ఆంధ్రప్రదేశ్‌

కాపులకు పోటీగా బీసీ గర్జన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: కాపుల ఒత్తిడికి సర్కారు తలొగ్గకుండా తాము కూడా అందుకు ప్రతిగా ఒత్తిడి రాజకీయానికి తెరలేపే ప్రణాళికలకు బీసీలు పదునుపెడుతున్నారు. ‘కాపులకు ఏమైనా ఇవ్వండి. రాజకీయ రిజర్వేషన్లు తప్ప’ అనే నినాదంతో ఫిబ్రవరిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు తెదేపా సర్కారుపై ఒత్తిడి పెంచి తమకు కావలసిన డిమాండ్లు సాధించుకుంటున్న నేపథ్యంలో, తాము వౌనంగా ఉంటే తమ హక్కులు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్న బీసీలు, తాము కూడా అదే స్థాయిలో సర్కారుపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. ఆర్ధికంగా, సామాజికంగా బలంగా ఉన్న కాపులను బీసీల్లో చేర్పిస్తే రాజకీయ రంగంలో ఇప్పటివరకూ తాము అనుభవిస్తున్న రిజర్వేషన్లు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్న బీసీలు, ఇకపై ఆ అంశానే్న ప్రముఖంగా ప్రస్తావించాలని భావిస్తున్నారు.
కాపులకు కార్పొరేషన్ పెట్టి ఎన్నివేల కోట్లు ఇచ్చినా, ఆ వర్గ విద్యార్థులకు ఎన్ని లక్షల రూపాయల రుణాలిచ్చినా తమకు అభ్యంతరం లేదని, అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీసీల్లో చేరే కాపులకు ఆ రిజర్వేషన్ అర్హత లేకుండా నిబంధన రూపొందించిన తర్వాత, వారిని బీసీల్లో చేర్పిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్న వాదనకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఈ విషయంలో ముందు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి, వారిపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. కాపు మంత్రులు, ఎమ్మెల్యేలలో ఉన్న ఐక్యత తమ మంత్రులు, ఎమ్మెల్యేలో కొరవడినందుకే తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం చాలాకాలం నుంచి బీసీల్లో ఉంది. అందుకే ఈ అంశంలో ముందు తమ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులనే లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు. ‘ముద్రగడ బలాన్ని సాకుగా చూపించి కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలో తమ బలం పెంచుకుంటున్నారు. ముద్రగడ ఎంత బలంగా ఉంటే పార్టీలో తమకు అంత ప్రాధాన్యం ఉంటుందని వారంతా కలసికట్టుగా ఉన్నారు. కాపు అధికారులకు మంచి పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు. కావలసిన నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. కానీ మా మంత్రులు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా పదవులే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. బీసీ కార్పోరేషన్‌కు నిధులిప్పించడంలో మా వాళ్లు విఫలమయ్యారు. అందుకే ముందు మా ఇంటి నుంచే ఒత్తిడి మొదలుపెడుతున్నామ’ని శెట్టిబలిజ నేత ఒకరు చెప్పారు.
సామాజికవర్గపరంగా కాపులను వ్యతిరేకించే శెట్టిబలిజలు ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు వారి నేతల మాటల బట్టి స్పష్టమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం తెలిసిందే. ముద్రగడ గతంలో చేసిన కాపు ఉద్యమాల వల్ల ఎక్కువగా నష్టపోయింది తామేనని, బీసీ రిజర్వేషన్ డిమాండుతో మళ్లీ ఈసారి కూడా తామే నష్టపోతున్నామని శెట్టిబలిజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కోస్తాలోనే భారీ బహిరంగసభ పెట్టి బీసీల సత్తా చూపిస్తామని చెబుతున్నారు. బీసీ వర్గాల సమాచారం ప్రకారం రాజమండ్రి వేదికగా వచ్చే ఫిబ్రవరిలో బీసీ గర్జన నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాజమండ్రిని వేదికగా ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం కూడా ఉందంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో శెట్టిబలిజల బలమేమిటో సర్కారుకు చాటాలంటే రాజమండ్రినే సరైన వేదిక అని వారు స్పష్టం చేస్తున్నారు.
కాపులకు రాజకీయ రిజర్వేషన్లు తప్ప ఏమి ఇచ్చినా పట్టించుకోమని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టం చేయడంలో తమ మంత్రులు విఫలమైనందుకే, తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు. ‘మాకు ఉన్నవే స్ధానిక సంస్ధల్లో రిజర్వేషన్లు. రేపు కాపులను కూడా బీసీల్లో చేర్పిస్తే డబ్బు ఎక్కువగా ఉండే వారికే సీట్లు దక్కుతాయి. డబ్బులేని అసలు బీసీలు అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉన్నందుకే ఈ డిమాండు తెరపైకి తీసుకువస్తున్నామ’ని అమలాపురానికి చెందిన శెట్టిబలిజ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ముద్రగడను చూసి భయపడి, కాపులను అందలమెక్కిస్తూ తమను విస్మరిస్తున్న సర్కారు రాజమండ్రి సభతో తమనూ అందలమెక్కించాల్సిన అనివార్య పరిస్థితిని సృష్టిస్తామని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.