ఆంధ్రప్రదేశ్‌

ఆటుపోట్లలో నిజాంపట్నం పోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 21.. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతి చేరువలో ఉన్న నిజాంపట్నం పోర్టు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. విస్తరణ విషయంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంతో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.. హార్బర్ విస్తరణకు గత దశాబ్దాల కాలంగా చేసిన ప్రతిపాదనలు అటకెక్కుతున్నాయి..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోర్టు ఆథారిత పరిశ్రమలపై దృష్టిసారించిన నేపథ్యంలో నిజాంపట్నంకు మహర్దశ పడుతుందని భావించారు. రోజుకు కోటి రూపాయలకు పైగా మత్స్య ఉత్పత్తులు లభ్యమవుతున్న ఈ పోర్టుకు వసతుల కల్పనలో మితిమీరిన జాప్యం జరుగుతోంది..ఏపిని ఈస్ట్‌కోస్టు హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.. ఇందులో భాగంగా మూడు మేజర్, మరో 10 వరకు మైనర్ పోర్టులను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందులో నిజాంపట్నం హార్బర్ కూడా ఉంది. పదెకరాల స్థలంలో నిర్మించిన హార్బర్ ప్లాట్‌ఫాం ప్రస్తుతం శిధిలావస్థకు చేరుకుంది. దీనికితోడు హార్బర్‌కు బోట్ల తాకిడి రెట్టింపయింది. ఈ పరిస్థితుల్లో విస్తరణ జరక్కపోతే ప్రమాదపుటంచున జీవన్మరణ పోరాటం సాగించాల్సి వస్తుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకంగా అనువైన దీవితో పాటు బీచ్ సదుపాయం ఉన్నప్పటికీ అభివృద్ధి నత్తనడకన సాగుతోంది.. గుంటూరు జిల్లాలో సూర్యలంక బీచ్‌కే సందర్శకులు అధికంగా వస్తుంటారు. నిజాంపట్నం హార్బర్‌కు చేరువలో బీచ్‌ను తలదనే్న రీతిలో అవకాశాలు ఉన్నప్పటికీ నిధుల కొరత కారణంగా నిరుపయోగంగా మారుతోంది. హార్బర్ వద్ద నుంచి తీరానికి స్నానానికి వెళ్లేందుకు అవరోధంగా ఉన్న పెద్ద కాల్వపై వారథి నిర్మాణానికి ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. కోస్టుగార్డు ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. చేపలు, రొయ్యల నిల్వకు జెట్టీ విస్తరణ చేయాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది.

అటు ఐటి సోదాలు.. ఇటు జన్మదిన వేడుకలు

టిడిపి నేత బద్రీనారాయణ ఇంట కార్యకర్తల సందడి

ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, డిసెంబర్ 21: చిత్తూరులో టిడిపి నేత బద్రీనారాయణ ఇంట్లో బుధవారం ఐటి ఆధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, మరోపక్క ఆయన జన్మదిన వేడుకలను ఇంటి వద్దనే ఘనంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు ఇంటిపై ఐటి అధికారుల దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఆయన వియ్యంకుడైన చిత్తూరుకు చెందిన టిడిపి నేత బద్రీనారాయణ ఇంటిపై కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ క్రమంలో ఆయన ఇంట్లో ఐటి అధికారుల బృందాలు సోదాలు చేస్తుండగానే బద్రీనారాయణ అభిమానులు పార్టీ శ్రేణులు ఇంటి వద్ద ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీ కేకు కట్ చేసి పెద్దఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు అభిమానులు బద్రీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒకపక్క ఇంట్లో సోదాలు జరుగుతుండగా మరోపక్క అక్కడే ఈ జన్మదిన వేడుకలు జరగడం నగరంలో చర్చనీయాశంగా మారింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి పెద్దఎత్తున నినాదాలు చేయడంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇంటి వద్ద ముందస్తు చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కె బిట్రగుంటలో కలకలం
జరుగుమల్లి: తమిళనాడు సిఎస్ రామ్మోహన్‌రావు ఇంటిపై ఐటి దాడులు నిర్వహించడంతో తన స్వగ్రామం అయిన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె బిట్రగుంట గ్రామంలో కలకలం రేపింది. రామ్మోహన్‌రావు తల్లి శివరావమ్మ 2007లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2007 నుంచి 2011 వరకు ఆ గ్రామ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారు.
శివరావమ్మకు ముగ్గురు కుమారులు, కుమార్తెలు. అందులో పెద్దకుమారుడు రామ్మోహన్‌రావు తమిళనాడులో సిఎస్‌గా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు విజయ్, మూడవ కుమారుడు శ్రీనివాసులు, కుమార్తె శేషమ్మ, ముగ్గురు కుమారులు తమిళనాడులో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం కుమార్తె శేషమ్మ బిట్రగుంటలో జీవనం సాగిస్తున్నారు. శివరావమ్మకు ఆరోగ్యం బాగా లేనందున ప్రస్తుతం కుమారుల వద్దనే ఉంటున్నట్లు సమాచారం. రామ్మోహన్‌రావు జడ్‌పి ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులకు విరాళాలు అందజేశారు. రామ్మోహన్‌రావు ఈ ప్రాంతంలో చదువుకుని కలెక్టర్‌గా ఉద్యోగం రావడం గ్రామాల్లో హర్షంవ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు కుటుంబ సమేతంగా జనవరి 10న స్వగ్రామం అయిన కె బిట్రగుంటకు వచ్చి బోగి, సంక్రాంతి, కనుమ పండుగ అనంతరం చెన్నై వెళతారని బిట్రగుంట ప్రజలు చెబుతున్నారు. బుధవారం సిఎస్‌పై ఐటి దాడులు చేయడంతో తన స్వగ్రామం అయిన బిట్రగుంటకు ఐటి అధికారులు వస్తారని మీడియాలో రావడంతో కలకలం రేగింది.

పారిశ్రామికాభివృద్ధికి
ప్రాధాన్యత: కెఇ కృష్ణమూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 21: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, వౌలిక సదుపాయాల కల్పనకు 45,493 ఎకరాలను కేటాయించామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి వెల్లడించారు. నగదు రహితంగా చేయడం వల్ల దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రెండు రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు విజయవాడలో బుధవారం ప్రారంభమైంది. పారిశ్రామిక ప్రగతికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రం అవలంబించిన పద్ధతులు, రెవెన్యూ సంస్కరణలు అధ్యయనం చేయడానికి వివిధ రాష్ట్రాల ప్రతినిధులు సందర్శిస్తున్నారని, ఇది గర్వకారణమన్నారు. ప్రమోషన్ ఆఫ్ ఎక్స్‌లెన్సు ఇన్ ఇ-గవర్నెన్సు కేటగిరి కింద రాష్ట్రానికి అవార్డు ప్రకటించిందన్నారు. భూములన్నింటినీ జియో ట్యాగ్ చేసిన రాష్ట్రంగా గుర్తింపువచ్చిందన్నారు. రియల్ టైమ్ పరిపాలనతో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. నగదు రహితంగా చేయడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మీ-్భమి పోర్టల్ పేరుతో తెలుగులో రెవెన్యూ శాఖ రూపొందించిందని, దీనిని 3.85 లక్షల మంది వీక్షించాలరన్నారు.

తూర్పు నౌకాదళంలో భద్రతా సమీక్ష

విశాఖపట్నం, డిసెంబర్ 21: భారత నౌకాదళం భద్రతా సమీక్ష తూర్పునౌకాదళం ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగింది. తూర్పునౌకాదళ ప్రధానాధికారి హెచ్‌ఎస్ బిస్త్ సమావేశాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే భద్రతా సమీక్షలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవి) కంట్రోలర్ ఆఫ్ పర్సనల్ సర్సీసెస్ విభాగం వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సారధ్యం వహించారు. ఈ సందర్భంగా తూర్పునౌకాదళ ప్రధానాధికారి బిస్త్ మాట్లాడుతూ రక్షణ రంగ ప్రధాన కేంద్రాల్లో రక్షణ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల కదలికలను ఎప్పటి కప్పుడు కనిపెడుతూ తక్షణమే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రక్షణ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. రక్షణ పరంగా అప్రమత్తతతో పాటు నౌకాదళ సిబ్బంది క్రమశిక్షణపై ఆయన ఉపన్యసించారు. ఈ సమీక్షలో మారుతున్న నేర విధానాలతో పాటు అత్యాధునిక రక్షణ వ్యవస్థ రూపకల్పన, అందుకు అవసరమైన వౌలిక సదుపాయలపై కూడా చర్చించారు.
తెగిన విద్యుత్ తీగలు.. నిలిచిన రైలు
వెంకటాచలం, డిసెంబర్ 21: నెల్లూరు జిల్లా వెంకటాచలం రైల్వేస్టేషన్ సమీపంలో 157-24 నెంబర్ విద్యుత్తు స్తంభం వద్ద విద్యుత్తు తీగ లు తెగిపోవటంతో బుధవారం వేకువజామున నుంచి నెల్లూరు -గూడూరు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పండింది. తమిళనాడు నుంచి జమ్ముకశ్మీర్‌కు ఫిరంగులు, ఆర్మీ వాహనాలు, ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రైలు ఉదయం 4.20 గంటల సమయంలో వెంకటాచలం రైల్వే స్టేషన్ వద్దకు రాగానే విద్యుత్తు తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్తు స్తంభం కూడా నెల మీదకు ఒరిగిపోయి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రధాన మార్గంలోనే తీగలు తెగిపోవటంతో గూడూరు - నెల్లూరు మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. హుటాహుటిన స్టేషన్ సిబ్బంది రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి రైలను పక్క మార్గంలోకి మళ్లించి విద్యుత్తు స్తంభాన్ని సరిచేసి విద్యుత్‌వైర్లు బిగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధచారు.

ఇ-పోస్‌కు బదులుగా
ఎం-పోస్ యంత్రాలు

జనవరి నుంచి అమలుకు ప్రయత్నాలు

ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, డిసెంబర్ 21: నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ఇప్పటివరకు అమల్లోవున్న ఇ-పోస్ యంత్రాలకు బదులుగా ఎం-పోస్ యంత్రాలు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డెబిట్, క్రెడిట్, రూపె తదితర కార్డుల ద్వారా చెల్లించడానికి బ్యాంకులు అందజేసే ఇ-పోస్ యంత్రాలను మాత్రమే ఇప్పటివరకు ఎక్కువశాతం మంది వ్యాపారులు ఉపయోగిస్తున్నారు. అయితే రాష్టవ్య్రాప్తంగా నగదు రహిత లావాదేవీల కోసం వాణిజ్య పన్నుల శాఖ అంచనాల ప్రకారం సుమారు ఐదు లక్షల ఇ-పోస్ యంత్రాలు అవసరమవుతాయి. ఇవన్నీ వివిధ బ్యాంకులు ఆయా వ్యాపారులకు అందించాల్సివుంది. అయితే మెషిన్ల కొరత కారణంగా ఇప్పట్లో అందరికీ ఈ మెషిన్లు అందించే అవకాశాలు చాలాతక్కువ. పైపెచ్చు నగదు కొరత నేపథ్యంలో ఇప్పటికే బ్యాంకులపై తీవ్రమైన పనిఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో ఇ-పోస్ స్థానంలో ఎం-పోస్ యంత్రాలు నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇ-పోస్ యంత్రం కంటే పరిమాణంలో చిన్నగా ఉండటమేకాక, ఖరీదు కూడా తక్కువ. లావాదేవీలు సైతం సులభంగా జరగడంతోపాటు, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా వాణిజ్యపన్నుల శాఖ వాటిని అందించే అవకాశమున్నందున ఎం-పోస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఎం-పోస్ యంత్రం చూడటానికి కాలిక్యులేటర్ తరహాలో ఉంటుంది. పేపర్‌లెస్ పరికరం. కార్డును స్వైపింగ్ చేసిన అనంతరం వర్తకుడు, కొనుగోలుదారుని సెల్‌ఫోన్లకు జరిగిన లావాదేవీల సమాచారం ఎస్‌ఎంఎస్ రూపంలో అందుతుంది. కేవలం సిమ్ యాక్టివేషన్‌తో ఈ పరికరం పనిచేస్తుంది.వాణిజ్య పన్నుల శాఖ ఉచితంగా వ్యాపారులకు ఈ పరికరం అందిస్తుంది. దీనికి నెలకు రూ.99 అద్దె చెల్లిస్తే సరిపోతోంది. ఈ నేపథ్యంలో 2017 జనవరి 1వ తేదీ నుంచి వీటిని అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ అధికార్లు కసరత్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ఇపోస్ యంత్రాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. కేవలం వాణిజ్య పన్నుల శాఖవద్ద రిజిస్టర్ అయిన వారికే కాక, నగదు లావాదేవీలు జరిగే ప్రతిచోటా వీటిని నెలకొల్పాలని ఆ శాఖ భావిస్తోంది. తొలుత లావాదేవీలు ఎక్కువగా జరిగే వ్యాపారులకు అందించి, దశలవారీగా అందరికీ అందించాలనేది లక్ష్యంగా ఉంది. ఎం-పోస్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సిటిఒ స్ధాయి అధికారులు సమాచారాన్ని అందిస్తున్నారు. కొత్త సంవత్సరం నుండి వ్యాపారుల వద్ద ఎం-పోస్ యంత్రాలు దర్శనమివ్వనున్నాయి.

69కి పెరగనున్న
రెవెన్యూ డివిజన్లు

నెలాఖరుకు పల్స్ సర్వే పూర్తి

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 21: రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 69కి పెరగనుంది. ఇప్పటి వరకూ 51గా ఉన్న డివిజన్లను శాఖాపరమైన సౌలభ్యం కోసం పెంచనున్నారు. ఈ విషయాన్ని విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనుతాయని తెలిపారు. శ్రీకాకుళంలో 3 నుంచి నాలుగుకు, విజయనగరంలో 2 నుంచి 4, విశాఖలో 4 నుంచి 6, పశ్చిమ గోదావరిలో 5 నుంచి 6, కృష్ణాలో 4 నుంచి 5, గుంటూరులో 4 నుంచి 7కు, ప్రకాశంలో 3 నుంచి 5కు, చిత్తూరులో 3 నుంచి 5, కడపలో 3 నుంచి 4కు, అనంతపురంలో 5 నుంచి 6కు, కర్నూలులో 3 నుంచి 5కు పెంచనున్నారు. తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం పెంచడం లేదు. దీంతో 69 డివిజన్ల పరిధిలో 175 మండాలు ఉంటాయి. పల్స్ సర్వేను డిసెంబర్ 31తో ముగించనున్నామని తెలిపారు. సమగ్ర డేటాతో అసలైన లబ్ధిదారులకు పథకాలు చేరేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన వారి వివరాలను సేకరించి, త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.