రాష్ట్రీయం

రెండు రాష్ట్రాలకూ పట్టని తెలుగు అకాడమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఉన్నత విద్యా మండలి విభజన అనంతరం దాని ఆధీనంలోని నిధులపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన ఇరు రాష్ట్రాలూ దాదాపు 350 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న తెలుగు అకాడమి వ్యవహారంపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా తెలుగు అకాడమి ఆలనా పాలనా లేక ఏటా వంద కోట్ల రూపాయిల వరకూ నష్టపోతోంది. పాఠ్యపుస్తకాలు, జనరంజక గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాల అమ్మకాలు ద్వారా ఏటా వంద కోట్ల రూపాయిలు ఆదాయం పొందే సామర్ధ్యం ఉన్న తెలుగు అకాడమిపై ఇరు రాష్ట్రాలు దృష్టి పెట్టకపోవడంతో సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్నారు. సాంక్షన్ పోస్టుల్లో మూడో వంతు మంది మాత్రమే పనిచేస్తున్నా వారికి సైతం చేతినిండా పనిలేక అసౌకర్యానికి గురవుతున్నారు. మరో రెండు నెలల్లో విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్నా కొత్త పాఠ్యగ్రంథాల అతీగతీ నేటికీ లేదు. తెలుగు అకాడమి పాఠ్యగ్రంథాల కోసం పెద్ద ఎత్తున పేపర్ కొనుగోలు చేయాల్సి ఉన్నా ఆ ప్రక్రియ కూడా నేటికీ పూర్తికాలేదని తెలిసింది. ప్రాంతీయ పంపిణీ కేంద్రాల్లో పుస్తకాలే లేవు. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని సమీపంలోని ఇతర కేంద్రాలకు తరలించడంతో ఉన్న కేంద్రాలు మూత పడే పరిస్థితి వచ్చింది. తెలుగు అకాడమి టెన్త్ షెడ్యూలులో ఉండటంతో పదోన్నతులు, బదిలీలు, తొలగింపులు, నియామకాలు ఇరు రాష్ట్రాల అనుమతితో జరగాల్సి ఉంది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నా ఆంధ్రాప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరిస్తోంది. తెలుగు అకాడమి గతంలో సాంస్కృతిక శాఖలో ఉన్నా దానిని నేడు ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి తెచ్చారు. నియమనిబంధనలను పక్కన పెట్టి ప్రాధమిక విద్యాశాఖకు చెందిన ఒక అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించారు. దాంతో ఏ రోజు తీసుకోవల్సిన నిర్ణయాలు ఆరోజు తీసుకోకపోవడంతో తెలుగు అకాడమి పాలన కుంటుపడింది. రెండేళ్లు గడిచినా ఒక్కసారి కూడా గవర్నింగ్ బాడీ సమావేశం జరగలేదని అకాడమి ఉద్యోగులు చెబుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇరు రాష్ట్రాలు వాటిని 58: 42 శాతం నిష్పత్తిలో పంచుకోవల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపించకపోవడం విడ్డూరం. అకాడమిలో 160 పోస్టులకు గానూ కేవలం 60 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 70 మంది అవుట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్నారు. 18 పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసినా నేటికీ ఆ రిక్రూట్‌మెంట్ ఎవరికీ పట్టలేదు. అనేక పాఠ్యగ్రంథాల సిలబస్ మారినా ఆ పుస్తకాలను ఇంత వరకూ ప్రచురించలేదు. వొకేషనల్ ఎడ్యుకేషన్, ఉర్దూ పుస్తకాల అతీగతీ లేదు. జనరంజక గ్రంథాలు ముద్రణ దాదాపు ఆగిపోయింది. తెలంగాణలో పోటీపరీక్షల నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నా అవసరమైన పుస్తకాలను అందించడంలో తెలుగు అకాడమి విఫలమైందనే ఆరోపణలు వినవస్తున్నాయి. రెగ్యులర్ సంచాలకుడి నియామకంలోనూ ఇరు రాష్ట్రాలూ సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ నిమ్మకునీరెత్తినట్టు ఉండటం వల్లనే అకాడమి మళ్లీ తిరోగమిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.