ఆంధ్రప్రదేశ్‌

వైకాపాలోకి కందికుంట?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 16: అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం కన్వీనర్ కందికుంట వెంకటప్రసాద్‌ను పార్టీలో చేర్చుకునేందుకు వైకాపా నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీలో చేర్చుకునే విషయమై జిల్లా వైకాపా నేతలు పలుదఫాలుగా కందికుంట సన్నిహితుల ద్వారా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టిడిపిలో తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న కందికుంట త్వరలో వైకాపాలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో పట్టు సాధించేందుకు వైకాపా ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్న చందంగా రాజకీయ ఎత్తుగడలకు శ్రీకారం చుడుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలో దారుణంగా దెబ్బతిన్న పార్టీ పట్టు సాధించేందుకు పావులుకదుపుతోంది. ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా వైకాపాను వీడి సైకిలెక్కడంతో కదిరిలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గం కన్వీనర్ కందికుంట వెంకటప్రసాద్‌ను వైకాపాలో చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ప్రసాద్‌ను బరిలో నిలిపి పోయిన సీటు దక్కించుకోవాలని పార్టీ అధినేత కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైకాపా తరఫున ఉరవకొండలో విశే్వశ్వరరెడ్డి, కదిరిలో అత్తార్ చాంద్‌బాషా గెలుపొందారు. అయితే అత్తార్ చాంద్‌బాషా అనూహ్యంగా టిడిపిలో చేరడంతో విశే్వశ్వరరెడ్డి ఏకైక ఎమ్మెల్యేగా మిగిలారు. అయితే అత్తార్ రాకను మాజీ ఎమ్మెల్యే కందికుంట జీర్ణించుకోలేకపోయారు. ఇద్దరు ఎడమొహం పెడమొహంగా మెలుగుతూ వచ్చారు. నియోజకవర్గం కన్వీనర్‌గా ఉన్న కందికుంట అత్తార్‌తో కలిసి పనిచేయకపోవడంతో అధిష్టానం పలుసార్లు దండించినట్లు సమాచారం. ఓ దశలో ఇష్టం ఉంటే పార్టీలో ఉండండి.. లేకుంటే వెళ్లిపోండి.. అంటూ అధిష్టానం హుకుం జారీచేయడంతో కందికుంట తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అధిష్టానం హెచ్చరికలతో ఖిన్నుడైన కందికుంట కలిసి పనిచేస్తామని పైకి ప్రకటించినా అత్తార్ రాకను విభేదిస్తూ వచ్చారు. పార్టీ కోసం తానెంతగానో కృషి చేస్తే తనను అవమానించారంటూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లా అధ్యక్షుడు బికె.పార్థసారథి సైతం సహకరించకపోవడంతో పార్టీలో కొనసాగాలా, వద్దా అనే సందిగ్ధంలో కందికుంట పడినట్లు సమాచారం. దీనికి తోడు నకిలీ చెక్కుల కేసు మెడకు చుట్టుకోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలకు, జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలకు కందికుంట గైర్హాజరవుతూవచ్చారు. అత్తార్ వెళ్లిపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సమర్థవంతమైన నాయకుని కోసం వెతుకుతున్న వైకాపాకు కందికుంట తారసపడ్డాడు. కదిరిలో బలమైన నాయకుడుగా ఉన్న కందికుంట వెంకటప్రసాద్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా టిడిపిని దెబ్బ తీసినట్లు అవుతుందని వైకాపా నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే తడవుగా పార్టీలో చేరాలంటూ అనుచరుల ద్వారా కందికుంటకు కబురుపెట్టినట్లు సమాచారం. ఇదే విషయమై కందికుంటకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న నాయకులతో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.