డైలీ సీరియల్

పూలకుండీలు 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విధంగా రాత్రి తెల్లవార్లూ ఆలోచనకు, మనసుకూ మధ్య జరిగిన అంతర్మథనంలో ఆఖరికి ఆలోచన మీద మనసే పైచేయి సాధించింది. శాంతమ్మ అంతవరకూ తానెరుగని ఓ విషయం మీద సానుకూల నిర్ణయం తీసుకునేలా చేసింది.
శాంతమ్మ రోజూ పొద్దునే్న ఐదు గంటలకల్లా నిద్రలేచి ఇంట్లో పనులు చక్కబెట్టుకుని ఏడు గంటలకల్లా కాలనీలో పనికెళ్లిపోతుంది. అటువంటిది ఆ రోజు తెల్లవార్లూ ఆలోచనతో నిద్రపోకపోవడంవల్ల తల దిమ్మెక్కి కళ్ళు ఎర్రబడి, వళ్ళంతా నొప్పులు రావడంతోబాటు జ్వరం కూడా తగిలి ఏడు గంటలు కావస్తున్నా పక్కమీదనుండి లేవలేకపోయింది.
కోడలెందుకో తెల్లవార్లూ నిద్రపోకపోవడం, తెల్లవారేసరికి జ్వరం రావడం గమనించి అత్త కమలమ్మ ‘‘ఏంది బిడ్డా! ఏమైంది. తెల్లవార్లు నిద్రబోకుండ చేపపిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకున్నవెందుకు?’’ అంటూ కోడలు వళ్ళు పట్టి చూసింది.
అత్తగారి ఆత్మీయతకు గుండెలు చెమ్మగిల్లిపోతుంటే ‘‘ఒక్కసారిగా అత్తమ్మా!’’ అంటూ దిగ్గున లేచిన శాంతమ్మ అమాంతంగా ఆవిడను గట్టిగా కౌగిలించుకుని బాణం దెబ్బ తగిలిన పక్షి మాదిరిగా పొగిలి పొగిలి ఏడవసాగింది.
పెళ్ళైయినది మొదలు ఇప్పటికి నలుగురు పిల్లల తల్లి అయినదాకా ఎన్ని ఇబ్బందులొచ్చినా ఏనాడూ కంట తడిపెట్టి ఎరుగని కోడలు అంత బేలగా తనను పట్టుకొని ఏడవడంతో ఒక్కసారిగా హడలిపోయిన అత్త కంగారుపడిపోతూ ‘‘ఏమైంది బిడ్డా! ఏమైంది?’’ అంటూ మరింతగా దగ్గరికి తీసుకుని ఆర్తిగా గుండెల్లో పొదువుకుంది.
కొంతసేపటికి దుఃఖం నుండి తేరుకున్న శాంతమ్మ ‘‘ఏం లేదు, బొంబాయిలో మీ కొడుక్కేదో యాక్సిడెంట్ అయినట్టు తెల్లవార్లూ ఒకటే పీడ కలలొచ్చాయి’’ అసలు విషయాన్ని మనుసలోనే అదిమి పెట్టుకుంటూ మార్చి చెప్పింది.
‘‘అయ్యో అట్లనా! అయినా నీ పిచ్చిగాని కలలో జరిగింది ఇలలో జరుగదులే బిడ్డా! నువ్వేం భయపడకు’’ అంటూ కోడలిని ఊరడించిన అత్తామామలు ఎందుకైనా మంచిదని ఆ సాయంత్రమే పెద్ద మసీదు సెంటర్లో వుండే పాపామియా దగ్గరికెళ్లి అంత్రం రాయించుకొచ్చి కోడలి ఎడమ దండ చేతికి కట్టారు.
ఆ తరువాత మూడు రోజులపాటు హైదరాబాద్ వెళ్ళాలా? వద్దా? అన్న అంశం మీద తీవ్ర స్థాయిలో మల్లగుల్లాలు పడిన శాంతమ్మ ఆఖరికి వెళ్లాలనే నిర్ణయానికొచ్చి ఆర్‌ఎంపి లింగయ్యకు తన అంగీకారాన్ని తెలియజేసింది.
ఇంకా నాలుగు రోజులు ఆలస్యమైనా శాంతమ్మ తన దగ్గరికొచ్చి అంగీకారాన్ని తెలియజేస్తుందన్న పూర్తి భరోసాతో వున్న ఆర్‌ఎంపి లింగయ్యకు ఆమె అంగీకారం ఏమంత వింతగా అన్పించలేదు. అందుకే ఆమె వంక చూస్తూ ‘‘మంచిది నేను హైదరాబాద్ ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటారో తెలుసుకుంటాను’’ అంటూ అప్పటికి సంభాషణను పొడిగించకుండా ముగించాడు.
మూడు రోజుల తరువాత
ఆ రోజు ఉదయానే్న శాంతమ్మ కాలనీకి పనికి బయలుదేరబోతుండగా ఆర్‌ఎంపి లింగయ్య బండేసుకొని వాళ్ళ ఇంటికొచ్చాడు.
అతణ్ణి చూడ్డంతోటే తత్తరపాటుకు లోనైన శాంతమ్మ గబగబా గుడిశెలోనుండి బయటకొచ్చి ‘‘ఏందన్నా! సరాసరి ఇంటికే వచ్చినవేంది?’’ అన్నట్టు చూసింది.
‘‘ఇల్లు కాయితాలు రాయించుకోటానికొచ్చిండేమో?’’ ఆర్‌ఎంపి లింగయ్యను గమనించిన మామ మల్లయ్య తన పక్కనే వున్న భార్య కమలమ్మతో అన్నాడు మెల్లగా.
‘‘రాత్రి హైదరాబాద్ ఫోన్ జేసి మాట్లాడాను. వాళ్ళు సరేనన్నారు ఇక నీదే ఆలస్యం. కాకపోతే’’ అంటూ ఇంకేదో విషయం చెప్పాలా వద్దా అన్నట్టు నటిస్తూ ఇంట్లోకి చూడసాగాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘నా దగ్గరింకా అనుమానమేందన్నా! అదేందో చెప్పరాదు’’ అన్నట్టు అతని వంక చూసింది శాంతమ్మ.
‘‘ఏం లేదు, మొన్న నీకిస్తారన్న మూడు లక్షల్లో యాభై వేలు హైదరాబాద్‌లో వుండే మధ్యవర్తులు తీసుకుంటారట. మరి నువ్వు దానికొప్పుకుంటే వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఒకవేళ అది నీకు నచ్చకపోనంటే చెప్పు, గుంటూరు ఏరియా నుంచి ఆ రేటుకి రావడానికి చాలామంది వున్నారంట, వాళ్ళల్లో ఒకళ్ళను పిలిపించుకుంటాం అంటున్నారు. మరి నీకిష్టమైతే చెప్పు. ఇపుడే పదివేలు అడ్వాన్స్ ఇస్తాను. తీసుకుని నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. ఏ సంగతీ బాగా ఆలోచించుకొని వచ్చి సాయంత్రం చెప్పులే. నువ్వు సరేనంటే ఎల్లుండి రాత్రి కొత్తగూడెం వెళ్లి రెలెక్కుదాం’’ గుడిసెలో నిలబడి ఆశ్చర్యంగా తమ వంకే చూస్తున్న ముసలోళ్ళిద్దరినీ గమనించిన ఆర్‌ఎంపి లింగయ్య తను చెప్పదలచుకున్నదేదో గబగబా చెప్పేశాడు.
‘‘సరే కానియ్యి, ఇంతదూరం వచ్చాక ఇంకావెనుకడుగేసేదేముంది? వాళ్ళంతే ఇచ్చారనుకుంటాను’’ అంటూ నిస్ససహాయంగా తన అంగీకారాన్ని తెలయజేసింది శాంతమ్మ.
ఆమె మాటలతో సంతృప్తిగా తలవూపుతూ వెంటనే ఐదొందల రూపాయల కొత్త నోట్ల కట్టలు రెండు తన మెడికల్ కిట్‌లో నుండి బయటకు తీసి ‘‘ఇదుగో ఈ పదివేలూ అడ్వాన్స్ కిందుంచుకో. ఈ డబ్బులతో నీ ఏర్పాట్లు నువ్వు చేసుకొని ఎల్లుండి రాత్రి ట్రైన్‌కి తయారుగుండు. ఈ లోపల నా ఏర్పాట్లలో నేనుంటాను’’ శాంతమ్మ తన బుట్టలో పడిపోయిందన్న సంతోషంతో బండిని స్టార్ట్ చేసుకుని వచ్చినంత వేగంగా వెనుదిగి వెళ్లిపోయాడు ఆర్‌ఎంపి లింగయ్య.
డబ్బుకట్టలతో ఇంట్లోకి తిరిగొచ్చిన కోడలిని నిలేసిన కమలమ్మ, మల్లయ్యలు ‘‘ఆ ఆర్‌ఎంపి లింగయ్యతో గుసగుసమని అంతసేపు ఏం మాట్లాడినవ్? ఆ పైసలేంది?’’ ఆమె వంక అనుమానంతో గుచ్చి గుచ్చి చూస్తూ అడిగారు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు