రాష్ట్రీయం

జలాశయాల స్థితి ఈ ఏటికింతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాన జలాశయాలు ఈ ఏడాదైనా నీటితో కళకళలాడతాయని అంతా భావించినప్పటికీ, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, కండలేరు, సోమశిల, పులిచింతల తదితర జలాశయాల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండినప్పటికీ, దీని నిలువనీటి సామర్థ్యం కేవలం 11 టిఎంసిలు మాత్రమే కావడం గమనార్హం. జూరాల తర్వాత ప్రధాన జలాశయం శ్రీశైలం. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 215 టిఎంసిలు కాగా, ఒకదశలో 175 టిఎంసిల వరకు నీరు చేరింది. కర్నాటక, మహారాష్టల్రలో భారీ వర్షాల వల్ల ఈ మాత్రమైనా నీరు చేరింది.
కర్నాటకలోని ఆల్‌మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి, అవి పొంగిపొర్లితేనే సాధారణంగా శ్రీశైలంలోకి నీరు చేరుతుంది.ఆల్‌మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి భారీ వరద రావడంతో ఇవి పొంగిపొర్లాయి. దాదాపు 140 టిఎంసిల నీరు జూరాలమీదుగా శ్రీశైలం జలాశయానికి చేరింది. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం 100 టిఎంసిల సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ఇందులోకి 50 టిఎంసిల నీరు కూడా చేరలేదు. వంద టిఎంసిలు చేరితేనే అదనపు నీటిని శ్రీశైలంలోకి వదిలివేస్తారు. తుంగభద్ర జలాశయమే నిండకపోవడంతో శ్రీశైలంలోకి నీరు విడుదల కాలేదు. అందుకే శ్రీశైలం కూడాపూర్తిగా నిండలేదు. రాయలసీమలోని అనేక ప్రాజెక్టులకు, తెలంగాణలోని ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రధాన నీటి వనరుగా ఉంది. ఇటీవల శ్రీశైలం కుడివైపు నుండి భారీగా నీటిని రాయలసీమకు తరలించారు. శ్రీశైలంలోకి నీరు చేరగానే జలవిద్యుత్తు కూడా చేశారు. దాంతో కొంత నీరు నాగార్జునసాగర్‌కు చేరింది.
చాలా పర్యాయాలు శ్రీశైలం పొంగిపొర్లింది. ఈ ఏడు మాత్రం పూర్తిస్థాయిలో నిండలేదు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయిలో 312 టిఎంసిల నీరు ఉంటుంది. ప్రస్తుతం ఇందులో కేవలం 138 టిఎంసిల నీరే ఉంది. దాదాపు ఇది డెడ్‌స్టోరేజీగానే పరిగణనిస్తారు. శ్రీశైలం పూర్తిగా నిండి అదనపునీటిని విడుదల చేస్తేనే నాగార్జునసాగర్‌కు ఉపయోగం ఉంటుంది. సాగర్‌లో నీరు లేకపోవడంతో ఈ ఏడు సాగర్ కుడి, ఎడమల కాలువల కింద వరివేయలేదు. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆరుతడి పంటలు వేయగా, మరికొందరు రైతులు బోర్‌బావులు, బావులు తదితర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వరివేశారు. గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో 90 టిఎంసిల నీరు ఉంటుంది. ఈఏడు 45 టిఎంసిల వరకు నీరు చేరింది. ఈ నీటిని ఉపయోగించి ఆయకట్టులో కొంత భాగం పంటలు వేశారు. ఇలా ఉండగా కండలేరు, సోమశిల ప్రాజెక్టులోకి కూడా రెండు నెలల క్రితం కొంత నీరు చేరినప్పటికీ, ఈ ప్రాజెక్టులు పూర్తిగా నిండలేదు. కండలేరు సామర్థ్యం 68 టిఎంసిలు కాగా ప్రస్తుతం 22 టిఎంసిల నీరే ఉంది. సోమశిల నిలువనీటి సామర్థ్యం 78 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 15 టిఎంసిలు ఉంది.

నైరుతీ రుతుపవనాల ఉపసంహరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 15: నైరుతీ రుతుపవనాల ఉపసంహరణ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఈ ఉపసంహరణ మెల్లమెల్లగా కొనసాగి, తెలంగాణలో అక్టోబర్ 12 నుండి 20 మధ్య పూర్తవుతుంది. ఎపిలో అక్టోబర్ 25 వరకు ఉపసంహరణ పూర్తవుతుంది. తెలంగాణ, ఎపితో సహా దేశం మొత్తంలో పంటలు పండేందుకు, తాగునీటి సమస్యలు ఏడాదిపాటు తీర్చేందుకు నైరుతీరుతుపవనాలే ఉపయోగపడుతుంటాయి.చిన్నచిన్న కుంటలు, చెరువులతో పాటు చిన్నతరహా, మధ్యతరహా, భారీ నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నైరుతీరుతుపవనాల సమయంలో కురిసే వర్షాలపైనే ఆధారపడి ఉంటాయి. ప్రతిఏటా జూన్ ప్రారంభంలో కేరళలో ప్రవేశించే నైరుతీరుతుపవనాలు, జూలై మధ్య వరకు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. మనదేశానికి పశ్చిమంవైపు ఉన్న రాజస్థాన్‌లోకి నైరుతీరుతుపవనాలు ప్రవేశించి, రెండునెలలు గడవక ముందే అదే రాష్ట్రం నుండి ఉపసంహరణ మొదలవుతుంది. అంటే వర్షాకాలం సమయం ఈ రాష్ట్రంలో తక్కువగా ఉంటుంది. తెలంగాణ, ఎపిలలో దాదాపు నాలుగు నెలల పాటు నైరుతీరుతుపవనాల మూలంగా వర్షాలు కురుస్తాయి. నైరుతీ రుతుపవనాలు ఉపసంహరణ పూర్తవగానే, ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయి. రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలుతో పాటు కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలు ఈశాన్యరుతుపవనాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.