రాష్ట్రీయం

భారీ వర్షాలకు అపార నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 15: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యవసాయ పంటలకు అపార నష్టం సంభవించింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే 20 వేల హెక్టార్ల మేర వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గురజాల, మాచర్ల పట్టణాల్లోని పలు కాలనీలు ఇంకా నీట నానుతున్నాయి. ఐదు మండలాల్లో 120 కిలోమీటర్ల వరకు రోడ్లు కోతకు గురయ్యాయి. వ్యవసాయ పంటలు వరి, పత్తి, కంది పైర్లతో పాటు రెండు వేల హెక్టార్లలో మిర్చి తదితర ఉద్యానవన, వాణిజ్య పైర్లు నీట మునిగాయి. సాగర్ కుడికాల్వ పరిధిలో ఖరీఫ్ సాగుకు నీరు విడుదల కాలేదు. దీంతో రైతులు వర్షాధారంతో సాగుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు పైర్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తక్షణ సాయంగా నిర్వాసితులకు 20 కిలోల బియ్యం, ఐదు కిలోల కిరోసిన్ పంపిణీ చేస్తోంది. కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలకు దుస్తులకు రు. 18 వందలు, వంట పాత్రల కొనుగోలుకు మరో రెండు వేల ఆర్థిక సాయాన్ని అధికారులు అందిస్తున్నారు. పంటలకు సంభవించిన నష్టంపై వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో సమీక్షించారు. మరో 24 గంటలు గడిస్తేకానీ ఎన్యుమరేషన్ పూర్తికాదని అధికారులు వివరించారు. ప్రస్తుతానికి పంచాయతీరాజ్ శాఖకు రు. 20 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. గురజాల, మాచర్లలో మరో రెండురోజుల పాటు పునరావాస కేంద్రాలను కొనసాగిస్తామన్నారు. ఇందులో 12 వందల మంది ఆశ్రయం పొందుతున్నారు. మంత్రి పుల్లారావు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అధికారులు ముంపునకు గురైన పంట పొలాలను సందర్శించారు. నష్టం అంచనాలు పూర్తయ్యాక రైతులకు పరిహారం చెల్లించే విషయమై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పుల్లారావు హామీ ఇచ్చారు. గత కొనే్నళ్లుగా అసలు ఖరీఫ్ సాగుకే దిక్కులేని పరిస్థితుల్లో విలవిల్లాడుతున్నామని, ఆశ, నిరాశల మధ్య ఖరీఫ్ సాగుకు ఉపక్రమిస్తే ఆదిలోనే హంసపాదులా భారీ వర్షాలకు పంటలు తుడిచిపెట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నాగార్జునసాగర్‌లో గరిష్ఠ నీటి మట్టం ఉంటేనే సాగు నీరందించే అవకాశం ఉందని మంత్రి పుల్లారావు తేల్చిచెప్పారు. గురువారం పల్నాడులో పంటలను పరిశీలించిన అనంతరం గుంటూరులో మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్‌కు నీరందిస్తామని ప్రభుత్వం ప్రకటించలేదని, ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయం తీసుకుని నీటిని విడుదల చేశారని, ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు. ముందు మంచినీటి అవసరాలు తీరిన తరువాతే సాగు నీటి విషయమై పరిశీలిస్తామన్నారు.

పల్నాడులో భారీ వర్షాలకు తుడిచిపెట్టుకుపోయిన పంట పొలాలు