ఆంధ్రప్రదేశ్‌

టిటిడి ఉద్యోగుల ఇళ్లపై ఏసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 26: టిటిడిలో సూపరింటెండెంట్ స్థాయిలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు, కల్యాణకట్టలో మేస్ర్తి హోదాలో పనిచేస్తున్న ఒక యూనియన్ నాయకుడు ఇంటిలో మంగళవారం ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ దాడులు బుధవారం ఉదయం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఎసిబి అధికారులు గుర్తించినట్లు సమాచారం. వాస్తవానికి టిటిడి పరిపాలనా భవనంలో రిక్రూట్‌మెంట్ సెల్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న నరేంద్రకు సంబంధించిన సమాచారం అందడంతో ఎసిబి అధికారులు దాడులు చేయాలని నిర్ణయించారు. ఈలోపే వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న యూనియన్ నాయకుడు మోహన్‌రెడ్డి, నారుూబ్రాహ్మణుల యూనియన్‌కు సంబంధించిన నాయకుడు తంగవేలుకు సంబంధించిన సమాచారం కూడా ఎసిబి అధికారులకు అందడంతో డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో ముగ్గురు ఉద్యోగులబంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. సుమారు 11 చోట్ల ఎసిబి దాడులు జరుగుతున్నట్లు తెలిసింది. నరేంద్ర ఇంటిలో దాడులు నిర్వహిస్తున్న శంకర్‌రెడ్డి బృందం ఇప్పటికే ఆరు స్థలాలకు సంబంధించిన పత్రాలను, 18 స్థలాల విక్రయాలకు సంబంధించిన ఆధారాలను సేకరించింది. ఒక షాపింగ్ కాంప్లెక్స్, మూడు ఇళ్లను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. బుధవారం నరేంద్రకు సంబంధించిన రెండు లాకర్లను తెరవడానికి ఎసిబి అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తంగవేలు వద్ద కూడా భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా గుర్తించారు. మోహన్‌రెడ్డికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ఈ ముగ్గురు ఉద్యోగులు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు కూడా ఎసిబి అధికారులు గుర్తించారు. ఏదేమైనా తొలిసారిగా టిటిడికి సంబంధించిన ముగ్గురు ఉద్యోగులపై దాడులు చేయడం టిటిడి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యే క్వార్టర్లు

విఐపిల కోసం మరికొన్ని గదులు స్థలాన్ని పరిశీలించిన జిఎడి అధికారులు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 26: విజయవాడ నగర నడిబొడ్డునున్న స్టేట్ గెస్ట్ హౌస్‌ను పూర్తిగా తొలగించి, అందులో ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం స్టేట్ గెస్ట్‌హౌస్ స్థలాన్ని సాధారణ పరిపాలనా విభాగం అధికారులు పరిశీలించారు.
ప్రస్తుతం స్టేట్ గెస్ట్ హౌస్‌లో 22 గదులు ఉన్నాయి. ఇందులో 13 గదులను ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కోసం కేటాయించారు. మిగిలిన తొమ్మిది గదులను విఐపి, వివిఐపిలకు కేటాయిస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోకపోవడంతో విజయవాడకు వచ్చే మంత్రులంతా ప్రైవేటు హోటళ్లలో బస చేస్తున్నారు. దీనివలన ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు స్టేట్ గెస్ట్‌హౌస్‌ను పూర్తిగా తొలగించి, అందులో భవనాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌ను 1913లో నిర్మించారు. అప్పట్లో రెండు బ్లాక్‌లను నిర్మించారు. 1984లో మూడవ బ్లాక్‌ను ప్రారంభించారు బ్రిటిష్ కాలంలో నిర్మించిన రెండు బ్లాకులు చాలా వరకూ శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాగే కొన్ని గదులైతే ఇప్పటికే శిథిలమైపోయాయి.
భారీగా పెరిగిన నిర్వహణ భారం
ఇదిలా ఉండగా ప్రస్తుతం స్టేట్ గెస్ట్ హౌస్‌కు రోజుకు కనీసం నలుగురు, ఐదుగురు విఐపిలు వచ్చి వెళుతున్నారు. ఇక్కడ ఏసి గది రెంట్ కేవలం 150 రూపాయల మాత్రమే. ఈ లెక్కన నెలకు గెస్ట్ హౌస్‌కు ఎనిమిది వేల నుంచి 15 వేల రూపాయల ఆదాయం మాత్రమే వస్తోంది.
నిర్వహణ మాత్రం తడిపి మోపెడు అవుతోంది. విజయవాడకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి గెస్ట్ హౌస్ నిర్వహణ మరింత పెరిగిపోయింది. చంద్రబాబు వాహనాల డీజిల్‌కే నెలకు రెండు లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. దీంతోపాటు సుమారు కోటి రూపాయల వరకూ హౌస్ టాక్స్ బకాయిలను నగర పాలక సంస్థకు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ బిల్లుల బకాయిలు చూస్తే 56 లక్షల రూపాయల వరకూ చేరుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్టేట్ గెస్ట్ హౌస్‌ను కొనసాగించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది.
ఇక ఈ గెస్ట్‌హౌస్‌లోని రెండు బ్లాక్‌లను తొలగించి, జి ప్లస్ టెన్ లేదా జి ప్లస్ నైన్ విధానంలో సుమారు 150 నుంచి 200 గదులతో కూడిన ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మంచాలని భావిస్తోంది. అలాగే, విజయవాడ నగరానికి పెద్ద సంఖ్యలో విఐపిలు, వివిఐపిలు వస్తున్నందున వారి కోసం 100 నుంచి 200 గదులు అదనంగా నిర్మించాలని భావిస్తోంది. ఒక మీటింగ్ హాల్, ఒక వెయిటింగ్ హాల్, ఒక కిచెన్ కూడా నిర్మించాలని అనుకుంటోంది. ప్రస్తుతం స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఉన్న భారీ వృక్షాన్ని యథాతథంగా ఉంచి, మిగిలిన భాగాన్ని తొలగించాలన్న ఆలోచన చేస్తున్నారు. అటు ఎయిర్‌పోర్టుకు, ఇటు సెక్రటేరియట్‌కు మధ్యలో ఉన్న ఈ స్థలమే అన్ని విధాలా మంచిదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇంత పెద్ద ఎత్తున గదులను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్న సమయంలో వీటి నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే బాగుటుందని భావిస్తున్నారు.

ఇక స్మగ్లర్ల ఆటకట్టు

ఎర్రచందనం టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు

నెల్లూరు, ఏప్రిల్ 26: దేశంలోనే వినూత్నంగా అటవీ శాఖకు వేలిముద్రల సాంకేతిక పరిజ్ఞానాన్ని జతచేస్తూ పోలీస్ శాఖ వేలిముద్రల విభాగానికి అనుసంధాన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఎర్ర చందనం టాస్క్ఫోర్స్ డి ఐ జి కాంతారావు పేర్కొన్నారు. నెల్లూరులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి వివరాలను తెలియచేశారు. దేశంలో తొలిసారి మన రాష్ట్రంలో ఈ విధానం అమలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలవాలని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిజిపి రాముడుల సలహాలు, ఆదేశాలతో ఎర్ర చందనం స్మగ్లర్లను కట్టడి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పోలీస్ శాఖకు మాత్రమే పరిమితమైన ఈ వేలిముద్రల పరిజ్ఞానం ఇకపై అటవీ శాఖకు కూడా అందుబాటులోకి రానుందన్నారు. ఇందుకోసం అటవీ సిబ్బందికి వేలిముద్రల నిపుణులు శిక్షణను అందిస్తారని వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడినపుడు తప్పుడు సమాచారం, గుర్తింపు వివరాలు అందిస్తుంటారని, గతంలో వారు ఇదే తరహా నేరాలకు పాల్పడి ఉన్నప్పటికీ వారి వివరాలు పూర్తిగా తెలిసేవి కాదన్నారు. ఇకపై నిందితులు పట్టుబడిన వెంటనే వారి వివరాలతో పాటు వేలిముద్రలను కూడా అటవీ సిబ్బంది తీసుకుంటారనీ, ఈ సమాచారాన్ని రాష్టస్థ్రాయిలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకు అనుసంధానం చేస్తామన్నారు. అక్కడ నుంచి కేంద్రస్థాయికి ఇదే తరహాలో అనుసంధానం జరిగి ఉంటుందన్నారు. దీంతో నేరానికి పాల్పడిన వారు ఇతర దేశాలకు చెందిన వారైనా సమాచారం చిటికెలో తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ఇతర కేసుల్లో వారి వివరాలు అటవీ శాఖకు వెంటనే తెలిసే అవకాశం ఉన్నందున ఆయా కేసుల పూర్వాపరాలను పరిశీలించి కోర్టుకు సమర్పించే అవకాశం కలుగుతుందన్నారు. దీంతో నేరస్తులకు గరిష్ట శిక్షలు పడే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. త్వరలో అటవీ శాఖ సిబ్బందికి, అధికారులకు తమ శాఖ తరపున వేలిముద్రల నిపుణులు శిక్షణను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఎన్‌కౌంటర్‌లో జవానుకు గాయాలు

చింతూరు, ఏప్రిల్ 26: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసు బలగాలు మావోయిస్టుల స్థూపాన్ని ధ్వంసం చేయగా, ఎదురుకాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. వివరాలిలావున్నాయి... సిఆర్పీఎఫ్, డిస్ట్రిక్ట్ ఫోర్సు బలగాలు గంగులూరు పోలీసు స్టేషన్ పరిధిలోని దండకారుణ్యంలో మంగళవారం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసు బలగాలకు మావోస్టులకు చెందిన 20 అడుగుల స్మారక స్థూపం కనబడింది. దీంతో పోలీసు బలగాలు ఈ స్థూపాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కాగా బీజాపూర్ జిల్లా బాసాగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 204 కోబ్రా బెటాలియన్ కువర్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న సమయంలో మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో దీపుదాస్ అనే జవానుకు బులెట్ గాయాలైనట్టు ఆ జిల్లా ఎస్పీ ఇందిరా కల్యాణ్ తెలిపారు. గాయపడిన జవానును హెలికాఫ్టర్ ద్వారా రాయపూర్ తరలించారు.