రాష్ట్రీయం

టార్గెట్ టీఆర్‌ఎస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 17: తెలంగాణలో బిజెపి లక్ష్యం మారుతోందా? మజ్లిస్ సంతుష్టీకరణ విధానాలు అవలంబిస్తున్న టీఆర్‌ఎస్‌ను ఇకపై కమలం లక్ష్యంగా ఎంచుకుందా? అందుకే మజ్లిస్ భుజంపై తుపాకిపెట్టి కేసీఆర్‌కు గురిపెట్టిందా? హిందువులకు చేరువయ్యే వ్యూహానికి మళ్లీ పదనుపెడుతోందా? అందుకే రజాకార్ల అరాచాలను మరోసారి తూర్పారబట్టిందా? తిరంగాయాత్ర ముగింపు సందర్భంగా, శనివారం హన్మకొండ జెఎన్‌ఎస్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకత్వంలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నుంచి, లక్ష్మణ్ వరకూ సంధించిన విమర్శనాస్త్రాలు పరిశీలిస్తే ఇలాంటి అనుమానం నిజమనిపించకమానదు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిజెపి జరిపిన సభ అంచనాలకు మించి సక్సెస్ అయింది. దాదాపు 50 వేల మంది హాజరయిన ఈ సభ ఆసాంతం టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకునే సాగింది. మజ్లిస్‌ను భుజానికెత్తుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును అమిత్‌షా సైతం నేరుగానే విమర్శించారు. ఒక్క మజ్లిస్ అనుకూల విధానాలపైనే కాకుండా, కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనూ దునుమాడటం ద్వారా, ఇకపై తమకు తెరాసతో యుద్ధం తప్పదన్న హెచ్చరిక సంకేతాలు పంపారు.
కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ సంగతి ఏమిటని, కేంద్ర నిధులు రాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని, మొత్తం నిధులను కేసీఆర్ కంపెనీ నీరుగారుస్తోందంటూ అమిత్‌షా విమర్శల వర్షం కురిపించడం ద్వారా, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్టయింది. దేశంలో ప్రతి 15 రోజులకు ఓ కొత్త పథకం చేపడుతుంటే తెలంగాణలో ఒక్క పథకం కూడా లేదని ఎద్దేవా చేయటం ద్వారా, ప్రజల్లో కేసీఆర్ పాలనపై కొత్త ఆలోచనకు బీజం వేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఒవైసీకి, మజ్లిస్‌కు భయపడి స్వాతంత్య్రదినోత్సవం జరపడం లేదని, మిమ్మల్ని గెలిపించింది ప్రజలే తప్ప, ఒవైసీ కాదన్న విమర్శ.. చాలాకాలం నుంచి మజ్లిస్‌కు అనుకూలంగా ఉన్న తెరాస వైఖరిపై అసంతృప్తితో ఉన్న హిందువులను ఆకట్టుకునే వ్యూహంగానే స్పష్టమవుతోంది.
మిగిలిన ప్రతిపక్షాల మాదిరిగా అమిత్‌షా కూడా కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షను వదలకపోవడం విశేషం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వస్తున్నారంటే ఊరకనే వస్తారా? అని ప్రశ్నించారు. అంటే వారిని కొనుగోలు చేశారని చెప్పకనే చెప్పినట్లయింది. అమిత్‌షా తన ప్రసంగం ప్రారంభంలో కేసీఆర్‌కు వినిపించేలా భారత్‌మాతాకీ జై అనాలని పిలుపునిచ్చి, చివర్లో మజ్లిస్ పెత్తనం పోవాలంటే బిజెపిని బలోపేతం చేయాలని వ్యాఖ్యానించటం బట్టి తెలంగాణలో బిజెపి అడుగులు ఏమిటనేది అమిత్‌షా శ్రేణులకు స్పష్టం చేసినట్టయింది.
కేంద్రమంత్రి దత్తాత్రేయ సైతం కేసీఆర్ పతనం వరంగల్ నుంచే ప్రారంభమవుతుందని హెచ్చరించటం ప్రస్తావనార్హం. డాక్టర్ లక్ష్మణ్ నేరుగా కేసీఆర్‌పైనే విమర్శనాస్త్రాలు సంధించారు. వీరందరికంటే కిషన్‌రెడ్డి కేసీఆర్, ఒవైసీలపై చేసిన తీవ్ర విమర్శలు పరిశీలిస్తే రాష్ట్రంలో తెరాసతో యుద్ధం తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళీధర్‌రావు, రామచందర్‌రావు వంటి సీనియర్ల ప్రసంగాలను పరికిస్తే బిజెపి ఒవైసీ భుజం మీద తుపాకి పెట్టి కేసీఆర్‌ను లక్ష్యం చేసుకుందని స్పష్టమవుతోంది.
కాగా, విమోచనదినం పేరుతో తెలంగాణలో రాజకీయ చైతన్యం, ఉద్యమాలకు పురిటిగడ్డయిన వరంగల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ విజయవంతం కావడం కమలదళాల్లో ఉత్సాహం నింపింది. సభ బయట కూడా జనం భారీ సంఖ్యలో కనిపించారు. దీనికోసం వరంగల్ జిల్లా పరిసర గ్రామాల నుంచి జరిపిన జనసమీకరణ ఫలించింది. రాష్ట్ర నేతలు సైతం గత 15 రోజుల నుంచి విస్తృతంగా పర్యటించి, దృష్టి సారించడంతో సభ సక్సెస్ అయింది.

చిత్రం... అమిత్ షాకు గదను బహూకరిస్తున్న నాయకులు... స్వాతంత్య్ర సమరయోధులతో అమిత్ షా.. ప్రజలకు అభివాదం చేస్తున్న బిజెపి నేతలు

మార్తి సుబ్రహ్మణ్యం