం వారిద్దరూ తుని సభకు ముందు అనేకసార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారని వెల్లడించాయి. వీటి ఆధారంగా ఈ విధ్వంసం వెనుక కరుణాకర్‌రెడ్డి ప్రమేయం ఉందన్న దిశగా, సీఐడి కేసు నమోదుచేసేందుకు సిద్ధమవుతోందన్న ప్రచారం అప్పట్లో మీడియాలో జరిగింది. ఆ అనుమానాలను బలపరుస్తూ తాజాగా కరుణాకర్‌రెడ్డికి సీఆర్‌పీసీ సెక్షన్ 3, 160 కింద విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ ఏపి సీఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న గుంటూరులోని సీఐడి కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులో పేర్కొనగా, తాను 6న హాజరవుతానని ఆయన చెప్పారు. ఓటుకునోటు కేసులో తెదేపా అధినేత, ఏపి సీఎం చంద్రబాబునాయుడు స్వర నమూనాలు పరీక్షించగా ఆ గొంతు ఆయనదేనని తేలింది కాబట్టి, కేసును పునర్విచారించాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి స్పందించిన ఏసీబీ కోర్టు పునర్విచారణకు ఆదేశించింది. ఏసీబీ తీర్పును సవాల్ చేస్తూ బాబు హైకోర్టుకెళ్లగా శుక్రవారం స్టే విధించింది.శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువడుతున్న సమయంలోనే ఏపి సీఐడి, వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితుడైన భూమన కరుణాకర్‌రెడ్డికి, తుని కేసులో నోటీసులు జారీ చేయటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. సీఎంను పాత కేసులో ఇబ్బందిపెట్టిన వైసీపీని, తెదేపా కూడా అదే పాత కేసును తవ్వితోడి బదులు తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. తుని ఘటనలో రాయలసీమ గూండాలున్నారంటూ తెదేపా, పోలీసు వర్గాలు మొదటినుంచీ చెబుతున్నా, ఆ మేరకు కేసులు మాత్రం దాఖలు చేసినట్లు లేదు. ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ నేత భూమనకు నోటీసులివ్వడం ద్వారా, దేశం దెబ్బకు దెబ్బతీసినట్లు రాజకీయ వర్గాలు విశే్లషిస్తున్నాయి. నిజానికి తుని ఘటనలో అరెస్టయిన ముద్దాయిలంతా, బెయిల్‌పై బయటకు రావడంతో ఇక ఆ కేసు వీగిపోయిందని అన్ని వర్గాలు భావించాయి. కానీ హఠాత్తుగా భూమనకు నోటీసులిచ్చి ప్రభుత్వం వైసీపీకి పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్టయింది. వైసీపీ నేతలు సైతం భూమనకు నోటీసులిస్తాయని ఊహించలేదు. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న ప్రతీకార చర్యగానే వైసీపీ భావిస్తోంది.